శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డాక్టర్ జితేంద్ర సింగ్‌తో సమావేశమైన అమెరికా రాయబారి సెర్జియో గోర్: వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాలను విస్తరించడంపై చర్చ


బయోటెక్, క్వాంటం, అంతరిక్ష రంగాల్లో విశ్వసనీయమైన సహకారం కోసం అన్వేషిస్తున్న భారత్, అమెరికా
భారత్‌లో మొదటిసారిగా అణు పరిశోధన అవకాశాలను ప్రైవేటు రంగానికి విస్తరించడంతో పెట్టుబడుల్లో నూతన అవకాశాలకు, ప్రైవేటు రంగంలో భాగస్వామ్యాలకు మార్గం సుగమమైందన్న మంత్రి

యూఎస్ పెట్టుబడిదారులతో సాధారణ కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలన్న డాక్టర్ జితేంద్ర సింగ్

నాడు పోస్టు చేయడమైనది: 20 MAY 2026 5:29PM by PIB Hyderabad

భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌తో ఈ రోజు సమావేశమయ్యారు. బయోటెక్నాలజీ, క్వాంటం సాంకేతికతలు, అంతరిక్షం, అణు విద్యుత్, న్యూక్లియర్ ఔషధాలు తదితర రంగాల్లో నైపుణ్యాలు, పెట్టుబడులు, జ్ఞాన వినిమయం, పారిశ్రామిక భాగస్వామ్యాల్లో ద్వైపాక్షిక సహకారాలను విస్తరించడంపై చర్చించారు.

భారత్‌ తొలిసారిగా ప్రైవేటు రంగానికి అణు పరిశోధనలకు అవకాశం ఇచ్చిందని మంత్రి చెప్పారు. దీనివల్ల అధునాతన క్యాన్సర్ చికిత్స, రోగ నిర్ధారణ పరీక్షలు, ఆంకాలజీ పరిశోధన, జన్యు వైద్యంలో పెట్టుబడుల్లో నూతన అవకాశాలకు, ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి, అంతర్జాతీయ సహకారానికి నూతన మార్గాలను తెరిచిందని తెలిపారు.

వివిధ జనాభా సమూహాలతో కూడిన విస్తారమైన, బహుళ జాతి జన్యు సమాచారమే భారత దేశానికున్న ప్రధాన ప్రయోజనమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఇది బయోటెక్నాలజీ, కచ్చితమైన ఫలితాలనిచ్చే ఔషధాలు, ఏఐ ఆధారిత రోగనిర్ధారణ పరీక్షలు, భవిష్యత్తు ఆరోగ్య పరిష్కారాల కోసం చేసే అంతర్జాతీయ పరిశోధనలో కీలకంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. ఏఐ ఆధారిత రోగనిర్ధారణ పరీక్షలు, సీక్వెన్సింగ్ టెక్నాలజీలు, వేగంగా పరీక్షలు చేసే విధానాల వంటివి చికిత్సకు పట్టే సమయాన్ని తగ్గిస్తాయన్నారు. అలాగే సంప్రదాయ కల్చర్ ఆధారిత పద్ధతుల ద్వారా 48 గంటలు సమయం తీసుకొనే ప్రక్రియలను వేగవంతం చేస్తాయన్నారు.

సహకారం, అవకాశానికి సంబంధించి కొలవదగిన అనేక అంశాలను మంత్రి ప్రస్తావించారు. జాతీయ క్వాంటం మిషన్ పరిధిలో క్వాంటం కంప్యూటింగ్, కమ్యూనికేషన్, సెన్సింగ్, మెట్రాలజీ, క్వాంటం పదార్థాలు, పరికరాల కోసం నాలుగు ఇతివృత్త ఆధారిత కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎనిమిదేళ్ల కాలపరిమితిలో సాధించాలని నిర్దేశించుకున్న వాటిలో సగానికి పైగా లక్ష్యాలను మూడేళ్లోనే భారత్ సాధించిందని వెల్లడించారు.

కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీలు, బయోటెక్నాలజీ, ఇంధనం, అధునాతన పదార్థాలు, కీలకమైన ఖనిజాలు, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాల్లో ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, అంకుర సంస్థల మధ్య సహకారానికి అవసరమైన విధానాన్ని ఏర్పాటు చేసే యూఎస్-ఇండియా ట్రస్ట్ కార్యక్రమం ఆధారంగా ఈ చర్చలు జరిగాయి. విశ్వసనీయమైన సాంకేతిక భాగస్వామ్యాలు, స్థిరమైన సరఫరా వ్యవస్థలు, ఆవిష్కరణ వ్యవస్థలు, సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానాలను పరిరక్షించడానికి ఈ కార్యక్రమం ఇస్తున్న ప్రాధాన్యమే భారత్-అమెరికా శాస్త్రీయ సహకారంలో తర్వాతి దశకు కేంద్రంగా ఉందని  డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అమలుకు తోడ్పాటు అందించే సంస్థాగత యంత్రాంగాలుగా ఐయూఎస్ఎస్‌టీఎఫ్, యూఎస్ఐఎస్‌టీఈఎఫ్ లాంటి ఇప్పటికే కొనసాగుతున్న వేదికలను, యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌ సహకారాన్ని గుర్తించారు.

విధానపరంగా తీసుకువచ్చిన కీలకమైన మార్పు గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. భధ్రతాపరమైన అంశాలు, రక్షణ చర్యలను పాటిస్తూనే అణు రంగం, న్యూక్లియర్ ఔషధ సంబంధ పరిశోధన పెట్టుబడుల్లో ప్రైవేటు రంగానికి భారత్ అవకాశం కల్పించిందని తెలియజేశారు. ఇది గతంలో ఎక్కువగా ప్రభుత్వ రంగానికి మాత్రమే పరిమితమైన విభాగాల్లో ప్రైవేటు రంగ పెట్టుబడులకు అవకాశాన్ని కల్పించిందని తెలిపారు. అలాగే దీనికి సంబంధించిన తుది నిబంధనలు మరికొన్ని వారాల్లో విడుదల చేస్తామని వెల్లడించారు.

బయోటెక్నాలజీ, టీకాల్లో సహకారం, నియంత్రణల సమన్వయం, ఆంకాలజీ పరీక్షలు, సీఏఆర్-టీ థెరపీ, ఏఐ ఆధారిత పరీక్షలు, అంతర్జాతీయ పరిశోధన కోసం భారత్‌కున్న వైవిధ్యమైన జన్యు సమాచారాన్ని వినియోగించుకోవడంపై ఉభయపక్షాలు చర్చించాయి. బయోటెక్నాలజీలో పరిశ్రమ సహకారానికి మాధ్యమంగా బీఐఆర్ఏసీ ఉంటుందని, న్యూక్లియర్ ఔషధాల్లోనూ ఇదే తరహా వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపారు.

పెట్టుబడుల విషయానికి వస్తే.. పరిశోధనాభివృద్ధి పెట్టుబడుల్లోకి ప్రైవేటు రంగాన్ని తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన ప్రధాన కార్యక్రమంగా పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ నిధిని పేర్కొన్నారు. ఈ నిధి ప్రైవేటు రంగ భాగస్వామ్యంపైనే ప్రాథమిక దృష్టి సారిస్తుంది. సుమారుగా 2 నుంచి 3 శాతం వడ్డీతో హామీ రహిత దీర్ఘకాలిక రుణాలను అందిస్తుంది. తద్వారా పరిశోధన, ఆవిష్కరణల్లో సమాన భాగస్వామిగా మారేందుకు పరిశ్రమకు వీలు కల్పిస్తుంది.

పెట్టుబడులు, నైపుణ్యాలు, జ్ఞాన వినిమయం, సంస్థాగత సహకారంపై అమెరికా పెట్టుబడిదారులు, సంస్థలు, పరిశోధనా సంస్థలతో నెలకోసారి సమావేశమయ్యేలా సాధారణ కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ప్రతిపాదించారు. ఇలాంటి భాగస్వామ్యాలు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మూలధనాన్ని మాత్రమే కాకుండా సాంకేతిక నైపుణ్యాన్ని, ప్రైవేటు రంగ అనుభవాన్ని, సహకార సామర్థ్యాన్ని కూడా తీసుకు వస్తుందని ఆయన చెప్పారు.

అంతరిక్ష సహకారం, స్టార్‌లింక్, దేశంలో క్వాంటం మౌలిక వసతులు, థోరియం ఆధారిత అణు అవకాశాల కోసం సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, బెంగళూరులో త్వరలో నిర్వహిచే అంతరిక్ష కార్యక్రమాల గురించి కూడా చర్చించారు. గడచిన అయిదారేళ్లుగా అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశాలను కల్పించడం ద్వారా భారత్ అతిపెద్ద విజయం సాధించిందని, విశ్వసనీయమైన భాగస్వాములతో సహకారానికి నూతన అవకాశాలను సృష్టించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

 

*****


(రిలీజ్ ఐడి: 2263517) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Tamil