మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
థాయిలాండ్‌లో అయిదో ‘ప్రపంచ చిన్న తరహా మత్స్య పరిశ్రమల సదస్సు’
ద్వైపాక్షిక చర్చలకు హాజరైన కేంద్ర మత్స్యశాఖ కార్యదర్శి
చిన్న తరహా మత్స్య పరిశ్రమల్లో సమ్మిళిత, వ్యవస్థాగత నిర్వహణపై భారత్ ప్రత్యేక దృష్టి
प्रविष्टि तिथि:
27 APR 2026 6:10PM by PIB Hyderabad
ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో), టీడీటీఐ గ్లోబల్ ఆధ్వర్యంలో థాయిలాండ్‌లోని హువా హిన్‌లో 2026 ఏప్రిల్ 27 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న అయిదో ‘ప్రపంచ చిన్న తరహా మత్స్య పారిశ్రామిక సదస్సు’లో పాల్గొంటున్న ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి.. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మత్స్య విభాగం కార్యదర్శి డాక్టర్ అభిలాక్ష లిఖి నేతృత్వం వహిస్తున్నారు. ‘న్యాయబద్ధమైన సామరస్యం, యువతకు భవిష్యత్ అవకాశాలు, పునరుత్పాదక విజ్ఞానాన్ని పెంపొందించడంలో చిన్నతరహా మత్స్య పరిశ్రమల పాత్ర’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం.. తీర, సముద్ర ప్రాంతాల్లో న్యాయాన్ని, వివాద పరిష్కారాన్ని ప్రోత్సహించడం, మత్స్య - సముద్ర సంరక్షణలో యువతను సశక్తులను చేయడం, సంప్రదాయ విజ్ఞానంలో బలమైన మూలాలున్న పునరుత్పాదక, వాతావరణ హిత పద్ధతులను ప్రోత్సహించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. దాదాపు 50 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 45 సాంకేతిక సదస్సులు కూడా ఇందులో ఉంటాయి.
2026 ఏప్రిల్ 27న అయిదో ప్రపంచ చిన్న తరహా మత్స పరిశ్రమల కాంగ్రెస్‌లో ప్రసంగిస్తూ.. సామాజిక - ఆర్థిక అభివృద్ధి, ఆహార - పోషకాహార భద్రత, పర్యావరణ సుస్థిరతలో చిన్న తరహా మత్స్య పరిశ్రమలు, ఆక్వాకల్చర్ పాత్రను డాక్టర్ అభిలాక్ష లిఖి వివరించారు. 19.7 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి ఉత్పత్తితో ప్రపంచంలో రెండో అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా భారత్ నిలిచిందని ఆయన తెలిపారు. ఆధునికీకరణ, ఆవిష్కరణలు, నిరంతర పెట్టుబడుల కారణంగా సముద్ర ఆహార ఎగుమతుల్లో బలమైన వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. సుస్థిర - పారదర్శకమైన మత్స్య పరిశ్రమలు, డిజిటల్ పరివర్తన, సామాజిక ప్రాతిపదికన విధానాలపై భారత్ నిబద్ధతను ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రస్తుతం భారత్ అధ్యక్షత వహిస్తున్న ‘బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ ఇంటర్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ (బీవోబీపీ-ఐజీవో)’ ద్వారా ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకతనూ ఆయన వివరించారు.

చిన్న తరహా మత్స్య పరిశ్రమల జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్‌పీవోఏ-ఎస్ఎస్ఎఫ్)పై ఎఫ్ఏవో నిర్వహించిన చర్చా వేదికలో ప్యానెలిస్టుగా కూడా ఆయన పాల్గొన్నారు. సుస్థిరమైన, సమగ్రమైన చిన్న తరహా మత్స్య పరిశ్రమల కోసం విధానపరమైన వ్యవస్థల బలోపేతంపై తన అభిప్రాయాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. ముఖ్యంగా బంగాళాఖాత ప్రాంతంలో ఆహార భద్రత, జీవనోపాధి, సాంస్కృతిక అస్తిత్వం, తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థలకు చిన్న తరహా మత్స్య పరిశ్రమలే ప్రధాన కేంద్రమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిశ్రమలోని వైవిధ్యాన్ని, స్థానిక పరిస్థితులను గుర్తిస్తూ.. అన్ని దశల్లోనూ అట్టడుగు వర్గాలకు చోటు కల్పించేలా పాలన వ్యవస్థలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. చిన్న తరహా మత్స్య పరిశ్రమల జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్‌పీవోఏ-ఎస్ఎస్ఎఫ్) రూపకల్పన దిశగా బీవోబీపీ - ఐజీవో సభ్య దేశాల సమష్టి కృషిని ఆయన ప్రస్తావించారు. సమ్మిళిత, సామాజిక ప్రాతిపదిక గల, వ్యవస్థాగత విధానాల ప్రాధాన్యాన్ని వివరించారు. సంస్థలను బలోపేతం చేయడం, మత్స్య రంగ నిర్వహణలో సుస్థిరత కోసం క్రమమైన, భాగస్వామ్య విధాన ప్రక్రియలు అవసరమని పిలుపునిచ్చారు.
చిన్న తరహా మత్స్య పరిశ్రమలు, సంబంధిత సంస్థల సంస్థాగత, సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడంపైనే చిన్న తరహా మత్స్య పరిశ్రమల జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్‌పీవోఏ-ఎస్ఎస్ఎఫ్) ప్రభావవంతమైన అమలు ఆధారపడి ఉంటుందని చర్చలో నిపుణులు అభిప్రాయపడ్డారు. తద్వారా సమ్మిళిత, వికేంద్రీకృత సంప్రదింపులకూ, ఆర్థిక వనరులు, మౌలిక సదుపాయాల లభ్యతను మెరుగుపరిచేందుకూ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిపాలన వ్యవస్థలతో ఈ కార్యాచరణ ప్రణాళికను ఏకీకృతం చేయడం, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని ప్రోత్సహించడం, జాతీయ పథకాలను ఉపయోగించుకుంటూ ఎస్ఎస్ఎఫ్ భాగస్వాముల అర్థవంతమైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంపైనా ప్రత్యేకంగా చర్చించారు. చిన్న తరహా మత్స్యకారుల గళాన్ని బలంగా వినిపించేందుకూ, అలాగే మత్స్యరంగ నిర్వహణలో భాగస్వామ్యాన్ని, సమానతను, సుస్థిరతను ముందుకు తీసుకెళ్లడానికీ ఈ ప్రక్రియ ఒక కీలకమైన వేదికగా ఉపయోగపడుతుందని గుర్తించారు.


ప్రపంచ మత్స్య సంపద సేకరణలో చిన్న తరహా మత్స్య పరిశ్రమలు వెన్నెముక వంటివి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత్స్యకారుల్లో దాదాపు 90 శాతం మందికి ఇవే ఉపాధిని కల్పిస్తున్నాయి. సముద్ర, అంతర్గత చేపల ఉత్పత్తిలో వీటి వాటా దాదాపు 40 శాతం. అలాగే ఆహార భద్రత, పోషకాహారం, పేదరిక నిర్మూలన, లింగ సమానత్వాన్ని పెంపొందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా చేపల వేట అనంతర కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. చిన్నతరహా మత్స్య పరిశ్రమల కార్మికులు, వినియోగదారుల్లో అత్యధిక వాటా కలిగిన ఆసియాలో.. మత్స్య పరిశ్రమ ప్రధానంగా వివిధ జాతులు, వివిధ పరికరాలతోపాటు కుటుంబ ఆధారిత స్వభావం గలది. ఇది లక్షలాది మంది జీవనోపాధికి ఆధారం. అదే సమయంలో ఈ రంగం ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అభద్రత, గణాంకాల్లో పరిమితులు, తీరప్రాంతాల్లో రద్దీ పెరగడం, వనరుల క్షీణత, పారిశ్రామిక చేపల వేటతో ఘర్షణలు, వాతావరణ మార్పులతో ముప్పులు ఈ పరిశ్రమను వేధిస్తున్నాయి. కేవలం ఉత్పత్తిపరంగానే కాకుండా, చిన్న తరహా మత్స్య పరిశ్రమల ప్రాధాన్యాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించింది. ఎఫ్ఏవో రూపొందించిన ‘సుస్థిర చిన్న తరహా మత్స్య పరిశ్రమల రక్షణ కోసం స్వచ్ఛంద మార్గదర్శకాలు (వీజీఎస్ఎస్ఎఫ్)’, ఎఫ్ఏవో-ఏపీఎఫ్ఐసీ, బీవోబీపీ-ఐజీవో వంటి ప్రాంతీయ సహకార వేదికలు ప్రధానంగా సుస్థిర నిర్వహణ, వృత్తిపరమైన హక్కులు, సామాజిక భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి.
దేశంలో సముద్ర మత్స్య కార్యకలాపాల్లో చిన్న తరహా మత్స్య పరిశ్రమదే ఆధిపత్యం. దాదాపు 4 మిలియన్ల సముద్ర మత్స్యకారులు ప్రధానంగా 12 నాటికల్ మైళ్ల వరకు ఉన్న ప్రాదేశిక జలాల్లో కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర సముద్ర మత్స్య నియంత్రణ చట్టాలు ఈ రంగాన్ని నిర్వహిస్తాయి. తీరానికి సమీపంలో చేపలు పట్టే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం, వాతావరణ సంబంధిత నష్టాలు, మార్కెట్ అస్థిరత వంటి సవాళ్లను ఇది ఎదుర్కొంటోంది. సుస్థిరతను, మత్స్యకారుల జీవనోపాధిని పెంపొందించడం లక్ష్యంగా.. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై), ఈఈజెడ్ నియమాలు- 2025 ద్వారా పలు చర్యలను ప్రభుత్వం చేపట్టింది. మత్స్య సహకార సంఘాలు, చేపల పెంపకందారులు - ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్ఎఫ్పీవోలు) ద్వారా సంస్థలను బలోపేతం చేయడంపై దేశంలో ఇటీవలి విధానపరమైన చర్యలు ప్రధానంగా దృష్టి సారించాయి.
నేపథ్యం
భారతదేశం- ప్రపంచంలో రెండో అతిపెద్ద చేపల ఉత్పత్తిదారు. ప్రపంచవ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో భారత్ వాటా 8 శాతం ఉండగా.. జలసేద్య ఉత్పత్తుల్లో రెండో స్థానంలో ఉంది. అలాగే రొయ్యల ఉత్పత్తి, ఎగుమతిలో అగ్రగామిగా ఉంది. మత్స్య సంపదలో రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది.
దేశంలో మత్స్య, ఆక్వాకల్చర్ రంగం సమగ్రాభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో వరుసగా పలు విప్లవాత్మక కార్యక్రమాలను భారత ప్రభుత్వం ప్రారంభించింది. కొన్నేళ్లుగా ఈ రంగానికి కేటాయించిన కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల్లో విశేషమైన పెరుగుదలను గమనించవచ్చు. 2015లో ఈ ప్రయత్నాలు మొదలైనప్పటి నుంచి నీలి విప్లవం, మత్స్య - జలసేద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఎఫ్ఐడీఎఫ్), ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎస్ఎస్‌వై), ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన (పీఎంఎంకేఎస్ఎస్వై) వంటి వివిధ పథకాల కింద మొత్తం రూ.39,272 కోట్ల భారీ పెట్టుబడులు ఆమోదం లేదా ప్రకటనలు జరిగాయి.
ఎఫ్ఏవో రూపొందించిన సుస్థిర చిన్న తరహా మత్స్య పరిశ్రమల రక్షణ కోసం స్వచ్ఛంద మార్గదర్శకాలు (వీజీఎస్ఎస్ఎఫ్) 2014లో ఆమోదం పొందాయి. చిన్న తరహా మత్స్య పరిశ్రమ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రపంచంలో మొదటి, మానవ హక్కులు ప్రాతిపదికగా ఉన్న వ్యవస్థను ఇది అందిస్తుంది. చేపల వేట నుంచి వాణిజ్యం వరకు ప్రతి దశ దీని పరిధిలోకి వస్తుంది. ఆహార భద్రత, వృత్తిపరమైన హక్కుల రక్షణ, లింగ సమానత్వం, వ్యవస్థాగత ఆధారంగా నిర్వహణ, విపత్తు ముప్పును తగ్గించడం, వాతావరణ మార్పులను తట్టుకోవడం వంటి అంశాలకు ఈ మార్గదర్శకాలు ప్రత్యేక ప్రాధాన్యమిస్తాయి. హిందూ మహాసముద్ర తీరప్రాంత మత్స్య పరిశ్రమలో చిన్న తరహా మత్స్య పరిశ్రమ ఆధిపత్యం ఉన్నప్పటికీ.. ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో, ఇండియన్ ఓషన్ ట్యూనా కమిషన్ సహా ప్రాంతీయ మత్స్య పరిశ్రమ నిర్వహణ సంస్థల్లో వీరికి తగిన ప్రాతినిధ్యం లభించడం లేదు.
డబ్ల్యూటీవో మత్స్య పరిశ్రమల ముసాయిదా పరిధిలో.. జీవనోపాధిపై ఆధారపడిన చిన్న తరహా మత్స్య పరిశ్రమల రక్షణ ఆవశ్యకతను బహుపాక్షిక వేదికలపై భారత్ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తోంది. అదే సమయంలో ఐయూయూ వేట, చేపల నిల్వలు అంతరించిపోయేలా చేసే అతి వేటను అరికట్టే నిబంధనలకు మద్దతిస్తూనే.. అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రత్యేక, వైవిధ్య హోదా కలిగినవిగా గుర్తించాలని భారత్ బలంగా వాదిస్తోంది. దేశీయంగా, ఈఈజెడ్ నిబంధనలు – 2025 చిన్న తరహా మత్స్యకారులకు, మత్స్యకార సంఘాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందులో భాగంగా సంప్రదాయ పడవలకు ప్రవేశ అనుమతి పత్రాల అవసరం నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే సముద్ర సంపదను దెబ్బతీసే చేపల వేట పద్ధతులను నిషేధిస్తూ, మత్స్య నిర్వహణ ప్రణాళికలను ప్రోత్సహిస్తున్నారు. తీరప్రాంత వనరులపై ఒత్తిడిని తగ్గించడం కోసం మత్స్యకార సహకార సంఘాలను, ఉత్పత్తిదారు సంస్థలను బలోపేతం చేస్తున్నారు. అనధికారిక చేపల వేట (ఐయూయూ ఫిషింగ్) నిరోధానికి కఠిన నిబంధనలతోపాటు సమాజ భాగస్వామ్య చర్యలను చేపట్టారు. వీటితోపాటు.. చిన్నతరహా మత్స్య పరిశ్రమలను ఆక్వాకల్చర్, మరీకల్చర్, సముద్ర శైవలాల సాగుతో అనుసంధానిస్తున్నారు. బాధ్యతాయుతమైన చేపల వేటలో ఎఫ్ఏవో నియమావళి కట్టుబాట్లను, ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఈ చర్యలు ముందుకు తీసుకెళ్తున్నాయి.
***
(रिलीज़ आईडी: 2256783)
आगंतुक पटल : 38