జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

‘వలస కార్మికుల హక్కుల పరిరక్షణ: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల సమష్టి బాధ్యత’ అంశంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ కీలక సభ్యుల సమావేశం


విధానాలను రూపొందించడమే కాకుండా.. అంతర్రాష్ట్ర సమన్వయం, బదిలీ చేయగలిగే సామాజిక భద్రత, కార్మిక చట్టాల పటిష్ట అమలు వంటి వ్యవస్థాగత సంస్కరణల ఆవశ్యకతను వివరించిన కమిషన్‌ ఛైర్‌పర్సన్ జస్టిస్ వీ రామసుబ్రమణియన్

సమయానికి వేతనాలు చెల్లించకపోవడం వల్ల కార్మికులు తమ ఇళ్లను వదిలి వచ్చిన ఉద్దేశమే దెబ్బతింటుందన్న కమిషన్‌ సభ్యుడు జస్టిస్ (డాక్టర్‌) బిద్యుత్ రంజన్ సారంగి

ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకంపై సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్ ప్రశంస.. చట్టాలకు, వాటి క్షేత్రస్థాయి అమలుకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాల్సిన అవసరం ఉందని సూచన

వివిధ రంగాల నిపుణులు, భాగస్వామ్య పక్షాలతో జరిగిన చర్చల్లో ప్రతిపాదించిన కీలక విషయాలు.. వలస కార్మికులకు వేతనాలను ఏకరీతిగా, సకాలంలో చెల్లించడం, వారికి నిత్యావసర సేవలు, వైద్యం, పారిశుద్ధ్యం, గృహ వసతి, సామాజిక భద్రత కల్పించడం, పిల్లల విద్యకు భరోసా కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవడం వంటివి ముఖ్యమైనవి…

నాడు పోస్టు చేయడమైనది: 13 MAY 2026 11:56AM by PIB Hyderabad

‘వలస కార్మికుల హక్కుల పరిరక్షణ: ప్రభుత్వం, ప్రైవేటు రంగాల ఉమ్మడి బాధ్యత’ అంశంపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) న్యూఢిల్లీలోని తన కార్యాలయంలో హైబ్రిడ్ విధానంలో కీలక సభ్యుల సమావేశాన్ని నిర్వహించింది. దీనికి కమిషన్‌ చైర్‌పర్సన్ జస్టిస్ వీ రామసుబ్రమణియన్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర కార్మికులతో పోలిస్తే వలస కార్మికులు అత్యధికంగా సవాళ్లను ఎదుర్కొంటున్నారని, వారిలో అత్యధిక మంది అసంఘటిత రంగానికి చెందినవారు కావడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. భాషా పరమైన అడ్డంకులు, నిరంతర వలసలు, స్థిరమైన నివాసం లేకపోవడం వంటి కారణాల వల్ల వారు తమ హక్కులను సంఘటితంగా కాపాడుకోలేకపోతున్నారని అన్నారు. కార్మికుల హక్కుల కోసం గతంలో ఉన్న బలమైన యూనియన్ల సంప్రదాయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యుడు జస్టిస్ (డాక్టర్) విద్యుత్ రంజన్ సారంగి, సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్, డీజీ (విచారణ విభాగం) శ్రీమతి అనుపమ నీలేకర్ చంద్ర, రిజిస్ట్రార్ (న్యాయ విభాగం) శ్రీ జోగిందర్ సింగ్, జాయింట్ సెక్రటరీలు శ్రీ సమీర్ కుమార్, శ్రీమతి సైడింగ్‌పుయి ఛక్‌చువాక్‌తోపాటు భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ రంగాల నిపుణులు, వివిధ ఐక్యరాజ్యసమితి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

వలస కార్మికుల గుర్తింపు కోసం 1979లో వచ్చిన చట్టాన్ని, 240 రోజుల నిరంతర పని తర్వాత రక్షణ కల్పించే పారిశ్రామిక వివాదాల చట్టం నిబంధనలను జస్టిస్‌ రామసుబ్రమణియన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ చట్టాల్లో ఉన్న లొసుగులను యజమానులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని తెలిపారు. కార్మికుల పని పూర్తయ్యే సమయం దగ్గర పడగానే యజమానులు కావాలనే పనిలో విరామం ఇచ్చి, వారు ఆ అర్హతను సాధించకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. దేశంలో 1979 నుంచే కార్మికుల రక్షణ కోసం బలమైన చట్టాలు ఉన్నప్పటికీ, వాటి క్షేత్రస్థాయి అమలు మాత్రం ఆందోళనకరంగానే ఉందని అన్నారు. ప్రభుత్వాలకు తగిన సలహాలు, సూచనలు అందించడంలో జాతీయ మానవ హక్కుల సంఘం, సభ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అందరికీ తెలిసినవేనని, ఇప్పుడు జరగబోయే వివిధ పక్షాల చర్చల ద్వారా ఆచరణాత్మక పరిష్కారాలు లభిస్తాయని కమిషన్ ఆశిస్తోందని పేర్కొన్నారు. ఈ చర్చల ఆధారంగా రూపొందించే సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమలు కోసం పంపిస్తామని ఆయన వెల్లడించారు.

 

వలస కార్మికుల విషయంలో కేవలం నిబంధనలను పాటించడమే కాకుండా, వారి హక్కులకు ప్రాధాన్యతనిచ్చే సంస్కృతి రావాలని జస్టిస్ రామసుబ్రమణియన్ స్పష్టం చేశారు. రాష్ట్రాల మధ్య సమన్వయం, ఎక్కడికైనా తరలించగలిగే సామాజిక భద్రత, కార్మిక చట్టాల పటిష్ట అమలు వంటి వ్యవస్థాగత సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణ రంగం, హోటల్, వ్యాపార, నిర్మాణ రంగ కార్మికులుగా పనిచేస్తున్న వలసదారులపై తక్షణమే దృష్టి సారించాలని సూచించారు. కార్మికులకు మెరుగైన పని వాతావరణాన్ని కల్పించేందుకు భాషా ప్రాతిపదికన ఏర్పడిన కార్మిక సంఘాల సభ్యులను సమన్వయ మండలిలో భాగస్వామ్యం చేయాలని ప్రతిపాదించారు.

వలస కార్మికులకు సరైన గౌరవం గానీ, వేతనాలు గానీ అందడం లేదని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యుడు జస్టిస్‌ (డాక్టర్‌) విద్యుత్‌ రంజన్‌ సారంగి ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల వారు తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వచ్చిన ఉద్దేశమే దెబ్బతింటోందని అన్నారు. కార్మికులు ఆత్మగౌరవంతో జీవించడానికి తగిన వేతనం, నివాస సదుపాయం, వైద్య సేవలు, వారి పిల్లలకు విద్యా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వీటితో పాటు కార్మిక కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన డేటాబేస్‌ను రూపొందించాలని, తద్వారా వారికి కూడా ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చూడాలని ఆయన సూచించారు.

 

అంతకుముందు వలసలపై ఒక నివేదికను ప్రస్తావిస్తూ... ప్రపంచవ్యాప్తంగా వలస కార్మికులు అన్ని స్థాయిల్లోనూ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నారని జాతీయ మానవ హక్కుల సంఘం సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్ కొనియాడారు. దేశ జనాభాలో దాదాపు 28.9 శాతం మంది గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లే కార్మికులే ఉన్నారని, వీరు ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. కోవిడ్ 19 సంక్షోభ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న తీవ్రమైన ఇబ్బందులను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యంగా అవుట్‌సోర్సింగ్ కార్మికుల దోపిడీపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. వారిలో చాలామందికి కనీస వేతనాలు కూడా అందడం లేదని తెలిపారు. కాంట్రాక్టర్లు పేమెంట్ యాప్‌ల ద్వారా కార్మికుల జీతాలను భారీగా తగ్గిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు. వలస కార్మికుల పట్ల సమాజానికి మరింత సామాజిక స్పృహ, బాధ్యత అవసరమని చెప్పారు.

 

కార్మికుల అభివృద్ధి కోసం చేసే పెట్టుబడులు, సంక్షేమ చర్యలు వారి పనితీరును గణనీయంగా పెంచుతాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన వలస కార్మికులపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్ చేసిన ఒక అధ్యయనాన్ని ఉదహరించారు. సంక్షేమ చర్యల వల్ల కర్మాగార కార్మికుల పని సామర్థ్యం 1.38 రెట్లు పెరిగి, వారి కుటుంబ సంక్షేమం, విద్య, పిల్లల భవిష్యత్తు అవకాశాలు మెరుగుపడ్డాయని ఆ అధ్యయనం పేర్కొందని తెలిపారు. సమాజంలో ఎదురయ్యే వివక్ష, అన్యాయం వంటివి కొన్నిసార్లు హింసకు దారితీసే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. కొత్త కార్మిక చట్టాలు, డిజిటల్ పాలనా వ్యవస్థల మద్దతుతో కార్మికులకు సరైన వేతనాలు, సామాజిక భద్రత కల్పించడం సామూహిక బాధ్యత అని స్పష్టం చేశారు. కోవిడ్ 19 సమయంలో జాతీయ మానవ హక్కుల సంఘం చేపట్టిన కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. ‘ఒకే దేశం, ఒకే రేషన్‌ కార్డు’ వంటి పథకాలను అభినందిస్తూనే.. చట్టాలకు, వాటి క్షేత్రస్థాయి అమలుకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రాల మధ్య సమన్వయం పెరగాలని, సామాజిక భద్రత పథకాలు ఎక్కడికైనా వర్తించేలా ఉండాలని, కార్మికుల నైపుణ్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. నిబంధనల అమలు ధోరణి నుంచి హక్కుల ఆధారిత విధానం వైపు మార్పు రావాలని పిలుపునిచ్చారు.

 

మూడు సాంకేతిక సమావేశాల వివరాలను ఎన్‌హెచ్‌ఆర్‌సీ సంయుక్త కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ వెల్లడించారు. అవి ‘చట్టపరమైన, సంస్థాగత విధానాలు: రక్షణ, అమలులో ఉన్న లోపాలు’, ‘దేశంలో వలస కార్మికుల హక్కుల పరిరక్షణలో వ్యాపార సంస్థల పాత్ర’, ‘వలస కార్మికుల రక్షణ, సంక్షేమం కోసం ఆచరణాత్మక చర్యలు-బహుళ పక్షాల భాగస్వామ్యం’. దేశ ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, సరుకు రవాణా, నిర్మాణ పనులు, రోజువారీ జీవితంలో వలస కార్మికులు అత్యంత కీలకమని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో గతంలో జరిగిన కార్మిక నిరసనల పరిణామాలను ఆయన గుర్తు చేశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో వలస కార్మికులు తమ స్వగ్రామాలకు వెళ్లడం వల్ల నగరాల్లో కార్మికుల కొరత ఏర్పడి, ప్రజా సేవలపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు.

 

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ విమల్ భట్టర్ మాట్లాడుతూ.. స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన కంపెనీలు తమ పర్యావరణ, సామాజిక, పాలనా (ఈఎస్‌జీ) పనితీరును వెల్లడించే వ్యాపార బాధ్యత, స్థిరత్వ నివేదిక (బీఆర్‌ఎస్‌ఆర్‌) గురించి వివరించారు. దీని ద్వారా కంపెనీలు తమ వద్ద పనిచేసే వలస, కాంట్రాక్టు కార్మికుల సంక్షేమ గణాంకాలను వెల్లడిస్తాయని తెలిపారు. అయితే అధిక శాతం వలస కార్మికులు ఎంఎస్‌ఎంఈ, అసంఘటిత రంగాల్లోనే పనిచేస్తున్నారని, దీనివల్ల వారు నిబంధనల పరిధిలోకి రావడం లేదని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి అనుజ బాపత్‌ మాట్లాడుతూ.. వలస కార్మికుల సమస్యలను కేవలం వారి వ్యక్తిగత కోణంలోనే కాకుండా, కుటుంబం, వ్యవస్థ రూపంలో చూడాలని సూచించారు. పీఎం విశ్వకర్మ, పీఎంఈజీపీ, ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్ వంటి పథకాల ద్వారా స్థానికంగానే ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చని, తద్వారా దుర్భర వలసలను తగ్గించవచ్చని ఆమె పేర్కొన్నారు.

 

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ శ్రీ దీపాంకర్ గుహ మాట్లాడుతూ.. వలస కార్మికుల సంక్షేమానికి ఈ-శ్రమ్ వేదిక బలమైన పునాది వంటిదని పేర్కొన్నారు. ఈ వేదికలో ఉన్న సమాచారాన్ని వివిధ ప్రభుత్వ పథకాలతో అనుసంధానించినప్పుడే కార్మికులకు నిజమైన ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్‌ డైరెక్టర్ శ్రీ కేసీ మీనా మాట్లాడుతూ.. కంపెనీల రిపోర్టింగ్ విధానాలు, నివేదికల వ్యవస్థల గురించి వివరించారు. స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన కంపెనీలకు సంబంధించి కొన్ని రిపోర్టింగ్‌ బాధ్యతలు స్వచ్ఛందంగా లేదా మారుతూ ఉంటాయని, అలాగే చట్టపరమైన నిబంధనలు కూడా సంస్థను బట్టి మారుతాయని పేర్కొన్నారు.

 

వలస కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలంటే మెరుగైన డేటా వ్యవస్థలు ఉండాలని ప్రాక్సిస్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పార్టిసిపేటరీ ప్రాక్టీసెస్ సీఈఓ శ్రీ టామ్ థామస్ తెలిపారు. ముఖ్యంగా ఈ-శ్రమ్ వంటి వేదికలను బలోపేతం చేసి, ఇతర డేటాబేస్‌లతో అనుసంధానించాలని సూచించారు. సమాచారం ఒక వ్యవస్థ నుంచి మరొక వ్యవస్థకు సజావుగా చేరినప్పుడే సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఉన్న కార్మికులకు సరిగ్గా అందుతాయని ఆయన పేర్కొన్నారు.

 

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్‌లోని సెంటర్ ఫర్ మైగ్రేషన్, మొబిలిటీ అండ్ డయాస్పోరా స్టడీస్‌కు చెందిన పరిశోధన సహయకులు డాక్టర్ కిష్లయ్ నిర్మాణ రంగ కార్మికుల గురించి ప్రస్తావించారు. ఉప-కాంట్రాక్టు పద్ధతుల్లో ఉన్న లోపాలు, కార్మికుల వద్ద సరైన పత్రాలు లేకపోవడం, సంక్షేమ పథకాల నుంచి మినహాయింపుకు గురవ్వడం వంటి అంశాలను ఎత్తిచూపారు. వీరికి తక్కువ ధరకే గృహ వసతి కల్పించాలని, న్యాయంగా కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ వలసల నిర్వహణ సంస్థ (ఐఓఎం) అధిపతి శ్రీ సంజయ్ అవస్థీ మాట్లాడుతూ.. వ్యాపారాలు, మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాలను పాటించాలని కోరారు. ముఖ్యంగా నైతిక నియామక ప్రక్రియ ఉండాలని, కార్మికుల నుంచి ఎటువంటి నియామక రుసుము వసూలు చేయకూడదని పేర్కొన్నారు. ఉప-కాంట్రాక్టుల వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచాలని, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు.

 

వ్యాపార, మానవ హక్కుల నిపుణురాలు, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ ఇండియా) ప్రతినిధి శ్రీమతి నుస్రత్ మాట్లాడుతూ.. వలస కార్మికుల పట్ల కార్పొరేట్ బాధ్యతను మరింత స్పష్టంగా, రంగాల వారీగా నిర్వచించాలని పిలుపునిచ్చారు. బాధ్యతాయుతమైన వ్యాపార ప్రవర్తనపై తాజా జాతీయ మార్గదర్శకాలను, వ్యాపారం, మానవ హక్కులపై పటిష్టమైన విధాన సమన్వయం అవసరమని సూచించారు. కేవలం వలసదారులకే కాకుండా కార్మికులందరికీ హక్కుల ఆధారిత విధానం అవసరమని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) వలసదారుల ప్రాథమిక సూత్రాలు, హక్కుల నిపుణుడు ఇన్సాఫ్ నిజాం తెలిపారు. పాలన, అమలు వ్యవస్థలను మెరుగుపరుస్తూనే, నిర్మాణాత్మక, సంస్థాగత అడ్డంకులను పరిష్కరించడం, కార్మిక చట్టాలను రక్షించాల్సిన ఆవశ్యకతను వివరించారు. వలస కార్మికుల వేతన నిర్మాణంలో మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరాన్ని వరల్డ్ బెంచ్‌మార్కింగ్ అలయన్స్ ఆసియా పాలసీ సారథి శ్రీ నమిత్ అగర్వాల్ ప్రస్తావించారు.

 

ఈఎస్‌జీ వెల్లడిలో భారత్‌ అగ్రగామిగా ఉందని పార్టనర్స్ ఇన్ చేంజ్ డైరెక్టర్ శ్రీ ప్రదీప్ నారాయణన్ తెలిపారు. కంపెనీలకు ఇచ్చే ఈఎస్‌జీ రేటింగ్‌లను వలస కార్మికుల సంక్షేమానికి అనుసంధానించాలని ప్రతిపాదించారు. ఈ-శ్రమ్‌ను ఆధార్, ఈపీఎఫ్, ఈఎస్‌ఐసీ, రాష్ట్ర పథకాలతో అనుసంధానించడం, వలస కార్మికుల కోసం క్యూఆర్ కోడ్‌ ఆధారిత గుర్తింపు కార్డులు, జాతీయస్థాయి వలస కార్మిక డాష్‌బోర్డును ఏర్పాటు చేయాలని వ్యాపార, పారిశ్రామిక మండలి డిప్యూటీ సెక్రటరీ జనరల్ డాక్టర్ జతిందర్ సింగ్ ప్రతిపాదించారు. బహుభాషా ఫిర్యాదుల వ్యవస్థలు, కాంట్రాక్టర్ల నిబంధనల అమలుపై హామీ పత్రాన్ని తీసుకోవాలని, బీఆర్ఎస్ఆర్ రిపోర్టింగు‌లో వలసదారులకు ప్రత్యేకమైన విభాగాన్ని చేర్చాలని సూచించారు. అంతర్జాతీయ వలసలు, అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ శ్రీ ఎస్ గిరిధాయ రాజన్ మాట్లాడుతూ.. వలస కార్మికులను అతిథులుగా కాకుండా ఆర్థిక వ్యవస్థలో శాశ్వత భాగస్వాములుగా గుర్తించాలని కోరారు. ఎప్పటికప్పుడూ వలస సమాచారం ఉండాలని, రంగాల వారీగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

 

వేతనాల అపహరణ, అదనపు పనికి వేతనం లభించకపోవడం, భాషా పరమైన ఇబ్బందులు, వాతావరణ మార్పుల వల్ల వలసదారులు ఎదుర్కొనే ముప్పుల గురించి  ఆందోళన వ్యక్తం చేశారు. వలస కార్మికులకు వైద్య సేవలు అందడంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఆజీవిక బ్యూరో డైరెక్టర్ శ్రీ సంతోష్ పూనియా ప్రస్తావించారు. అందరికీ ఒకే రకమైన విధానం కాకుండా, వలస కార్మికుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఆరోగ్య పథకాలు ఉండాలని  స్పష్టం చేశారు.

 

ఈ సమావేశంలో ఫిక్కీ (ఎఫ్‌ఐసీసీఐ)సెక్రటరీ జనరల్ శ్రీ అనంత్ స్వరూప్, భారత పరిశ్రమల సమాఖ్య ప్రధాన సలహాదారు శ్రీ సునీల్ మిశ్రా, సెబీ చీఫ్‌ జనరల్ మేనేజర్ డాక్టర్ రాజేష్ కుమార్ దంగేటి, ఐఐఎంబీ ప్రొఫెసర్ వసంతి శ్రీనివాస్, ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సీనియర్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ విద్య టికూ, డీడబ్ల్యూటీ దక్షిణాసియా కార్మిక వలసల నిపుణురాలు కేథరిన్‌ లాస్‌, వ్యాపారం, మానవ హక్కులపై ఐరాస నిపుణుల బృందం ఆసియా-పసిఫిక్ సభ్యురాలు పిచామోన్‌ యోఫాంటాంగ్‌, ప్రభుత్వ రంగ సంస్థల విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీ కైలాష్ భండారి, ఐఐఎంఏడీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎస్‌ ఇరుదయ రాజన్, ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రత్యేక పర్యవేక్షకులు శ్రీ డీఎస్‌ ధపోలా, ప్రత్యేక నివేదికాధికారి శ్రీమతి శోమిత బిస్వాస్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో చర్చించిన పలు కీలక సూచనలు...

·       వలస కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రత్యేక సమన్వయ మండలి ఏర్పాటు చేయాలి.

·       భాషా ప్రాతిపదికన ఏర్పడిన వివిధ రంగాల సంఘాలు, సభ్యుల నెట్‌వర్క్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలి. దీనివల్ల వలస కార్మికులు తమకు తెలిసిన భాషలో సమాచారాన్ని చేరవేస్తూ.. అవసరమైన మద్దతు కోసం వారిని సులభంగా సంప్రదించే అవకాశం ఉంటుంది.

·       వలస కార్మికుల రాకపోకలను జిల్లాల వారీగా పర్యవేక్షించేందుకు జాతీయ డాష్‌బోర్డును రూపొందించాలి.

·       కేవలం ఈ-శ్రమ్ వేదికకే పరిమితం కాకుండా, వివిధ ప్రభుత్వ వ్యవస్థల్లోని డేటాబేస్‌లను అనుసంధానించాలి. దీని ద్వారా వలస కార్మికుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఒక సమగ్ర సమాచార వ్యవస్థను రూపొందించాలి.

·       సరఫరా వ్యవస్థ నివేదికల ప్రమాణాలను మరింత విస్తృతం చేయాలి. ఇందులో కేవలం పెద్ద కంపెనీలే కాకుండా, ఇతర సంస్థలు కూడా ఈఎస్‌జీ,బీఆర్‌ఎస్‌ఆర్‌ శైలి రిపోర్టింగ్‌లో వలస కార్మికుల సమాచారాన్ని తప్పనిసరిగా భాగం చేయాలి.

·       సాధారణ వ్యాపార బాధ్యత నిబంధనలపై ఆధారపడకుండా.. వలస కార్మికులు ఎక్కువగా ఉండే వస్త్ర, గిగ్ వర్క్, నిర్మాణ రంగాల కోసం ప్రత్యేకమైన కార్పొరేట్ సామాజిక బాధ్యత మార్గదర్శకాలను ప్రవేశపెట్టాలి.

·       వలస కార్మికుల కోసం జాతీయ స్థాయిలో ఒక అధికారిక సలహా లేదా సంప్రదింపుల యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. దీని ద్వారా ప్రభుత్వ విధానాల రూపకల్పనలో వలస కార్మికులకు నేరుగా ప్రాతినిధ్యం ఉండేలా చూడాలి.

·       క్షేత్రస్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం, కార్మికుల ఫిర్యాదుల పరిష్కరించడంలో బహుళ స్థాయిల ప్రభుత్వ ఆమోదాల వల్ల జరిగే జాప్యాన్ని తగ్గించాలి.

·       ప్రస్తుతం ఉన్న జాతీయ స్థాయి డేటా పాతదైనందున సంక్షోభ సమయాల్లో అది సరిపోకపోవడంతో జిల్లా స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందేలా వలసల డేటా వ్యవస్థను ఆధునీకరించాలి.

·       ముఖ్యంగా భవన నిర్మాణం, అతిథ్యం,గృహ కార్మిక రంగాల్లోని వలస కార్మికుల కోసం సంక్షేమ పథకాల ధ్రువీకరణ ప్రక్రియను ప్రామాణీకరించాలి. దీనివల్ల వారు విద్యా సహాయం, బీమా వంటి ప్రయోజనాలను సులభంగా పొందగలరు.

·       వలస కార్మికుల అవసరాలను పట్టణ ప్రణాళికా రూపకల్పనలో ప్రధానాంశంగా చేర్చాలి. గృహ వసతి, మౌలిక సదుపాయాల కల్పనలో వారిని విస్మరించకుండా ప్రణాళికలోనే ప్రాధాన్యత ఇవ్వాలి.

·       ప్రస్తుత పథకాలను మరింత విస్తృతం చేస్తూ.. కేవలం రేషన్ కార్డులకే పరిమితం కాకుండా, ఆరోగ్యం, బీమాతోపాటు ఇతర సంక్షేమ ప్రయోజనాలను కూడా ఏ రాష్ట్రంలోనైనా పొందేలా సులభమైన వ్యవస్థను బలోపేతం చేయాలి.

·       వ్యాపార, మానవ హక్కుల వ్యవస్థలో ‘కార్పొరేట్ బాధ్యత’ అంశాన్ని మరింత స్పష్టంగా వివరించాలి. ముఖ్యంగా అసంఘటిత రంగం, ఉప-ఒప్పందాల వల్ల తలెత్తే అస్పష్టతను తొలగించి, కంపెనీలకు స్పష్టమైన బాధ్యతలను నిర్దేశించాలి.

·       వలస కార్మికుల సంక్షేమాన్ని మెరుగుపరిచే కంపెనీలకు మెరుగైన ఈఎస్‌జీ రేటింగ్‌లు లభించేలా ప్రోత్సాహక వ్యవస్థను రూపొందించాలి. దీనివల్ల మార్కెట్ ఒత్తిడి, పోటీ కారణంగా కంపెనీలు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించేలా చేయవచ్చు.

·       ఏ ఒక్క కంపెనీ నేరుగా బాధ్యత వహించని ‘అంతర్గత సరఫరా వ్యవస్థ’ను గుర్తించి నియంత్రించాలి. ఆయా రంగాల్లోని అగ్రశ్రేణి కంపెనీలను వలస కార్మికుల పరిస్థితులకు ఉమ్మడి జవాబుదారీగా చేయాలి.

·       కేవలం విధానపరమైన చర్చలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో అమలు చేయగల పరిష్కారాలను రూపొందించడానికి ఆయా రంగాలవారీ నిపుణులను ఎన్‌హెచ్‌ఆర్‌సీ వేదికలపైకి తీసుకురావాలి. వారి సహకారంతో రంగాల వారీగా వలస కార్మికుల సంక్షేమ ప్రణాళికలను రూపొందించాలి. సంప్రదాయ కార్మిక సంఘాలకు వెలుపల ఉన్న కార్మికుల కోసం తమ హక్కుల సాధనలో సమష్టి బేరసారాల కొత్త పద్ధతులపై అవగాహనను బలోపేతం చేయాలి.

·       కార్మిక విధానాల్లో కులాధారిత బలహీనతలను విశ్లేషించాలి. చారిత్రకంగా వలసలు ఎక్కువగా ఉండే సామాజిక వర్గాల సమస్యలను పరిష్కరించడానికి ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్లతో సమన్వయం చేసుకోవాలి.

·       చారిత్రకంగా నిరంతరం వలసలు వెళ్లే జనాభా కోసం మానవ హక్కుల సంఘం, కుల, గిరిజన కమిషన్లు కలిసి సమన్వయంతో కూడిన విధానపరమైన ప్రతిస్పందనలను రూపొందించాలి.

·       చర్చలు కేవలం విద్యాపరమైనవిగా మిగిలిపోకుండా, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయగల యంత్రాంగాలుగా మార్చే, ఫలితాలపై దృష్టి సారించే విధివిధానాలను ఏర్పాటు చేయాలి.

·       కాంట్రాక్టర్లు లేదా సరఫరాదారులు తమ వద్ద పనిచేసే వలస కార్మికుల వేతనాలు, భద్రత, గృహ వసతి, నియామక నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తున్నామని ధ్రువీకరిస్తూ తప్పనిసరిగా సంక్షేమ డిక్లరేషన్లు సమర్పించాలి.

·       ఫిర్యాదులను కేవలం నమోదు చేయడమే కాకుండా నిర్ణీత కాలపరిమితిలో అవి పరిష్కారమయ్యేలా కఠినమైన నిబంధనలతో కూడిన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను రూపొందించాలి.

·       వలసలు ఎక్కువగా ఉండే జిల్లాల్లో వలస వెళ్లేవారికి ముందస్తుగా హక్కుల అవగాహన, ఒప్పందాలు, వేతనాలు, చట్టపరమైన రక్షణలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి.

·       ఈఎస్‌జీ, బీఆర్‌ఎస్‌ఆర్‌నివేదికల విధానాల్లో వలస కార్మికులకు సంబంధించిన ప్రత్యేక విభాగాన్ని చేర్చాలి. ఇందులో వారి నమోదు స్థితి, వేతన ఆడిట్లు, ఫిర్యాదుల పరిష్కార రేటు, నివాస, భద్రత వివరాలు ఉండాలి.

·       చట్టబద్ధంగా నిర్ణయించిన కనీస వేతనాల కంటే పట్టణాల్లో పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా ఉండే ‘‘జీవన వేతన’’ ప్రమాణాల వైపు నిర్ణయాలు తీసుకోవాలి.

·       వలస జనాభాకు దీర్ఘకాలిక గృహ వసతి,  ప్రభుత్వ సేవలు అందేలా, వారి అవసరాలను పట్టణ ప్రణాళికా విధానాల్లో అంతర్భాగం చేయాలి.

·       వేతనాల ఎగవేతను తగ్గించడానికి, పారదర్శకతను పెంచడానికి పేరోల్ రికార్డులతో అనుసంధానించిన డిజిటల్ వేతన చెల్లింపు వ్యవస్థలను ప్రోత్సహించాలి.

·       వలసలు ఎక్కువగా వెళ్లే రాష్ట్రాలు, వలసలు ఎక్కువగా వచ్చే రాష్ట్రాల  మధ్య సమన్వయ యంత్రాంగాలను బలోపేతం చేయాలి.

ఈ ప్రతిపాదనలన్నింటినీ కమిషన్ మరింత లోతుగా చర్చించి ప్రభుత్వానికి తుది సిఫార్సులను సమర్పిస్తుంది.

***


(రిలీజ్ ఐడి: 2260923) సందర్శకుల సూచీ సంఖ్య : : 57
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , Gujarati , हिन्दी , Tamil