యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వికసిత్‌ భారత్‌ 2047 నిర్మాణంలో యువకులు కేవలం లబ్ధిదారులే మాత్రమే కాదు... భాగస్వాములు కావాలి: డాక్టర్‌ మన్సుఖ్‌ మాండవీయ


క్షేత్రస్థాయి చర్చల నుంచి జాతీయ స్థాయి చర్యల వరకు... విధాన రూపకల్పనలో యువత గళానికి ప్రాధాన్యత: శ్రీమతి రక్షా ఖడ్సే

దశలవారీ సంప్రదింపుల ద్వారా సాక్ష్యాధారిత, సమ్మిళిత నిర్ణయాలు సాధ్యం: డాక్టర్ పల్లవి జైన్ గోవిల్

శ్రీనగర్‌లో యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రుల చింతన్ శిబిరం ప్రారంభం.. వికసిత్‌ భారత్‌ @2047 ద్వారా యువత నేతృత్వంలోని అభివృద్ధిపై ప్రధాన దృష్టి

దేశ యువ శక్తిని సద్వినియోగం చేసుకోవడానికి సమ్మిళిత, భాగస్వామ్య పాలన అత్యంత కీలకం

నాడు పోస్టు చేయడమైనది: 24 APR 2026 7:40PM by PIB Hyderabad

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రుల మూడు రోజుల చింతన్ శిబిరం నేడు శ్రీనగర్‌లోని షేర్-ఈ-కాశ్మీర్ అంతర్జాతీయ కన్వెన్షన్ కేంద్రంలో (ఎస్‌కేఐసీసీ) ఘనంగా ప్రారంభమైంది. ఈ శిబిరానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, కేంద్ర సహాయ మంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే నేతృత్వం వహిస్తున్నారు.

 

సదస్సు మొదటి రోజును “సంవాద్ సే సమాధాన్” అనే ఇతివృత్తంతో నిర్వహించారు. ఇందులో ప్రధానంగా మై భారత్ వేదిక ద్వారా యువత భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడంపై చర్చించారు. ప్రభుత్వ విధానాలను అనుసంధానించడం, వివిధ సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, ఫలితాల ఆధారిత కార్యక్రమాల అమలుపై ఈ సందర్భంగా ప్రత్యేక దృష్టి సారించారు.

 

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ .. సమ్మిళిత, భాగస్వామ్య  ప్రాముఖ్యతను వివరించారు. ‘‘ప్రతి యువకుడి గళాన్ని నిర్ణయాధికార ప్రక్రియలో భాగం చేయడం ద్వారా.. పాలనలో వ్యక్తిగత భాగస్వామ్యాన్ని నిర్ధారించడమే ఈ చింతన్ శిబిరం ప్రధాన ఉద్దేశ్యం’’ అని స్పష్టం చేశారు.

 

దేశ జనాభా శక్తి గురించి ప్రస్తావిస్తూ  కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యువ శక్తి భారత్‌ సొంతం. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేసుకోవాలంటే, యువత తమకు ప్రయోజనం చేకూర్చే విధానాల రూపకల్పనలో చురుగ్గా పాల్గొనడం చాలా అవసరం’’ అని ఆయన పేర్కొన్నారు.

 

జాతీయ నిర్మాణంలో ఉమ్మడి భాగస్వామ్య ఆవశ్యకతను వివరిస్తూ... ‘‘యువతను కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా మాత్రమే చూడకూడదు. 2047 లక్ష్యాలను చేరుకోవడంలో వారిని సమాన భాగస్వాములుగా మార్చాలి’’ అని స్పష్టం చేశారు.

 

యువతను తీర్చిదిద్దే సంస్థాగత వ్యవస్థల గురించి ప్రస్తావిస్తూ... ‘‘క్షేత్రస్థాయి నుంచి వచ్చే వినూత్న ఆలోచనలను సరైన దిశలో మళ్ళించడానికి జిల్లా యువజన అధికారులు కీలక పాత్ర పోషించాలి. వీరి ద్వారానే యువతలోని నైపుణ్యాలను సరైన రీతిలో పెంపొందించడం సాధ్యమవుతుంది’’ అని వివరించారు.

 

అదేవిధంగా క్షేత్రస్థాయి వ్యవస్థల బలోపేతంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ‘‘యువత భాగస్వామ్యానికి పునాదిగా నిలిచే యువజన క్లబ్‌‌లను మరింత చైతన్యవంతం చేయాలి. మన క్షేత్రస్థాయి పనితీరు ఎంత బలంగా ఉంటే, యువత దేశాభివృద్ధిలో అంత గొప్పగా భాగస్వాములు కాగలరు’’ అని మంత్రి పునరుద్ఘాటించారు.

 

సమర్థవంతమైన విధాన రూపకల్పన గురించి కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ... ‘‘ఏదైనా పటిష్టమైన విధానాన్ని రూపొందించేటప్పుడు సంబంధిత భాగస్వాములందరితో సంప్రదింపులు జరపడం చాలా ముఖ్యం. క్షేత్రస్థాయి నుంచి వచ్చే సూచనలు, సలహాలు ఎక్కడా పక్కదారి పట్టకుండా, నేరుగా తుది ఫలితాల్లో ప్రతిబింబించేలా పారదర్శకతను పాటించాలి’’ అని చెప్పారు.

 

కేంద్ర సహాయ మంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే మాట్లాడుతూ... దేశ యువత కోసం ఆచరణాత్మక వ్యూహాలను రూపొందించడానికి ఈ చింతన్ శిబిరం ఒక గొప్ప వేదిక అని కొనియాడారు. ‘‘దేశంలోని యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి, వాటికి సరైన పరిష్కార మార్గాలను అన్వేషించడానికి ఈ సదస్సు అర్థవంతమైన చర్చలకు అవకాశం కల్పిస్తుంది’’ అని ఆమె పేర్కొన్నారు.

 

భాగస్వామ్య పాలన గురించి వివరిస్తూ..  “ప్రతి స్థాయిలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో యువత చురుగ్గా పాల్గొనడం తప్పనిసరి’’ అని అన్నారు.

 

క్షేత్రస్థాయి అభిప్రాయాల ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ ‘‘చర్చలు క్షేత్రస్థాయి నుంచి ప్రారంభమై జిల్లా యువజన అధికారుల ద్వారా జాతీయ స్థాయికి చేరాలి. అప్పుడే ప్రభుత్వ విధానాలు ప్రజల వాస్తవ అవసరాలను, ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి’’ అని చెప్పారు.

 

ఈ చింతన్ శిబిరం గతంలో జరిగిన చర్చల కొనసాగింపు అని కేంద్ర యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి డాక్టర్ పల్లవి జైన్ గోవిల్ పేర్కొన్నారు. ‘‘బెంగళూరులో ప్రారంభమైన సంప్రదింపుల ప్రక్రియను అనుసరిస్తూ ఒక క్రమ పద్ధతిలో ఈ సదస్సును నిర్వహిస్తున్నాం’’ అని తెలిపారు.

 

పాలనలో సమ్మిళితత్వం గురించి చెబుతూ... ‘‘ఈ తరహా సదస్సులు అన్ని స్థాయిల అధికారులకు తమ ఎదుట ఉన్న సవాళ్లను, వినూత్న ఆలోచనలను పంచుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయి’’ ఆమె అన్నారు.

 

‘‘ఇటువంటి నిర్మాణాత్మక చర్చలు సమాచారంతో కూడిన, సాక్ష్యాధారిత  నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడతాయి. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో యువతే కీలక పాత్ర పోషించనున్నారు’’ అని వివరించారు.

 

అంతకుముందు యువజన వ్యవహారాల అదనపు కార్యదర్శి శ్రీ నితేష్ కుమార్ మిశ్రా.. సదస్సులో పాల్గొన్నవారికి స్వాగతం పలికి శిబిరం లక్ష్యాలను వివరించారు.

 

సదస్సు మొదటి రోజున విధానపరమైన సమన్వయం, వ్యూహాత్మక ప్రాధాన్యతలు, లోపాల విశ్లేషణ, అమలు వ్యవస్థలపై దృష్టి సారిస్తూ 2026-27 వార్షిక కార్యాచరణ ప్రణాళికపై లోతైన సాంకేతిక చర్చలు జరిగాయి. ప్రజెంటేషన్ల ద్వారా యువజన క్లబ్బుల అభివృద్ధిలో ఉత్తమ పద్ధతులు, సుస్థిరత నమూనాలు, గత కార్యక్రమాల నుంచి నేర్చుకున్న పాఠాలను కూడా వివరించారు.

 

మై భారత్ వేదిక ద్వారా డిజిటల్ యువత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, క్షేత్రస్థాయి భాగస్వామ్యాన్ని పెంపొందించడం, నిధుల వినియోగం, కార్యక్రమాల సమన్వయంతో సహా మై భారత్- జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) మధ్య అనుసంధానాన్ని మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి.

 

కీలకమైన అంశాల విశ్లేషణతో మొదటి రోజు చర్చలు ముగిశాయి. తదుపరి సమావేశాల్లో నిర్దిష్ట అంశాలపై చర్చించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మరో రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ చింతన్ శిబిరం యువతకు సాధికారత కల్పించే పటిష్టమైన వ్యవస్థను నిర్మించడం ద్వారా వికసిత్ భారత్ @2047 లక్ష్యానికి బాటలు వేయనుంది.

***


(రిలీజ్ ఐడి: 2255534) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati