శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
రామన్ ఎఫెక్ట్ పుట్టినిల్లు, శాస్త్ర విజ్ఞాన రంగంలో భారత్‌కు మొట్టమొదటి నోబెల్ బహుమతిని అందించిన ఐఏసీఎస్ 150 సంవత్సరాల వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
కోల్‌కతాలోని చారిత్రాత్మక ఐఏసీఎస్ క్యాంపస్‌లో స్వదేశీ సోలార్ సెల్ ఫ్యాబ్రికేషన్ సౌకర్యాన్ని, 'రెటినా' ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన డాక్టర్ జితేంద్ర సింగ్
మూడు శతాబ్దాలుగా సాగుతోన్న భారత శాస్త్రీయ రంగవృద్ధిని ఐఏసీఎస్ ప్రస్థానం తెలియజేస్తోందన్న కేంద్ర మంత్రి
వికసిత్ భారత్ 2047 వైపు భారత్ చేస్తోన్న ప్రయాణానికి మహేంద్రలాల్ సర్కార్, సీవీ రామన్‌ల వారసత్వం స్ఫూర్తినిస్తుందన్న డాక్టర్ జితేంద్ర సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
26 MAY 2026 5:16PM by PIB Hyderabad
కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ, భూవిజ్ఞాన శాఖల మంత్రి (స్వతంత్ర బాధ్యత).. ప్రధాని కార్యాలయం, సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పింఛన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు కోల్‌కతాలోని ‘ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్’ను (ఐఏసీఎస్) సందర్శించారు. శాస్త్ర విజ్ఞాన రంగంలో భారత్‌కు మొట్టమొదటి నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టిన ’రామన్ ఎఫెక్ట్' ఆవిష్కరణకు సంబంధించిన పరిశోధనలను సర్ సీవీ రామన్ ఈ సంస్థలోనే చేశారు. 19, 20, 21వ శతాబ్దాల్లో పనిచేసిన భారతదేశపు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన శాస్త్రీయ సంస్థలలో ఒకటిగా నిలిచిన ఈ ఐఏసీఎస్ 150 సంవత్సరాల వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశ శాస్త్రీయ చైతన్యానికి, స్వాతంత్ర్యం తర్వాత దేశ శాస్త్రీయ వృద్ధికి ఐఏసీఎస్ సంస్థ ఒక సజీవ చిహ్నంగా నిలిచిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ సంస్థ శాస్త్రీయ ప్రావీణ్యం, ఆవిష్కరణలు, దేశ నిర్మాణంలో తరతరాల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిందని ఆయన అన్నారు. 1876లో డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ స్థాపించిన ఈ సంస్థ జగదీష్ చంద్రబోస్, మేఘనాధ్ సాహా, ఎస్.ఎన్. బోస్, సర్ సీవీ రామన్ వంటి భారతదేశపు అత్యున్నత శాస్త్రీయ మేధావులకు పుట్టినిల్లుగా నిలిచింది. వలసరాజ్యాల కాలం నాటి మేధోపరమైన పునరుజ్జీవనం నుంచి నేటి 'వికసిత్ భారత్ 2047'ను నడిపిస్తున్న ఆధునిక ఆవిష్కరణల వ్యవస్థ వరకు భారతదేశ శాస్త్రీయ గుర్తింపు పరిణామాన్ని ఐఏసీఎస్ ప్రస్థానం తెలియజేస్తోందని ఆయన పేర్కొన్నారు.
భారతదేశపు మొట్టమొదటి అమోర్ఫస్ సిలికాన్ సోలార్ సెల్ తయారీ కోసం ఐఏసీఎస్‌లో స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన పీఈసీవీడీ (ప్లాస్మా ఎన్‌హ్యాన్స్‌డ్ కెమికల్ వేపర్ డిపోజిషన్) వ్యవస్థను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. దీనితో పాటు సంస్థలోని కొత్త ఇంక్యుబేషన్ కేంద్రం ‘రెటినా’ను (రీసెర్చ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ఫర్ ట్రాన్స్లేషన్, ఇన్నోవేషన్ అండ్ నావిగేషన్) కూడా ఆయన ప్రారంభించారు. ఐఏసీఎస్ శాస్త్రీయ సహకారాలను, ప్రస్తుతం కొనసాగుతున్న పరిశోధనా కార్యకలాపాలను తెలియజేసే ఆ సంస్థకు చెందిన చారిత్రక రికార్డులు (ఆర్కైవ్స్), పరిశోధన ప్రదర్శన గ్యాలరీలను కూడా ఆయన సందర్శించారు.
క్యాంపస్‌లోని డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్, సర్ సీవీ రామన్, ప్రొఫెసర్ మేఘనాద్ సాహాల విగ్రహాలకు పూలమాలలు వేసి డాక్టర్ జితేంద్ర సింగ్ ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐఏసీఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కాలోబరన్ మైతీ, సీనియర్ శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, శాస్త్రీయ రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
మహేంద్ర లాల్ సర్కార్ హాల్‌లో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. స్వతంత్ర పరిశోధనల ద్వారా ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించడానికి భారతీయులు స్థాపించిన ఆసియాలోనే మొట్టమొదటి పరిశోధనా సంస్థగా దేశ శాస్త్రీయ చరిత్రలో ఐఏసీఎస్ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని అన్నారు. దేశంలో శాస్త్రీయ మౌలిక సదుపాయాలు దాదాపు శూన్యంగా ఉన్న కాలంలోనే భారతీయుల కోసం శాస్త్రీయ సామర్థ్య పెంపు, ఆధునిక శాస్త్రీయ విద్యను డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ సంకల్పించారని ఆయన గుర్తు చేశారు. ఆయన శ్రీరామకృష్ణ పరమహంసకు వ్యక్తిగత వైద్యుడిగా ఉన్నారని పేర్కొన్న కేంద్ర మంత్రి.. ఈ విధంగా శ్రీరామకృష్ణ పరమహంసకు ఈ సంస్థతో ప్రత్యేక చారిత్రక అనుబంధం ఉందని అన్నారు.
ఐఏసీఎస్‌లో 'రామన్ ఎఫెక్ట్'ను ఆవిష్కరించటం.. భారతదేశ శాస్త్రీయ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టాల్లో ఒకటని కేంద్ర మంత్రి అన్నారు. ఇది తరతరాలుగా భారతీయ శాస్త్రవేత్తలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన శాస్త్రీయ సహకారాలను అందించడాన్ని కొనసాగించిందని.. భౌతిక శాస్త్రాలు, జీవ శాస్త్రాలు, మెటీరియల్స్ సైన్స్, కంప్యూటేషనల్ సైన్స్, ఇంటర్ డిసిప్లినరీ సాంకేతికతలలో అధునాతన పరిశోధనలకు ఒక ప్రముఖ కేంద్రంగా రూపాంతరం చెందిందని ఆయన పేర్కొన్నారు.
పీఈసీవీడీ వ్యవస్థ ప్రారంభోత్సవాన్ని ప్రస్తావించిన డాక్టర్ జితేంద్ర సింగ్.. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికత కింద దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న శాస్త్రీయ స్వాలంబన, ఆవిష్కరణల స్ఫూర్తికి ‘స్వదేశీ పరిజ్ఞానంతో అధునాతన సోలార్ సెల్ తయారీ సాంకేతికతను అభివృద్ధి చేయడం’ నిదర్శనమని అన్నారు. ప్రొఫెసర్ అశోక్ కుమార్ బారువా రూపొందించిన ఈ వ్యవస్థ భారత్‌లో అమోర్ఫస్ సిలికాన్ సోలార్ సెల్ అభివృద్ధికి మార్గదర్శకత్వం వహించిందని వివరించారు. దేశ పునరుత్పాదక ఇంధన ప్రయాణంలో ఇదొక ముఖ్యమైన అధ్యాయంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
రెటినా’ ఇంక్యుబేషన్ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన డాక్టర్ జితేంద్ర సింగ్.. భారతదేశ శాస్త్రీయ సంస్థలు ఇప్పుడు ప్రాథమిక పరిశోధనలను వ్యవస్థాపకత, అంకుర సంస్కృతి, సామాజిక అవసరాలతో ఎక్కువగా అనుసంధానిస్తున్నాయని అన్నారు. భారతీయ శాస్త్ర విజ్ఞానం భవిష్యత్తు.. ప్రయోగశాల ఆవిష్కరణలను సామాన్యులకు అందుబాటులో ఉండేలా, విస్తరించదగిన సాంకేతికతలుగా మార్చడంలోనే ఉందన్న విషయాన్ని ఆయన ప్రధానంగా చెప్పారు. ఇవి ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛ ఇంధనం, అధునాతన పదార్థాలు, సుస్థిరాభివృద్ధి వంటి జాతీయ ప్రాధాన్యతలను పరిష్కరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
క్వాంటం పదార్థాలు, నానో సాంకేతికత, కృత్రిమ మేధ, బ్యాటరీ పదార్థాలు, క్యాన్సర్ జీవశాస్త్రం, పర్యావరణ సాంకేతికతలతో సహా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఐఏసీఎస్ అందిస్తున్న సహకారాన్ని కూడా కేంద్ర మంత్రి అభినందించారు. 'డుషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ' వ్యాధి చికిత్సకు సంబంధించిన పరిశోధన, విషపూరిత వ్యర్థాల నివారణ (టాక్సిక్ వేస్ట్ రిమిడిషన్), ఫోటో డిటెక్టర్లు, బయోసెన్సర్లు, సుస్థిర ఇంధన పదార్థాలు వంటి రంగాలలో ఐఏసీఎస్ శాస్త్రవేత్తలు ఇటీవల చేసిన కృషిని ఆయన ప్రస్తావించారు.
'వికసిత్ భారత్ 2047' జాతీయ దార్శనికతకు అనుగుణంగా భారతదేశ శాస్త్రీయ సంస్థలు ఒక పరివర్తనాత్మక దశలోకి ప్రవేశిస్తున్నాయని.. ఇక్కడ ఆవిష్కరణలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, అంకురాలు కలిసికట్టుగా పనిచేస్తూ ప్రపంచంలోని అగ్రగామి విజ్ఞాన ఆర్థిక వ్యవస్థల సరసన భారత్‌ను నిలబెట్టుతున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించటం, శాస్త్రీయ భాగస్వామ్యాన్ని విస్తరింపజేయాలన్న ఉద్దేశంతో పాఠశాల విద్యార్థులు, మహిళలు, గ్రామీణ వర్గాల కోసం ఈ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను కూడా ఆయన అభినందించారు.




***
(రిలీజ్ ఐడి: 2265630)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10