ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆరు దశాబ్దాలుగా విశిష్ట సేవలందిస్తున్న హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ సంస్థ డైమండ్ జూబ్లీ ముగింపు వేడుకల్లో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీమతి పుణ్య సలిల శ్రీ వాస్తవ ప్రసంగం


ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా సమ్మిళితమైన, సరసమైన, నాణ్యమైన ఆరోగ్య సేవలను ముందుకు తీసుకెళుతున్న హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ సంస్థ: శ్రీమతి పుణ్య సలిల శ్రీవాస్తవ

ఆపరేషన్ సిందూర్‌ సహా సంక్షోభ సమయాల్లో హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ ఆదర్శప్రాయమైన సేవలను అందించింది: కేంద్ర ఆరోగ్య కార్యదర్శి

ఆరోగ్య సేవల్లో ఆవిష్కరణ, పరిశోధన సహకారాన్నిముందుకు తీసుకెళ్లడానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్‌లతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్న హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్

తిరువనంతపురంలోని హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ సంస్థ అక్కుళం యూనిట్లో ఆధునికీకరించిన మెనుస్ట్రువల్ కప్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య కార్యదర్శి

నాడు పోస్టు చేయడమైనది: 18 MAY 2026 2:40PM by PIB Hyderabad

భారత దేశ ప్రజారోగ్య రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో హెచ్ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ సంస్థ 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన డైమండ్ జూబ్లీ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీమతి పుణ్య సలిల శ్రీవాస్తవ ప్రసంగించారు. తిరువనంతపురంలోని హెచ్ఎల్ఎల్ పెరూర్కడా ఫ్యాక్టరీలో ఈ కార్యక్రమం జరిగింది.

హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ సంస్థ 1966లో ప్రారంభమైంది. భారత దేశ ప్రజారోగ్య కార్యక్రమానికి తోడ్పాటును అందించడంలో మార్గదర్శక పాత్ర పోషించింది. ప్రారంభంలో అందించిన సహకారం నుంచి జాతీయ కుటుంబ నియంత్రణ వరకు ఆరోగ్య ఉత్పత్తులు, రోగ నిర్దారణ పరీక్షలు, మౌలిక వసతుల అభివృద్ధి, సోషల్ మార్కెటింగ్ తదితర విభాగాల్లో తన ఉనికిని చాటుకుంది. ఉత్తమ సేవలు, ఆవిష్కరణలు, ప్రజాసేవ పట్ల నిబద్ధతను ఈ సంస్థ నిరంతరం ప్రదర్శిస్తోంది.

ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీమతి పుణ్య సలిల శ్రీవాస్తవ ప్రసంగించారు. హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ పై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఉన్న నమ్మకం గురించి తెలియజేశారు. సమ్మిళతమైన, అందుబాటు ధరల్లో, నాణ్యమైన ఆరోగ్య సేవలను అందరికీ అందించాలనే ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా ఈ సంస్థ నిబద్ధతతో వ్యవహరిస్తూ, విశ్వసనీయతను నిలబెట్టుకుంటోందన్నారు.

హెచ్ఎల్ఎల్ సంస్థ నిరంతర అభివృద్ధిని, మారుతున్న ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా స్పందిస్తున్న తీరును ఆమె ప్రశంసించారు. వ్యవస్థలో ఉన్న ముఖ్యమైన లోపాలను గుర్తించి వాటిని ప్రయోగాత్మకమైన, ప్రభావవంతమైన చర్యల ద్వారా పరిష్కరించడంలో ప్రత్యేకమైన సామర్థ్యాన్ని ఈ సంస్థ ప్రదర్శించిందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు అన్ని సందర్భాల్లోనూ విప్లవాత్మకమైన రీతిలో భారీ స్థాయిలో ఉండకపోయినప్పటికీ వాటి మొత్తం ప్రభావం మహిళలు, రోగుల జీవితాలను మెరుగుపరచడంలోనూ, దేశ ఆరోగ్య సేవల విధానాన్ని బలోపేతం చేయడంలోనూ పరివర్తనాత్మక పాత్రను పోషిస్తుందన్నారు.

హెచ్ఎల్ఎల్‌పై మంత్రిత్వ శాఖకున్న విశ్వాసం గురించి ఆమె స్పష్టం చేశారు. ఇటీవలే దశాబ్దం పూర్తి చేసుకున్న అమృత్ (చికిత్స కోసం అందుబాటు ధరల్లో ఔషధాలు, నమ్మకమైన ఇంప్లాంట్లు) ఫార్మసీ నెట్‌వర్క్ లాంటి సేవల్లో, కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రి అందిస్తున్న మద్దతు, సహకారంలో.. ఈ విశ్వసనీయత ప్రతిబింబిస్తోందని తెలిపారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజనతో సహా ఈ తరహా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చౌక ధరలకే మందులను అందించేందుకు దోహదపడ్డాయని ఆమె అన్నారు.

క్యాన్సర్ ఔషధాలు, బ్రాండెడ్ మందులు, అత్యవసరమైన వైద్య పరికరాలతో సహా కీలకమైన ఔషధాలను మార్కెట్ ధరలతో పోలిస్తే 50 శాతం తక్కువకే అందించేలా అమృత్ ఫార్మసీలు మంత్రిత్వశాఖకు వీలు కల్పించాయని ఆమె అన్నారు. ఫలితంగా  రోగులకు, వారి కుటుంబాలకు ఆర్థిక భారం నుంచి ఉపశమనం లభించిందని తెలియజేశారు.

సంక్షోభ సమయంలో హెచ్ఎల్ఎల్ పోషించిన ప్రశంసనీయమైన పాత్రను గుర్తు చేసుకున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో వేగవంతమైన, సమన్వయ విధానంలో సంస్థ స్పందించిన తీరును వివరించారు. జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు అవసరమైన వైద్య సామగ్రి, భీష్మ క్యూబ్‌లు, ఔషధాలను పంపించిందన్నారు. ఇలాంటి ప్రయత్నాలు అత్యవసర సమయాల్లో దేశానికి సేవ చేయాలనే హెచ్ఎల్ఎల్ కార్యాచరణ సంసిద్ధతను, అంకితభావాన్ని, సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయని ఆమె తెలిపారు.

అత్యవసర సందర్భాల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే సామర్థ్యమే సంస్థ పనితీరుకు అసలైన కొలమానమని, ప్రజా సేవలో హెచ్ఎల్ఎల్ ప్రమాణాన్ని నిర్దేశించిందని అన్నారు.

పారదర్శకత, సమగ్రత, అంకితభావంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పుతూ సేవలందిస్తున్న హెచ్ఎల్ఎల్ లైప్‌కేర్ లిమిటెడ్ సంస్థను ఆమె అభినందించారు. అలాగే భారత దేశ ప్రజారోగ్య లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో కీలక భాగస్వామిగా సంస్థ పట్ల మంత్రిత్వ శాఖకున్న విశ్వసనీయతను పునరుద్ఘాటించారు.

ఈ ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆరోగ్య రంగ సంస్థల్లో అగ్రగామిగా హెచ్ఎల్ఎల్ ఆరు దశాబ్దాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ సంస్థ ప్రయాణానికి, జాతీయ ప్రాధాన్యానికి ప్రతీకగా ఓ స్మారక నాణేన్ని విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ లాంటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలతో హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది. సహకారాత్మక పరిశోధన, ఆరోగ్యసేవల్లో ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడం, దేశ ప్రజారోగ్య అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడమే ఈ ఒప్పందాల లక్ష్యం.

అందుబాటు ధరల్లో ఆరోగ్య సేవల పరిష్కారాలను అందిస్తూ, సామాజిక ప్రభావం పట్ల తన నిబద్ధతను స్పష్టం చేస్తూ.. ముఖ్యమైన ఉత్పత్తి, సేవా కార్యక్రమాలను హెచ్ఎల్ఎల్ ప్రకటించింది. వాటిలో హైడ్రోసెఫలస్ షంట్‌ను రీలాంఛ్ చేయడం, హెచ్ఎల్ఎల్ పరివర్తన్ వెల్‌నెస్ క్లినిక్ ప్రారంభం, హెచ్ఎల్ఎల్ వాటర్ పరిచయం, ‘హ్యాపీ డేస్’ కంపోస్టబుల్ శానిటరీ న్యాప్‌కిన్ ఆవిష్కరణ ఉన్నాయి. ఇవన్నీ అందరికీ అందుబాటు ధరల్లో ఉండే, సుస్థిరమైన, ఆవిష్కరణాత్మకమైన ప్రజారోగ్య పరిష్కారాలపై నిరంతరం సంస్థ సారిస్తున్న దృష్టిని ప్రతిబింబిస్తాయి.

తిరువనంతపురంలోని హెచ్ఎల్ఎల్ అక్కుళం ఫ్యాక్టరీ వద్ద ఆధునికీకరించిన మెనుస్ట్రువల్ కప్ తయారీ కేంద్రాన్ని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రారంభించారు. మహిళల ఆరోగ్యం, పర్యావరణహితమైన రుతుక్రమ శుభ్రత పరిష్కారాలను అందించడంలోనూ, జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడంలోనూ హెచ్ఎల్ఎల్ సంస్థకున్న చిత్తశుద్ధిని.. మెరుగుపరిచిన ఈ తయారీ కేంద్రం ప్రతిబింబిస్తుంది.

హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ కు చెందిన పీఎఫ్‌టీ, ఏఎఫ్‌టీ కేంద్రాలను కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీమతి పుణ్య సలిల శ్రీ వాస్తవ సందర్శించారు. అక్కడ నిర్వహించే ముఖ్యమైన కార్యకలాపాల గురించి ఉన్నతాధికారులు ఆమెకు వివరించారు.

ఫ్యాక్టరీకి చెందిన రెండు యూనిట్ల లో ఆమె పర్యటించారు. బృందాలతో సంభాషిస్తూ.. తయారీ విధానాలను సమీక్షించారు. అలాగే నాణ్యత, సామర్థ్యం, దేశీయంగా ఉత్పత్తి పట్ల హెచ్ఎల్ఎల్‌కున్న నిబద్ధతను ఆమె ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ యాజమాన్యం, భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు, ప్రజారోగ్యం, ఆరోగ్యసేవల రంగాలకు చెందిన విశిష్ట భాగస్వాములు పాల్గొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2262632) సందర్శకుల సూచీ సంఖ్య : : 18
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Tamil , Malayalam