శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారత్, వియత్నాం మధ్య ఉన్నత స్థాయి చర్చల
ద్వారా శాస్త్ర సాంకేతిక రంగాల్లో బలపడిన బంధం... ఏఐ, డీప్-టెక్, ఆవిష్కరణలకు విస్తరించిన భాగస్వామ్యం
వియత్నాం శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు చేపట్టిన డాక్టర్ జితేంద్ర సింగ్
శాస్త్ర సాంకేతిక, ఆవిష్కరణల రంగాల్లో ఉమ్మడి సహకారాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించిన భారత్, వియత్నాం
నాడు పోస్టు చేయడమైనది:
07 MAY 2026 4:00PM by PIB Hyderabad
కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ, భూవిజ్ఞాన శాఖ (స్వతంత్ర బాధ్యత), ప్రధాని కార్యాలయం, సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పింఛన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ఢిల్లీలో వియత్నాం దేశ శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ప్రొఫెసర్ డాక్టర్ వూ హాయ్ క్వాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వర్ధమాన సాంకేతికతలు, ఆవిష్కరణలు, పరిశోధనలు- అంకుర వ్యవస్థ వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.
కృత్రిమ మేధ, సైబర్ భద్రత, డీప్ టెక్, సెమీకండక్టర్లు, రోబోటిక్స్, జీవసాంకేతికత, డిజిటల్ సాంకేతికతలు, ఆవిష్కరణల ఆధారిత పరిశోధనల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయి. శాస్త్ర సాంకేతికత రంగంలో ఇరు దేశాల మధ్య సంస్థాగత యంత్రాంగాలను బలోపేతం చేయడంపై కూడా దృష్టి సారించారు.
వియత్నాం ప్రతినిధి బృందానికి స్వాగతం పలికిన డాక్టర్ జితేంద్ర సింగ్... భారత్, వియత్నాంలు దాదాపు రెండు వేల ఏళ్ల నాటి ఉమ్మడి సాంస్కృతిక, చారిత్రక సంబంధాలతో ముడిపడి ఉన్న నాగరికత భాగస్వాములని అభివర్ణించారు. గత దశాబ్ద కాలంలో ఇరు దేశాల మధ్య 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' సరికొత్త వేగాన్ని పుంజుకుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా 2024 ఆగస్టులో వియత్నాం ప్రధాన మంత్రి ఫామ్ మిన్ చిన్ భారత్‌లో పర్యటించిన తర్వాత ఈ బంధం మరింత దృఢంగా మారిందని అన్నారు.
భారతదేశ 'యాక్ట్ ఈస్ట్ పాలసీ', 'ఇండో-పసిఫిక్ విజన్'లో వియత్నాం ఒక ముఖ్యమైన భాగస్వామిగా కొనసాగుతోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో పెరుగుతున్న భారత్-ఆసియాన్ అనుసంధానం.. ఉమ్మడి పరిశోధనలు, ఆవిష్కరణలు, సాంకేతికత ఆధారిత వృద్ధికి బలమైన ఆధారాన్నిస్తుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుత పరిణామాలు శాస్త్ర సాంకేతిక రంగంలోని అత్యాధునిక అంశాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఒక ముఖ్యమైన అవకాశాన్ని కల్పిస్తాయని ఆయన అన్నారు.
భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న అంకుర వ్యవస్థను ప్రస్తావించిన డాక్టర్ జితేంద్ర సింగ్.. ఇరు దేశాల అంకురాలు, ఆవిష్కర్తలు, పరిశోధనా సంస్థల మధ్య మరింత బలమైన అనుసంధానం ఉండాలన్నారు. వర్ధమాన సాంకేతిక రంగాల్లోని పారిశ్రామికవేత్తలు, యువ పరిశోధకులకు కొత్త అవకాశాలను సృష్టించేందుకు భారత్, వియత్నాం కలిసి పనిచేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్-ఆసియాన్‌కు సంబంధించిన శాస్త్ర సాంకేతికత, ఆవిష్కరణ కార్యక్రమాల్లో వియత్నాం క్రియాశీల భాగస్వామ్యాన్ని కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. 'భారత్-ఆసియాన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫెలోషిప్' కార్యక్రమం కింద వియత్నాంకు చెందిన సుమారు పదిమంది పరిశోధకులు ఫెలోషిప్‌లను పొందగా... శాస్త్ర సాంకేతికతకు సంబంధించిన వివిధ విభాగాల్లో పలు ఉమ్మడి ప్రాజెక్టులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రాంతీయ సహకార ఒప్పందాల పరిధిలో నిర్వహించిన ఆవిష్కరణలు- శాస్త్ర విజ్ఞాన ఫోరమ్‌లలో వియత్నాం ఆవిష్కర్తలు, మహిళా శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు.
ప్రతిపాదిత తదుపరి ‘భారత్-వియత్నాం జాయింట్ కమిటీ మీటింగ్ (జేసీఎం)’ గురించి ఇరుపక్షాలు చర్చించాయి. నిర్మాణాత్మక సంస్థాగత సహకారం ద్వారా శాస్త్ర సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి జరుగుతున్న సన్నాహాలను సమీక్షించాయి.
శాస్త్ర సాంకేతికత రంగంలో ఇరు దేశాల మధ్య పెరుగుతున్న అనుసంధానాన్ని ప్రొఫెసర్ డాక్టర్ వూ హాయ్ క్వాన్ స్వాగతించారు. సామాజిక ప్రయోజనాలు, ఆచరణాత్మక అప్లికేషన్లు కలిగిన డీప్ టెక్ రంగంలో నిర్మాణాత్మక సహకారాన్ని పెంపొందించటంపై వియత్నాం ఆసక్తితో ఉన్నట్లు ఆయన తెలిపారు. నిరంతర సమన్వయం కోసం రెండు దేశాల సంబంధిత మంత్రిత్వ శాఖల నుంచి ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలని... తద్వారా ద్వైపాక్షిక కార్యక్రమాలను అమలు చేసే విధంగా మార్చేందుకు ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన ప్రతిపాదించారు.
ఇరు దేశాల మంత్రిత్వ శాఖల మధ్య ప్రస్తుతం ఉన్న 'జాయింట్ కమిటీ' యంత్రాంగాన్ని కొనసాగించడాన్ని వియత్నాం మంత్రి సమర్థించారు. భవిష్యత్తులో భారత్‌తో కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు వియత్నాం తరపున ఒక 'సహాయ మంత్రి’ స్థాయి ప్రతినిధిని నియమించనున్నట్లు ఆయన తెలియజేశారు.
ఈ చర్చల సందర్భంగా కృత్రిమ మేధ మిషన్లు, సైబర్ భద్రత ఫ్రేమ్‌వర్క్‌లు, ఆవిష్కరణల వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ వంటి అంశాలపై ఇరుపక్షాలు అభిప్రాయాలను పంచుకున్నాయి. ఈ రంగాల్లో అనుభవాలు, అత్యుత్తమ విధానాలను పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.
పరిశోధనా సంస్థలు, ఆవిష్కరణల కేంద్రాలు, సాంకేతిక ఇంక్యుబేషన్ ప్లాట్‌ఫామ్‌లతో కూడిన ద్వైపాక్షిక విద్యా, సంస్థాగత సంబంధాలను కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. అంకుర బదిలీ కార్యక్రమాలు, ఉమ్మడి ఆవిష్కరణ కేంద్రాలు, పరిశ్రమలతో ముడిపడి ఉన్న పరిశోధనా భాగస్వామ్యాల వంటి అవకాశాలపై ఇరు దేశాలు చర్చించాయి.
'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' కింద బలమైన, విస్తృతమైన బంధాన్ని భారత్, వియత్నాంలు కలిగి ఉన్నాయి. ఇందులో శాస్త్ర సాంకేతిక రంగం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి ఒక ప్రధాన ఆధారంగా మారింది. నిరంతర సంప్రదింపులను కొనసాగించాలని.. ఈ ద్వైపాక్షిక చర్చల ద్వారా తీసుకున్న నిర్ణయాలను ఇరు దేశాల ప్రజలకు సాంకేతిక, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను చేకూర్చే నిర్దిష్ట ఉమ్మడి కార్యక్రమాలుగా మార్చాలని ఇరుపక్షాలు అంగీకరించాయి.
***
(రిలీజ్ ఐడి: 2258901)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7