పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలోని పరిణామాల దృష్ట్యా కీలక రంగాలపై తాజా సమాచారం మార్చి 2026 నుంచి సుమారు 5.96 లక్షల పీఎన్‌జీ కనెక్షన్‌లకు గ్యాసిఫికేషన్
అదనంగా 2.68 లక్షల కనెక్షన్‌ల కోసం మౌలిక సదుపాయాలు
కొత్త కనెక్షన్‌ల కోసం నమోదు చేసుకున్న సుమారు 6.66 లక్షల మంది వినియోగదారులు
2026 ఏప్రిల్ 9 నుంచి రసాయన, ఔషధ, పెయింట్ పరిశ్రమలకు 10,000 ఎమ్‌టీ కంటే ఎక్కువ ప్రొపిలీన్, 1,200 ఎమ్‌టీ కంటే ఎక్కువ బ్యూటైల్ అక్రిలేట్‌ను విక్రయించిన ముంబయి, కొచ్చి, విశాఖపట్నం, చెన్నై, మధుర, గుజరాత్ రిఫైనరీలు
గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి గత 24 గంటల్లో వచ్చిన 30 మంది సహా... మొత్తం 2,922 మందికి పైగా భారతీయ నావికుల సురక్షిత తరలింపు
గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను పర్యవేక్షిస్తోన్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
02 MAY 2026 4:24PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం సమన్వయ ప్రతిస్పందన చర్యల ద్వారా కీలక రంగాల్లో సంసిద్ధతను, కొనసాగింపునూ నిర్ధారించడంలో చురుగ్గా నిమగ్నమై ఉంది. ఈ ప్రాంతంలో ఇంధన సరఫరా, నౌకా వాణిజ్య కార్యకలాపాలు, భారత పౌరులకు మద్దతునివ్వడం సంబంధిత చర్యలను ప్రభుత్వం తెలియజేసింది:
ఇంధన సరఫరా, ఇంధన లభ్యత
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూసేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం వివరించింది. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితిపై తాజా సమాచారాన్ని అందించింది. ఈ సందర్భంగా కింది విషయాలు తెలియజేసింది:
ప్రజలకు సూచనలు, పౌరులకు అవగాహన
పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీల లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నందున, పౌరులు వీటిని భయాందోళనతో కొనుగోలు చేయడం మానుకోవాలి.
వదంతుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, సరైన సమాచారం కోసం అధికారిక వనరులపై ఆధారపడాలి.
ఎల్‌పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకోవాలని, పంపిణీదారుల వద్దకు వెళ్లడం మానుకోవాలని విజ్ఞప్తి.
పీఎన్‌జీ, విద్యుత్ లేదా ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాల్సిందిగా పౌరులను ప్రోత్సహిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో, పౌరులంతా తమ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేయాలని కోరడమైనది.
ప్రభుత్వ సంసిద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో గృహావసరాల కోసం ఎల్‌పీజీ, పీఎన్‌జీ, సీఎన్‌జీ (రవాణా) 100 శాతం సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాలో ఆసుపత్రులకు, విద్యా సంస్థలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఔషధ, ఉక్కు, ఆటోమొబైల్, విత్తన, వ్యవసాయ రంగాలకూ ప్రాధాన్యత కొనసాగిస్తున్నారు. 2026 మార్చి 2, 3 తేదీల్లో నమోదైన సగటు రోజువారీ సరఫరా ఆధారంగా వలస కార్మికులకు అందించే 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల సరఫరానూ రెట్టింపు చేశారు.
సరఫరా, డిమాండ్ రెండు వైపులా ప్రభుత్వం ఇప్పటికే అనేక హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. వీటిలో రిఫైనరీ ఉత్పత్తి పెంపుదల... పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ విరామాన్ని 21 రోజుల నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకూ పెంచడం... సరఫరా విషయంలో నిర్దిష్ట రంగాలకు ప్రాధాన్యమివ్వడం వంటి చర్యలు ఉన్నాయి.
ఎల్‌పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలు అందుబాటులో ఉంచుతున్నారు.
చిన్న, మధ్య తరహా వినియోగదారులకు పంపిణీ చేసే నిమిత్తం రాష్ట్రాలకు అదనపు బొగ్గును కేటాయించాలని 'కోల్ ఇండియా', 'సింగరేణి కాలరీస్'లను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
గృహ, వాణిజ్య వినియోగదారులు కొత్త పీఎన్‌జీ కనెక్షన్లను పొందుటను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు
నిత్యావసర వస్తువుల చట్టం-1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వులు-2000 ప్రకారం సరఫరాను పర్యవేక్షించడం... అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.
పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వంటి నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడంలో, నియంత్రించడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంది. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు లేఖలు, వీడియో అనుసంధానాల ద్వారా పునరుద్ఘాటించింది.
తగినంత ఇంధన లభ్యతపై పౌరులకు భరోసా కల్పించేందుకు గానూ ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన ఆవశ్యకతను భారత ప్రభుత్వం 27.03.2026, 02.04.2026 తేదీల నాటి లేఖల ద్వారా స్పష్టం చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతర సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. 02.04.2026న (ఎమ్‌వోపీఎన్‌జీ కార్యదర్శి అధ్యక్షతన), 06.04.2026న (ఎమ్‌వోపీఎన్‌జీ కార్యదర్శితో పాటు సమాచార-ప్రసార శాఖ, వినియోగదారుల వ్యవహారాల శాఖల కార్యదర్శుల అధ్యక్షతన) సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కింది అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు:
రోజువారీ పత్రికా సమావేశాలను నిర్వహించడం, క్రమం తప్పకుండా ప్రజలకు సూచనలు జారీ చేయడం.
సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించడం, తిప్పికొట్టడం.
జిల్లా యంత్రాంగం ద్వారా రోజువారీ అమలు చర్యలను ముమ్మరం చేయడం, ఓఎమ్‌సీలతో సమన్వయం ద్వారా సోదాలు, తనిఖీలను కొనసాగించడం.
తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన అదనపు ఎస్‌కేవో కోసం ఎస్‌కేవో కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
పీఎన్‌జీ వినియోగాన్ని, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.
ముఖ్యంగా గృహావసరాల కోసం ఎల్‌పీజీ సరఫరాకు ప్రాధాన్యమివ్వడం. సరఫరా స్థిరత్వాన్ని నిర్ధారించడం కోసం లక్ష్యానికి అనుగుణంగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల పంపిణీని అమలు చేయడం.
అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూమ్‌లను, జిల్లా పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాయి.
అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పత్రికా ప్రకటనలను జారీ చేస్తున్నాయి... సమావేశాలనూ నిర్వహిస్తున్నాయి.
అమలు, పర్యవేక్షణ చర్యలు
ఎల్‌పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌లను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా తనిఖీ చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 1700కు పైగా సోదాలు నిర్వహించారు.
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేసి, 342 ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాలకు జరిమానాలు విధించాయి. నిన్నటి వరకు 73 ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల లైసెన్సునూ నిలిపివేశాయి.
ఎల్‌పీజీ సరఫరా
గృహావసరాల కోసం ఎల్‌పీజీ సరఫరా స్థితి...
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.
గృహ వినియోగదారులకు ఎల్‌పీజీ సరఫరా కోసం అత్యంత ప్రాధాన్యత కొనసాగుతోంది.
ఎల్‌పీజీ పంపిణీదారుల వద్ద ఎక్కడా నిల్వల కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.
నిన్న పరిశ్రమవ్యాప్తంగా ఆన్‌లైన్ ఎల్‌పీజీ బుకింగ్‌లు సుమారు 99 శాతానికి పెరిగాయి.
సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టడానికి డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీ విధానాన్ని సుమారు 94 శాతానికి పెంచారు. నమోదు చేసుకున్న ఫోన్ నంబర్‌కు డీఏసీ వస్తోంది.
వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు:
మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో సుమారు 70 శాతానికి పెరిగాయి. ఇందులో సంస్కరణలతో ముడిపడి ఉన్న 10 శాతం కేటాయింపులూ ఉన్నాయి.
వలస కార్మికులకు పంపిణీ చేసే 5 కిలోల ఎఫ్‌టీఎల్ (ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ) సిలిండర్ల రోజువారీ పరిమాణాన్ని ప్రతి రాష్ట్రంలోనూ రెట్టింపు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం 06.04.2026 నాటి లేఖ ద్వారా తెలియజేసింది. 21.03.2026 నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితిని మించి, 2026 మార్చి 2-3 తేదీల్లో వలస కార్మికులకు సరఫరా చేసిన సగటు సిలిండర్ల సంఖ్య ఆధారంగా ఈ పెంపు ఉంటుంది. ఈ 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉంటాయి. వీటిని చమురు మార్కెటింగ్ కంపెనీల సహకారంతో కేవలం ఆయా రాష్ట్రాల్లోని వలస కార్మికులకు మాత్రమే సరఫరా చేయాల్సి ఉంటుంది.
ఏప్రిల్ నెలలో 22.78 లక్షలకు పైగా 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
2026 ఏప్రిల్ 3 నుంచి, ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు 9980 కంటే ఎక్కువ అవగాహన శిబిరాలు నిర్వహించాయి. ఈ శిబిరాల ద్వారా 1,71,000కి పైగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వాణిజ్య ఎల్‌పీజీ పంపిణీని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సంస్థల కార్యనిర్వహక డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ... రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల విభాగాలతో సమన్వయం చేసుకుంటోంది.
2026 ఏప్రిల్ నెలలో, మొత్తం 2,05,849 మెట్రిక్ టన్నుల (108.34 లక్షలకు పైగా 19 కేజీల ఎల్పీజీ సిలిండర్లకు సమానమైన) వాణిజ్య ఎల్‌పీజీని విక్రయించారు.
2026 ఏప్రిల్ నుంచి, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మొత్తం 10,698 మెట్రిక్ టన్నుల ఆటో ఎల్‌పీజీని విక్రయించాయి.
సహజ వాయువు సరఫరా, పీఎన్‌జీ విస్తరణ కార్యక్రమాలు
డీ-పీఎన్‌జీ, సీఎన్‌జీ-రవాణాకు 100 శాతం సరఫరాలతో వినియోగదారులకు ప్రాధాన్యమిస్తున్నారు.
ఎరువుల కర్మాగారాలకు కేటాయించే మొత్తం గ్యాస్‌ను, వాటి ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 98 శాతానికి పెంచారు.
అదనంగా, సీజీడీ నెట్‌వర్క్‌ల ద్వారా జరిగే సరఫరాలు సహా... ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 80 శాతం వరకు పెంచారు.
వాణిజ్య ఎల్‌పీజీ లభ్యతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడానికి సీజీడీ సంస్థలు తమ అన్ని జిఏల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్‌జీ కనెక్షన్లకు ప్రాధాన్యమివ్వాలని సూచించాయి.
ఐజీఎల్, ఎమ్‌జీఎల్, జీఏఐఎల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీలు గృహ, వాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్‌ల కోసం ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.
సీజీడీ నెట్‌వర్క్‌ల విస్తరణకు అవసరమైన ఆమోదాలను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరారు.
ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి దీర్ఘకాలిక పరివర్తనలో సహాయపడే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్‌పీజీలో అదనంగా 10 శాతం కేటాయింపును తేది 18.03.2026 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రతిపాదించింది.
పీఎన్‌జీ విస్తరణ సంస్కరణలకు అనుసంధానంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును పొందుతున్నాయి.
రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తేదీ 24.03.26 నాటి లేఖ ద్వారా సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యత ప్రాతిపదికన ప్రాసెస్ చేయడానికి, 'తగ్గించిన కాలపరిమితులతో సీజీడీ మౌలిక సదుపాయాల కోసం వేగవంతమైన ఆమోద విధాన ప్రణాళిక'ను 3 నెలల పాటు ప్రత్యేకంగా అమలు చేస్తోంది.
24.03.2026 తేదీ గల గెజిట్ ద్వారా భారత ప్రభుత్వం... నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్‌లైన్‌లు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయడం, నిర్మించడం, నిర్వహించడం, విస్తరించడం ద్వారా) ఉత్తర్వులు-2026ను జారీ చేసింది. ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా పైప్‌లైన్‌లను వేయడానికి, విస్తరించడానికి ఒక క్రమబద్ధమైన, కాలపరిమితితో కూడిన విధాన ప్రణాళికను అందిస్తుంది. ఇది అనుమతులు, భూమి లభ్యతలో జాప్యాలను పరిష్కరించి, నివాస ప్రాంతాలు సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి వీలు కల్పిస్తుంది. ఇది పీఎన్‌జీ నెట్‌వర్క్ వృద్ధిని వేగవంతం చేస్తుందని, మారుమూల ప్రాంతాలతో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని, పరిశుద్ధ ఇంధనాలకు మారడానికి మద్దతునిస్తుందని, తద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేసి భారత గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందని భావిస్తున్నారు.
డీ-పీఎన్‌జీ కనెక్షన్‌లను వేగవంతం చేయాలని సీజీడీ సంస్థలను పీఎన్‌జీఆర్‌బీ ఆదేశించింది. పీఎన్‌జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడానికి నేషనల్ పీఎన్‌జీ డ్రైవ్ 2.0ను 30.06.2026 వరకు పొడిగించారు.
పరిశుద్ధమైన, మరింత సురక్షితమైన, స్వయం సమృద్ధిగల ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించడం కోసం భారత ప్రభుత్వం రాష్ట్ర సీబీజీ విధానం కోసం నమూనా ముసాయిదాను అభివృద్ధి చేసింది. ఈ నమూనా విధానం... సీబీజీ అభివృద్ధి కోసం రాష్ట్రాలు తమ సొంత, పెట్టుబడిదారులకు అనుకూలమైన, అమలుకు అనువుగా ఉండే వ్యవస్థను సృష్టించుకోవడానికి వీలు కల్పించే ఒక సమగ్రమైన, సరళమైన మార్గదర్శక విధాన ప్రణాళికగా పనిచేయడానికి ఉద్దేశించినది. దీనిని ఎంచుకున్న రాష్ట్రాలకు, వాణిజ్య ఎల్‌పీజీ అదనపు కేటాయింపుల తదుపరి విడతలో ప్రాధాన్యమిస్తారు.
ఎమ్‌వోఈఎఫ్‌సీసీ 07.04.2026 తేదీ నాటి ఉత్తర్వుల ద్వారా... సీజీడీ నెట్‌వర్క్, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి, నిర్వహించడానికి 15 రోజుల్లోపు అనుమతి మంజూరు చేసేందుకు ఎస్‌పీసీబీ, పీసీసీలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని సీపీసీబీని ఆదేశించింది.
మార్చి 2026 నుంచి, సుమారు 5.96 లక్షల పీఎన్‌జీ కనెక్షన్‌ల గ్యాసిఫికేషన్ పూర్తయింది. అదనంగా 2.68 లక్షల కనెక్షన్‌ల కోసం మౌలిక సదుపాయాలు కల్పించారు. దీంతో మొత్తం కనెక్షన్‌ల సంఖ్య 8.64 లక్షలకు చేరింది. కొత్త కనెక్షన్‌ల కోసం సుమారు 6.66 లక్షల మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారు.
01.05.2026 వరకు, 43,350 కంటే ఎక్కువ మంది పీఎన్‌జీ వినియోగదారులు MYPNGD.in వెబ్‌సైట్ ద్వారా తమ ఎల్‌పీజీ కనెక్షన్‌లను వదులుకున్నారు.
ముడి చమురు లభ్యత, రిఫైనరీ కార్యకలాపాలు
· అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో పెట్రోల్, డీజిలు నిల్వలు సరిపడా ఉన్నాయి.
· దేశీయ వినియోగానికి మద్దతుగా రిఫైనరీల నుంచి ఎల్పీజీ ఉత్పత్తిని పెంచారు.
· దేశీయ మార్కెట్కు అవసరమైన పెట్రోకెమికల్ ముడిసరుకు సరఫరా నిరంతరాయంగా అందేలా చూడటం కోసం వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన ఒక సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది. దీనిని అనుసరిస్తూ భారత ప్రభుత్వం 01.04.2026 నాటి ఉత్తర్వుల ద్వారా.. దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు తమ వద్ద ఉండే సీ3, సీ4 గ్యాస్ నిల్వలను నిర్ణీత పరిమాణంలో కొన్ని ముఖ్యమైన రంగాలకు అందించాలని అనుమతించింది.
· ఔషధ విభాగం, రసాయనాలు, పెట్రో కెమికల్స్ విభాగం, పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం నుంచి అందిన అభ్యర్థనల మేరకు.. ఔషధ, రసాయన రంగ కంపెనీల కోసం ఎల్పీజీ పూల్ నుంచి రోజుకు 1000 మెట్రిక్ టన్నులను కేటాయించారు.
· 9 ఏప్రిల్ 2026 నుంచి ముంబై, కొచ్చి, విశాఖకపట్నం, చెన్నై, మధుర, గుజరాత్ రిఫైనరీలు రసాయన, ఔషధ, పెయింట్ పరిశ్రమలకు 10,000 మెట్రిక్ టన్నులకు పైగా ప్రొపైలిన్, 1200 మెట్రిక్ టన్నులకు పైగా బ్యూటైల్ అక్రిలేట్ను విక్రయించాయి.
రిటైల్ ఇంధన లభ్యత, ధరల నియంత్రణ చర్యలు
· దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోలు బంకులు యథావిధిగా నడుస్తున్నాయి.
· మధ్యప్రాచ్యం సంక్షోభం వల్ల ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. అయినప్పటికీ సామాన్యులపై భారం పడకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం పెట్రోలు, డీజిలు పైన ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 తగ్గించింది.
· భారత ప్రభుత్వం 30.04.2026 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా డీజిలుపై లీటరుకు రూ. 55.50 నుంచి రూ.23కు... విమాన ఇంధనంపై లీటరుకు రూ. 42 నుంచి రూ.33కు ఎగుమతి సుంకాన్ని తగ్గించింది.
· వదంతుల కారణంగా కొన్ని రిటైల్ అవుట్లెట్ల వద్ద ప్రజలు అత్యవసరంగా ఇంధనాన్ని కొనుగోలు చేయడం గమనించాం. దేశంలోని అన్ని పెట్రోలు బంకుల్లో పెట్రోలు, డీజిలు తగినంత నిల్వలు అందుబాటులో ఉందని తెలియజేస్తున్నాం. పెట్రోలు, డీజిలు సాధారణ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వ రంగ చమురు సంస్థల అవుట్లెట్లలో వాటి ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.
కిరోసిన్ లభ్యత, పంపిణీ చర్యలు
· సాధారణ కేటాయింపులకు అదనంగా అన్ని రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ 48,000 కిలో లీటర్ల కిరోసిన్ను కేటాయించారు.
· 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ప్రాంతాలు తమకు కిరోసిన్ అవసరం లేదని తెలియజేశాయి.
సముద్ర భద్రత, నౌకా రవాణా కార్యకలాపాలు
పర్షియన్ గల్ఫ్లో నెలకొన్న సముద్ర పరిస్థితిపై ఓడరేవులు, నౌకా రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. ఈ ప్రాంతంలో భారతీయ నౌకలు, సిబ్బంది భద్రత, రక్షణను నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించింది. ఆ సమాచారం మేరకు..
· నావికుల సంక్షేమం, నిరంతరాయ సముద్ర కార్యకలాపాలను నిర్ధారించడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు, సముద్ర రంగ భాగస్వాములతో మంత్రిత్వ శాఖ సమన్వయం కొనసాగిస్తోంది.
· ఆ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారతీయ జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.
· షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24x7 పనిచేస్తూనే ఉంది. ప్రారంభమైనప్పటి నుంచి 8,335 కాల్స్ , 17,838 కంటే ఎక్కువ ఈమెయిళ్లను స్వీకరించి పరిష్కరించింది.. గత 24 గంటల్లో 67 కాల్స్, 144 ఈమెయిళ్లు అందాయి.
· డీజీ షిప్పింగ్ ద్వారా గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి గత 24 గంటల్లో 30 మందితో సహా… ఇప్పటివరకు 2,922 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో మంత్రిత్వ శాఖ సహాయపడింది.
· దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. ఎటువంటి రద్దీ నమోదు కాలేదు.
యుద్ధ ప్రభావ ప్రాంతంలో భారత పౌరుల భద్రత
గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఈ ప్రాంతంలోని భారతీయుల భద్రత, రక్షణ, సంక్షేమాన్ని నిర్ధారించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసిన వివరాల ప్రకారం...
· సమాచార మార్పిడి, మద్దతు కోసం మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సన్నిహిత సమన్వయాన్ని కొనసాగిస్తోంది.
· భారతీయ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు మన పౌరులకు సకాలంలో సహాయం అందించేందుకు నిరంతరాయంగా హెల్ప్‌లైన్‌లను నిర్వహిస్తున్నాయి. అలాగే అక్కడి స్థానిక ప్రభుత్వాలతో కూడా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాయి.
· స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు, విమాన ప్రయాణాల పరిస్థితి, కాన్సులర్ సేవలు, ప్రవాస భారతీయుల కోసం చేపడుతున్న వివిధ సంక్షేమ చర్యలకు సంబంధించిన తాజా సమాచారంతో కూడిన సూచనలను ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారు.
· మన దౌత్య కార్యాలయాలు భారతీయ సమాజ సంఘాలు, వృత్తిపరమైన సమూహాలు, భారతీయ కంపెనీల ఆందోళనలను పరిష్కరించేందుకు వారితో చురుగ్గా సంప్రదింపులు జరుపుతున్నాయి.
· ఆ ప్రాంతంలో భారతీయ నావికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దౌత్య కార్యాలయాలు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవడం, కాన్సులర్ మద్దతును అందించడం, అవసరమైన చోట తిరిగి భారత్కు చేరుకోవడానికి వీలు కల్పించడం వంటి సహాయక చర్యలను చేపడుతున్నాయి.
· ఆ ప్రాంతాల నుంచి భారత్లోని వివిధ గమ్యస్థానాలకు అదనపు విమానాలు నడుస్తుండటంతో విమాన రాకపోకల పరిస్థితి మొత్తం మీద మెరుగుపడుతూనే ఉంది.
· యూఏఈ కార్యకలాపాలు, భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకుని విమానయాన సంస్థలు యూఏఈ-భారత్ మధ్య పరిమిత సంఖ్యలో వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి.
· సౌదీ అరేబియా, ఒమన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్లోని వివిధ గమ్యస్థానాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
· ఖతార్ గగనతలం పాక్షికంగా తెరుచుకోవడంతో ఖతార్ ఎయిర్వేస్ భారత్లోని వివిధ గమ్యస్థానాలకు విమానాలను నడుపుతోంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో సంస్థలు ఖతార్ నుంచి భారత్కు తమ విమాన కార్యకలాపాలను ప్రారంభించాయి.
· కువైట్ గగనతలం తెరిచి ఉంది. జజీరా ఎయిర్‌వేస్, కువైట్ ఎయిర్‌వేస్, కువైట్ నుంచి భారత్కు పరిమిత విమాన సేవలను తిరిగి ప్రారంభించాయి.
· బహ్రెయిన్ గగనతలం తెరిచి ఉంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, గల్ఫ్ ఎయిర్ సంస్థలు బహ్రెయిన్ నుంచి భారత్లోని వివిధ గమ్యస్థానాలకు విమానాలను నడుపుతున్నాయి. ఇండిగో కూడా ఈ రోజు నుంచి భారత్కు విమాన సేవలను పునరుద్ధరించే ఆలోచనలో ఉంది.
· ఇరాక్ గగనతలం తెరిచి ఉంది. ఆ ప్రాంతంలోని ఇతర నగరాలకు పరిమిత విమానాలు నడుస్తున్నాయి. వాటి ద్వారా భారత్కు ప్రయాణించవచ్చు.
· ఇరాన్ గగనతలం కార్గో, చార్టర్డ్ విమానాల కోసం పాక్షికంగా తెరిచి ఉంది. భారతీయులు ఇరాన్ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే అక్కడ ఉన్నవారు భారత రాయబార కార్యాలయం సహాయంతో భూ సరిహద్దు మార్గాల ద్వారా ఇరాన్ దాటాలని కోరారు. ఇప్పటివరకు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం 2,490 మంది భారతీయులు భూ సరిహద్దుల ద్వారా ఇరాన్ నుంచి బయటకు వచ్చేలా సాయపడింది.
· ఇజ్రాయెల్ గగనతలం తెరిచి ఉంది. ఆ ప్రాంతంలోని గమ్యస్థానాలకు పరిమిత విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. వీటిని భారత్‌కు తదుపరి ప్రయాణం కోసం ఉపయోగించుకోవచ్చు.
****
(రిలీజ్ ఐడి: 2257578)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam