కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేసేలా ప్రసార భారతితో ఐఈపీఎఫ్ఏ అవగాహన ఒప్పందం

నాడు పోస్టు చేయడమైనది: 13 MAY 2026 5:22PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులకు అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వ రంగ ప్రసార సంస్థ అయిన ప్రసార భారతితో.. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని పెట్టుబడిదారుల విద్య, రక్షణ నిధి ప్రాధికార సంస్థ (ఐఈపీఎఫ్ఏ) అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా దూరదర్శన్‌కు చెందిన జాతీయ, ప్రాంతీయ చానెళ్లలో వివరాలతో కూడిన స్క్రోల్ సందేశాలను ప్రసారం చేయడం ద్వారా అవగాహన కల్పిస్తారు.

ఐఈపీఎఫ్ఏ సీఈవో, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి అనిత షా అకెళ్ల అధ్యక్షతన ఈ అవగాహన ఒప్పంద సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా పెట్టుబడిదారీ అవగాహనను పెంపొందించడంలో, ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించడంలో సమన్వయంతో కూడిన ప్రజా అవగాహన కార్యక్రమాల ప్రాధాన్యాన్ని ఈ సందర్భంగా ఆమె వివరించారు.

దూరదర్శన్ వంటి విశ్వసనీయ ప్రభుత్వ ప్రసార వేదికలను ఉపయోగించుకోవడం ద్వారా.. పెట్టుబడిదారుల రక్షణ, క్లెయిమ్ చేయని డివిడెండ్లు, షేర్లు, సురక్షితమైన పెట్టుబడి పద్ధతులకు సంబంధించిన కీలక సమాచారాన్ని మారుమూల, వెనుకబడిన ప్రాంతాలతోపాటు ప్రజలందరికీ విస్తృతంగా చేరువ చేయవచ్చని ఆమె చెప్పారు.

ఐఈపీఎఫ్ఏ జనరల్ మేనేజర్ లెఫ్టినెంట్ కల్నల్ ఆదిత్య సిన్హా, ప్రసార భారతి (విక్రయ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ సంజయ్ ప్రసాద్ ఈ అవగాహన ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేశారు. వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో అవగాహనను పెంపొందించే దిశగా ఇదొక కీలక ముందడుగు.

ప్రసార భారతికి గల ఈ విస్తృత పరిధిని ఉపయోగించుకుని.. పెట్టుబడిదారులకు అవగాహనతోపాటు, ఐఈపీఎఫ్ఏకు బదిలీ అయిన క్లెయిమ్ చేయని డివిడెండ్లు, షేర్లను తిరిగి పొందే ప్రక్రియకు సంబంధించిన కీలక సందేశాలను అందించడం ఈ వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యం. అలాగే ఈ స్క్రోల్ సందేశాలను దూరదర్శన్ చానెళ్లలో ప్రసారం చేయడం ద్వారా మారుమూల, వెనుకబడిన ప్రాంతాలు సహా దేశవ్యాప్తంగా విస్తృతంగా సమాచారం అందుబాటులో ఉండేలా చూస్తారు.

ఈ కార్యక్రమం ద్వారా పెట్టుబడిదారులకు సకాలంలో కచ్చితమైన సమాచారాన్ని అందించి వారిని సాధికారులను చేయడం ఐఈపిఎఫ్ఏ లక్ష్యం. ఇందులో భాగంగా సెర్చ్ వంటి సదుపాయాలను ఉపయోగించుకోవాలని, ఫారం ఐఈపీఎఫ్-5 ద్వారా క్లెయిమ్‌లను దాఖలు చేయాలని వారిని ప్రోత్సహిస్తోంది. అలాగే మోసాల నివారణ, సురక్షిత పెట్టుబడి పద్ధతుల ప్రాధాన్యంపై అవగాహన కల్పించడంపైనా ఈ కార్యక్రమం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది.

కీలకమైన ప్రభుత్వ సంస్థలతో సమన్వయంతో పనిచేయడం ద్వారా.. ఆర్థిక సమ్మిళితత్వాన్ని పెంపొందించడం, పెట్టుబడిదారులను సాధికారులుగా తీర్చిదిద్దడం పట్ల ఐఈపీఎఫ్ఏ నిరంతర నిబద్ధతను ఈ అవగాహన ఒప్పందం స్పష్టం చేస్తోంది. 

***


(రిలీజ్ ఐడి: 2260876) సందర్శకుల సూచీ సంఖ్య : : 87
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Marathi , हिन्दी , Tamil , Kannada , Malayalam , Urdu