రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ప్రాజెక్ట్ సక్షమ్’ ద్వారా మహిళా నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహిస్తోన్న ఎన్‌హెచ్‌ఏఐ

నాడు పోస్టు చేయడమైనది: 15 MAY 2026 3:09PM by PIB Hyderabad

సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించాలనే తన నిబద్ధతను చాటేలా భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), వెర్టిస్ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో సమాజంలో ఒక అర్ధవంతమైన మార్పునకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రారంభించిన ‘‘ప్రాజెక్ట్ సక్షమ్’’ ద్వారా గ్రామీణ మహిళలకు క్రమబద్ధమైన నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తూ, వారికి స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పిస్తోంది. కేవలం నైపుణ్యాలను నేర్పించడమే కాకుండా మహిళలు దీర్ఘకాలికంగా ఆర్థిక స్వాతంత్య్రం, సామాజిక సాధికారత సాధించేలా చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం.

 

ప్రాజెక్ట్ సక్షమ్ దేశవ్యాప్తంగా 12 శిక్షణ కేంద్రాల వ్యవస్థ ద్వారా పనిచేస్తుంది. ఇది వెనుకబడిన వర్గాల వారికి, పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలను నేర్పిస్తూ...  ఉపాధి రంగంలోకి ప్రవేశించే మార్గాలను అందిస్తోంది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం 6,000 మందికి పైగా యువతకు శిక్షణ ఇవ్వగా, వారిలో 4,000 మందికి పైగా వివిధ రంగాల్లో విజయవంతంగా ఉద్యోగాలు పొందారు. లబ్ధిదారులు నెలకు సగటున రూ.13,000 నుంచి 16,000 మధ్య ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇది అనేక రాష్ట్రాల్లోని ప్రారంభ స్థాయి వేతనాల కంటే చాలా ఎక్కువ. ముఖ్యంగా లబ్ధిదారులలో 80 వాతం కంటే ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ఇది మహిళా సాధికారతకు ఈ కార్యక్రమం ఇస్తున్న బలమైన ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది.

 

మౌలిక సదుపాయాల సమగ్ర అభివృద్ధి అనే విస్తృత దృక్పథంతో పనిచేస్తున్న భారత జాతీయ రహదారుల సంస్థ జాతీయ రహదారుల వెంబడి నివసించే ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ మహిళలు ఆర్థిక వృద్ధి  పొందాలనే ఉద్దేశంతో ‘ప్రాజెక్ట్ సక్షమ్’ కార్యక్రమం చేపట్టింది. రహదారుల విస్తరణ జరుగుతున్నప్పటికీ, ఆ ఆర్థిక గమనంలో భాగస్వాములు కాలేకపోతున్న వెనుకబడిన వర్గాలకు నైపుణ్యాలు, ఉపాధి, ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడానికి ద్వారా ఈ ప్రాజెక్టు  ప్రయత్నిస్తోంది.

 

ప్రాజెక్ట్ సక్షమ్ దాని బలమైన క్షేత్రస్థాయి కార్యచరణ నమూనాతో ప్రత్యేకత గుర్తుంపును పొందింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి, కుటుంబాలతో సన్నిహితంగా మాట్లాడి వారిలో నమ్మకాన్ని పెంపొందిస్తున్నాయి. సామాజిక, సాంస్కృతిక అడ్డంకులను అధిగమించి, మహిళలు మొదటిసారిగా నైపుణ్యాభివృద్ధి,  ఉపాధి అవకాశాలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కింద లబ్ధిదారులకు మార్కెట్ అవసరాలకు తగినట్లుగా ఎలక్ట్రికల్ పనులు, గృహోపకరణాల మరమ్మత్తు, టైలరింగ్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్ నర్సింగ్, మల్టీ-స్కిల్ టెక్నీషియన్ శిక్షణ సహా విభిన్న రంగాల్లో వృత్తి విద్యా నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా లబ్ధిదారుల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా, వారికి ఆచరణాత్మక సామర్థ్యాలను అందించేలా ఈ కార్యక్రమాలను ప్రత్యేకంగా రూపొందించారు. చాలా మంది పాల్గొనేవారికి ఈ శిక్షణ ఒక పరివర్తనాత్మక ప్రయాణంగా నిలుస్తూ, వారు ఆర్థిక స్వాలంబన సాధించేలా చేయడమే కాకుండా, వారి గురించి, వారి సమాజం గురించి  పెట్టుకున్న ఆకాంక్షలకు సరికొత్త రూపాన్ని ఇస్తోంది.

 

మౌలిక సదుపాయాల అభివృద్ధి కేవలం మెరుగైన అనుసంధానాన్ని అందించడమే కాకుండా, దేశవ్యాప్తంగా మరింత బలమైన, స్థితిస్థాపకత కలిగిన సమాజాలను రూపొందించడంలో దోహదపడే సమ్మిళిత వృద్ధికి అవకాశాలను కూడా కల్పిస్తుందనే ఎన్‌హెచ్‌ఏఐ నిబద్ధతను ఈ కార్యక్రమం స్పష్టం చేస్తోంది.

***


(రిలీజ్ ఐడి: 2261836) సందర్శకుల సూచీ సంఖ్య : : 26
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Gujarati , English , Manipuri , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Tamil