వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఖరీఫ్ 2026 సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ఎరువుల సమతుల్య వినియోగంపై దేశవ్యాప్త అవగాహన ప్రచారాన్ని చేపట్టిన ఐసీఎఆర్
వివిధ రాష్ట్రాల్లో కేవీకేలు, సంస్థల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి శిబిరాలు, రైతులు - శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ
నాడు పోస్టు చేయడమైనది:
20 MAY 2026 6:43PM by PIB Hyderabad
సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించి భూసారాన్ని సంరక్షించాలన్న ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) సమతుల్య ఎరువుల వినియోగంపై దేశవ్యాప్త అవగాహన ప్రచారాన్ని మరింత ఉధృతం చేసింది. తన పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకేలు), పరిశోధనా సంస్థల ద్వారా భూసార పరీక్షల ఆధారిత పోషకాల నిర్వహణ, సమగ్ర పోషకాల పద్ధతులు, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలపై రైతులు, విద్యార్థులు సంబంధిత భాగస్వాములను ప్రోత్సహిస్తూ అవగాహన కల్పించేందుకు ఐసీఎఆర్ విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దాదాపు నెల రోజులుగా సాగుతున్న ఈ చొరవలో భాగంగా, గత రెండు రోజులలో (మే 18-19, 2026) దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు.
పంజాబ్: కేవీకే ఫాజిల్కా, అబోహర్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల కోసం ఎరువుల సమతుల్య వినియోగం, భూసార పరీక్షల ప్రాముఖ్యతపై “సమతుల్య ఎరువులను వాడండి, భూసారాన్ని కాపాడండి” అనే సందేశంతో ఒక అవగాహన శిబిరాన్ని నిర్వహించారు.
పశ్చిమ బెంగాల్: ఎరువుల సమతుల్య వినియోగంపై కొనసాగుతున్న అవగాహన ప్రచారంలో భాగంగా, కేవీకే, బర్ధమాన్ ఆధ్వర్యంలో ఎరువుల విచక్షణాయుత వినియోగం, సుస్థిర పోషకాల నిర్వహణ పద్ధతులపై దృష్టి సారిస్తూ మే 18, 2026న గల్సి-I లోని బుద్ బుద్ వద్ద, మే 19, 2026న గల్సి-II లోని భాసాపూర్ వద్ద అవగాహన శిబిరాలను నిర్వహించారు.
దక్షిణ 24 పరగణాల ఆర్ఏకేవీకే, నింపిత్ ఆధ్వర్యంలో మే 19, 2026న “వివిధ పంటలలో భూసార పరీక్షల ఆధారిత పోషకాల నిర్వహణ” అనే అంశంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కాలింపాంగ్ కేవీకే ఆధ్వర్యంలో కాలింపాంగ్ బ్లాక్-II పరిధిలోని సాంగ్‌సే గ్రామంలో ఎరువుల సమతుల్య వినియోగంపై అవగాహన కార్యక్రమం జరిగింది; ఈ కార్యక్రమానికి పంచాయతీ ప్రతినిధులు, రైతులు హాజరయ్యారు.
దక్షిణ దినాజ్‌పూర్‌లోని డీడీకేవీకే ఆధ్వర్యంలో కుమార్‌గంజ్ పరిధిలోని బతున్ వద్ద ఖరీఫ్ వరి విత్తన, నారుమడి శుద్ధిపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 31 మంది రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు. పంట ఉత్పాదకతను, సుస్థిరతను పెంపొందించడం కోసం శాస్త్రీయ విత్తన శుద్ధి పద్ధతులు, ఆరోగ్యకరమైన నారుమడి నిర్వహణపై ఇందులో ప్రముఖంగా చర్చించారు.
ఒడిశా: బౌధ్ జిల్లాలోని హర్భంగా బ్లాక్‌లో మే 19, 2026న కేవీకే, బౌధ్ ఆధ్వర్యంలో ఎరువుల సమతుల్య వినియోగంపై అవగాహన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 మంది పాల్గొన్నారు.
మధ్యప్రదేశ్: జబల్‌పూర్ జిల్లా, పటాన్ బ్లాక్ పరిధిలోని రైత్రా గ్రామంలో మే 19, 2026న ఐసిఎఆర్-డైరెక్టరేట్ ఆఫ్ వీడ్ రీసెర్చ్, జబల్‌పూర్ ఆధ్వర్యంలో ఎరువుల సమతుల్య వినియోగంపై రైతు-శాస్త్రవేత్తల ముఖాముఖి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి 12 మంది మహిళా రైతులతో సహా మొత్తం 34 మంది రైతులు హాజరయ్యారు.
ఐసీఎఆర్-ఐఐఎస్ఎస్, భోపాల్ కూడా మే 18, 2026న సీహోర్ పరిధిలోని ఆమ్లా గ్రామంలో ఖరీఫ్ 2026 కోసం పచ్చిరొట్ట ఎరువులు, జీవ ఎరువులు, కచ్చితత్వ వ్యవసాయం, సుస్థిర పద్ధతులపై దృష్టి సారిస్తూ సమతుల్య ఎరువుల వినియోగంపై ఒక ప్రచారాన్ని నిర్వహించింది. ‘మేరా గావ్ మేరా గౌరవ్’ కార్యక్రమంలో భాగంగా, ఒక బృందం మే 19, 2026న ధార్ జిల్లా, నాల్చా బ్లాక్ పరిధిలోని ముందనా గ్రామంలో “సోయాబీన్‌లో ఎరువుల సమతుల్య వినియోగం” అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించింది.
రాజస్థాన్: ఎరువుల సమతుల్య వినియోగం, నేల సారాన్ని పెంపొందించడం, పచ్చిరొట్ట ఎరువులు, సహజ, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై రైతులలో అవగాహన కల్పించేందుకు “మేరా గావ్–మేరా గౌరవ్” కార్యక్రమంలో భాగంగా మే 19, 2026న భరత్‌పూర్‌లోని ఐసిఎఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రేప్‌సీడ్-మస్టర్డ్ రీసెర్చ్ (ఐఐఆర్ఎంఆర్) రణ్‌ధీర్‌పురా గ్రామంలో ఒక రోజు ‘కిసాన్ సంగోష్ఠి’ (రైతు సదస్సు)ని నిర్వహించింది.
తెలంగాణ: సమతుల్య ఎరువుల వినియోగంపై చేపట్టిన ముమ్మర ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా, బాలానగర్ మండలం పరిధిలోని మమ్మూడుగుట్ట గ్రామంలో మే 19, 2026న హైదరాబాద్ లోని ఐసిఎఆర్-డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 19 మంది రైతులు పాల్గొన్నారు.
ఉత్తరప్రదేశ్: లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్ బ్లాక్ పరిధిలోని దేవతి గ్రామంలో మే 19, 2026న సమతుల్య ఎరువుల వినియోగంపై ‘మేరా గావ్ మేరా గౌరవ్’ కార్యక్రమం నిర్వహించారు.
ఉత్తరాఖండ్: నైనితాల్‌లోని భీమ్‌తాల్ పరిధిలో ఉన్న పాండేఛోర్ గ్రామంలో సేంద్రీయ ఎరువుల వినియోగంపై మే 19, 2026న భీమ్‌తాల్ ఐసిఎఆర్-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కోల్డ్‌వాటర్ ఫిషరీస్ రీసెర్చ్, క్షేత్ర స్థాయి ప్రదర్శనను నిర్వహించింది.
మొత్తంగా ఈ ప్రచార కార్యక్రమం ఖరీఫ్ 2026 సీజన్‌లో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం, సమగ్ర పోషకాల నిర్వహణ, జీవ ఎరువుల వినియోగం, వర్మీకంపోస్టింగ్, పశువుల పెంట శాస్త్రీయ వినియోగం, పశుగ్రాసం ఆధారిత పోషకాల పునరుత్పత్తి, పచ్చిరొట్ట ఎరువుల పద్ధతుల ద్వారా సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టింది. ఐసీఎఆర్ చేపట్టిన ఈ సమన్వయ యత్నాలు ఆహార భద్రత, పోషకాల వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించడం, పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడం, దీర్ఘకాలం పాటు నేల ఆరోగ్యాన్ని సంరక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2263515)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13