ఆయుష్
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రణాళికపై ఆయుష్ మంత్రిత్వ శాఖ అంతర్ మంత్రివర్గ కమిటీ సమావేశం
ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే ప్రజా ఉద్యమంగా పరిణామం చెందిన యోగా: కేంద్రమంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్
సమష్టి, సమ్మిళిత భాగస్వామ్యంతో ముందుకు సాగుతోన్న ఐడీవై 2026.. నిజమైన సంపూర్ణ ప్రభుత్వ, సంపూర్ణ-సమాజ ఉద్యమంగా నిలుస్తుంది: శ్రీ జాదవ్
ఆరోగ్యం, శ్రేయస్సు, అంతర్గత సమతుల్యతకు సాధనంగా ప్రపంచవ్యాప్త ఆమోదం పొందుతోన్న యోగా: విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి(పశ్చిమ) శ్రీ సీబీ జార్జ్
నాడు పోస్టు చేయడమైనది:
04 MAY 2026 5:28PM by PIB Hyderabad
అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) 2026 వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు.. వాటి ప్రణాళిక, సమన్వయ అమలుపై చర్చించేందుకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నేడు న్యూఢిల్లీలో అంతర్ మంత్రిత్వ కమిటీ కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు, ప్రముఖ యోగా గురువులు, వివిధ యోగా సంస్థలు, సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ (స్వతంత్ర బాధ్యత), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావు జాదవ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం యోగాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యోగ దినోత్సవ 50 రోజుల కౌంట్‌డౌన్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఆయన గుర్తు చేశారు. యోగాపై ప్రజల ఉత్సాహం, భాగస్వామ్యం పెరుగుతోందని అన్నారు. యోగా ఇప్పుడు కేవలం శిక్షణ తరగతులకు లేదా మ్యాట్‌లకే పరిమితం కాకుండా, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే ఒక ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందిందని ఆయన పేర్కొన్నారు.
యోగా ద్వారా ప్రపంచ దేశాలకు భారత్ నాయకత్వం వహిస్తోందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతతో 2015 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం 190కి పైగా దేశాలకు విస్తరించిందని పేర్కొన్నారు. శారీరక ఆరోగ్యం, మానసిక సమతుల్యత, అంతర్గత శాంతి కోసం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలకు యోగా స్ఫూర్తినిస్తోందని ఆయన వివరించారు.
ఐడీవై 2026 విజయవంతం కావడానికి అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు చురుగ్గా సహకరించాలని... సంపూర్ణ ప్రభుత్వ విధానం అనుసరించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ దిశగా కొన్ని ముఖ్యమైన లక్ష్యాలను ఆయన వివరించారు. జూన్ 21న నిర్వహించే సాధారణ యోగా నియమావళి కార్యక్రమంలో గరిష్ట స్థాయిలో ప్రజలు పాల్గొనేలా చూడటం... పాఠశాలలు, కార్యాలయాలు, ఆరోగ్య వ్యవస్థల వంటి సంస్థాగత నిర్మాణాల్లో యోగాను ఒక భాగంగా మార్చడం... గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన వర్గాలు, సరిహద్దు, మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా యోగా ఫలాలు అందేలా చూడటం... ప్రచారం కోసం డిజిటల్ వేదికలను విరివిగా ఉపయోగించడం, కార్యక్రమాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వంటి అంశాలపై దృష్టి సారించాలని తెలిపారు.
అన్ని మంత్రిత్వ శాఖలు భాగస్వామ్య పక్షాలు సమయానుకూలంగా, సమన్వయంతో పనిచేయాలని మంత్రి చెప్పారు. ‘‘12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మునుపెన్నడూ లేని రీతిలో భారీ ప్రజా భాగస్వామ్యం, సమర్థవంతమైన సమన్వయం, విస్తృత అవగాహనతో జరుపుకునేలా మనమందరం కలిసి పని చేద్దాం’’ అని ఆయన పిలుపునిచ్చారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి (పశ్చిమ) శ్రీ సీబీ జార్జ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు తమ మంత్రిత్వ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు, మిషన్ల ద్వారా యోగాను విశ్వవ్యాప్తం చేయడంలో కీలక పాత్ర పోషిస్తామని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తిని మరింత విస్తరించడానికి.. భారీ స్థాయి అవగాహన, సామాజిక కార్యక్రమాలను సమన్వయం చేయడంలో విదేశాల్లోని భారతీయ మిషన్లు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన చెప్పారు.
యోగాకు పెరుగుతున్న అంతర్జాతీయ ఆదరణను ప్రస్తావిస్తూ... జపాన్‌లో ఆయుష్ మంత్రిత్వ శాఖ, హార్ట్‌ఫుల్‌నెస్ సహకారంతో ఆరు నెలలుగా సాగుతున్న యోగా శిక్షణ కార్యక్రమం అద్భుతమైన విజయాన్ని సాధించిందని ఆయన పేర్కొన్నారు. ఇది ఆరోగ్యం, శ్రేయస్సు, అంతర్గత సమతుల్యతకు ఒక సాధనంగా యోగాకు పెరుగుతున్న ప్రపంచవ్యాప్త ఆమోదాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. ఇటువంటి నిరంతర ప్రయత్నాలు అంతర్జాతీయ భాగస్వామ్యాలు 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిజమైన ప్రపంచ ఉద్యమంగా మారుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా ప్రసంగిస్తూ.. ఈ సమావేశంలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంలో ఈ సమావేశం ఎంతో కీలకమైనదని ఆయన పేర్కొన్నారు. దేశ సాంస్కృతిక,ఆధ్యాత్మిక వారసత్వంలో యోగా ఒక ముఖ్యమైన భాగమని, నేడు అది అంతర్జాతీయ ఆరోగ్య ఉద్యమంగా రూపాంతరం చెందిందని ఆయన కొనియాడారు. 2014లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, వర్గాల భాగస్వామ్యంతో యోగా విస్తృతి నిరంతరం పెరుగుతోందని అన్నారు. ఈ ‘‘అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది కేవలం ఒక రోజు జరుపుకునే వేడుక మాత్రమే కాదు. ఆరోగ్యం, సమతుల్యత, సంపూర్ణ జీవనశైలిని ప్రోత్సహించే ఒక నిరంతర ప్రపంచ ప్రచారం’’ స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా యోగా సాధకుల సంఖ్య నిరంతరం పెరుగుతోందని ఎస్ వ్యాస విశ్వవిద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ హెచ్ ఆర్ నాగేంద్ర పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజా భాగస్వామ్యం ఇటీవల అద్భుతంగా విస్తరిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 26 కోట్ల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారని గుర్తు చేస్తూ.. ఈ ఏడాది ఆ సంఖ్య 30 కోట్లు దాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. సాక్ష్యాధారిత యోగా సాధన ప్రాముఖ్యతను ఆయన వివరించారు. పెరుగుతున్న పరిశోధనలు యోగాను కేవలం శారీరక క్షేమానికే కాకుండా, అంటువ్యాధులు కాని వ్యాధుల నివారణ, నిర్వహణలో అత్యంత ప్రభావవంతమైన మార్గంగా నిరూపించాయని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకలకు మోక్షాయతన్ అంతర్జాతీయ యోగాశ్రమం అధ్యక్షుడు శ్రీ స్వామి డాక్టర్ భరత్ భూషణ్ తన పూర్తి మద్దతును ప్రకటించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రయత్నాలు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడి దైనందిన జీవనశైలిలో యోగా ఒక భాగంగా మారేలా చూడాలని ఆయన చెప్పారు. యోగా పరివర్తన శక్తిని వివరిస్తూ... ‘‘మనిషిని ఎలాంటి కష్టాల నుంచి అయిన గట్టెక్కించే శక్తి ఉంది. ఇది వ్యక్తులను మరింత ఆరోగ్యకరమైన, సమతుల్యమైన జీవితం వైపు నడిపిస్తుంది’’ ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 కోసం ప్రతిపాదించిన వ్యూహాలు, కార్యకలాపాలపై ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి మోనాలిసా దాష్ ఒక సమగ్రమైన ప్రజెంటేషన్‌ను అందించారు. ఈ సందర్భంగా ఆమె రాబోయే వేడుకలకు సంబంధించిన కీలక కార్యక్రమాలు, నేపథ్య ప్రాధాన్యతాంశాలు, ప్రచార ప్రణాళికలను వివరించారు. అనంతరం జరిగిన సుదీర్ఘ చర్చల్లో వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, ప్రముఖ యోగా గురువులు, వివిధ యోగా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో యోగా దినోత్సవ ప్రభావాన్ని మరింత పెంచేందుకు వారు తమ సూచనలు, సలహాలను పంచుకున్నారు. ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా పలు సంస్థల ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మరింత విస్తృతమైన ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు సంపూర్ణ ప్రభుత్వ విధానం అనుసరించాలని చర్చల్లో నిర్ణయించారు. సంస్థాగత వ్యవస్థలు, మీడియా వేదికలు, సామాజిక భాగస్వామ్యం ద్వారా యోగా విశిష్టతను చాటిచెప్పాలని ప్రతినిధులు చెప్పారు. ముఖ్యంగా యువత భాగస్వామ్యం, డిజిటల్ ప్రచారం, ప్రస్తుతం అమలవుతున్న జాతీయ ఆరోగ్య, శ్రేయస్సు పథకాలతో యోగాను అనుసంధానించడంపై ప్రత్యేక దృష్టి సారించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 లక్ష్యాలను చేరుకోవడానికి ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అన్ని మంత్రిత్వ శాఖలకు, భాగస్వామ్య పక్షాలకు ఒక దిశానిర్దేశంలా పనిచేస్తాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సమ్మిళితత్వం, నూతన ఆవిష్కరణలు, ప్రపంచ స్థాయి భాగస్వామ్యంతో నిర్వహించబోయే ఈ వేడుకలు.. ఆరోగ్యం, సామరస్యం, సంక్షేమం కోసం యోగాను ఒక విశ్వవ్యాప్త మార్గంగా ప్రచారం చేయడంలో దేశ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తాయని మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.
***
(రిలీజ్ ఐడి: 2257938)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9