చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
జిల్లా.. సబార్డినేట్ కోర్టులలో మౌలిక సదుపాయాల కల్పన
కేంద్ర ప్రాయోజిత పథకం (సీఎస్ఎస్) పరిధిలో 2026-27కుగాను
‘మదర్ శాంక్షన్’ కింద రూ.401.50 కోట్ల తొలి విడత నిధుల విడుదల
రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలకు నిధులను విడుదల చేసిన కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాల్లోని జిల్లా-సబార్డినేట్ కోర్టులలో మౌలిక సదుపాయాల మెరుగుదల
నాడు పోస్టు చేయడమైనది:
13 MAY 2026 5:19PM by PIB Hyderabad
దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని జిల్లా, సబార్డినేట్ కోర్టులలో మౌలిక సదుపాయాల కల్పన సంబంధ కేంద్ర ప్రాయోజిత పథకం (సీఎస్ఎస్) పరిధిలో 2026-27 సంవత్సరానికిగాను ‘మదర్ శాంక్షన్’ కింద రూ.401.50 కోట్ల తొలి విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఇవాళ న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్-2లో సమావేశం నిర్వహించిన సందర్భంగా కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ ‘పీఎఫ్‌ఎంఎస్’ వ్యవస్థ ద్వారా ఆన్‌లైన్ మార్గంలో ఈ నిధులను విడుదల చేశారు. ఆయా రాష్ట్రాల హైకోర్టులు, రాష్ట్ర-కేంద్రపాలిత ప్రభుత్వాల ప్రతినిధులు కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ‘సీఎస్‌ఎస్’ కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని జిల్లా, సబార్డినేట్ కోర్టులలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా జిల్లా స్థాయి సహా దిగువ కోర్టులలోనూ మౌలిక సదుపాయాలు బలోపేతమవుతాయి.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ- ‘న్యాయం సౌలభ్యం’ దృక్కోణంతో న్యాయవ్యవస్థకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరాన్ని, ప్రాధాన్యాన్ని వివరించారు. ‘సీఎస్‌ఎస్’ పథకం చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేస్తూ- పౌర కేంద్రక న్యాయ ప్రదానాన్ని ప్రజానీకానికి మరింత చేరువ చేయడమే దీని ప్రధాన ధ్యేయమని ఉద్ఘాటించారు. ఈ నేపథ్యంలో 2026 మార్చి 31తో ముగిసిన ఈ పథకాన్ని మరో 5 ఏళ్లు... 2026-27 నుంచి 2030-31 దాకా పొడిగించే ప్రక్రియ కొనసాగుతున్నదని అన్ని హైకోర్టులతోపాటు రాష్ట్ర, ద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకు ఆయన వెల్లడించారు. కక్షిదారులు, పౌరుల అవసరాలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ పథకం కింద ‘కక్షిదారుల నిరీక్షణ మందిరం’ (వెయిటింగ్ హాల్ ఫర్ లిటిగెంట్స్) పేరిట కొత్త అంశాన్ని అమలు చేయాలని సూచించారు. ఇక ‘సీఎస్‌ఎస్’ కొనసాగింపులో భాగంగా ఆర్థిక మంత్రిత్వశాఖ ఇప్పటికే దీన్ని 2026 సెప్టెంబరు 30దాకా తాత్కాలిక పొడిగింపు ఇచ్చిందని తెలిపారు. జాతీయ స్థాయిలో ఏకీకృత మౌలిక సదుపాయాల వ్యవస్థకు భరోసా ఇస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి 12.05.2026న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ అధ్యక్షతన “న్యాయ మౌలిక సదుపాయాల సలహా కమిటీ”ని ఏర్పాటు చేశారని శ్రీ మేఘ్వాల్ వెల్లడించారు.
అంతకుముందు న్యాయశాఖ కార్యదర్శి అందరికీ స్వాగతం పలుకుతూ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా జిల్లా, సబార్డినేట్ కోర్టులలో మౌలిక సదుపాయాల కల్పన అవసరాన్ని, ఈ దిశగా 1993-94 నుంచి న్యాయ మంత్రిత్వశాఖ చేపట్టిన చర్యలను ప్రముఖంగా ప్రస్తావించారు.
భావితరానికి అనువైన, పటిష్ట, ఆధునిక భౌతిక మౌలిక సదుపాయాలతో కూడిన న్యాయవ్యవస్థను సమకూర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషిని తెలిపే వీడియోను ఈ సమావేశంలో ప్రదర్శించారు. ఇది ‘సీఎస్‌ఎస్’ రూపురేఖలను, దానికింద సాధించిన ప్రగతిని విశదీకరించింది. ఈ పథకానికి శ్రీకారం చుట్టిన నాటినుంచి ఇప్పటిదాకా రూ.12844.72 కోట్ల మేర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నిధులు అందాయని వివరించారు. ఇందులో గత 12 ఏళ్ల వ్యవధిలోనే రూ.9400.41 కోట్లు (73.18శాతం) విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ నిర్దేశిత నిధుల పంపిణీ విధానం కింద ఈశాన్య రాష్ట్రాలు మినహా ఇతర రాష్ట్రాలకు 60:40 నిష్పత్తిలో, ఈశాన్య-2 హిమాలయ రాష్ట్రాలకు 90:10 నిష్పత్తిలో, కేంద్రపాలిత ప్రాంతాలకు 100 శాతం చొప్పున నిధులిచ్చినట్లు తెలిపారు. దీంతో 31.03.2026 నాటికి 6,345 కోర్టు హాళ్లు, 4,023 సిబ్బంది నివాసాలు నిర్మించగా, ప్రస్తుతం 3,161 కోర్టు హాళ్లు, 3,245 నివాసాలు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు.
‘న్యాయ సంస్కరణలపై కార్యాచరణ పరిశోధన-అధ్యయనం’ పథకం కింద న్యాయశాఖ చేపట్టిన మూడు కార్యాచరణ పరిశోధన నివేదికలను మంత్రి శ్రీ మేఘ్వాల్ ఆవిష్కరించారు. జాతీయ న్యాయ ప్రదానం-న్యాయ సంస్కరణల మిషన్ సంబంధిత అంశాలపై పరిశోధన, అధ్యయనాలను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. ఇందుకోసం న్యాయ మంత్రిత్వశాఖ రూ.25 లక్షల దాకా ఆర్థిక సహాయం అందిస్తోంది.
ఈశాన్య భారతంలోని గిరిజన సంప్రదాయ చట్టాలను వివరించే మూడు ‘ఇ-పుస్తకాల’ను కూడా శ్రీ మేఘ్వాల్ ఆవిష్కరించారు. గువహటి హైకోర్టు లా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సహకారంతో వీటిని ప్రచురించారు. అస్సాంలోని హ్రాంగ్‌ఖోల్, బియాటే, అస్సాం-మేఘాలయ రాష్ట్రాల పరిధిలో నివసించే హజోంగ్ వంటి గిరిజన సంప్రదాయ న్యాయ పద్ధతులను ఇవి విశదీకరిస్తాయి. డిజిటల్-సంస్థాగత వేదికల ద్వారా దేశీయ న్యాయ సంప్రదాయాల పరిరక్షణ, న్యాయ అవగాహన బలోపేతం, దేశీయ న్యాయ యంత్రాంగాల నమోదు, ప్రజలకు ప్రాంత నిర్దిష్ట న్యాయ-సాంస్కృతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా అందుబాటులోకి తేవడంలో కృషి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
***
(రిలీజ్ ఐడి: 2260877)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7