యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
‘‘భారత ప్రాచీన విజ్ఞానం నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడ వరకు... అంతర్జాతీయ శక్తిగా అవతరిస్తున్న యోగా’’: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ
2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమివ్వాలని భారత్ సన్నద్ధమవుతున్న తరుణంలో.. యోగాను ఒలింపిక్ క్రీడగా నిలిపేలా కృషి
‘‘భారత సాంస్కృతిక సమ్మోహన శక్తిగానూ, ఆరోగ్య సాధనంగానూ - ఆర్థిక అవకాశంగానూ ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందుతున్న యోగా: కేంద్ర మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ
అమ్దవద్‌లో జూన్ 4 నుంచి 8 వరకు ప్రథమ ప్రపంచ యోగాసన ఛాంపియన్ షిప్: 75 దేశాల నుంచి ప్రాతినిధ్యం
నాడు పోస్టు చేయడమైనది:
26 MAY 2026 3:55PM by PIB Hyderabad
జూన్ 4 నుంచి 8 వరకు గుజరాత్‌లోని అమ్దవద్ మొదటి 'ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్'కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ అంతర్జాతీయ పోటీని నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ ఛాంపియన్‌షిప్‌లో జరిగే 12 పోటీల్లో 75 దేశాల నుంచి 500 మందికి పైగా పాల్గొంటారని అంచనా.
ఛాంపియన్‌షిప్‌కు ముందు సభనుద్దేశించి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. "యోగాను ప్రపంచానికి అందించింది భారతదేశమే. 5,000 ఏళ్ల కిందట మన దేశం ఆవిష్కరించిన అమూల్య సంపద ఇది" అని వ్యాఖ్యానించారు.
యోగా ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. "శారీరక, మానసిక శక్తులు రెండింటినీ యోగా మనకిస్తుంది" అన్నారు. యోగా ఇప్పుడు మంచి ఆరోగ్య సాధనంగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన క్రీడగా మారిందన్నారు.
యోగాకు పెరుగుతున్న అంతర్జాతీయ ఆదరణను ప్రస్తావిస్తూ.. ‘‘ప్రపంచ దేశాలన్నీ యోగాను స్వీకరించి దాన్ని తమ జీవితంలో భాగంగా చేసుకోవడం ప్రారంభించాయి’’ అని డాక్టర్ మాండవీయ అన్నారు. భారత్‌లోని ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో ఈ దేశపు యోగా జ్ఞానం, సంప్రదాయం సజీవంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
క్రమంగా విస్తరిస్తున్న యోగా ప్రభావాన్ని వివరిస్తూ... ‘‘నేడు యోగాసనాలంటే శారీరక, మానసిక శ్రేయస్సుకు సాధనాలు మాత్రమే కాదు. మెరుగైన జీవనోపాధి మార్గంగానూ, ప్రపంచవ్యాప్తంగా భారత సాంస్కృతిక సమ్మోహన శక్తికి బలమైన ప్రతీకగానూ ఎదుగుతోంది’’ అని మంత్రి అన్నారు.
భారత సాంస్కృతిక శక్తిని ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు ఈ ఛాంపియన్‌షిప్ ఒక గొప్ప అవకాశమని మంత్రి అన్నారు.
అంతర్జాతీయ ఒలింపిక్ మండలి విధానపరమైన వ్యవస్థలో నమోదుతోపాటు, యోగాసనాన్ని అంతర్జాతీయ క్రీడగా గుర్తించే దిశగా సమాఖ్య ఇప్పుడు కృషి చేయాలని మంత్రి కోరారు.
2036 ఒలింపిక్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో డాక్టర్ మాండవీయ ఇలా వ్యాఖ్యానించారు.. ‘‘యోగా పుట్టిన మన దేశం 2036లో ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు సన్నద్ధమవుతున్న తరుణమిది. తొలిసారిగా అంతర్జాతీయ వేదికపై యోగాసనాన్ని ఒలింపిక్ క్రీడగా నిలిపేందుకు కూడా మేం అన్ని విధాలా కృషి చేస్తాం.’’
***
(రిలీజ్ ఐడి: 2265541)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10