రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

దొంగరవాణాకు వ్యతిరేకంగా గుజరాత్‌లో ముంద్రా తీరానికి ఆవల భారతీయ కోస్తా పరిరక్షక దళం చేపట్టిన చర్య


రూ.1,150 కోట్ల విలువైన 115 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్న ఐసీజీ, ఏటీఎస్ గుజరాత్

నాడు పోస్టు చేయడమైనది: 27 MAY 2026 2:28PM by PIB Hyderabad

మాదక ద్రవ్యాలను సముద్ర మార్గంలో అక్రమంగా తరలిస్తుండగా అడ్డుకొనే చర్యల్లో ఓ ప్రధాన విజయమిది.. రహస్య సమాచారం ఆధారంగా, భారతీయ కోస్తా పరిరక్షక దళం (ఐసీజీ).. గుజరాత్‌లోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)తో కలిసి 2026 మే నెల 25, 26 తేదీల్లో గుజరాత్‌లోని ముంద్రా తీరానికి ఆవల దొంగరవాణాకు వ్యతిరేకంగా చేపట్టిన ఒక సంయుక్త చర్యలో సుమారు 115 కిలోల కొకెైన్‌‌ను స్వాధీనం చేసుకుంది. జప్తు చేసిన మత్తుపదార్థాల విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 1,150 కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా.
గుజరాత్  ఏటీఎస్ పంచుకున్న నిర్దిష్ట కార్యాచరణ యోగ్య రహస్య సమాచారం ఆధారంగా, ఏటీఎస్ సిబ్బందితో కూడిన ఐసీజీ ఇంటర్‌సెప్టర్ పడవలు ముంద్రా యాంకరేజి ప్రాంతంలో విస్తృత సోదాను నిర్వహించాయి. ఈ క్రమంలో, ఒక కంటెయినర్ నౌకలో అనుమానాస్పద కార్యకలాపాలను గమనించారు. వెనువెంటనే నిరంతరాయ ప్రాతిపదికన అంతర-ఏజెన్సీ సమన్వయంతో చేపట్టిన చర్యలో ఘటనాస్థలానికి బృందం చేరుకొని, సముద్రంలో నుంచి అయిదు సంచుల్ని తీసుకురావడంలో సఫలమైంది.
ఆ సంచుల్లో తెల్లని పొడి వంటి పదార్థమున్న పొట్లాలు దొరికాయి. వాటిని పరీక్షించగా, కొకెయిన్ అని తేలింది. ఈ చర్యలో ఇంచుమించు ఒక కిలో బరువున్న 115 పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. అవి అన్నీ కలిపితే, 115 కిలోల బరువు ఉన్నాయి. తదుపరి దర్యాప్తు కోసం నౌకను ఓడరేవుకు తీసుకువచ్చారు.
మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఐసీజీ, ఏటీఎస్‌లు గత అయిదు సంవత్సరాల్లో సంయుక్తంగా చేపట్టి, విజయవంతంగా ముగించిన చర్యల్లో ఇది 15వ చర్య. ఈ చర్యలు నౌకావాణిజ్య భద్రతను పటిష్ఠపరచడంతో పాటు, ‘‘నషా ముక్త్ భారత్’’ (మత్తు పదార్థ రహిత భారత్) లక్ష్య సాధన దిశగా సాగిస్తున్న ప్రయాణంలో ఐసీజీ, ఏటీఎస్‌ల తిరుగులేని నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాయి.  

***


(రిలీజ్ ఐడి: 2265950) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil