పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఒడిశాలో పెట్రోల్- డీజిల్ కొరత లేదని, తగినంత నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు

నాడు పోస్టు చేయడమైనది: 07 MAY 2026 9:01PM by PIB Hyderabad

ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ తాత్కాలికంగా అందుబాటులో లేవంటూ వస్తున్న కొన్ని మీడియా కథనాల నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) స్పష్టతనిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో తగినంత ఇంధనం అందుబాటులో ఉందని.. మొత్తం సరఫరా పరిస్థితి సాధారణంగా, స్థిరంగా ఉందని అవి తెలియజేశాయి. 

ప్రస్తుత నెల ప్రారంభంలోని కొన్ని రోజుల్లో ఒడిశా సరిహద్దు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కోసం ఊహించని విధంగా డిమాండ్ పెరిగింది. ఈ పరిస్థితిపై తక్షణమే స్పందించిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ).. ప్రభావితమైన పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలను ఆలస్యం లేకుండా భర్తీ చేయడానికి సమన్వయ చర్యలను చేపట్టాయి.

ఇంధన సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూసేందుకు, వివిధ సరఫరా కేంద్రాలు- పెట్రోల్ బంకులకు ఇంధనాన్ని వేగంగా రవాణా చేయడానికి, నిల్వలను భర్తీ చేయడానికి అదనపు ట్యాంకర్ ట్రక్కులను ఉపయోగిస్తున్నారు. ఇంధన నిల్వల స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించటంతో పాటు నిల్వలు తక్కువగా ఉన్న పెట్రోల్ బంకులకు ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు. 

పారిశ్రామిక వినియోగదారులకు కావాల్సిన ఇంధనాన్ని పెట్రోల్ బంకుల నుంచి కాకుండా నేరుగా సంబంధిత ఆయిల్ కంపెనీల నుంచే కొనుగోలు చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) సూచించాయి. పెట్రోలియం ఉత్పత్తులను టోకు పద్ధతిలో విక్రయించే అధికారం రిటైల్ పెట్రోల్ బంకులకు లేదని ఈ సందర్భంగా కంపెనీలు స్పష్టం చేశాయి.

ఒడిశావ్యాప్తంగా ఉన్న అన్ని సరఫరా కేంద్రాలు, పెట్రోల్ బంకుల్లో తగినంత పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని కంపెనీలు పునరుద్ఘాటించాయి. అన్ని ఇంధన విక్రయ కేంద్రాలు యథావిధిగా పనిచేస్తున్నాయని అవి తెలియజేశాయి. 

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) భరోసా ఇస్తున్నాయి. వినియోగదారులు కంగారుతో ముందస్తు కొనుగోళ్లు చేయొద్దని విజ్ఞప్తి చేశాయి. ఇంధన లభ్యతకు సంబంధించిన తాజా వివరాల కోసం కేవలం అధికారిక సమాచారంపైనే ఆధారపడాలని ప్రజలకు అవి సూచించాయి. 

***


(రిలీజ్ ఐడి: 2258931) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Odia