శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
విజ్ఞానశాస్త్ర కమ్యూనికేషన్లోనూ, సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలోనూ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఎమ్ఓయూను కుదుర్చుకున్న సీఎస్ఐఆర్-ఎన్ఐఎస్‌సీపీఆర్, ఎన్ఐఏఎస్
నాడు పోస్టు చేయడమైనది:
25 MAY 2026 9:43PM by PIB Hyderabad
బెంగళూరు ప్రధానకేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేషనల్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇనిస్టిట్యూట్ (ఎన్ఐఏఎస్)తో న్యూఢిల్లీ లోని సీఎస్ఐఆర్-నేషనల్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్ఐఎస్‌సీపీఆర్) ఒక అవగాహన ఒప్పంద పత్రం (ఎమ్ఓయూ)పై 2026 మే నెల 25న సంతకాలు చేసింది. విజ్ఞానశాస్త్ర కమ్యూనికేషన్, ప్రజలను భాగస్వాములను చేయడంతో పాటు సైన్స్, టెక్నాలజీకి సంబంధించిన విధాన పరమైన పరిశోధనలోనూ ఇప్పుడున్న సహకారాన్ని పటిష్ఠపరుచుకోవడం ఈ ఎమ్ఓయూ ముఖ్యోద్దేశం. ఈ సహకారం సంయుక్త పరిశోధక ప్రాజెక్టులు, ఫేకల్టీ తో పాటు పరిశోధక విద్యార్థుల ఆదాన ప్రదానం, కార్యక్రమాల సంయుక్త నిర్వహణలతో పాటు సామర్థ్యాలను పెంపొందించుకొనే కార్యక్రమాలను కూడా ప్రోత్సహించనుంది.
ఎన్ఐఏఎస్ డైరెక్టరు డాక్టర్ శైలేశ్ నాయక్ స్వాగతోపన్యాసమిస్తూ, విజ్ఞానశాస్త్ర కమ్యూనికేషనును బలపరచడానికి సంస్థాగత సహకారం ఎంతో ముఖ్యమని, సామర్థ్యాలను పెంపొందించుకొనే కార్యక్రమాలను కలిసికట్టుగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఎస్ఐఆర్-ఎన్ఐఎస్‌సీపీఆర్ డైరెక్టరు డాక్టర్ గీతా వాణీ రాయసమ్ మాట్లాడుతూ, సమ్మిళిత విజ్ఞానశాస్త్ర కమ్యూనికేషన్ ప్రాధాన్యాన్ని వివరించారు. లక్షిత సముదాయాల అవసరాలను తీర్చగలిగిన సామగ్రిని తీర్చిదిద్దడంతో పాటు విజ్ఞానశాస్త్రంలో ప్రజలు పాలుపంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకు ఆధునిక సాంకేతికతల ఉపయోగానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని సూచించారు. భారతీయ భాషలలో కమ్యూనికేషన్‌కు కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగించుకోవడంలో నైతిక ప్రమాణాలను అనుసరించాలని స్పష్టం చేశారు.
అవగాహన ఒప్పందపత్రంపై సంతకాల కార్యక్రమం పూర్తి అయిన తరువాత, ‘‘డిజిటల్ యుగంలో సమ్మిళిత విజ్ఞానశాస్త్ర కమ్యూనికేషన్: ప్రాధాన్యాలు, పద్ధతులు, విధానాలు’’ అంశంపై మేధోమధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ చర్చలో ఎన్ఏఐఎస్ కు చెందిన ప్రొఫెసర్ డి.కె. శ్రీవాస్తవ, ప్రొఫెసర్ సంజయ్ శ్రీవాస్తవ, ప్రొఫెసర్ రజని ఎమ్‌బి, ప్రొఫెసర్ శిశిర్ రాయ్, డాక్టర్ అనంత్ కామత్‌లతో పాటు డాక్టర్ వి.వి. బినయ్, ఎన్ఐఏఎస్ కు చెందిన డాక్టర్ గీతా వాణీ రాయసమ్, డాక్టర్ కస్తూరీ మండల్, ఎన్ఐఎస్‌సీపీఆర్ కు చెందిన డాక్టర్ పరమానంద బర్మన్, గుబ్బీ ల్యాబ్స్ కు చెందిన డాక్టర్ హెచ్.ఎస్. సుధీర, ఐఐఎస్‌సీ కి చెందిన సీఎస్‌పీ డాక్టర్ సూర్యేశ్ కె. నామ్‌దేవ్ పాల్గొని, తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్యానల్ సభ్యులు బాధ్యతాయుత, సమ్మిళిత విజ్ఞానశాస్త్ర కమ్యూనికేషన్‌ను బలోపేతం చేయడంలో ప్రస్తుతం ఎదురవుతున్న లోటుపాట్లు, ప్రాధాన్యాలను ప్రస్తావించారు. అలాగే, విజ్ఞానశాస్త్ర కమ్యూనికేషన్ కు సంబంధించిన విధానాలను భారత్ అవసరాలకు తగ్గట్టు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాన సిఫార్సుల్లో.. సైన్సుపై నమ్మకాన్ని ప్రోత్సహించడం, సైన్స్ కమ్యూనికేటర్లు, పాత్రికేయులకు శిక్షణను ఇవ్వడం, తప్పు సమాచారాన్ని సమర్థంగా ఎదుర్కొని పరిష్కరించడం, ప్రజా మేధావుల సమూహాన్ని తీర్చిదిద్దడం, పాఠశాలల్లో సైన్స్ కమ్యూనికేషనును బలపరచడం, పౌర విజ్ఞానం ఆదరణకు నోచుకొనేటట్లు చూడడం, ప్రభావవంతమైన మార్గదర్శకాలను రూపొందించి వాటిని అమలులోకి తీసుకురావడంతో పాటు శాస్త్రవేత్తలకూ, విధాన రూపకర్తలకూ, కమ్యూనికేటర్లకూ మధ్య మాటామంతీ ని ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2265446)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8