కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా చివరి మైలు వరకు పార్శిల్ డెలివరీ సేవల కోసం తపాలా శాఖ, ఫ్లిప్‌కార్ట్ మధ్య ఒప్పందం
నాడు పోస్టు చేయడమైనది:
22 MAY 2026 5:42PM by PIB Hyderabad
భారతదేశ ఇ-కామర్స్ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థను బలోపేతం చేయడం, దేశవ్యాప్తంగా చివరి మైలు వరకు డెలివరీ సామర్థ్యాలను మెరుగుపరచడం దిశగా ఒక కీలక అడుగు పడింది. ఇందులో భాగంగా కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖకు చెందిన తపాలా శాఖ, ఫ్లిప్‌కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరస్పరం లాస్ట్-మైల్ పార్శిల్ డెలివరీ సేవల కోసం ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి.
తపాలా శాఖ పార్శిల్ డైరెక్టరేట్ జనరల్ మేనేజర్ శ్రీ నీరజ్ కుమార్ ఝా, ఫ్లిప్‌కార్ట్ ఇండియా సంస్థ కమర్షియల్ డైరెక్టర్ శ్రీ హర్విందర్ కపూర్ ఈరోజు న్యూఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో తపాలా శాఖ పార్శిల్, సీసీఎస్ డైరెక్టరేట్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ అద్నాన్ అహ్మద్, ఫ్లిప్‌కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ శ్రీ డిప్పి వంకాని, ఇరు సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భారతదేశం అంతటా సమర్థవంతమైన, నమ్మకమైన, వినియోగదారుల అవసరాలకు అనుగుణమైన పార్శిల్ డెలివరీ సేవలను అందించడం కోసం తపాలా శాఖకు ఉన్న సాటిలేని విస్తృతి, విశ్వసనీయ డెలివరీ నెట్‌వర్క్‌తో పాటు, భారత ఇ-కామర్స్ రంగంలో ఫ్లిప్‌కార్ట్‌కు ఉన్న బలమైన సామర్ధ్యాన్ని ఉపయోగించుకోవడం ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఒప్పందం ప్రకారం, భారతదేశం అంతటా ఫ్లిప్‌కార్ట్ ద్వారా వచ్చే పార్శిళ్లకు తపాలా శాఖ చివరి మైలు వరకు డెలివరీ సేవలను అందిస్తుంది.
ఒప్పందంలోని ముఖ్యాంశాలు
-
దేశవ్యాప్తంగా చివరి మైలు వరకు చేరిక: పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో పాటు మారుమూల, సరైన సేవలందని ప్రాంతాలలో కూడా పార్శిల్ డెలివరీ సేవల కోసం తపాలా శాఖ ఇండియా పోస్ట్ విస్తృతమైన నెట్‌వర్క్‌ను ఫ్లిప్‌కార్ట్ ఉపయోగించుకుంటుంది.
-
సమగ్ర డెలివరీ సేవలు: ఈ సేవలలో ప్రీపెయిడ్, సీఓడీ (క్యాష్ ఆన్ డెలివరీ) పార్శిళ్ల డెలివరీ, ఓటీపీ (ఓటీపీ) ఆధారిత డెలివరీ ధృవీకరణ, పార్శిల్ ఎక్కడుందో లైవ్‌లో తెలుసుకునే నిరంతర షిప్‌మెంట్ ట్రాకింగ్ సౌకర్యాలు ఉన్నాయి.
-
మెరుగైన వినియోగదారు అనుభవం: వేగవంతమైన డెలివరీలు, నిర్వహణపరంగా మెరుగైన సమన్వయం, సమర్థవంతమైన పార్శిల్ రవాణా, డెలివరీల కోసం అంతరాయాలు లేని సాంకేతిక అనుసంధానంపై ఈ ఒప్పందం ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
-
ఇ-కామర్స్ వృద్ధికి మద్దతు: వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశ ఇ-కామర్స్ రంగానికి వెన్నుదన్నుగా నిలిచే రవాణా మౌలిక సదుపాయాలను ఈ భాగస్వామ్యం మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
ఈ భాగస్వామ్యం ద్వారా, ఫ్లిప్‌కార్ట్ దేశవ్యాప్తంగా 1.6 లక్షలకు పైగా పోస్టాఫీసులతో కూడిన తపాలా శాఖ విస్తారమైన నెట్‌వర్క్‌ను, సాటిలేని డెలివరీ సామర్ధ్యాన్ని ఉపయోగించుకునే అవకాశం పొందుతుంది. ఇది మార్కెట్ విస్తృతికి, మెరుగైన డెలివరీ సామర్థ్యానికి, ముఖ్యంగా మారుమూల, గ్రామీణ ప్రాంతాలలో సేవల లభ్యతను పెంపొందించడానికి తోడ్పడుతుంది.
దేశవ్యాప్తంగా లక్షలాదిమంది వినియోగదారులకు విస్తృత శ్రేణి ఉత్పత్తులను, డిజిటల్ కామర్స్ సేవలను అందిస్తున్న ఫ్లిప్‌కార్ట్ భారతదేశ అగ్రగామి ఇ-కామర్స్ కంపెనీలలో ఒకటిగా నిలిచింది. ఈ భాగస్వామ్యం తపాలా శాఖ డెలివరీ నెట్‌వర్క్ రవాణా మౌలిక సదుపాయాల వినియోగాన్ని పెంచడం ద్వారా, దాని పార్శిల్ వ్యాపారాన్ని గణనీయంగా బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మారుతున్న అవసరాలకు మద్దతుగా, తనను తాను ఒక ప్రముఖ రవాణా సంస్థగా మార్చుకోవడానికి తపాలా శాఖ నిరంతరం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఈ భాగస్వామ్యం కుదిరింది.
***
(రిలీజ్ ఐడి: 2264478)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13