వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్-కెన్యా ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడానికి నైరోబీలో రెండు దేశాల సంయుక్త వాణిజ్య సంఘం పదో సమావేశ నిర్వహణ
కెన్యా కీలక వాణిజ్య భాగస్వామిగా భారత్... 4.31 బిలియన్ అమెరికా డాలర్లకు పెరిగిన వాణిజ్యం
నాడు పోస్టు చేయడమైనది:
29 APR 2026 12:46PM by PIB Hyderabad
భారత్, కెన్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, ఆర్థిక సహకారాన్ని సమీక్షించి బలోపేతం చేయడానికి భారత్-కెన్యా సంయుక్త వాణిజ్య సంఘం (జేటీసీ) పదో సమావేశాన్ని కెన్యా లోని నైరబీలో 2026 ఏప్రిల్ 27, 28 తేదీల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వాణిజ్య విభాగంలో వాణిజ్య కార్యదర్శి శ్రీ రాజేశ్ అగ్రవాల్‌తో పాటు కెన్యా వాణిజ్య విభాగ ప్రిన్సిపల్ సెక్రటరీ రెజినా అకోతా ఓమ్బమ్ సహాధ్యక్షత వహించారు.
ద్వైపాక్షిక వాణిజ్యంలో నిలకడగా వృద్ధి చోటుచేసుకోవడాన్ని ఉభయ పక్షాలూ ప్రస్తావించాయి. కెన్యా ప్రధాన వాణిజ్య భాగస్వాముల్లో ఒక భాగస్వామిగా భారత్ నిలిచింది. భారత్, కెన్యా మధ్య మొత్తం వాణిజ్యం విలువ 2025-26లో 4.31 బిలియన్ అమెరికా డాలర్లుగా ఉంది. ఇది 2024-25లో నమోదైన 3.45 బిలియన్ అమెరికా డాలర్లతో పోలిస్తే 24.91 శాతం ఎక్కువ. వాణిజ్యాన్ని విస్తరించడం, మార్కెట్ల లభ్యతకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడంతో పాటు ఇంజినీరింగ్ వస్తువులు, ఫార్మస్యూటికల్స్, వ్యవసాయ, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో పరస్పర పూరకత్వానికి ఉన్న అవకాశాల్ని సద్వినియోగపరుచుకోవడంపై చర్చించారు.
ప్రమాణీకరణ, అనుకూలతా సంబంధిత మూల్యాంకనంలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్), కెన్యా ప్రమాణాల బ్యూరో (కేఈబీఎస్)కు మధ్య అవగాహన ఒప్పందం (ఎమ్ఓయూ) సహా ప్రస్తుతం అమలు చేస్తున్న వాణిజ్య సౌలభ్య కార్యక్రమాల్లో పురోగతిని సంఘం సమీక్షించింది. ప్రవేశాని కన్నా ముందుగానే కస్టమ్స్ సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి సంబంధించి పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర మండలి (సీబీఐసీ), కెన్యా రెవిన్యూ ప్రాధికార సంస్థ (కేఆర్ఏ) మధ్య ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు పూర్తి అయ్యాయి. దీనిలో కస్టమ్స్ ప్రక్రియలను సువ్యవస్థీకరించేందుకు, వాణిజ్య సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రాధాన్యతనిచ్చారు.
వాణిజ్యం, పెట్టుబడి, పరిశ్రమ సహకారం.. వీటిని ప్రోత్సహించేందుకు భారతీయ పరిశ్రమ సమాఖ్య (సీఐఐ), భారత్ కెన్యా వాణిజ్య, పరిశ్రమ మండలి మధ్య మరో అవగాహన ఒప్పందం పైన సంతకాలయ్యాయి.
స్థానిక కరెన్సీలలోనే వాణిజ్య పరిష్కారాన్ని ప్రోత్సహించేందుకు గల అవకాశాలను ఇరు పక్షాలు గుర్తించాయి. భారతీయ బ్యాంకులతో కెన్యా బ్యాంకులు కలసి స్పెషల్ రుపీ వోస్త్రో ఖాతాలను (ఎస్ఆర్‌వీఏస్) తెరిచాయని, ఈ వ్యవస్థను ఎక్కువగా ఉపయోగించుకోవడం ద్వైపాక్షిక లావాదేవీల మార్గాన్ని సుగమం చేయగలదని గుర్తించారు. స్థానిక కరెన్సీ పరిష్కార (ఎల్‌సీఎస్) యంత్రాంగాన్ని అనుసరించేందుకు అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయో కూడా చర్చించారు.
కొత్తగా ఉనికిలోకి వస్తున్న రంగాల్లో రంగం వారీ సహకారం అంశంపైనా చర్చోపచర్చలు జరిపారు. ఇంజినీరింగ్- తయారీ రంగంలో, ఆటోమొబైల్స్, యంత్రాలు, నిర్మాణ సామగ్రి రంగాల్లో ఎగుమతులను విస్తరించుకొనేందుకు గల అవకాశాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. దీంతో పాటు ఆటోఎక్స్‌పో కెన్యా, ది బిగ్ 5 కన్‌స్ట్రక్ట్ కెన్యా వంటి ప్రదర్శనల్లో భాగస్వామ్యం పంచుకునే అంశాన్ని కూడా చర్చించారు. రైల్వేలు సహా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సహకారంపై చర్చించారు. దీనిలో భాగంగా కెన్యా స్టాండర్డ్ గేజ్ రైల్వేకు రైలు పెట్టెలు, ఇంజను వగైరా సరఫరా చేయడం, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, సాధ్యాసాధ్యాల అధ్యయనాల నిర్వహణ వంటి సేవలను అందిస్తామని భారత్ ప్రతిపాదించింది. భారతీయ షిప్‌యార్డులతో కలసి నౌకానిర్మాణంలో సహకారానికి గల అవకాశాల్ని కూడా పరిశీలించారు.
ఔషధ నిర్మాణ రంగంలో, తక్కువ ఖర్చులో జెనరిక్ మందులు, వైద్య పరికరాల సరఫరాదారుగా తాను పోషిస్తున్న పాత్రను భారత్ వివరించింది. బిజినెస్-టు-బిజినెస్ అనుబంధాన్ని పెంచుకొందామని ప్రతిపాదించింది. ఉభయ పక్షాలూ ఆరోగ్య రక్షణ, ఓషధి మొక్కల సంబంధిత సమస్యలను పరిష్కరించుకుంటూ వ్యవసాయ ఉత్పాదనల వాణిజ్యాన్ని పెంచుకోవడంపై కూడా చర్చించాయి.
పునరుత్పాదక ఇంధన రంగంలో, సౌర విద్యుత్తు ప్రాజెక్టులు పవన విద్యుత్తు ప్రాజెక్టులు సహా కెన్యాలో స్వచ్ఛ ఇంధన కార్యక్రమాలకు మద్దతివ్వడానికి సిద్ధమని భారత్ తెలిపింది. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ)లో చేరాలని నిర్ణయించుకున్నట్లు కెన్యా వెల్లడించింది. ఈ ఒప్పందంపై వీలయినంత త్వరగా సంతకాలు చేయాలని వేచి ఉన్నామంది. ప్రజలకు డిజిటల్ మాధ్యమం ద్వారా ఆర్థిక తదితర సేవలను అందించడానికి అనువైన మౌలిక సదుపాయాల కల్పన కూడా చర్చల్లో చోటు చేసుకుంది. యూపీఐ వంటి చెల్లింపు వ్యవస్థలు, భారత్ కనెక్ట్, ఆర్థిక సేవల్ని మరింత మందికి చేరువ చేసే సాధనాల విషయంలో సహకరించుకోవడం కూడా ప్రస్తావనకు వచ్చింది.
సామర్థ్యాలను పెంచే ప్రక్రియను పరస్పర సహకారానికి ఒక ముఖ్య రంగంగా గుర్తించారు. గనుల తవ్వకం, భూ విజ్ఞానశాస్త్రాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి అనేక రంగాల్లో ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఐటీఈసీ) కార్యక్రమం వంటి వాటిలో శిక్షణను ఇవ్వగలమని భారత్ ముందుకు వచ్చింది. ఉన్నత విద్య, డిజిటల్ మాధ్యమ శిక్షణ వేదికలు, నైపుణ్యాభివృద్ధిలో సహకారాన్ని గురించి చర్చించారు. ‘‘స్టడీ ఇన్ ఇండియా’’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల రాక పోకలను పెంపొందించుకొనే అంశంపైనా మాట్లాడుకున్నారు.
వైవిధ్యభరిత, సమతౌల్యత సహిత, భావికాల అవసరాలు ప్రధానంగా ఉండే ఆర్థిక భాగస్వామ్యానికి కట్టుబడి ఉంటామని ఇరు పక్షాలూ పునరుద్ఘాటించాయి. వాణిజ్యాన్ని సులభతరంగా తీర్చిదిద్దడానికి, పరిష్కారం కాకుండా మిగిలిపోయిన అంశాలను ఓ కొలిక్కి తీసుకురావడానికి, బిజినెస్-టు-బిజినెస్ అనుబంధాన్ని పెంపొందింప చేసుకోవడానికి సంస్థాగత వ్యవస్థల్ని పటిష్ఠపరచాలని అంగీకరించాయి.
సంయుక్త వాణిజ్య సంఘం (జేటీసీ) నేపథ్యంలో, భారత్-కెన్యా సంయుక్త వాణిజ్య వేదికను కూడా నిర్వహించారు. దీనిలో సీఐఐ, కెన్యా జాతీయ వాణిజ్య పరిశ్రమ జాతీయ మండలి (కేఎన్‌సీసీఐ)ల ప్రతినిధులు సహా భారత్, కెన్యా వాణిజ్య రంగ ప్రముఖులు పాలు పంచుకున్నారు.భారత ప్రభుత్వ వాణిజ్య కార్యదర్శి శ్రీ రాజేశ్ అగ్రవాల్, కెన్యా రిపబ్లిక్ వాణిజ్య ప్రిన్సిపల్ సెక్రటరీ రెజినా అకోతా ఓమ్బమ్ కీలకోపన్యాసాలనిచ్చారు. వారితో పాటు కేఎన్‌సీసీఐ చైర్మన్, ఇన్వెస్ట్‌కెన్యా ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేదిక తయారీ, వ్యవసాయం, ఫార్మాస్యూటికల్స్, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ సాంకేతికతలు, సేవల వంటి రంగాల్లో వాణిజ్యాన్ని, పెట్టుబడి సంబంధాల్ని విస్తరించుకొనేందుకు ఒక అవకాశాన్ని పారిశ్రామిక జగతికి చెందిన ప్రముఖులకు అందించింది.
దీనికి అదనంగా, భారత ప్రభుత్వ వాణిజ్య విభాగ కార్యదర్శి శ్రీ రాజేశ్ అగ్రవాల్ అధ్యక్షతన స్థానిక భారతీయ వాణిజ్య సమాజంతో కలసి ఒక ముఖాముఖిని భారత్-కెన్యా వాణిజ్య మండలి నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక భారతీయ వాణిజ్య సమాజం, వారి వెంట వచ్చిన సీఐఐ వాణిజ్య ప్రతినిధివర్గం పాలుపంచుకున్నాయి. కెన్యాతో వాణిజ్యాన్ని నిర్వహించడానికి సంబంధించిన అవకాశాలు, అనుభవాలపై ఈ సందర్భంగా దృష్టిని కేంద్రీకరించారు.

***
(రిలీజ్ ఐడి: 2256654)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5