పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘బిగ్ క్యాట్స్’ నివాస స్థల పునరుద్ధరణ, సాంకేతికత ప్రధానమైన పర్యవేక్షణ, సమాజ ఆధారిత సంరక్షణలకు కార్పొరేట్ ఫండింగ్ ఎంతైనా అవసరం: శ్రీ భూపేందర్ యాదవ్

నాడు పోస్టు చేయడమైనది: 11 MAY 2026 3:02PM by PIB Hyderabad

భారత్ మొదటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ సమ్మిట్‌ను జూన్ 1, 2 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించనుందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఈ రోజు తెలిపారు. బిగ్ క్యాట్స్ సంరక్షణలో చురుకైన పాత్రను పోషించాల్సిందిగా పరిశ్రమ రంగానికి ఆయన విజ్ఞ‌ప్తి చేశారు. ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమ, సమాజ భవిత.. ఇండియా@100 దార్శనికత’ అంశంపై భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో  శ్రీ యాదవ్ ప్రసంగిస్తూ,  ప్రపంచంలో ఏడు ‘బిగ్ క్యాట్స్’ .. పులి, సింహం, చీతా, చిరుత పులి, మంచు ప్రాంతాల్లో కనిపించే చిరుత, జాగ్వార్, ప్యూమా సంతతులను కాపాడడానికి ఐబీసీఏ (ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్) కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీసుకు వచ్చారని గుర్తు చేశారు. ‘బిగ్ క్యాట్స్’ సంరక్షణకు ప్రపంచ వ్యాప్త ప్రయత్నాలకు కార్పొరేట్ ఫండింగ్‌తోనూ, భాగస్వామ్యాల ద్వారానూ మద్దతివ్వాల్సిందిగా పరిశ్రమ రంగ ప్రముఖులను ఆయన కోరారు.  

 


వీటి సంరక్షణలో పరిశ్రమ పాత్ర ముఖ్యమని మంత్రి చెబుతూ, ‘‘బిగ్ క్యాట్స్ నివాస స్థలాల పునరుద్ధరణ, సాంకేతికత ప్రధానమైన పర్యవేక్షణ, నిఘా, సమాజ ఆధారిత సంరక్షణ, సామర్థ్యాల పెంపుతో పాటు సంరక్షణ పరమైన చైతన్యాన్ని పెంచడం వంటి కీలక విధులకు కార్పొరేట్ ఫండింగ్ అత్యవసరం’’ అని పేర్కొన్నారు.
బిగ్ క్యాట్స్‌ను సంరక్షించడానికి అందరూ ముందుకు రావాలని శ్రీ యాదవ్ కోరారు. ‘‘వాటి భవిష్యత్తును కాపాడడం అంటే, మనను మనం కాపాడుకోవడమే. దీనికి కారణం అవి అగ్రగామి ప్రిడేటర్లూ, ‘అంబ్రెల్లా స్పీసీస్’ కావడమే.  పర్యావరణ సమతౌల్యాన్ని బిగ్ క్యాట్స్ నిలబెడతాయి. జీవవైవిధ్యాన్నీ, జల వనరుల్నీ పరిరక్షిస్తాయి’’ అని ఆయన అన్నారు. ఐబీసీఏతో ఒక ఎంఓయూను  సీఐఐ ఇప్పటికే కుదుర్చుకుందని కూడా మంత్రి తెలిపారు.

 


‘ఇండియా@100’ విషయంలో భారత్ సాధిస్తున్న పురోగతి, భారత్ దృష్టికోణాల గురించి శ్రీ యాదవ్ వివరిస్తూ, కృత్రిమ మేధ, హరిత సాంకేతికతలు, డిజిటల్ సేవలు ప్రధానంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలు, భౌగోళిక-రాజకీయ మార్పులు, వాతావరణ పరంగా సవాళ్ల నేపథ్యంలో ప్రపంచం ఒక యుగ మార్పునకు సాక్షీభూతంగా నిలుస్తోందన్నారు. ‘‘పలు కోణాల్లో, ఇది ఒక్క యుగ మార్పు మాత్రమే కాదు.. ఇది కాలపు మార్పు కూడా’’ అని ఆయన వర్ణించారు.
నూతన ఆవిష్కరణలకు సుదృఢత్వాన్నీ, ఆర్థికాభివృద్ధినీ, సుస్థిరత్వాన్నీ మేళవించి గ్లోబల్ లీడర్‌గా రూపొందే స్థితిలో ఉండగలగడం భారత్‌ను ఒక అద్వితీయ స్థానంలో నిలిపిందని మంత్రి అన్నారు. భారత్ ప్రపంచంలోకెల్లా అత్యంత వేగంగా దూసుకుపోతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని ఆయన తెలిపారు. పునరుత్పాదక ఇంధన సామర్థ్య విస్తరణ, ప్రజలకు డిజిటల్ మాధ్యమం ద్వారా సేవలను అందించడం, అంకుర సంస్థల పురోగతి, తయారీ రంగం.. ఇలా పలు అంశాల్లో ముందుకు వెళ్తూ ప్రపంచంలో మార్పునకు భారత్ కీలకంగా మారుతోందని ఆయన వివరించారు.
పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేసే స్తోమత పరంగా భారత్ ప్రస్తుతం ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని శ్రీ యాదవ్ తెలిపారు. దేశంలో మొత్తం సౌర సామర్థ్యం 2014లో 2.82 గిగావాట్లు (జీడబ్ల్యూ)గా ఉండగా, 2026 మార్చి నెలాఖరుకల్లా 150 గిగావాట్లకు చేరుకొందన్నారు. భారత్ స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యంలో దాదాపు 50 శాతం ప్రస్తుతం శిలాజేతర ఇంధన వనరుల నుంచే లభిస్తోందనీ, 2030 నాటికి ఈ స్థితికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకొంటే అంత కన్న ముందుగానే దీనిని సాధించారని ఆయన చెప్పారు.
ఉద్గారాల తీవ్రతను 2005, 2020 మధ్య కాలంలో 36 శాతం మేర  భారత్ తగ్గించిందని, యూఎన్ఎఫ్‌సీసీసీ, ప్యారిస్ ఒప్పంద ప్రణాళికల్లో భాగంగా తన మొదటి ద్వైవార్షిక పారదర్శకత నివేదికను ఇటీవలే విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు. ఈ నివేదికలో పేర్కొన్న ప్రకారం.. అనుకున్న షెడ్యూలు కన్న ముందుగానే శిలాజేతర ఇంధన సామర్థ్య లక్ష్యాలను  భారత్  నెరవేర్చడంతో పాటు తలసరి ఉద్గారాల స్థాయిని నిలబెట్టుకొంటూ, ఉద్గారాల తీవ్రతలో 37.38 శాతం తగ్గింపును సాధించిందని ఆయన తెలిపారు.

‘ఇండియా@100’ మూల స్తంభాలను గురించి శ్రీ యాదవ్ ప్రస్తావిస్తూ ఆర్థిక పరివర్తన, మానవ వనరులు, నైపుణ్య సాధన, సుస్థిర అభివృద్ధి, సామాజిక సమ్మిళితత్వం, ప్రపంచంలో భారత్ భూమిక.. ఇవి 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారే బాటలో భారత్ పయనాన్ని నిర్దేశిస్తాయన్నారు. ‘‘మా దృష్టికోణం స్పష్టంగా ఉంది: అది..అభివృద్ధి చెందుతూ, అన్ని వర్గాలనూ కలుపుకొని ముందుకు పోయే, నూతన దృక్పథం కలిగిన, సుస్థిరమైన, స్వయంసమృద్ధి కలిగిన భారత్‌ను సాకారం చేయడం.. అలా ఆవిర్భవించే భారత్ ద్వారా ప్రపంచ శాంతికి, సమృద్ధికి సార్థక తోడ్పాటును అందించడమే’’ అని చెబుతూ, ఆయన ప్రసంగాన్ని ముగించారు.


(రిలీజ్ ఐడి: 2259850) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi