గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వ్యర్థాల నుంచి బయోగ్యాస్‌... రోజుకు 500కి పైగా భోజనాలను అందిస్తోన్న గుజరాత్‌ విద్యా సంస్థ

నాడు పోస్టు చేయడమైనది: 27 APR 2026 1:34PM by PIB Hyderabad

స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 స్ఫూర్తితో గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని ఒక విద్యాసంస్థ సరికొత్త విప్లవానికి నాంది పలికింది. శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ ద్వారా ఇంధన స్వయం సమృద్ధిని, సుస్థిరతను ఎలా సాధించవచ్చో నిరూపించి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

 

అడాలజ్‌ సమీపంలోని వసుమతి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీమతి మానెక్‌బా వినయ్ విహార్ విద్యా సంస్థ.. వంట గ్యాస్ కోసం సంప్రదాయ ఎల్‌పీజీపై ఆధారపడటాన్ని పూర్తిగా నిలిపివేసింది. క్యాంపసు‌లోనే వెలువడే వ్యర్థాలను వినియోగించుకుంటూ బయో గ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేసి, దాని ద్వారా లభించే ఇంధనంతోనే ప్రతిరోజూ 500 మందికిపైగా భోజనం అందిస్తున్నారు. వసతి గృహంలో ఉంటున్న సుమారు 250 మంది విద్యార్థులకు రోజుకు రెండు పూటలా పౌష్టికాహారాన్ని ఈ బయో గ్యాస్ ద్వారానే వండుతున్నారు. అలాగే క్యాంపసు‌లోనే నివసిస్తున్న 15 మంది సిబ్బంది కుటుంబాలకు కూడా ఈ భోజనమే అందుతోంది.

 

ఈ క్యాంపస్‌లో రోజుకు 90 క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న రెండు బయో గ్యాసు ప్లాంట్లు పని చేస్తున్నాయి. ట్రస్టు ఆధ్వర్యంలోని గోశాలలో ఉన్న 222 ఆవుల నుంచి సేకరించిన పేడను ప్రధాన వనరుగా ఉపయోగిస్తున్నారు. దీనికి అదనంగా వంటగది వ్యర్థాలు, పొలాల్లో మిగిలిపోయిన వ్యవసాయ వ్యర్థాలను కూడా వినియోగిస్తున్నారు. ఈ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే బయోగ్యాస్‌తోనే సంస్థ మొత్తం వంట అవసరాలు తీరుతున్నాయి. దీని ద్వారా ఎల్‌పీజీ సిలిండర్ల అవసరం లేకుండా పోయింది.

 

‘‘గుజరాత్ ప్రభుత్వ సంస్థాగత బయోగ్యాస్ ప్లాంటు పథకం కింద మేం వంటగ్యాస్ విషయంలో స్వయం సమృద్ధి సాధించాం. ఆవుల నుంచి వచ్చే పేడ ప్లాంటుకు సరిపడా ముడి పదార్థాన్ని అందిస్తోంది. గ్యాసు ఉత్పత్తి తర్వాత మిగిలే వ్యర్థ ద్రావణాన్ని మా పొలాల్లో ఎరువుగా ఉపయోగిస్తున్నాం. ఈ ప్లాంటు లేకపోతే మాకు ప్రతి నెలా సుమారు 30 ఎల్‌పిజి సిలిండర్లు అవసరమయ్యేవి. ఇప్పుడు ఆ అవసరం లేకుండానే వంటలు జరుగుతున్నాయి’’ అని అధికారులు తెలిపారు.

 

సేంద్రియ వ్యర్థాలు గాలి తగలని స్థితిలో కుళ్ళిపోవడం ద్వారా ఉత్పత్తి అయ్యే బయో గ్యాస్.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత ఆచరణాత్మకమైన, పొదుపైన, పర్యావరణ హితమైన వంట ఇంధనం. దీని వల్ల కేవలం ఇంధనమే కాకుండా, నైట్రోజన్‌ అధికంగా ఉండే ఈ ఉప ఉత్పత్తి ద్రవ పదార్థం.. సమర్థవంతమైన సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. ఇది రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడమే కాకుండా, సాగు ఖర్చును తగ్గించి నేల సారాన్ని కాపాడుతుంది. ఇలా ఒక్క కార్యక్రమంతో అటు ఇంధనం, ఇటు ఎరువు అనే రెట్టింపు ప్రయోజనం లభిస్తోంది.

 

25 నుంచి 85 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల బయోగ్యాస్ ప్లాంట్ల కోసం గుజరాత్ ఇంధన అభివృద్ధి సంస్థ (జీఈడీఏ) ఆర్థిక సహాయం అందిస్తోంది. ముఖ్యంగా లాభాపేక్ష లేని సేవా సంస్థలకు 75 శాతం వరకు రాయితీ లభిస్తుండటంతో అనేక సంస్థలకు ఈ మార్పు ఆర్థికంగా ఎంతో సులభతరమైంది.

 

గత అయిదేళ్లలో గుజరాత్ వ్యాప్తంగా సుమారు 193 సంస్థగత బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఈ పద్ధతి ద్వారా కాలుష్య నివారణ, ఇంధన స్వయం సమృద్ధి, వ్యర్థాల నిర్వహణ, గోశాలలు, విద్యా సంస్థల నుంచి వెలువడే సేంద్రియ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వీర్యం చేస్తూ, సంపదగా మారుస్తోంది. ఈ విధంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులను పెంపొందించడంలో, స్థిరమైన అభివృద్ధిని సాధించడంలో గుజరాత్ రాష్ట్రం తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

 

స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 ఆశయాలకు అనుగుణంగా చేపట్టిన ఇటువంటి కార్యక్రమాలు, సుస్థిర అభివృద్ధి దిశగా నగరాలు, విద్యాసంస్థలు ఎలా అగ్రగామిగా నిలుస్తున్నాయో ప్రతిబింబిస్తున్నాయి. వ్యర్థాల నిర్వహణలో వినూత్నమైన, సర్క్యులర్ విధానాలను అవలంబించడం ద్వారా పర్యావరణంపై పడే ప్రభావాన్ని తగ్గించడమే కాకుండా, వ్యర్థాలను ఒక విలువైన వనరుగా ఎలా మార్చుకోవచ్చో ఇవి నిరూపిస్తున్నాయి. స్వచ్ఛమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం నుంచి సేంద్రియ పద్ధతులను ప్రోత్సహించడం వరకు, ప్రతి ప్రయత్నం  దేశ నగరాలకు ఒక ఆచరణాత్మక మార్గాన్ని చూపిస్తోంది. శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, సమాజ భాగస్వామ్యం, ముందుచూపుతో కూడిన ప్రభుత్వ విధానాలు కలిస్తే.. పర్యావరణహితమైన,పరిశుభ్రమైన, స్వయంసమృద్ధిని కలిగిన నగరాల నిర్మాణానికి ఇవి బాటలు వేస్తున్నాయి.

***


(రిలీజ్ ఐడి: 2255973) సందర్శకుల సూచీ సంఖ్య : : 22
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Gujarati