ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘‘వైద్య ఆవిష్కరణల పేటెంట్ మిత్ర: ఆవిష్కర్తలతో పరిశ్రమల అనుసంధానం” పేరుతో న్యూఢిల్లీలో దేశంలోనే అతిపెద్ద బయోమెడికల్‌ ఆవిష్కరణలు, సాంకేతిక బదిలీ కార్యక్రమాన్ని నిర్వహించిన భారత వైద్య పరిశోధనా మండలి


పటిష్టమైన శాస్త్ర, పరిశ్రమల భాగస్వామ్యంతో భారత్‌ చవకైన వైద్య సేవల సాంకేతికతలకు ప్రపంచ కేంద్రంగా ఆవిర్భవిస్తోందన్న కేంద్ర సహాయ మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్



దేశంలోనే తొలిసారిగా ఆవిష్కర్తలు-పరిశ్రమల వేదికను ప్రారంభించిన ఐసీఎంఆర్‌... ఇందులో భాగంగా పరిశ్రమలకు 41 ప్రజారోగ్య సాంకేతికతల బదిలీ



బయోమెడికల్ పరిశోధన, టీకా తయారీని బలోపేతం చేసేందుకు తొలిసారిగా నిర్వీర్యం చేసిన కేఎఫ్‌డీ, చండీపురా వైరస్ జీవ నమూనాలను పారిశ్రామిక భాగస్వాములకు బదిలీ చేసిన భారత్‌



‘‘వైద్య సాంకేతికత రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగే సామర్థ్యం భారత్‌ పూర్తిగా ఉంది’’ నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ గోబర్ధన్ దాస్



స్వదేశీ బయోమెడికల్ పరిశోధనలను ప్రయోగశాలల నుంచి ప్రజల వరకు చేర్చే ప్రక్రియను వైద్య ఆవిష్కరణల పేటెంట్ మిత్ర కార్యక్రమం వేగవంతం చేస్తుందన్న డీహెచ్ఆర్ కార్యదర్శి, ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ రాజీవ్ బహల్

నాడు పోస్టు చేయడమైనది: 25 MAY 2026 4:57PM by PIB Hyderabad

దేశంలోనే అతిపెద్ద బయోమెడికల్, సాంకేతిక బదిలీ ప్రోత్సాహక కార్యక్రమమైన ‘‘వైద్య ఆవిష్కరణల పేటెంట్ మిత్ర: ఆవిష్కర్తలతో పరిశ్రమల అనుసంధానం”ను కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆరోగ్య పరిశోధనల విభాగానికి చెందిన ‘భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) నేడు న్యూఢిల్లీలోని మానేక్షా కేంద్రంలో విజయవంతంగా నిర్వహించింది.

 

ఐసీఎంఆర్ ప్రారంభించిన వైద్య ఆవిష్కరణల పేటెంట్ మిత్ర కార్యక్రమం ద్వారా బయోమెడికల్ ఆవిష్కరణలను ప్రదర్శించడానికి, సాంకేతిక బదిలీ ప్రక్రియల కోసం దేశంలోనే తొలి వ్యవస్థీకృత వేదికల్లో ఒకటి ఏర్పాటైంది. పటిష్టమైన పారిశ్రామిక భాగస్వామ్యాల ద్వారా దేశీయ బయోమెడికల్ పరిశోధనలను, పరిశ్రమల భాగస్వామ్యంతో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే వైద్య సేవల పరిష్కారాలుగా మార్చడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

 

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నీతి ఆయోగ్ సభ్యులు ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్ సమక్షంలో కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ గణపత్‌రావ్ జాదవ్ ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా కేంద్ర సహాయమంత్రి శ్రీ జాదవ్‌ మాట్లాడుతూ.. ‘‘దేశ వైజ్ఙానిక రంగాన్ని పారిశ్రామిక రంగంతో అనుసంధానించడంలో ఈ కార్యక్రమం ఒక నిర్ణయాత్మక చర్య. మన ప్రయోగశాలల్లో రూపుదిద్దుకునే సరికొత్త ఆవిష్కరణలు ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేందుకు, వికసిత్‌ భారత్‌ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుంది. ఐసీఎంఆర్ వంటి సంస్థలు, పటిష్టమైన పారిశ్రామిక భాగస్వామ్యాల సహకారంతో భారత్‌ కేవలం వైద్య సాంకేతికతలను వినియోగించే స్థాయి నుంచి ప్రపంచ దేశాలకు తక్కువ ఖర్చుతో కూడిన వినూత్న వైద్య సేవలకు పరిష్కారాలను అందించే కేంద్రంగా ఎదుగుతోంది’’ అని పేర్కొన్నారు.

 

నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ గోవర్దన్ దాస్ మాట్లాడుతూ.. ‘‘వైద్య సాంకేతికత రంగంలో ప్రపంచ నాయకుడిగా ఎదగడానికి అవసరమైన శాస్త్రీయ సామర్థ్యం, బలమైన ఆవిష్కరణల వ్యవస్థ భారత్‌కు ఉన్నాయి. మేధో సంపత్తిని రక్షించడంలో, సాంకేతిక బదిలీని సులభతరం చేయడంలో, దేశీయ ఆవిష్కరణలను ప్రయోగశాలల నుంచి నేరుగా సమాజానికి చేరవేయడంలో వైద్య ఆవిష్కరణల పేటెంట్ మిత్ర కార్యక్రమం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది’’ అని పేర్కొన్నారు.

 

 

వైద్య పరిశోధనల విభాగం కార్యదర్శి, ఐసీఎం‌ఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బాల్ మాట్లాడుతూ.. ‘‘అత్యాధునిక పరిశోధనలు కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా బలమైన పారిశ్రామిక భాగస్వామ్యాలు, సమర్థవంతమైన సాంకేతిక బదిలీ ద్వారా సామాన్య ప్రజలందరికీ చేరాలనే ఐసీఎం‌ఆర్ సంకల్పానికి వైద్య ఆవిష్కరణల పేటెంట్ మిత్ర ఒక నిదర్శనం” అని వివరించారు.

 

ఈ కార్యక్రమంలో దేశ బయోమెడికల్ ఆవిష్కరణలు, మేధో సంపత్తి, సాంకేతిక బదిలీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ‘ఇండియన్ బయోమెడికల్ పేటెంట్ ల్యాండ్‌స్కేప్ రిపోర్టు’, ‘టెక్నాలజీ కాంపెండియం’లను కూడా విడుదల చేశారు.

 

ఐసీఎం‌ఆర్ సంస్థలు, పరిశోధకులు అభివృద్ధి చేసిన 41 ప్రజారోగ్య సాంకేతికతలను తదుపరి అభివృద్ధి, తయారీ, వాణిజ్యీకరణ కోసం పారిశ్రామిక భాగస్వాములకు బదిలీ చేయడం ఈ కార్యక్రమంలో కీలకంగా నిలిచింది. ప్రజారోగ్య రంగంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన సమస్యలను పరిష్కరించే అత్యాధునిక రోగనిర్ధారణ పరీక్షలు, టీకాలు, వైద్య పరికరాలు, బయోమెడికల్ పరిష్కారాలు ఈ సాంకేతికతల్లో ఉన్నాయి. ముఖ్యంగా టైఫాయిడ్, పారాటైఫాయిడ్ వ్యాధుల కోసం తయారు చేసిన గ్లైకోకాంజుగేట్, రీకాంబినెంట్ వ్యాక్సీన్లతోపాటు జపనీస్ మెదడు వాపు వ్యాధి, క్షయ, మంకీపాక్స్ వంటి వ్యాధుల రోగనిర్ధారణ సాంకేతికతలను పరిశ్రమలకు అప్పగించారు.

 

నిర్వీర్యం చేసిన కేఎఫ్‌డీ, చండీపురా  వైరస్ నమూనాలతో సహా పరిశీలించిన బయోమెటీరియల్స్‌ను పారిశ్రామిక భాగస్వాములకు బదిలీ చేశారు. ఇది దేశ బయోమెడికల్ పరిశోధన, ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేసేందుకు దోహదపడుతుంది. ఐసీఎం‌ఆర్ సంస్థలు, పరిశోధకులు, అంకుర సంస్థలు అభివృద్ధి చేసిన రోగనిర్ధారణ, చికిత్స, వైద్య పరికరాలకు సంబంధించిన 100 కంటే ఎక్కువ సాంకేతికతలను ఈ ప్రదర్శనలో ఉంచారు. ఇది ఆవిష్కర్తలకు, పారిశ్రామిక రంగానికి చెందిన ప్రముఖులకు మధ్య నేరుగా చర్చలు జరపడానికి ముఖ్య వేదికగా నిలిచింది.

 

బలమైన ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా వికసిత్‌ భారత్‌ 2047 సంకల్పాన్ని సాధించడంలో, దేశ బయోమెడికల్ రంగాన్ని బలోపేతం చేయడంలో ఆవిష్కర్తలతో పరిశ్రమల అనుసంధాన కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.


(రిలీజ్ ఐడి: 2265233) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil