సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ముస్సోరీలోని జాతీయ సుపరిపాలన కేంద్రంలో(ఎన్‌సీజీజీ) ప్రారంభమైన సీషెల్స్ సివిల్ సర్వీసెస్ అధికారుల శిక్షణ కార్యక్రమం


విధానపరమైన వ్యవహారాల క్యాబినెట్ ఉపకార్యదర్శి అలెక్స్ హెండర్సన్ నేతృత్వంలో
ఈ కార్యక్రమానికి హాజరైన 29 మంది సభ్యుల బృందం

శిక్షణలో అధ్యక్ష కార్యాలయం, హోంలాండ్ భద్రత - పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ శాఖ, విద్యా- మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, న్యాయవ్యవస్థకు చెందిన ఉన్నతాధికారులు

నాడు పోస్టు చేయడమైనది: 12 MAY 2026 10:19AM by PIB Hyderabad

ముస్సోరీలోని జాతీయ సుపరిపాలన కేంద్రంలో(ఎన్‌సీజీజీ) సీషెల్స్ దేశ ప్రభుత్వానికి చెందిన సివిల్ సర్వీసెస్ అధికారుల (సివిల్ సర్వెంట్ల) శిక్షణ కార్యక్రమం 2026 మే 11న ప్రారంభమైంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) సహకారంతో ముస్సోరీ, ఢిల్లీలో మే 11 నుంచి మే 22 వరకు ఈ రెండు వారాల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మొదటి బ్యాచ్‌లో రక్షణ, ఐటీ, ఆర్థికం, న్యాయం, విద్య, ప్రజా పాలన, అధ్యక్ష కార్యాలయం వంటి కీలక విభాగాలకు చెందిన డైరెక్టర్ జనరళ్లు, ఉన్నతాధికారులతో సహా మొత్తం 29 మంది పాల్గొంటున్నారు.

2026 ఫిబ్రవరి‌లో ఎన్‌సీజీజీ, సీషెల్స్ పబ్లిక్ సర్వీస్ బ్యూరో (పీఎస్‌బీ) మధ్య కుదిరిన చారిత్రాత్మక అవగాహన ఒప్పందంలో (ఎంఓయూ) భాగంగా దీనిని నిర్వహిస్తున్నారు. మూడేళ్లపాటు కొనసాగే ఈ ఒప్పందం ప్రకారం 250 మంది సీషెల్స్ ప్రభుత్వ ఉన్నతాధికారులకు శిక్షణ ఇవ్వటం కోసం ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా సంస్థాగత నాయకత్వాన్ని బలోపేతం చేయడం, డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

జాతీయ సుపరిపాలన కేంద్రం (ఎన్‌సీజీజీ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ సురేంద్రకుమార్ బాగ్డే అధ్యక్షతన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. 29 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందానికి స్వాగతం పలికిన డాక్టర్ బాగ్డే.. భారత్, సీషెల్స్ దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ చారిత్రాత్మక, సాంస్కృతిక బంధాలను గుర్తు చేశారు. సీషెల్స్ దేశ సుస్థిర అభివృద్ధికి అవసరమైన కీలక రంగాలను దృష్టిలో ఉంచుకొని ఆయా అధికారుల వృత్తిపరమైన నిపుణతకు అనుగుణంగా ఈ శిక్షణను అత్యంత జాగ్రత్తగా రూపొందించినట్లు ఆయన ప్రధానంగా చెప్పారు. “జాతీయ స్థాయిలో అత్యంత ప్రభావవంతమైన కార్యక్రమాలను రూపొందించటం.. అమలు చేయడానికి అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానాన్ని అధికారులకు అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం” అని ఆయన పేర్కొన్నారు. పరస్పర అభ్యాసం, భవిష్యత్తులో అవసరమైన శిక్షణ అంశాలను గుర్తించడానికి వీలుగా సీషెల్స్ అనుభవాలను కూడా తమతో పంచుకోవాల్సిందిగా ఆయన ప్రతినిధులను ఆహ్వానించారు.

అధ్యక్ష కార్యాలయంలోని క్యాబినెట్ కార్యాలయం, విధాన వ్యవహారాల క్యాబినెట్ ఉప కార్యదర్శి, ప్రతినిధి బృంద నాయకుడు అలెక్స్ హెండర్సన్ మాట్లాడుతూ.. ఈ అవకాశం కల్పించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం కేవలం సామర్థ్య పెంపుదలకు మాత్రమే కాకుండా భారత్, సీషెల్స్ మధ్య ద్వైపాక్షిక చర్చలను ప్రోత్సహించడానికి.. ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుందని ఆయన ప్రముఖంగా చెప్పారు.

ఎన్‌సీజీజీ‌తో పాటు గత కొన్నేళ్లుగా ఆ సంస్థ సాధించిన కీలక విజయాల గురించి ఎన్‌సీజీజీ అసోసియేట్ ప్రొఫెసర్, ఈ కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ బీ.ఎస్. బిష్త్ వివరించారు. ఈ శిక్షణ ప్రధానంగా సుపరిపాలన సూత్రాలు, విధానాల రూపకల్పన- అమలు, పాలనలో సాంకేతిక ఆవిష్కరణలు వంటి అంశాలపై దృష్టి సారిస్తుందని ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు కోర్టు నిర్వహణ- భారత్‌లో న్యాయ సంస్కరణలు, ఈ-కోర్టులు, ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకత కోసం జీఈఎం, ఏఐ ఆధారిత సుపరిపాలన, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పీఎం గతిశక్తి, పరిపాలనలో నైతికత- చిత్తశుద్ధి, మౌలిక సదుపాయాలలో పీపీపీ నమూనా, జాతీయ భద్రత, డిజిటల్ చెల్లింపులు వంటి వైవిధ్యమైన అంశాలపై శిక్షణ ఉంటుందని ఆయన తెలిపారు. శిక్షణలో భాగంగా రెండో దశలో అధికారులకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు పలు ముఖ్యమైన సంస్థలకు క్షేత్రస్థాయి పర్యటనలు ఉంటాయని ఆయన వెల్లడించారు.

ఎన్‌సీజీజీ ఇప్పటి వరకు మడగాస్కర్, మలేషియా, శ్రీలంక, బంగ్లాదేశ్, కెన్యా, టాంజానియా, ట్యునీషియా, సెషెల్స్, గాంబియా, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్, లావోస్, వియత్నాం, నేపాల్, భూటాన్, మయన్మార్, ఇథియోపియా, ఎరిట్రియా, కాంబోడియాతో పాటు ఇతర ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి దాదాపు 52 దేశాలకు చెందిన 5,500 మందికి పైగా ప్రభుత్వ ఉన్నతాధికారులకు శిక్షణ అందించింది. 

కోర్సు సమన్వయకర్త డాక్టర్ బీ.ఎస్. బిష్త్, అసోసియేట్ సమన్వయకర్త డాక్టర్ సంజీవ్ శర్మ పర్యవేక్షణలో ఎన్‌సీజీజీ సామర్థ్య పెంపుదల బృంద సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 

***


(రిలీజ్ ఐడి: 2260525) సందర్శకుల సూచీ సంఖ్య : : 62
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Tamil