ఉప రాష్ట్రపతి సచివాలయం
విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉత్సవాలలో గౌరవ భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పాల్గొన్నారు
పెట్టుబడులు మరియు ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతుంది: ఉపరాష్ట్రపతి
శాశ్వత రాజధానిగా అమరావతి ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం: ఉపరాష్ట్రపతి
‘వికసిత భారత్ కోసం వికసిత రాష్ట్రాలు అవసరం’: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటలను ఉటంకించిన ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
27 APR 2026 7:15PM by PIB Vijayawada
విశాఖపట్నం
తేది: 27 ఏప్రిల్ 2026
భారత ఉపరాష్ట్రపతి సి.పి రాధాకృష్ణన్ విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించిన రాధాకృష్ణన్.. కేవలం చరిత్రను సాక్షిగా చూడటమే కాకుండా, చరిత్రను నిర్మించడంలోనూ కీలక పాత్ర పోషించిన ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. గత వందేళ్లుగా ఈ విశ్వవిద్యాలయం అద్భుతమైన ఆలోచనలకు వేదికై, దేశ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించి, ఎందరో విద్యార్థులను మేధావులుగా, నాయకులుగా తీర్చిదిద్దిందని కొనియాడారు.
ఈ విశ్వవిద్యాలయానికి పూర్వ ఉపకులపతిగా పనిచేసి, దేశం గర్వించదగ్గ గొప్ప తత్వవేత్త, రాజనీతిజ్ఞుడైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వారసత్వాన్ని ఉప రాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. విద్య అనేది కేవలం మేధస్సు మాత్రమే కాదని, వ్యక్తిత్వాన్ని పెంపొందించే సాధనం కావాలనే ఆయన దార్శనికత.. నేటికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు.
ఈ నగరం, ఈ విశ్వవిద్యాలయంతో అనుబంధం ఉన్న ప్రముఖల జీవితాలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి.. నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్ ప్రాథమిక విద్యను విశాఖలోనే అభ్యసించారని గుర్తు చేశారు. అలాగే.. మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు ఆంధ్ర విశ్వవిద్యాలయ విశిష్ట పూర్వ విద్యార్థి అన్న రాధాకృష్ణన్.. దేశంలోనే ఎంతో విశిష్టమైన శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీతలు, పద్మవిభూషణ్, పద్మశ్రీ, సాహిత్య అకాడమీ వంటి పురస్కారాలు అందుకున్న ప్రముఖులను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ దేశానికి అందించిందని ప్రశంసించారు.
గతేడాది తాను 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు కోసం విశాఖపట్నం వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న వేగవంతమైన పురోగతి పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా దూసుకుపోతోందని, భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తూ ఆవిష్కరణలకు, వృద్ధికి చిరునామాగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్ర సాంకేతిక వ్యవస్థను మెరుగుపరచడంలో ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ పోషిస్తున్న పాత్రను ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి ప్రసంసించారు.
ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నమ్మకాన్ని వివరిస్తూ.. గూగుల్ వంటి ప్రముఖ సాంకేతిక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చూపిస్తున్న ఆసక్తిని ప్రస్తావించారు. ముఖ్యంగా డేటా సెంటర్లు, ఐటీ, పర్యాటకం, ఎలక్ట్రానిక్స్ మరియు డిజిటల్ మౌలిక సదుపాయాల వంటి రంగాలలో విశాఖపట్నం ప్రధాన వృద్ధి కేంద్రంగా ఎదుగుతోందని, ఇక్కడ హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు వంటి భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రతిపాదిస్తూ పార్లమెంట్లో చట్టం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్.. ఆ సమయంలో తాను రాజ్యసభకు అధ్యక్షత వహించే అదృష్టం దక్కిందని తెలిపారు. బిల్లు ఆమోదం పొందే సమయంలో రాష్ట్ర ప్రజల ఆనందాన్ని, గర్వాన్ని తాను స్వయంగా చూశానని గుర్తు చేసుకున్నారు. శాశ్వత రాజధాని నిర్ణయం ప్రజల సామూహిక ఆకాంక్షలకు ప్రతిబింబమని, ఇది రాష్ట్ర పరిపాలనా భవిష్యత్తుకు స్పష్టతను, స్థిరత్వాన్ని మరియు దిశానిర్దేశాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపరాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు.
అభివృద్ధి చెందిన భారతదేశం గురించి ప్రస్తావిస్తూ.. "వికసిత రాష్ట్రాల ద్వారానే వికసిత భారత్ సాధ్యమవుతుంది" అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటలను ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. దూరదృష్టి గల నాయకత్వం, పటిష్టమైన పాలన, సమర్థవంతమైన అమలు కారణంగా ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటిగా ఎదిగిందని అన్నారు.
2025-26లో దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన పెట్టుబడుల్లో 25 శాతం కంటే ఎక్కువ వాటాను దక్కించుకుని ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు. నిర్ణీత సమయంలోగా అనుమతులు, పారదర్శక పాలన, భూమి, విద్యుత్, రవాణా సౌకర్యాలతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే పటిష్టమైన సింగిల్ విండో విధానం వంటి రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడిదారీ అనుకూల విధానాలను ఆయన అభినందించారు.
విజయం సాధించడానికి సమయం పడుతుందని పేర్కొంటూ.. అందరూ ఎంతో ఇష్టంగా పిలుచుకునే "క్రికెట్ దేవుడు" సచిన్ టెండూల్కర్ కూడా తన వందో సెంచరీ సాధించడానికి వేచి చూడాల్సి వచ్చిందని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు. విజయం సాధించడానికి సహనం చాలా అవసరమని ఈ సందర్భంగా చెప్పారు.
అంతర్గత ఒత్తిడిని నిర్వహించడం నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించిన రాధాకృష్ణన్.. అపజయాలు విలువైన పాఠాలను నేర్పుతాయని, వాటిని చూసి నిరుత్సాహపరచకూడదన్నారు. ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి పలువురు ప్రముఖులకు 'విశిష్ట పూర్వ విద్యార్థి' పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ అవార్డులు అందుకున్న వారిలో:
● శ్రీ ఎం. వెంకయ్య నాయుడు: భారత మాజీ ఉపరాష్ట్రపతి.
● శ్రీ కె. హరిబాబు: ఒడిశా గవర్నర్.
● శ్రీ గ్రంథి మల్లికార్జున రావు: జీఎంఆర్ గ్రూప్ వ్యవస్థాపకులు మరియు ఛైర్మన్.
● శ్రీ కె. పద్మనాభయ్య: భారత ప్రభుత్వ మాజీ కేంద్ర హోం కార్యదర్శి.
● శ్రీ బి. వి. ఆర్. మోహన్ రెడ్డి: సైయంట్ వ్యవస్థాపకులు మరియు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్.
● శ్రీ సత్యనారాయణ చావ: లారస్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు మరియు సీఈఓ.
● శ్రీ వి. ఎస్. రాజు: ఐఐటీ దిల్లీ మాజీ డైరెక్టర్.
● శ్రీ ఎమ్. ఆర్. మాధవ్: ఐఐటీ కాన్పూర్ మాజీ ప్రొఫెసర్.
● శ్రీ విజయ్ జోషి: ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI) సీఈఓ.
● శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్: ప్రముఖ సినీ దర్శకులు.
అదేవిధంగా, ఈ శతాబ్ది వేడుకల జ్ఞాపకార్థం ఒక ప్రత్యేక నాణెం, పోస్టల్ స్టాంపు, కాఫీ టేబుల్ బుక్‌ను ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. ఆయన సమక్షంలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం మూడు కీలక ఒప్పందాలను కుదుర్చుకుంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, ఆక్స్‌మిక్ ల్యాబ్స్ ఇంక్ మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM) సంస్థలతో ఈ అవగాహన ఒప్పందాలు జరిగాయి. అనంతరం, ఆంధ్ర విశ్వవిద్యాలయ చరిత్ర, పరిణామ క్రమాన్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శ్రీ అబ్దుల్ నజీర్, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, క్రికెట్ దిగ్గజం శ్రీ సచిన్ టెండూల్కర్, ఒడిశా గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి, కేంద్ర సహాయ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ, ఐటీ మరియు హెచ్‌ఆర్‌డి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్‌లతో పాటు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో పాల్గొనడానికి ముందు ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయం, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
*****
(రిలీజ్ ఐడి: 2256095)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8