రక్షణ మంత్రిత్వ శాఖ
భారత సమష్టి సంకల్పాన్ని, సరికొత్త సైనిక ఒరవడిని చాటేలా.. తక్కువ వ్యవధిలోనే తీక్షణంగా చొచ్చుకుపోయి తీవ్రంగా, ప్రభావవంతంగా సాగిన ఆపరేషన్ సిందూర్: జాయింట్ కమాండర్ల సదస్సులో రక్షణ మంత్రి
భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నడుమ భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి
“ఏఐ, స్వయంప్రతిపత్త వ్యవస్థలు, డేటా విశ్లేషణ, సురక్షిత కమ్యూనికేషన్ నెట్వర్కుల్లో సామర్థ్యాల బలోపేతం ఆవశ్యకం”
“వినూత్న ఆలోచనలు, మెరుగైన సమన్వయంతోనే భవిష్యత్తులో యుద్ధాల్లో విజయం’’
“శత్రువు అంచనాలకు చిక్కకుండా, వ్యూహాత్మక ప్రయోజనాన్ని పొందడంలో ‘ఆకస్మిక వ్యూహం’ అత్యంత కీలకం”
प्रविष्टि तिथि:
08 MAY 2026 4:20PM by PIB Hyderabad
‘‘దేశ ప్రయోజనాల పరిరక్షణలో భారత రక్షణ దళాలు ఎంత వేగంగా, కచ్చితత్వంతో, సమన్వయంతో స్పందించగలవో ఆపరేషన్ సిందూర్ చాటింది’’ అని రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ ఆపరేషన్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత భద్రతా పరిస్థితుల నుంచి పాఠాలను నేర్చుకుంటూ, భవిష్యత్తు సవాళ్లను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన త్రివిధ దళాల కమాండర్లకు ఆయన పిలుపునిచ్చారు. 2026 మే 8న రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన రెండో జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడుతూ.. తక్కువ వ్యవధిలో, శత్రువుల భూభాగంలోకి తీక్షణంగా చొచ్చుకుపోయి, అత్యంత తీవ్రతతో ప్రభావవంతంగా చేపట్టిన చర్యగా ఆపరేషన్ సిందూర్‌ను అభివర్ణించారు. శత్రువును లొంగదీయడంలో భారత్ సామర్థ్యాన్ని ఇది చాటిందన్నారు. బలోపేతమవుతున్న భారత్ శక్తికి ఈ ఆపరేషన్ నిదర్శనమని, దేశ సమష్టి సంకల్పానికి, నూతన సైనిక ఒరవడికి చిహ్నమని ఆయన వ్యాఖ్యానించారు.
వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయ భద్రతా పరిస్థితులకు అనుగుణంగా సంసిద్ధంగా ఉండేలా.. కృత్రిమ మేధ, స్వయంప్రతిపత్త వ్యవస్థలు, డేటా అనలిటిక్స్, సురక్షిత సమాచార నెట్‌వర్కుల్లో సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తలెత్తే ఘర్షణలు ప్రధానంగా హైబ్రిడ్ ముప్పు, సమాచార ఆధిపత్యం ద్వారానే ఉంటాయని ఆయన చెప్పారు. అంతేకాకుండా సైబర్, అంతరిక్షం, ఎలక్ట్రోమాగ్నెటిక్, మేధోపరమైన రంగాల్లో ఏకకాలంలో దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అధునాతన సాంకేతికతలు చూపే అమితమైన ప్రభావాన్ని వివరిస్తూ.. అన్ని రకాల ఘర్షణలను ఎదుర్కొనేందుకు దేశం సర్వసన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
మూడు సాయుధ దళాల మధ్య ఉమ్మడి తత్వం, ఏకీకరణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడంలో సాధించిన పురోగతిని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ప్రపంచ రక్షణ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులలో ఉమ్మడి తత్వం అత్యంత కీలక అంశమని ఆయన పేర్కొన్నారు. “భవిష్యత్తు యుద్ధాలను కేవలం ఆయుధాలతోనే గెలవలేం. వినూత్న ఆలోచనలు, దళాల మధ్య మెరుగైన సమన్వయంతోనే విజయం సాధ్యమవుతుంది” అని ఆయన స్పష్టం చేశారు.
శత్రువు అంచనాలకు అందకుండా, ఏ పరిస్థితిలోనైనా ప్రత్యర్థులపై వ్యూహాత్మక ఆధిక్యతను సాధించేలా.. సాయుధ దళాలలో ‘ఆకస్మిక వ్యూహాల’ను పెంపొందించుకోవాలని రక్షణ మంత్రి కమాండర్లకు ఉద్బోధించారు. అయితే అదే సమయంలో శత్రువుల వైపు నుంచి ఎదురయ్యే అనూహ్య దాడుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎప్పుడూ శత్రువు కన్నా రెండు అడుగులు ముందే ఉండాలని వారిని కోరారు.
అత్యాధునిక ఆయుధాలు, ప్లాట్‌ఫాంల ద్వారా రక్షణ దళాల సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ప్రత్యేక రంగాల్లో పరిశోధనపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సదస్సు సందర్భంగా ఆపరేషన్ సిందూర్‌పై ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని రక్షణ మంత్రి విడుదల చేశారు. దేశ రక్షణ దళాల కార్యాచరణ సంసిద్ధతను, సమర్థమైన దేశ నిర్ణయాత్మక ప్రతిఘటన సామర్థ్యాన్ని ఈ చిత్రం చాటుతుంది. దీనితోపాటు విజన్ 2047 హిందీ వెర్షన్‌ను కూడా విడుదల చేశారు. అలాగే భవిష్యత్తులో వివిధ రంగాల్లో చేపట్టే ఉమ్మడి కార్యకలాపాలకు సంబంధించి.. సాయుధ దళాల్లో సైద్ధాంతిక స్పష్టత, పరస్పర సమన్వయం, సమీకృత సమాచార వినిమయాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఉన్న ‘సమీకృత సమాచార వినిమయ ఉమ్మడి ప్రణాళిక’ను కూడా వివరించారు.
‘కొత్త రంగాల్లో సైనిక సామర్థ్యం’ అనే ఇతివృత్తంతో జరిగిన సదస్సులో.. రక్షణ మంత్రిత్వ శాఖ, భారత రక్షణ దళాల అగ్రశ్రేణి నాయకత్వం పాల్గొని ఎదురవుతున్న భద్రతా సవాళ్లు, భవిష్యత్తు సన్నద్ధతపై చర్చించారు. భవిష్యత్తు యుద్ధ తంత్రాలు, బహుళ రంగ కార్యకలాపాలు, సాంకేతిక పరివర్తన, ఉమ్మడి సామర్థ్యాభివృద్ధిపై సమగ్రంగా చర్చించారు. మేధోపరమైన వ్యూహాత్మక యుద్ధం (కాగ్నిటివ్ వార్‌ఫేర్), అత్యాధునిక రంగాలైన క్వాంటం, ఏఐ ఆధారిత ముప్పుల నుంచి సైబర్ ప్రతిఘటన, సరికొత్త రంగాల్లో సైనిక సామర్థ్యాభివృద్ధి, దేశీయ ఆవిష్కరణలు, ఏఐ ఆధారిత యుద్ధ భావనలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు.
సమాచార క్రోడీకరణ, కార్యకలాపాల ప్రణాళిక, సమాచార నిర్వహణ కోసం అభివృద్ధి చేసిన అత్యాధునిక వ్యవస్థలు, ప్లాట్‌ఫాంల ప్రదర్శనలను కూడా ఈ సదస్సులో నిర్వహించారు. ఉమ్మడి కార్యాచరణ వ్యవస్థలతో అత్యాధునిక సాంకేతికతలను వేగంగా అనుసంధానిస్తున్న తీరుకు ఇది నిదర్శనం. భారత సైనిక భవిష్యత్తును, సమీకృత కార్యాచరణ సన్నద్ధతను రూపుదిద్దడంలో ఈ చర్చలు విశేషంగా దోహదపడతాయి.
సాయుధ దళాల ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్, నావికా దళాధిపతి అధిపతి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి. సింగ్, రక్షణ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్, రక్షణ పరిశోధన - అభివృద్ధి విభాగం కార్యదర్శి, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్, కార్యదర్శి (రక్షణ ఉత్పత్తి) శ్రీ సంజీవ్ కుమార్, కార్యదర్శి (మాజీ సైనికుల సంక్షేమం) శ్రీమతి సుకృతి లిఖి, కార్యదర్శి (రక్షణ ఆర్థిక విభాగం) శ్రీ విశ్వజిత్ సహాయ్, ఇతర ఉన్నత పౌర, సైనికాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2261019)
आगंतुक पटल : 44