పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమాసియాలోని పరిణామాల దృష్ట్యా కీలక రంగాలపై తాజా సమాచారంపశ్చిమాసియాలోని పరిణామాల దృష్ట్యా కీలక రంగాలపై తాజా సమాచారం


ప్రధానంగా వాణిజ్య, పారిశ్రామిక, ప్రీమియం రంగాలకు సేవలందించే కొన్ని ఉత్పత్తుల కోసం, ప్రస్తుత అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా క్రమబద్ధ ధరల సవరణ చేపట్టనున్న ఓఎమ్‌సీలు

రిటైల్ పంప్ పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ ఎల్‌పీజీ (సాధారణ గృహ వినియోగానికి ఉద్దేశించిన 14.2 కేజీల సిలిండర్లు) ధరలు యథాతథం

సుమారు 41.6 లక్షల ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్‌లకు గానూ, సుమారు 49.8 లక్షల గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లు పంపిణీ

యాక్టివేషన్ నుంచి 8,268 కాల్‌లు... 17,694 కంటే ఎక్కువ ఈమెయిళ్లనూ నిర్వహించిన డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్

భూ సరిహద్దు మార్గాల ద్వారా 2,490 మంది భారత పౌరులు ఇరాన్ నుంచి బయటకు వెళ్లేందుకు సౌకర్యం కల్పించిన టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం

నాడు పోస్టు చేయడమైనది: 01 MAY 2026 6:29PM by PIB Hyderabad

పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం సమన్వయ ప్రతిస్పందన చర్యల ద్వారా కీలక రంగాల్లో సంసిద్ధతను, కొనసాగింపునూ నిర్ధారించడంలో చురుగ్గా నిమగ్నమై ఉంది. ఈ ప్రాంతంలోని ఇంధన సరఫరా, నౌకా వాణిజ్య కార్యకలాపాలు, భారత పౌరులకు మద్దతునందించుటకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం తెలియజేసింది:

ఇంధన సరఫరా, ఇంధన లభ్యత

పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూసేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం వివరించింది. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితిపై తాజా సమాచారాన్ని అందించింది. ఈ సందర్భంగా కింది విషయాలు తెలియజేసింది:

ప్రజలకు సూచనలు, పౌరులకు అవగాహన

పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీల లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నందున, పౌరులు వీటిని భయాందోళనతో కొనుగోలు చేయడం మానుకోవాలి.

వదంతుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, సరైన సమాచారం కోసం అధికారిక వనరులపై ఆధారపడాలి.

ఎల్‌పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకోవాలని, పంపిణీదారుల వద్దకు వెళ్లడం మానుకోవాలని విజ్ఞప్తి.

పీఎన్‌జీ, విద్యుత్ లేదా ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాల్సిందిగా పౌరులను ప్రోత్సహిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో, పౌరులంతా తమ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేయాలని కోరడమైనది.

ప్రభుత్వ సంసిద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు

ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో గృహావసరాల కోసం ఎల్‌పీజీ, పీఎన్‌జీ, సీఎన్‌జీ (రవాణా) 100 శాతం సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాలో ఆసుపత్రులకు, విద్యా సంస్థలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఔషధ, ఉక్కు, ఆటోమొబైల్, విత్తన, వ్యవసాయ రంగాలకూ ప్రాధాన్యత కొనసాగిస్తున్నారు. 2026 మార్చి 2, 3 తేదీల్లో నమోదైన సగటు రోజువారీ సరఫరా ఆధారంగా వలస కార్మికులకు అందించే 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల సరఫరానూ రెట్టింపు చేశారు.

సరఫరా, డిమాండ్ రెండు వైపులా ప్రభుత్వం ఇప్పటికే అనేక హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. వీటిలో రిఫైనరీ ఉత్పత్తి పెంపుదల... పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ విరామాన్ని 21 రోజుల నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకూ పెంచడం... సరఫరా విషయంలో నిర్దిష్ట రంగాలకు ప్రాధాన్యమివ్వడం వంటి చర్యలు ఉన్నాయి.

ఎల్‌పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలు అందుబాటులో ఉంచుతున్నారు.

చిన్న, మధ్య తరహా వినియోగదారులకు పంపిణీ చేసే నిమిత్తం రాష్ట్రాలకు అదనపు బొగ్గును కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ 'కోల్ ఇండియా', 'సింగరేణి కాలరీస్'లను ఆదేశించింది.

గృహ, వాణిజ్య వినియోగదారులు కొత్త పీఎన్‌జీ కనెక్షన్లను పొందుటను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు

నిత్యావసర వస్తువుల చట్టం-1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వులు-2000 ప్రకారం సరఫరాను పర్యవేక్షించడం... అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.

పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వంటి నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడంలో, నియంత్రించడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంది. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు లేఖలు, వీడియో అనుసంధానాల ద్వారా పునరుద్ఘాటించింది.

తగినంత ఇంధన లభ్యతపై పౌరులకు భరోసా కల్పించేందుకు, ప్రజలకు ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సిన ఆవశ్యకతను భారత ప్రభుత్వం 27.03.2026, 02.04.2026 తేదీల నాటి లేఖల ద్వారా స్పష్టం చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతర సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. 02.04.2026న (ఎమ్‌వోపీఎన్‌జీ కార్యదర్శి అధ్యక్షతన), 06.04.2026న (ఎమ్‌వోపీఎన్‌జీ కార్యదర్శితో పాటు సమాచార-ప్రసార శాఖ, వినియోగదారుల వ్యవహారాల శాఖల కార్యదర్శుల అధ్యక్షతన) సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కింది అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు:

రోజువారీ పత్రికా సమావేశాలను నిర్వహించడం, క్రమం తప్పకుండా ప్రజలకు సూచనలు జారీ చేయడం.

సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించడం, తిప్పికొట్టడం.

జిల్లా యంత్రాంగం ద్వారా రోజువారీ అమలు చర్యలను ముమ్మరం చేయడం, ఓఎమ్‌సీలతో సమన్వయం ద్వారా సోదాలు, తనిఖీలను కొనసాగించడం.

తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన అదనపు ఎస్‌కేవో కోసం ఎస్‌కేవో కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.

పీఎన్‌జీ వినియోగాన్ని, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.

ముఖ్యంగా గృహావసరాల కోసం ఎల్‌పీజీ సరఫరాకు ప్రాధాన్యమివ్వడం. సరఫరా స్థిరత్వాన్ని నిర్ధారించడానికి లక్ష్యానికి అనుగుణంగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల పంపిణీని అమలు చేయడం.

అక్రమ నిల్వలు,  బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూమ్‌లను, జిల్లా పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాయి.

అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పత్రికా ప్రకటనలను జారీ చేస్తున్నాయి... సమావేశాలనూ నిర్వహిస్తున్నాయి.

అమలు, పర్యవేక్షణ చర్యలు

ఎల్‌పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌లను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా తనిఖీ చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 2,300కు పైగా సోదాలు నిర్వహించారు.

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేసి, 342 ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాలకు జరిమానాలు విధించాయి. నిన్నటి వరకు 73 ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల లైసెన్సునూ నిలిపివేశాయి.

30.04.2026న, 46 మంది ఎల్‌పీజీ పంపిణీదారులకు షో కాజ్ నోటీసులు జారీ చేశాయి. 6 పంపిణీ సంస్థలకు జరిమానాలు విధించాయి. ఒక పంపిణీదారుని లైసెన్స్ సస్పెండ్ చేశారు.

ఎల్‌పీజీ సరఫరా

గృహావసరాల కోసం ఎల్‌పీజీ సరఫరా స్థితి...

ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.

గృహ వినియోగదారులకు ఎల్‌పీజీ సరఫరా కోసం అత్యంత ప్రాధాన్యత కొనసాగుతోంది.

ఎల్‌పీజీ పంపిణీదారుల వద్ద ఎక్కడా నిల్వల కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.

నిన్న పరిశ్రమవ్యాప్తంగా ఆన్‌లైన్ ఎల్‌పీజీ బుకింగ్‌లు సుమారు 98 శాతానికి పెరిగాయి.

సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టడానికి డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీ విధానాన్ని సుమారు 93 శాతానికి పెంచారు. నమోదు చేసుకున్న ఫోన్‌ నంబర్‌కు డీఏసీ వస్తోంది.

30.04.2026న, సుమారు 41.6 లక్షల ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్‌లకు గానూ, దాదాపు 49.8 లక్షల గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లు పంపిణీ చేశారు.

వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు:

మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో సుమారు 70 శాతానికి పెరిగాయి. ఇందులో 10 శాతం సంస్కరణలతో ముడిపడి ఉన్న కేటాయింపులూ ఉన్నాయి.

వలస కార్మికులకు పంపిణీ చేసే 5 కిలోల ఎఫ్‌టీఎల్ (ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ) సిలిండర్ల రోజువారీ పరిమాణాన్ని ప్రతి రాష్ట్రంలోనూ రెట్టింపు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం 06.04.2026 నాటి లేఖ ద్వారా తెలియజేసింది. 21.03.2026 నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితిని మించి, 2026 మార్చి 2-3 తేదీల్లో వలస కార్మికులకు సరఫరా చేసిన సగటు సిలిండర్ల సంఖ్య ఆధారంగా ఈ పెంపు ఉంటుంది. ఈ 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉంటాయి. వీటిని చమురు మార్కెటింగ్ కంపెనీల సహకారంతో కేవలం ఆయా రాష్ట్రాల్లోని వలస కార్మికులకు మాత్రమే సరఫరా చేయాల్సి ఉంటుంది.

ఫిబ్రవరి నెలలో మొత్తం 21.7 లక్షల 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి. ఏప్రిల్ నెలలో 22.54 లక్షలకు పైగా 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.

నిన్న 79,000కు పైగా 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు పంపిణీ చేశారు.

2026 ఏప్రిల్ 3 నుంచి, ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు 9900 కంటే ఎక్కువ అవగాహన శిబిరాలు నిర్వహించాయి. ఈ శిబిరాల ద్వారా 1,69,000కి పైగా 5 కిలోల ఎఫ్‌టీఎల్‌ సిలిండర్లు అమ్ముడయ్యాయి.

నిన్న 162 శిబిరాల ద్వారా 4544 - 5 కిలోల ఎఫ్‌టీఎల్‌ సిలిండర్లు అమ్ముడయ్యాయి.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వాణిజ్య ఎల్‌పీజీ పంపిణీని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సంస్థల కార్యనిర్వహక డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ... రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల విభాగాలతో సమన్వయం చేసుకుంటోంది.

2026 ఏప్రిల్ నెలలో, మొత్తం 2,04,049 మెట్రిక్ టన్నుల (107.39 లక్షలకు పైగా 19 కేజీల ఎల్పీజీ సిలిండర్లకు సమానమైన) వాణిజ్య ఎల్‌పీజీని విక్రయించారు.

30.04.2026 తేదీన, 11517 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్‌పీజీ (సుమారు 6.06 లక్షల - 19 కేజీల సిలిండర్లకు సమానం) విక్రయించారు.

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల ద్వారా 2026 ఫిబ్రవరి నెలలో అమ్మకాలు సుమారు 5000 మెట్రిక్ టన్నులుగా ఉండగా... ఏప్రిల్ నెలలో ఆటో ఎల్‌పీజీ అమ్మకాలు సుమారు 10688 మెట్రిక్ టన్నులుగా ఉన్నాయి.

2026 ఏప్రిల్ నెలలో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల సగటు ఆటో ఎల్‌పీజీ అమ్మకాలు రోజుకు సుమారు 356 మెట్రిక్ టన్నులు కాగా... 2026 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ సగటు రోజుకు సుమారు 177 మెట్రిక్ టన్నులుగా ఉంది. ఇది పీఎస్‌యూ ఓఎమ్‌సీల ద్వారా జరిగే ఆటో ఎల్‌పీజీ అమ్మకాల్లో సుమారు 100 శాతం పెరుగుదలను సూచిస్తుంది.

సహజవాయువు  సరఫరా పీఎన్జీ విస్తరణ కార్యక్రమాలు

·    డీ-పీఎన్జీ, సీఎన్జీ రవాణాకు 100 శాతం సరఫరాలతో వినియోగదారులకే ప్రాధాన్యమిచ్చారు.

·    ఎరువుల కర్మాగాలకు కేటాయించే గ్యాసును, వాటి ఆరు నెలల సగటు వినియోగంలో సుమారుగా 95 శాతానికి పెంచారు.

·     అదనంగా, సీజీడీ నెట్‌వర్కుల ద్వారా జరిగే సరఫరాలతో సహా ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాసు సరఫరా 80 శాతానికి పెరిగింది.

·     వాణిజ్య ఎల్పీజీ లభ్యతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి తమ పరిధిలోని అన్ని జీఏల్లో నిర్వహించే హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్జీ కనెక్షన్లను ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యమివ్వాలని సీజీడీ సంస్థలకు సూచన అందింది.

·    ఐజీఎల్, ఎంజీఎల్ గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ సహా సీజీడీ సంస్థలు గృహ, వాణిజ్య అవసరాల కోసం పీఎన్జీ కనెక్షన్లకు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.

·     సీజీడీ నెట్‌వర్కులను విస్తరించడానికి అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరడమైనది.

·    ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారేలా చేపడుతున్న దీర్ఘకాలిక మార్పులకు మద్దతు అందించే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 10 శాతం వాణిజ్య కేటాయింపులను 18.03.2026న రాసిన లేఖలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

·    పీఎన్జీ విస్తరణ సంస్కరణలకు సంబంధించిన అదనపు కేటాయింపులను 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పొందుతున్నాయి.

·    కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 24.03.26 నాటి లేఖ ద్వారా సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్య క్రమంలో ఆమోదించేందుకు మూడు నెలల ప్రత్యేక వ్యవధితో కూడిన తగ్గించిన కాలపరిమితితో సీజీడీ మౌలిక సదుపాయాల కోసం వేగవంతమైన అనుమతుల విధానాన్ని అమలు చేస్తోంది.

·    24.03.2026న జారీ చేసిన గెజిట్ ద్వారా, నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్‌లైన్లు, ఇతర సౌకర్యాల ఏర్పాటు, నిర్మాణం, నిర్వహణ, విస్తరణ ద్వారా) ఉత్తర్వు- 2026ను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా పైప్‌లైన్‌లను ఏర్పాటు చేయడానికి, విస్తరించడానికి క్రమబద్ధీకరించిన, కాలపరిమితితో కూడిన విధానాన్ని అందిస్తుంది. ఇది అనుమతుల్లో జరిగే జాప్యాన్ని, భూసేకరణ సమస్యలను పరిష్కరించడమే కాకుండా, నివాస ప్రాంతాలతో సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇది పీఎన్‌జీ వ్యవస్థ వృద్ధిని వేగవంతం చేస్తుందనీ, సమాజంలో చివరి అంచెల వరకూ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందనీ, శుద్ధ ఇంధనాల వైపు మళ్లేందుకు మద్దతునిస్తుందనీ భావిస్తున్నారు. తద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేస్తూ, భారతదేశ గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళుతుంది.

·    డీ-పీఎన్జీ కనెక్షన్లను వేగంగా విస్తరించాలని సీజీడీ సంస్థలను పీఎన్‌జీఆర్‌బీ ఆదేశించింది. అలాగే, జాతీయ పీఎన్జీ డ్రైవ్ 2.0ను 30.06.2026 వరకు పొడిగించారు.

·         మరింత శుద్ధమైన, సురక్షితమైన, స్వయం సమృద్ధి సాధించిన ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించడానికి రాష్ట్ర సీబీజీ విధానం నమూనా ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. పెట్టుబడిదారులకు అనుకూలమైన, అమలు చేయడానికి వీలుగా ఉండే సీబీజీ అభివృద్ధి వ్యవస్థను రాష్ట్రాలను నిర్మించుకోవడానికి, ఈ నమూనా సమగ్రమైన, సరళమైన మార్గదర్శక విధానంగా ఉపయోగపడుతుంది. ఈ విధానాన్ని ఎంచుకునే రాష్ట్రాలకు, తదుపరి విడతలో కేటాయించే అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపుల్లో ప్రాధాన్యత దక్కుతుంది.

·         ఎమ్‌వోఈఎఫ్‌సీసీ 07.04.2026 తేదీన జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా... సీజీడీ నెట్‌వర్క్, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి లేదా నిర్వహించడానికి 15 రోజుల్లోపు అనుమతి మంజూరు చేసేందుకు ఎస్‌పీసీబీ/పీసీసీలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని సీపీసీబీని ఆదేశించింది.

·         మార్చి 2026 నుంచి సుమారుగా 5.88 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభమైంది. అదనంగా మరో 2.68 లక్షల కనెక్షన్ల కోసం మౌలిక సదుపాయాల కల్పన పూర్తయింది. దీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య 8.56 లక్షలకు చేరుకుంది. అంతేకాకుండా, సుమారు 6.60 లక్షల మంది వినియోగదారులు కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారు.

·         30.04.2026 నాటికి MYPNGD.in వెబ్సైట్ ద్వారా 43,200 మందికి పైగా పీఎన్జీ వినియోగదారులు తమ ఎల్పీజీ కనెక్షన్లను సరెండర్ చేశారు.

ముడి చమురు స్థితి, చమురు శుద్ధి కార్యకలాపాలు

·         అన్ని రిఫైనరీలు తగినంత ముడి చమురు నిల్వలతో పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. అదే సమయంలో పెట్రోలు, డీజిలు నిల్వలు తగినంత అందుబాటులో ఉండేలా నిర్వహిస్తున్నారు.

·         గృహ వినియోగానికి మద్దతుగా రిఫైనరీల నుంచి దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచారు.

·         దేశీయ మార్కెట్లో పెట్రోరసాయన ఫీడ్‌స్టాక్ సరఫరా అందుబాటులో ఉండేలా చూసేందుకు అంతర మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యవర్గ బృందం (జేడబ్ల్యూజీ) ఏర్పాటైంది. అదేవిధంగా, 01.04.2026న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్‌టీ) నిర్ణయించిన కీలక రంగాల్లో కనీసం పరిమాణంలో సీ3, సీ4 స్ట్రీమ్‌లను అందుబాటులో ఉంచడానికి పెట్రో కెమికల్ కాంప్లెక్సులతో సహా చమురు శుద్ధి కర్మాగారాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.

·         ఫార్మాసూటికల్ విభాగం, రసాయనాలు-పెట్రో రసాయనాల విభాగం (డీసీపీసీ), పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) నుంచి అందిన వినతుల ఆధారంగా ఫార్మా, రసాయన రంగ సంస్థలకు ఎల్పీజీ నిల్వల నుంచి రోజుకు 1000 ఎంటీలను కేటాయించారు.

·         2026 ఏప్రిల్ 9 నుంచి ముంబయి, కొచ్చి, వైజాగ్, చెన్నై, మధుర, గుజరాత్ రిఫైనరీల నుంచి 9900 మెట్రిక్ టన్నులకు పైగా ప్రొపిలీన్‌ను, 1100 మెట్రిక్ టన్నులకు పైగా బ్యుటైల్ ఆక్రిలేట్‌ను రసాయన, ఫార్మా, పెయింట్ పరిశ్రమలకు విక్రయించారు.

అందుబాటులో ఉన్న రీటైయిల్ ఇంధనం, ధరల సంబంధిత చర్యలు

·    దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీటెయిల్ అవుట్‌లెట్లు సాధారణంగానే పనిచేస్తున్నాయి.

·    మధ్య ప్రాచ్యంలో నెలకొన్న సంక్షోభంతో ముడి చమురు ధరలు అసాధారణంగా పెరిగాయి. వినియోగదారులను అధిక ధరల నుంచి రక్షించేందుకు భారత ప్రభుత్వం పెట్రోలు, డీజిలుపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 తగ్గించింది.

·         30.04.2026న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా డీజిల్‌పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 55.50 నుంచి రూ.23కు, ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 42 నుంచి రూ.33కు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది.

·    మొత్తం వినియోగంలో సాపేక్షంగా తక్కువ వాటా ఉండి, మార్కెట్ ఆధారిత సర్దుబాట్లకు లోబడి ఉండే కొన్ని ఉత్పత్తుల కోసం అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా ధరలను ఓఎంసీలు సవరించాయి. ప్రధానంగా వాణిజ్యం, పారిశ్రామిక, ప్రీమియం విభాగాలకు చెందిన బల్క్, ప్యాక్డ్ ఎల్పీజీతో సహా వాణిజ్య ఎల్పీజీ, బల్క్ డీజిలు, అంతర్జాతీయ కార్యకలాపాల కోసం ఏటీఎఫ్ లాంటి కొన్ని ఉత్పత్తులకు మాత్రమే ఈ సవరణ వర్తిస్తుంది.

·    పెట్రోలు, డీజిలు రీటెయిల్ ధరలు, గృహ వినియోగ ఎల్పీజీ (సాధారణ గృహావసరాల కోసం వినియోగించే 14.2 కేజీల సిలిండర్లు) ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

కిరోసిన్ లభ్యత, పంపిణీ చర్యలు

·    సాధారణ కేటాయింపులకు అదనంగా 48,000 కేఎల్ కిరోసిన్‌ను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించారు.

·    ఎస్‌కేవో కేటాయింపుల ఉత్తర్వులను 18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు జారీ చేయగా, హిమాచల్ ప్రదేశ్, లద్ధాఖ్ తమకు ఎలాంటి అవసరం లేదని తెలిపాయి.

నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు

పర్షియన్ గల్ఫ్‌లో నెలకొన్న నౌకా వాణిజ్య పరిస్థితిపై ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. ఈ ప్రాంతంలో భారతీయ నౌకలు, సిబ్బంది భద్రత, రక్షణను నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఈ నివేదికను సమర్పించింది. దానిలో దిగువ తెలిపిన విషయాలను పేర్కొంది:

·    నౌకా సిబ్బంది భద్రతకు, నౌకావాణిజ్య కార్యకలాపాలు అంతరాయం లేకుండా సాగేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారతీయ రాయబార కార్యాలయాలు, సముద్ర వాణిజ్య భాగస్వామ్యులతో ఓడరేవులు, నౌకాయానం, జలరవాణా మంత్రిత్వ శాఖ నిరంతరం సమన్వయం చేసుకుంటోంది.

·    ఈ ప్రాంతంలో ఉన్న భారతీయ నావికులంతా సురక్షితంగా ఉన్నారు. గడచిన 24 గంట్లో భారతీయ జెండాతో ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి ఘటన జరగలేదు.

·    ప్రారంభమైనప్పటి నుంచి 8,268 కాల్స్, 17,694కి పైగా ఈమెయిళ్లను డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూం నిర్వహించింది. గడచిన 24 గంటల్లో 113 కాల్స్, 295 ఈమెయిళ్లు అందాయి.

·         డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) ద్వారా, గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి గత 24 గంటల్లో 35 మందితో సహా, ఇప్పటివరకు 2,892 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి మంత్రిత్వశాఖ తీసుకువచ్చింది.

·         దేశవ్యాప్తంగా పోర్ట్ కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. ఎటువంటి రద్దీ నమోదు కాలేదు.

ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత

గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది. ఈ ప్రాంతంలోని భారతీయ పౌరుల భద్రత, రక్షణ, సంక్షేమాన్ని నిర్ధారించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కింది విషయాలను తెలియజేసింది:

·         మంత్రిత్వ శాఖలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ భారత పౌరులు, వారి కుటుంబాల సందేహాలకు స్పందించేందుకు పనిచేస్తోంది.

·         సమాచార ప్రసారానికి, ప్రయత్నాలను మెరుగ్గా సమన్వయం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.

·         సకాలంలో సహాయం అందించేందుకు ఇరవై నాలుగు గంటలూ పనిచేసే హెల్ప్‌లైన్‌లను భారత ఎంబసీలు, కాన్సులేట్‌లు నిర్వహిస్తున్నాయి. అలాగే మన పౌరులకు చురుగ్గా సహాయం అందిస్తున్నాయి. స్థానిక ప్రభుత్వాలతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాయి.

·         స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు, విమాన, ప్రయాణ పరిస్థితులు, కాన్సులర్ సేవలు, భారత పౌరుల కోసం చేపడుతున్న వివిధ సంక్షేమ చర్యలకు సంబంధించిన సమాచారం సహా తాజా సూచనలను జారీ చేస్తున్నారు.

·         స్థానిక భారతీయ సమాజంతో భారత రాయబార కార్యాలయాలు అనుసంధానమై ఉన్నాయి. వారి సమస్యలను పరిష్కరించేందుకు భారతీయ పౌర సంఘాలు, సంస్థలు, వృత్తిపరమైన నిపుణుల బృందాలు, భారతీయ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి.

·         ఈ ప్రాంతంలోని భారతీయ నావికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. భారతీయ మిషన్లు స్థానిక అధికారులు, ఏజెన్సీలతో సమన్వయం చేయడం, కాన్సులర్ సేవలు అందించడం, స్వదేశానికి తిరిగి రావాలనే అభ్యర్థనలకు సహాయం చేయడం సహా వారికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తున్నాయి.

·         ఈ ప్రాంతం నుంచి భారత్‌లోని వివిధ గమ్యస్థానాలకు అదనపు విమానాలు నడుస్తుండటంతో, మొత్తం విమానయాన పరిస్థితి మెరుగుపడుతూనే ఉంది.

·         కార్యాచరణ, భద్రతాపరమైన అంశాల ఆధారంగా యూఏఈ-భారత్ మధ్య పరిమిత సంఖ్యలో వాణిజ్య విమానాలను యూఏఈలోని ఎయిర్‌లైన్స్ నడుపుతున్నాయి.

·         సౌదీ అరేబియా, ఒమన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌లోని పలు పలు గమ్యస్థానాలకు విమాన సేవలు కొనసాగుతున్నాయి.

·         ఖతార్ గగనతలం పాక్షికంగా తెరుచుకోవడంతో, భారత్‌లోని వివిధ ప్రాంతాలకు ఖతార్ ఎయిర్‌వేస్ విమానాలను నడుపుతోంది. ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు త్వరలో ఖతార్ నుంచి భారత్‌కు విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నాయి.

·         కువైట్ గగనతలం తెరుచుకుంది. జజీరా ఎయిర్‌వేస్, కువైట్ ఎయిర్‌వేస్ సంస్థలు కువైట్ నుంచి భారత్‌కు పరిమిత విమాన కార్యకలాపాలను పునఃప్రారంభించాయి.

·         బహ్రెయిన్ గగనతలం కూడా తెరుచుకుంది.  బహ్రెయిన్ నుంచి భారత్‌లోని పలు గమ్యస్థానాలకు గల్ఫ్ ఎయిర్ విమానాలను నడుపుతోంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బహ్రెయిన్ నుంచి నిన్ననే కార్యకలాపాలను ప్రారంభించింది. ఇండిగో సంస్థ కూడా త్వరలో బహ్రెయిన్ నుంచి భారత్‌కు విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది.

·         ఇరాక్ గగనతలం తెరిచే ఉంది. ఈ ప్రాంతంలోని గమ్యస్థానాలకు పరిమిత విమాన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. వీటిని భారత్‌కు చేరుకొనేందుకు ఉపయోగించుకోవచ్చు.

·         సరుకు రవాణా, చార్టర్డ్ విమానాల కోసం ఇరాన్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉంది. భారత పౌరులు ఇరాన్‌కు ప్రయాణించకుండా ఉండాలని, ఇప్పటికే అక్కడ ఉన్నవారు భారత రాయబార కార్యాలయ సహకారంతో భూ మార్గాల ద్వారా ఆ ప్రాంతం నుంచి తిరిగి వెళ్లాలని కోరడమైనది. ఇప్పటివరకు, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం భూ మార్గాల ద్వారా 2,490 మంది భారత పౌరులకు ఇరాన్ నుంచి బయటకు వెళ్ళడానికి సౌకర్యం కల్పించింది.

·         ఇజ్రాయెల్ గగనతలం తెరచి ఉంది. ఈ ప్రాంతంలోని గమ్యస్థానాలకు పరిమిత స్థాయిలో విమాన కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయి. వీటిని భారత్‌కు చేరుకొనేందుకు ఉపయోగించుకోవచ్చు.

 

***


(రిలీజ్ ఐడి: 2257412) సందర్శకుల సూచీ సంఖ్య : : 70
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam