ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో ఎబోలా వ్యాధి కేసులు పెరుగుతున్న దృష్ట్యా భారత్ లో వ్యాధి నివారణ సన్నాహక చర్యలపై కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జేపీ నడ్డా సమీక్ష
భారత్ లో ఇప్పటివరకు బుండిబుగ్యో ఎబోలా కేసులేవీ నమోదు కాలేదు: శ్రీ నడ్డా
ఎబోలా వ్యాప్తిని అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఎబోలాను ఖండాంతర భద్రతా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన ఆఫ్రికా సీడీసీ
గుర్తింపు, పరీక్షలు, పర్యవేక్షణకు సంబంధించిన ఏర్పాట్లతో నిరంతరం సర్వసన్నద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి, భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రాలకు (ఎన్సీడీసీ) శ్రీ నడ్డా ఆదేశం
అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఇతర ప్రవేశ మార్గాల్లో స్క్రీనింగ్, పర్యవేక్షణ చర్యలు ముమ్మరం; స్క్రీనింగ్, క్వారంటైన్, క్లినికల్ నిర్వహణ, ప్రయోగశాల పరీక్షలు, వ్యాధి నియంత్రణ చర్యలపై రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ సూచనలు, మార్గదర్శకాల జారీ
అంతర్జాతీయ సంస్థల సమన్వయంతో ఎబోలా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న కేంద్రం
నాడు పోస్టు చేయడమైనది:
25 MAY 2026 8:24PM by PIB Hyderabad
ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో ఇటీవల ఎబోలా వ్యాధి వ్యాప్తి చెందిన నేపథ్యంలో భారత్ లో దానికి సంబంధించిన సన్నాహక, నిఘా చర్యలపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా ఈ రోజు ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు.
భారత్ లో ఇప్పటివరకు బుండిబుగ్యో ఎబోలా వ్యాధికి సంబంధించి ఒక్క కేసు కూడా నమోదవ్వలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలాను అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా, ఆఫ్రికా సీడీసీ దీనిని ఖండంతర భద్రతా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించినందున భారత ప్రభుత్వం ఆఫ్రికాలోని ఎబోలా పరిస్థితిని నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తోంది. ప్రజారోగ్య రక్షణ కోసం ముందుజాగ్రత్తగా దేశవ్యాప్తంగా నిఘా, సన్నాహక చర్యలను మరింత ముమ్మరం చేసింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముందస్తు జాగ్రత్త చర్యగా జాతీయ వ్యాధి నివారణ కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ - ఎన్సీడీసీ) డీజీహెచ్ఎస్, ఐసీఎంఆర్, పౌర విమానయాన శాఖ, ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలతో సమన్వయం చేసుకుంటూ దేశవ్యాప్తంగా నిఘాను, ప్రజారోగ్య సన్నద్ధతను బలోపేతం చేసిందని శ్రీ నడ్డా పేర్కొన్నారు.
అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఇతర ప్రవేశ మార్గాల వద్ద స్క్రీనింగ్, నిఘా చర్యలను ముమ్మరం చేశారు. స్క్రీనింగ్, క్వారంటైన్, క్లినికల్ మేనేజ్మెంట్, ల్యాబొరేటరీ పరీక్షలు, వ్యాధి నివారణ పద్ధతులపై ప్రామాణిక నిర్వహణ (ఎస్ఓపీ) విధానాలతో కూడిన సూచనలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపారు. సన్నద్ధత, స్పందన చర్యలను సమీక్షించడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, సంబంధిత భాగస్వాములతో సమావేశాలు కూడా నిర్వహించారు. ట్రాకింగ్, టెస్టింగ్, నిఘా కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను నిరంతరం సిద్ధంగా ఉంచాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిని, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్‌ను, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్‌ను కేంద్ర మంత్రి ఆదేశించారు.
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ దేశాలకు అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిందిగా 2026 మే 24న భారత్ తన పౌరులకు ప్రయాణ మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికంటే ముందు, 2026 మే 21న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎబోలా వ్యాధి సన్నద్ధత, స్పందనపై అంతర్జాతీయ ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలతో కూడిన ఎస్ఓపీలను జారీ చేసింది. ఆసుపత్రులలో వ్యాధి నియంత్రణ, ఐసోలేషన్ వసతుల సన్నద్ధత, ఎబోలా రోగుల మృతదేహాలను సురక్షితంగా, గౌరవప్రదంగా నిర్వహించడానికి సంబంధించిన మార్గదర్శకాలను 2026 మే 22న విడుదల చేసింది.
అంతర్జాతీయ ప్రయాణికులలో కారణం తెలియని జ్వరాల పట్ల గట్టి నిఘా ఉంచాలని, అనుమానిత కేసులు ఏవైనా ఉంటే వాటిని వెంటనే నివేదించి, తగిన నిర్వహణ చర్యలు చేపట్టాలని ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడిఎస్పీ) యూనిట్లను, విమానాశ్రయ ఆరోగ్య సంస్థలను ఆదేశించారు.
ఎబోలా వ్యాధిని అధిక మరణాల రేటు కలిగిన తీవ్రమైన వైరల్ హెమరేజిక్ జ్వరంగా గుర్తించారు. బుండిబుగ్యో వైరస్ వల్ల వచ్చే ఎబోలా వ్యాధికి అనుమతించిన వ్యాక్సిన్‌లు కానీ, నిర్దిష్ట చికిత్సలు కానీ అందుబాటులో లేవు.
ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీమతి పుణ్య సలిల శ్రీవాస్తవ, ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శి, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బాల్, డీజీహెచ్ఎస్ డాక్టర్ సునీతా శర్మ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ రాకేష్ గుప్తా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి జి. ఎస్. చిత్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
*****
(రిలీజ్ ఐడి: 2265235)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10