రైల్వే మంత్రిత్వ శాఖ
జమ్మూ-శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా ప్రాంతంలో రూ.238 కోట్ల వ్యయంతో
కీలక కొండ ప్రాంతాల్లో స్థిరత్వం, సొరంగాల పునరుద్ధరణ, వంతెనల రక్షణ పనులకు భారత రైల్వే ఆమోదం
వ్యూహాత్మకంగా కీలకమైన జమ్మూ-శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా ప్రాంత దీర్ఘకాలిక రక్షణ, విశ్వసనీయతను బలోపేతం చేసే ప్రాజెక్టు: శ్రీ అశ్వినీ వైష్ణవ్
నాడు పోస్టు చేయడమైనది:
19 MAY 2026 11:36AM by PIB Hyderabad
ఉత్తర రైల్వే పరిధిలోని జమ్మూ-శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా ప్రాంతంలో కీలకమైన కొండ ప్రాంతాల్లో స్థిరత్వం, సొరంగాల పునరుద్ధరణ, వంతెనల రక్షణకు రూ.238 కోట్ల వ్యయంతో కూడిన ప్రాజెక్టును భారత రైల్వే ఆమోదించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా జమ్మూ-శ్రీమాతా వైష్ణోదేవి కత్రా మార్గంలోని ప్రమాదకర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడకుండా చర్యలు తీసుకోవటం, పునరుద్ధరణ పనులు చేపట్టటం, సొరంగాల్లో లీకేజీ సమస్యలను పరిష్కరించటం, వంతెనల రక్షణతోపాటు భద్రతకు సంబంధించిన చర్యలు చేపడతారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. దేశంలోనే అత్యంత క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాల్లో సురక్షితమైన, విశ్వసనీయమైన రవాణా సౌకర్యాన్ని అందించేందుకు ప్రభుత్వానికున్న నిబద్ధతకు ఈ పనులే నిదర్శమని చెప్పారు. కొండచరియలు, వంతెనలు, సొరంగ మార్గాలను సమగ్రంగా అంచనా వేసిన అనంతరం రక్షణ, పునరుద్ధరణ పనులకు ఆమోదం తెలిపినట్లు శ్రీ అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ మార్గంలో దీర్ఘకాలిక భద్రత, విశ్వసనీయతను ఈ పనులు బలోపేతం చేస్తాయన్నారు.
విభిన్నమైన భూభాగం, ప్రతికూల భౌగోళిక పరిస్థితులు, భీకర వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ మార్గం.. పలు ఇంజనీరింగ్, కార్యాచరణ సవాళ్లను ఎదుర్కొంది. సకాలంలో పనులను పూర్తి చేయటం, పటిష్ఠమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం ద్వారా భారత రైల్వే ఈ సవాళ్లను అధిగమిస్తూ వచ్చింది. ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాల రక్షణ, పునరుద్ధరణకు నూతన పనులతో ఈ మార్గం మునుపెన్నడూ లేనంత పటిష్ఠంగా మారుతుంది. ఏటా ఈ మార్గంలో ప్రయాణించే లక్షలాది మందికి మరింత భద్రత, విశ్వాసంతో సేవలందించేందుకు ఇది సిద్ధంగా ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2262737)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8