ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘పేటెంట్ నుంచి ఉత్పత్తి వరకు: ఎలక్ట్రానిక్స్, ఐటీలో మేధోసంపత్తి వాణిజ్యీకరణకు ఉత్తేజం’… జాతీయ సదస్సు సందర్భంగా ఐపీ ఉత్ప్రేరక, డిజిటల్ వేదిక ప్రారంభం

నాడు పోస్టు చేయడమైనది: 13 MAY 2026 12:23PM by PIB Hyderabad

‘పేటెంట్ నుంచి ఉత్పత్తి వరకు: ఎలక్ట్రానిక్స్, ఐటీలో మేధోసంపత్తి వాణిజ్యీకరణకు ఉత్తేజం’పై న్యూఢిల్లీలోని ఇండియా హాబిటట్ సెంటర్‌లో 2026 మే 12న కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఒకరోజు జాతీయ సదస్సును నిర్వహించింది. విధాన రూపకర్తలు, ఆవిష్కర్తలు, పారిశ్రామిక ప్రముఖులు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలు, విద్యాసంస్థలు, పరిశోధకులు, పరిశోధన - అభివృద్ధి సంస్థల ప్రతినిధులను ఈ సదస్సు ఒక్కచోట చేర్చింది. ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగంలో దేశ మేధోసంపత్తిని, ఆవిష్కరణ వ్యవస్థను బలోపేతం చేయడంపై సదస్సులో చర్చించారు.

 

ప్రారంభ సదస్సు సందర్భంగా ఐపీ ఉత్ప్రేరక కార్యక్రమాన్ని, సంబంధిత డిజిటల్ వేదికను (https://cipie.in) మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్ ప్రారంభించారు. మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, ఇండియా సెమీకండక్టర్ మిషన్ సీఈవో శ్రీ అమితేశ్ కుమార్ సిన్హా, బృంద సమన్వయకర్త, శాస్త్రవేత్త (జీ) శ్రీమతి సునీతా వర్మ, వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని డీపీఐఐటీకి చెందిన సీజీపీడీటీఎం కాపీరైట్ల రిజిస్ట్రార్ ప్రొఫెసర్ (డా.) ఉన్నత్ పి. పండిట్, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ఇతర కీలక ప్రతినిధులు సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఐపీ ఉత్ప్రేరకం

పరిశోధన, మేధోసంపత్తి సృజన నుంచి సాంకేతికత బదిలీని సృష్టించడం, వాణిజ్యీకరణ, మార్కెట్‌లో ప్రవేశపెట్టడం వరకు.. పూర్తిస్థాయిలో ఆవిష్కరణ వ్యవస్థకు దన్నుగా నిలిచేలా, సమగ్రమైన డిజిటల్ వ్యవస్థను నెలకొల్పడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని - ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సహకారంతో, సీడీఏసీ - పూణె అమలు చేస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సంస్థలు, అంకుర సంస్థలు, విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించడం ద్వారా.. ప్రభుత్వ నిధులతో నడిచే పరిశోధన - అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలు వాటిని అందిపుచ్చుకోవడం మధ్య ఉన్న అంతరాన్ని తొలగించడమే దీని లక్ష్యం.

 

ముఖ్యాంశాలు, ఐపీ ఉత్ప్రేరక కార్యక్రమంతో సహకారం:

 

· మంత్రిత్వ శాఖ సంస్థలు, సహాయం పొందిన సంస్థల కోసం ఐపీ దాఖల్లకు ఆర్థికసాయం

 

· అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల కోసం అంతర్జాతీయ పేటెంట్ దాఖలుకు చేయూత

 

· సాంకేతికత వాణిజ్యీకరణ, ఐటీ సహాయక సేవలకు ఏకీకృత డిజిటల్ లభ్యత

 

· పూర్వ కళా శోధన, మేధో సంపత్తి సలహా సేవలు

 

· సాంకేతికతా సన్నద్ధత, గడువును అంచనా వేయడం

 

· మేధో సంపత్తి విలువ నిర్ధారణ, వాణిజ్యీకరణ సేవలు

 

· సాంకేతిక బదిలీ, లైసెన్సింగ్ సౌకర్యం

 

· పరిశ్రమ – విద్యాసంస్థలు – అంకుర సంస్థల సహకార అవకాశాలు

 

· మంత్రిత్వ శాఖ సహకారమున్న సాంకేతికతలు, దేశీయ పరిష్కార మార్గాల లభ్యత

 

· నమూనా దశ నుంచి ఉత్పత్తిగా రూపొందడానికి, మార్కెటులో ప్రవేశపెట్టడానికి చేయూత

 

cipie.in వేదిక…

 

మేధో సంపత్తి, వాణిజ్యీకరణ సహాయక సేవల కోసం ఏకీకృత ఆన్‌లైన్ మార్గంగా https://cipie.in డిజిటల్ వేదిక సేవలందిస్తుంది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ మద్దతుతో చేపట్టిన పరిశోధన - అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రూపొందించిన సాంకేతికతలకు జాతీయ స్థాయి డిజిటల్ నిక్షేపంగా కూడా వ్యవహరిస్తూ.. అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలు, పరిశ్రమలు దేశీయంగా అందుబాటులో ఉన్న సాంకేతికతలను గుర్తించడానికి, సహకార అవకాశాలను అన్వేషించడానికి ఇది వీలు కల్పిస్తుంది.

 

ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్ ప్రారంభోపన్యాసం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘వికసిత భారత్ లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా తన సృజనాత్మక ప్రస్థానంలో భారత్ నేడు ఒక నిశ్చయాత్మక స్థానంలో నిలిచింది. 2024–25లో భారత్ 1,10,375 పేటెంట్ దరఖాస్తులను దాఖలు చేసి చరిత్రాత్మక మైలురాయిని దాటింది. వీటిలో ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగం దాదాపు 44 శాతం. 2025–26లో పేటెంట్ దాఖలు మరింత పెరిగి ఆ సంఖ్య 1,43,729కి చేరింది. ఇందులో ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగంలో పేటెంట్ల దాఖలులలో 52 శాతం పెరుగుదలను నమోదవడం గమనార్హం. సాంకేతిక, ఆవిష్కరణ వ్యవస్థలో భారత్ బలం విశేషంగా పెరుగుతోందనేందుకు ఇది స్పష్టమైన నిదర్శనం’’ అని వివరించారు. వికసిత భారత్ లక్ష్యం దిశగా సాగుతున్న ఆవిష్కరణల ప్రస్థానంలో భారత్ నేడొక నిశ్చయాత్మక స్థితిలో ఉందని ఆయన తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాల్లో పేటెంట్ల దాఖలు విశేషంగా పెరగడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. నమూనా దశ నుంచి ఉత్పత్తి వరకు ప్రయాణాన్ని వేగవంతం చేయడం ద్వారా.. సాంకేతికతలు, ఉత్పత్తులు, సామాజిక సానుకూల ప్రభావంగా ఈ ఆవిష్కరణలను నిలిపేలా చూడడంలో ఐపీ ఉత్ప్రేరకం ఒక కీలకమైన ముందడుగు అని స్పష్టం చేశారు.

 

భారత్‌లో ముఖ్యంగా సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, ఏఐ, అత్యాధునిక సాంకేతికతల్లో వ్యూహాత్మక సాంకేతికతల ప్రాధాన్యం పెరుగుతోందని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, ఇండియా సెమీకండక్టర్ మిషన్ సీఈవో శ్రీ అమితేశ్ కుమార్ సిన్హా తెలిపారు. అంకుర సంస్థలు, ఎంఎస్‌ఎంఈలు, పరిశ్రమలు దేశీయ సాంకేతికతలను పొందడానికి, పరిశోధన సంస్థలతో సహకారానికి, ఆవిష్కరణల ఆధారంగా వృద్ధిని వేగవంతం చేయడానికి ఐపీ ఉత్ప్రేరక కార్యక్రమం వీలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.

 

ఆవిష్కరణ వ్యవస్థలో కీలక భాగస్వాములందరి మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు బృంద సమన్వయకర్త శ్రీమతి సునీతా వర్మ పేర్కొన్నారు. నిర్మాణాత్మక, డిజిటల్‌గా అందుబాటులో ఉండే మేధోసంపత్తి సేవల ద్వారా సంబంధిత భాగస్వాములందరి కోసం సాంకేతికతను వాణిజ్యీకరించడంలో ఈ వేదిక సహాయకారిగా ఉంటుందని ఆమె వెల్లడించారు.

 

డీపీఐఐటీకి చెందిన సీజీపీడీటీఎం కాపీరైట్ల రిజిస్ట్రార్ ప్రొఫెసర్ (డా.) ఉన్నత్ పి. పండిట్ మాట్లాడుతూ.. భారత్ ఇకపై పేటెంట్ దాఖళ్లకు మాత్రమే పరిమితం కాకుండా, మేధో సంపత్తి నుంచి ఆర్థిక, సాంకేతిక విలువను రాబట్టడంపై దృష్టి పెట్టాలన్నారు. ‘పేటెంట్లను దాఖలు చేయాల’న్న దృక్పథం నుంచి ‘పేటెంట్ → ఉత్పత్తి → లాభం’ అనే విధానం దిశగా మన ఆలోచన విధానంలో మార్పు రావాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల ఉత్పత్తులకు, సంపద సృష్టికి పేటెంట్లను పునాదిగా మలచుకోవాలని సూచించారు.

 

ప్రయోగశాల నుంచి మార్కెటు వైపునకు విస్తరించడం, అంకుర సంస్థలు - ఎంఎస్ఎంఈల సాధికారత, సాంకేతిక బదిలీ, అంతర్జాతీయ పేటెంట్ వ్యూహాలు, మేధోసంపత్తి వాస్తవిక విలువను మదింపు చేయడం సహా వివిధ ఇతివృత్తాలపై నిపుణుల బృందాలతో చర్చలను ఈ సదస్సులో నిర్వహించారు. దేశీయ ఆవిష్కరణ సామర్థ్యాలను బలోపేతం చేయడంతోపాటు వికసిత భారత్ లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా సాంకేతికతను వాణిజ్యీకరణను మెరుగుపరచుకోవడం, అలాగే ఎలక్ట్రానిక్స్ - ఐటీ రంగంలో ప్రయోగశాల నుంచి మార్కెట్ ప్రవేశాన్ని మరింత విస్తృతం చేయాలన్న భారత ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఐపీ ఉత్ప్రేరక కార్యక్రమాన్ని రూపొందించారు.

***


(రిలీజ్ ఐడి: 2260925) సందర్శకుల సూచీ సంఖ్య : : 72
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , हिन्दी , English , Tamil