కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
తిరువనంతపురంలో ముగిసిన బ్రిక్స్ ఉపాధి కార్యాచరణ బృందం రెండో సమావేశం
భారత్ అధ్యక్షత వహిస్తున్న బ్రిక్స్-2026 ఇతివృత్తమైన స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణమే ఈ చర్చలకు స్ఫూర్తి
బ్రిక్స్ దేశాల్లో కార్మిక, ఉపాధి సమస్యలకు సంబంధించిన నాలుగు ప్రధానాంశాలపై నిర్మాణాత్మకంగా జరిగిన చర్చలు
డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాలు, సామాజిక భద్రత, మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ధిని బలోపేతం చేయడం లాంటి అంశాల్లో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి సారింపు
నాడు పోస్టు చేయడమైనది:
07 MAY 2026 7:48PM by PIB Hyderabad
బ్రిక్స్‌కు అధ్యక్షత వహిస్తున్న భారత్ సారథ్యంలో బ్రిక్స్ ఉపాధి కార్యాచరణ బృందం (ఈడబ్ల్యూజీ) రెండో సమావేశం ఈ రోజు విజయవంతంగా తిరువనంతపురంలో ముగిసింది. భారత్ అధ్యక్షత వహిస్తున్న బ్రిక్స్-2026 ఇతివృత్తమైన ‘స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం’ స్ఫూర్తిగా ఈ సమావేశం జరిగింది.

రెండు రోజుల పాటు ఉత్సాహంగా, ఉత్పాదకంగా జరిగిన చర్చల్లో బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో), అంతర్జాతీయ సామాజిక భద్రతా సంఘం (ఐఎస్ఎస్ఏ), ఐక్యరాజ్యసమితి-భారతదేశం లాంటి విజ్ఞాన భాగస్వాములతో పాటు, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వ శాఖలతో సహా విజ్ఞాన భాగస్వాములు హాజరయ్యారు.
సామాజిక భద్రతను ముందుకు తీసుకెళ్లడం, దానిని వ్యవస్థీకరించడం, మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని పెంపొందించడం, ఉపాధి కల్పన-నైపుణ్యాభివృద్ధిలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడం అనే మూడు ప్రధానాంశాలపై సమావేశం మొదటి రోజు దృష్టి సారించారు. వాటా ఆధారిత, వాటా రహిత వ్యవస్థల ద్వారా అన్ని రకాల పనులకు సామాజిక భద్రతను విస్తరించాలనే ఉమ్మడి ఆలోచనకు సభ్యదేశాలు అంగీకరించాయి. మహిళా భాగస్వామ్యం గురించి సభ్యులు చర్చించారు. అభివృద్ధికి మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (ఎఫ్ఎల్ఎఫ్పీఆర్) ముఖ్యమైన కొలమానమనీ, ఉత్పాదకతకు, ఆర్థిక స్థిరత్వానికి, సమ్మిళిత కార్మిక మార్కెట్లకు నేరుగా దోహదపడుతుందనీ స్పష్టం చేశారు. ఉపాధి కల్పన, నైపుణ్యాల మ్యాపింగ్ పరిధిలో జీవితకాల అభ్యాసం, వృత్తిపరమైన శిక్షణ, ఉద్యోగానికి తగిన నైపుణ్యాల ప్రాముఖ్యంపై బలమైన ఏకాభిప్రాయం వ్యక్తమయింది. నైపుణ్యాలు, అర్హతలకు సంబంధించి ఒక ఉమ్మడి భాషను అభివృద్థి చేయడానికి ఐఎల్‌వో సహకారంతో భారత్ చేపట్టిన వృత్తుల వర్గీకరణపై జరుగుతున్న సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని ఒక గొప్ప చొరవగా స్వాగతించారు.
మొదటి రోజు జరిగిన చర్చల్లో భాగస్వామ్య స్ఫూర్తిని, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారాన్ని ప్రతినిధులు ప్రశంసించారు. సాయంత్రం ప్రతినిధుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. దేవభూమి కేరళ సాంస్కృతిక వైభవాన్ని భరత నాట్యం, మోహినీయాట్టం, కలరిపయట్టు, మయూర నృత్యం, మార్గంకళి, ఒప్పన లాంటి జానపద, శాస్త్రీయ కళారూపాల ద్వారా ప్రదర్శించారు.
రెండో రోజు బ్రిక్స్ దేశాల ప్రాధాన్యాల మధ్య ఉన్న సారూప్యత గురించి ప్రతినిధులు ప్రధానంగా చర్చించారు. అసంఘటిత, గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతను విస్తరింప చేయడం, కార్మిక మార్కెట్లలో స్త్రీ పురుష అసమానత్వాన్ని తగ్గించడం, వేగంగా మారుతున్న నైపుణ్యావసరాలపై స్పందించడం లాంటి ఉమ్మడి సవాళ్లను పరిష్కరించడానికి బలమైన సహకారం, బలమైన విజ్ఞాన భాగస్వామ్య వ్యవస్థల అవసరాన్ని అందరూ గుర్తించారు.
అనంతరం, నాలుగో ప్రాధాన్యాంశమైన గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లతో సహా కార్మికులందరి కోసం డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకోవడంపై చర్చలు జరిగాయి. పని స్వభావాన్ని డిజిటలైజేషన్ ప్రాథమికంగా పునర్నిర్మిస్తోందనీ, దీనిని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికీ, పారదర్శకతను పెంచడానికీ, సామాజిక భద్రత, ఉపాధి సేవల్లో సమ్మిళిత్వాన్ని సాధించడానికీ గణనీయమైన అవకాశాలను అందిస్తోందని సభ్యదేశాలు గుర్తించాయి. అదే సమయంలో కొత్తగా తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. అలాగే సమ్మిళిత్వంగా, సమానత్వంతో కూడినదిగా, కార్మిక కేంద్రంగా డిజిటల్ పరివర్తన ఉండాలన్నారు. నమోదు వ్యవస్థలు, ప్రయోజనాలను అందించే యంత్రాంగాలు, డేటా ఆధారిత పాలన, సాంకేతిక ఆధారిత పరిష్కరాలకు సంబంధించిన ఉత్తమ పద్ధతులను పంచుకోవడంపై చర్చల్లో దృష్టి సారించారు.
ఈ సమావేశంలో సమాచారాన్ని పంచుకొనే ప్రత్యేక కార్యక్రమం జరిగింది. దీనిలో బ్రిక్స్ దేశాలు తాము చేపడుతున్న కార్యక్రమాలు, తమ అనుభవాల గురించి వివరించాయి. వీటిలో భారత్‌లో అమలు చేస్తున్న ఎన్‌సీఎస్, ఈ-శ్రామ్, ఈజిప్టుకు చెందిన మొబైల్ ట్రైనింగ్ యూనిట్లు, యూఏఈకి చెందిన వేతన భద్రత వ్యవస్థ, నిరుద్యోగ బీమా పథకం, బ్రెజిల్‌లోని సమాన వేతన చట్టం, తదితరమైనవి ఉన్నాయి. కార్మిక మార్కెట్టుకు సంబంధించి ఉమ్మడి సవాళ్లను పరిష్కరించడంలో సభ్యదేశాల నుంచి నేర్చుకోవడానికి, పరస్పర సహకారానికి ఉన్న విలువను ఈ చర్చలు పునరుద్ఘాటించాయి.
సహకారం, ఏకాభిప్రాయం, పరస్పరం నేర్చుకోవడం ద్వారా సమ్మిళిత్వంతో కూడిన, స్థిరమైన, భవిష్యత్తు అవసరాలకు తగిన కార్మిక మార్కెట్లను నిర్మించేందుకు కలిసి పనిచేయాలన్న ఉమ్మడి నిబద్ధతను బ్రిక్స్ సభ్యదేశాలు పునరుద్ఘాటించడంతో ఈ సమావేశం ముగిసింది.
***
(రిలీజ్ ఐడి: 2259053)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5