కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వయంసహాయక సంఘాల పొదుపు ఖాతాను ప్రారంభించిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)

నాడు పోస్టు చేయడమైనది: 30 APR 2026 3:15PM by PIB Hyderabad

స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) పొదుపు ఖాతాలను ప్రారంభిస్తున్నట్టు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఈ రోజు ప్రకటించింది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖకు చెందిన ఈ సంస్థ 100 శాతం భారత ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది. గ్రామీణ భారతదేశంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక చేయూతనివ్వడం, ఆర్థిక వ్యవస్థలో వారిని భాగస్వాములను చేయడం లక్ష్యంగా ఈ ప్రత్యేక ఖాతాను అందుబాటులోకి తెచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘బ్యాంకింగ్ సేవలను ప్రతి భారతీయుడికీ సరళంగా, సులభంగా, సమ్మిళితంగా అందుబాటులోకి తేవడమే ఐపీపీబీ ప్రధాన లక్ష్యం. నమ్మకమైన, తక్కువ వ్యయంతో కూడిన బ్యాంకింగ్ సదుపాయాల ద్వారా మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక సంఘాలను సశక్తులను చేసే దిశగా ఈ ఎస్‌హెచ్‌జీ పొదుపు ఖాతా ఒక కీలక ముందడుగు. ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవల విధానం, డిజిటల్ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడం ద్వారా ఈ సంఘాలు అధికారిక ఆర్థిక వ్యవస్థలో క్రియాశీల భాగస్వాములయ్యేలా చూడడం, తద్వారా సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించడం మా లక్ష్యం’’ అని ఐపీపీబీ ఎండీ, సీఈఓ శ్రీ ఆర్. విశ్వేశ్వరన్ అన్నారు.

దేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరివర్తనలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం, నాబార్డ్ మద్దతుతో నడిచే కార్యక్రమాలతో స్వయం సహాయక సంఘాలకు సన్నిహిత సంబంధాలున్నాయి. తపాలా శాఖకు ఉన్న తిరుగులేని నెట్‌వర్కును, స్వీయ డిజిటల్ సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ విస్తృతమైన పోస్ట్‌మెన్, గ్రామీణ డాక్ సేవక్ వ్యవస్థ సహకారంతో స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సేవల లభ్యతను మరింత చేరువ చేయాలని ఐపీపీబీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా డిజిటల్ ఆన్ బోర్డింగ్, ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను ఐపీపీబీ అందిస్తోంది.

ఐపీపీబీ స్వయం సహాయక సంఘాల పొదుపు ఖాతా రూపొందిన విధానం:

  1. తక్కువ వ్యయంతో అందుబాటులో ఉండేలా జీరో బ్యాలెన్స్, జీరో చార్జీలతో ఖాతా.
  2. ఖాతా ప్రారంభ ప్రక్రియను సులభతరం చేయడం కోసం డిజిటల్ పద్ధతిలో రూపకల్పన.
  3. తపాలా కార్యాలయాలు, తపాలా సిబ్బంది/గ్రామీణ డాక్ సేవకుల విస్తారమైన నెట్‌వర్క్ ద్వారా పంపిణీ

ముఖ్య లక్షణాలు:

  1. కనీస ప్రారంభ డిపాజిట్ అవసరం లేదు.
  2. నెలవారీ సగటు బ్యాలెన్స్ అవసరం లేదు.
  3. గరిష్ట బ్యాలెన్స్ పరిమితి రూ. 2,00,000.
  4. వర్తించే పొదుపు రేట్ల ప్రకారం త్రైమాసిక వడ్డీ చెల్లింపులు.
  5. నగదు డిపాజిట్లు, విత్‌డ్రాలకు ఛార్జీలు లేవు.
  6. నెలకు ఒక ఉచిత భౌతిక ఖాతా స్టేట్‌మెంట్.
  7. ఖాతా మూసి వేసుకుంటే చార్జీలు లేవు.
  8. క్యూఆర్ కార్డు జారీకి ఎలాంటి రుసుములు లేవు.

ప్రత్యేకంగా స్వయం సహాయక సంఘాల కోసం ఐపీపీబీ రూపొందించిన ఈ ఎస్‌హెచ్‌జీ పొదుపు ఖాతా... సమ్మిళిత వృద్ధి, సుస్థిర జీవనోపాధి అన్న జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా సరళమైనఅందుబాటులో ఉండే, ఉచిత బ్యాంకింగ్ సదుపాయాన్ని వారికి అందిస్తుంది.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు గురించి:

కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ ఆధ్వర్యంలో 100 శాతం భారత ప్రభుత్వ యాజమాన్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకును నెలకొల్పారు. 2018 ఈ బ్యాంకును సెప్టెంబరు 1న ఈ బ్యాంకు ప్రారంభమైంది. సామాన్య భారతీయుడికి అత్యంత చేరువగా ఉండేలా, తక్కువ ఖర్చుతో కూడిన నమ్మకమైన బ్యాంకుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. దాదాపు 1,65,000 పోస్టాఫీసులు (వీటిలో 1,40,000 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి), మూడు లక్షల మంది తపాలా సిబ్బందితో కూడిన విస్తృత వ్యవస్థను ఉపయోగించుకుంటూ బ్యాంకింగ్ సేవలు లేని వారు, పూర్తిస్థాయిలో బ్యాంకింగ్ సేవలను పొందలేని వారితో పాటు క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా నిలవడం ఐపీపీబీ ప్రధాన కర్తవ్యం.

ఇండియా స్టాక్ అనే కీలక ప్రాతిపదికలు ఐపీపీబీ విస్తృతి, కార్యాచరణకు మూలం. స్మార్ట్‌ఫోన్, బయోమెట్రిక్ పరికరాలను సీబీఎస్‌తో అనుసంధానించడం ద్వారా భౌతికంగా పత్రాలు అవసరం లేకుండా, నగదుతో పనిలేని, బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సులభంగా, సురక్షితంగా వినియోగదారుల ఇంటి వద్దకే బ్యాంకు సేవలను ఐపీపీబీ చేరుస్తోంది. తక్కువ ఖర్చుతో కూడిన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ, సామాన్యులకు బ్యాంకింగ్‌ను సులభతరం చేయడమే లక్ష్యంగా 13 భాషల్లో అందుబాటులో ఉన్న సులభగ్రాహ్యమైన ఇంటర్‌ఫేస్ ద్వారా దేశంలోని 5.57 లక్షల గ్రామాలు, పట్టణాల్లోని 13 కోట్లకు పైగా వినియోగదారులకు ఐపీపీబీ చేరువైంది.

నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంతోపాటు డిజిటల్ ఇండియా లక్ష్య సాధనలో భాగస్వామి కావడానికి ఐపీపీబీ కట్టుబడి ఉంది. ఆర్థిక భద్రత, సాధికారతలను పొందేందుకు ప్రతి పౌరుడికీ సమాన అవకాశం లభించినప్పుడే భారత్ సుసంపన్నమవుతుంది. ‘ప్రతి వినియోగదారుడు ముఖ్యమే. ప్రతి లావాదేవీ కీలకమే. ప్రతి డిపాజిట్ విలువైనదే’ అన్న మా విధానానికి మేమెప్పుడూ కట్టుబడి ఉంటాం.

 

సంప్రదించండి:

Email: marketing@ippbonline.in

Website: www.ippbonline.bank.in

 

సోషల్ మీడియా హాండిళ్లు:

Twitter - https://twitter.com/IPPBOnline

Instagram - https://www.instagram.com/ippbonline

LinkedIn - https://www.linkedin.com/company/india-post-paymentsbank

Facebook - https://www.facebook.com/ippbonline

YouTube- https://www.youtube.com/@IndiaPostPaymentsBank 

***


(రిలీజ్ ఐడి: 2257010) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati , Kannada