ఉప రాష్ట్రపతి సచివాలయం
ఆలోచనలు, నాయకత్వ సంగమం ఆంధ్ర విశ్వవిద్యాలయం:
విశాఖపట్నంలో జరిగిన విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకల్లో ఉపరాష్ట్రపతి
ఆంధ్రప్రదేశ్ భారీ పెట్టుబడులు, ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతోంది: ఉపరాష్ట్రపతి
శాశ్వత రాజధానిగా ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్న అమరావతి: ఉపరాష్ట్రపతి
'వికసిత్ భారత్'కు 'వికసిత్ రాష్ట్రాలు' అవసరం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షను పునరుద్ఘాటించిన ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
27 APR 2026 7:15PM by PIB Hyderabad
విశాఖపట్నంలో ఈరోజు జరిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలకు ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ హాజరయ్యారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకల వంటి చారిత్రాత్మక సందర్భంలో భాగస్వామి కావడం తనకెంతో గర్వకారణమని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా అన్నారు. చరిత్రను కేవలం చూడటమే కాకుండా, ఆ చరిత్రను మలచడంలో కూడా ఈ విశ్వవిద్యాలయం సహాయపడిందని, ఇది శతాబ్ద కాలంగా అత్యుత్తమ ప్రమాణాలను కొనసాగిస్తోందని ఆయన పేర్కొన్నారు. గడిచిన వంద ఏళ్లలో ఈ విశ్వవిద్యాలయం ఆలోచనల సమ్మేళనంగా పనిచేసిందని, ఈ విశ్వవిద్యాలయం తరతరాలుగా తీర్చిదిద్దిన విద్యార్థులెందరో దేశ నిర్మాణంలో గణనీయమైన కృషి చేశారని ఆయన అన్నారు.
ఈ విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి, భారత అత్యంత విశిష్ట తాత్వికులు, రాజనీతిజ్ఞులలో ఒకరైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వారసత్వాన్ని గౌరవంతో గుర్తుచేసుకుంటూ, విద్య మేధస్సును వ్యక్తిత్వాన్ని రెండింటినీ పెంపొందించే సాధనమన్న ఆయన దార్శనికతను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. ఈ దార్శనికత నేటికీ ఎంతగానో ప్రాముఖ్యత కలిగి ఉందని ఆయన అన్నారు.
విశాఖపట్నంతో ప్రముఖుల అనుబంధాన్ని కూడా ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ నగరంలోనే ప్రాథమిక విద్యను అభ్యసించిన నోబెల్ బహుమతి గ్రహీత సి.వి. రామన్, ఈ విశ్వవిద్యాలయం విశిష్ట పూర్వ విద్యార్థి, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు వంటి వారిని ఆయన ప్రస్తావించారు. శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం, పద్మ విభూషణ్, పద్మశ్రీ, సాహిత్య అకాడమీ గౌరవాలు పొందిన ఎంతో మంది ప్రముఖులను ఆంధ్ర విశ్వవిద్యాలయం తీర్చిదిద్దిందని ఆయన పేర్కొన్నారు.
గతంలో తన విశాఖ పర్యటనను, ముఖ్యంగా 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సును గుర్తుచేసుకుంటూ, ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన వేగవంతమైన పురోగతి పట్ల ఉపరాష్ట్రపతి సంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రం తన అభివృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేసిందని, భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ, ఆవిష్కరణలు, అభివృద్ధికి కేంద్రంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సాంకేతిక పరిజ్ఞాన వ్యవస్థను ప్రోత్సహించడంలో ఐటి మంత్రి శ్రీ నారా లోకేష్ పోషిస్తున్న పాత్రను కూడా ఆయన అభినందించారు.
ఆంధ్రప్రదేశ్‌పై అంతర్జాతీయంగా పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రముఖంగా పేర్కొంటూ, గూగుల్ వంటి ప్రముఖ సాంకేతిక సంస్థల ఆసక్తిని, పెట్టుబడులను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు, ఐటి పెట్టుబడుల వంటి ప్రధాన ప్రాజెక్టులతో, ముఖ్యంగా డేటా సెంటర్లు, ఐటి, పర్యాటకం, ఎలక్ట్రానిక్స్, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాలలో విశాఖపట్నం ఒక కీలక వృద్ధి కేంద్రంగా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు.
పార్లమెంటులో సంబంధిత బిల్లు ఆమోదం పొందిన తర్వాత, అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా ప్రకటించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉపరాష్ట్రపతి అభినందించారు. ఆ బిల్లు ఆమోదం పొందే సమయంలో రాజ్యసభకు అధ్యక్షత వహించే అవకాశం తనకు లభించిందని, అప్పుడు ప్రజల ఆనందాన్ని, గర్వాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ నిర్ణయం ప్రజల సామూహిక ఆకాంక్షలకు ప్రతిబింబమని, ఇది రాష్ట్ర పరిపాలనా భవిష్యత్తుకు స్పష్టతను, స్థిరత్వాన్ని, దిశానిర్దేశాన్ని అందిస్తుందని ఆయన అభివర్ణించారు.
అభివృద్ధి చెందిన భారతదేశ సాధన లక్ష్యాన్ని గురించి ప్రస్తావిస్తూ, "వికసిత రాష్ట్రాల ద్వారానే వికసిత్ భారత్ సాధ్యమవుతుంది" అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్న మాటలను ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. దార్శనిక నాయకత్వం, బలమైన పాలన, సమర్థవంతమైన అమలుతో ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటిగా ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ప్రతిపాదించిన పెట్టుబడులలో 25 శాతానికి పైగా వాటాతో, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అగ్రగామి గమ్యస్థానంగా మారిందని ఆయన పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో అనుమతులు, పారదర్శకమైన పాలన, భూమి, విద్యుత్, అనుసంధానత, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని సులభంగా పొందడానికి వీలు కల్పించే పటిష్టమైన సింగిల్-విండో వ్యవస్థ వంటి రాష్ట్రంలోని పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
విజయం సాధించడానికి సమయం పడుతుందని పేర్కొంటూ, 'క్రికెట్ దేవుడు'గా ఎంతో ప్రేమతో పిలుచుకునే సచిన్ టెండూల్కర్ కూడా తన సెంచరీల సెంచరీని (వంద సెంచరీలను) సాధించడానికి వేచి చూడాల్సి వచ్చిందని ఉపరాష్ట్రపతి చెప్పారు. విజయం సాధించడంలో ఓపిక ఎంతో అవసరమని ఆయన అన్నారు.
ఒత్తిడిని తట్టుకోవడం నేర్చుకోవాలని ఆయన తెలిపారు. వైఫల్యాలు విలువైన పాఠాలను నేర్పుతాయని, వాటివల్ల నిరుత్సాహపరచకూడదని, జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ఒడిశా గవర్నర్ కె. హరిబాబు, జిఎంఆర్ గ్రూప్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ గ్రంధి మల్లికార్జున రావు, భారత ప్రభుత్వ మాజీ కేంద్ర హోం కార్యదర్శి కె. పద్మనాభయ్య, సైయంట్ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి, లారస్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు, సిఇఓ సత్యనారాయణ చావ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ మాజీ డైరెక్టర్ వి. ఎస్. రాజు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ మాజీ ప్రొఫెసర్ ఎంఆర్ మాధవ్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సిఇఓ విజయ్ జోషి, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లకు ఉపరాష్ట్రపతి 'విశిష్ట పూర్వ విద్యార్థుల పురస్కారాలను' ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి స్మారక నాణెం, స్మారక స్టాంపు, కాఫీ టేబుల్ బుక్‌ను కూడా విడుదల చేశారు. ఉపరాష్ట్రపతి సమక్షంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, అమెరికాలోని ఆక్స్‌మిక్ ల్యాబ్స్ ఇంక్., ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ ల మధ్య మూడు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయ చరిత్రను, దాని పరిణామక్రమాన్ని ప్రతిబింబించే ఫోటో ప్రదర్శనను ఆయన సందర్శించారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఛాన్సలర్ శ్రీ అబ్దుల్ నజీర్, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, దిగ్గజ క్రికెటర్ శ్రీ సచిన్ టెండూల్కర్, ఒడిశా గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి, కేంద్ర సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఐటీ, హెచ్ఆర్డి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఉపకులపతి ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ లతో పాటు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉపరాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ అంతకుముందు శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కూర్మనాథ స్వామి ఆలయాన్ని, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
***
(రిలీజ్ ఐడి: 2256164)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7