కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
దశాబ్ద కాలంలో భారత టెలికాం రంగ వృద్ధికి ప్రభుత్వ-పరిశ్రమల సమన్వయం దోహదపడిందని కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్రశేఖర్ ప్రసంసించారు
2025 ఆర్థిక ఏడాదిలో టెలికాం రంగ ఆదాయం రూ.3.72 లక్షల కోట్లకు చేరుకుంది. దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేయడంలో ఎఫ్.డి.ఐ, పీఎల్ఐ విజయమే కారణమన్న కేంద్ర సహాయ మంత్రి
ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ బ్రాడ్ బ్యాండ్ కార్యక్రమం కింద 2.6 లక్షల గ్రామ పంచాయతీలు అనుసంధానించనున్నాం: డాక్టర్ పెమ్మసాని
‘చక్షు’ నుంచి సంస్థాగత నిఘా వరకు: స్పామ్, ఆర్థిక మోసాల నుంచి పౌరులను రక్షించడానికి బహుళ అంచెల వ్యూహాన్ని సహాయ మంత్రి వివరించారు
భారత డిజిటల్ పరివర్తన: 6జీ, ఏఐ, క్వాంటం సాంకేతికలతో పనిచేసే భవిష్యత్త్ ను సహాయ మంత్రి డా.పెమ్మసాని వివరించారు
భారత్ 6జీ లక్ష్యానికి నాయకత్వం వహించేందుకు అంతర్జాతీయ ఆర్ అండ్ డీ ప్రమాణాల్ని అందుకోవాలని టెలికాం అపరేటర్లను కోరిన సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్.
నాడు పోస్టు చేయడమైనది:
24 APR 2026 1:33PM by PIB Vijayawada
కేంద్ర కమ్యూనికేషన్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు దిల్లీలో జరిగిన 'సీఓఏఐ డిజికామ్ సమ్మిట్ 2026' రెండో ఎడిషన్ను ప్రారంభించారు. ఈ సదస్సు “ఇండియాస్ టెక్ఏడ్: డిజిటల్ భవిష్యత్తును వేగవంతం చేయడం, తీర్చిదిద్దడం” అనే ఇతివృత్తంతో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం ఎంతో దూరం ప్రయాణించిందని, టెలికాం రంగంలో వచ్చిన మార్పులు విప్లవాత్మకమైనవని పేర్కొన్నారు. సాంకేతికత అనేది ఎప్పుడూ ఒకే చోట నిలిచిపోదని, 6జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు క్వాంటం వంటివి తదుపరి నూతన రంగానికి ప్రాతినిధ్యం వహిస్తాయని… ఇవి ఉత్సాహభరితంగా ఉండటంతో పాటు సవాళ్లతో కూడుకున్నవని అన్నారు. ప్రభుత్వం, పరిశ్రమలు రెండూ కలిసి పనిచేసినప్పుడే బలమైన టెలికాం రంగం నిర్మింతమవుతుందని చెబుతూ పరస్పర సహకార ప్రాధాన్యతను తెలియజేశారు.

డాక్టర్ పెమ్మసాని తన ప్రసంగంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం టెలికాం విధానంలోని దాదాపు ప్రతి ప్రధాన అంశాన్ని సమూలంగా ప్రక్షాళన చేసిందని అన్నారు. 140 ఏళ్ల తర్వాత భారత టెలికాం చట్టాన్ని మొదటిసారిగా పూర్తిస్థాయిలో తిరగరాస్తూ రూపొందించిన 'టెలికమ్యూనికేషన్స్ చట్టం-2023' స్పష్టమైన అనుమతుల వ్యవస్థను, బలమైన వినియోగదారుల రక్షణను, సరికొత్త సాంకేతికతలకు సంబంధించిన నిబంధనలను తెలియజేస్తోందని తెలిపారు. 2021 నాటి సంస్కరణల ప్యాకేజీ ద్వారా ఏజీఆర్ హేతుబద్ధీకరణ, పాత బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం, బ్యాంక్ గ్యారంటీల తొలగింపు, ఈక్విటీ మార్పిడికి అవకాశం కల్పించడం ద్వారా ఆర్థిక సుస్థిరతపై భరోసా ఇచ్చామని చెప్పారు. గతి శక్తి సంచార్ పోర్టల్ ద్వారా చేపట్టిన 'రైట్-ఆఫ్-వే' సంస్కరణలతో ఫీజులను క్రమబద్ధీకరించడమే కాకుండా, అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి సమయాన్ని గణనీయంగా తగ్గించామని వివరించారు. అలాగే నేషనల్ ఫ్రీక్వెన్సీ అలోకేషన్ ప్లాన్ 2025, స్పష్టమైన వేలం కాలక్రమం ద్వారా స్పెక్ట్రమ్ హేతుబద్ధీకరణను చేపట్టినట్లు వెల్లడించారు.
డాక్టర్ పెమ్మసాని తన ప్రసంగంలో మరికొన్ని కీలక విషయాలను ప్రస్తావించారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ బ్రాడ్బ్యాండ్ కార్యక్రమం అయిన 'భారత్ నెట్' ద్వారా, దేశవ్యాప్తంగా 2.6 లక్షలకు పైగా గ్రామ పంచాయతీలను అనుసంధానించడమే లక్ష్యమని వివరించారు. ఈ ప్రాజెక్టులో దీర్ఘకాలిక నిర్వహణ, సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. వీటితో పాటు ప్రజల రక్షణ కోసం సంచార్ సాథి, డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్, చక్షు, ఏఎస్టీఆర్ వంటి వ్యవస్థలను భారీ స్థాయిలో ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. భారత టెలికాం రంగ చరిత్రలోనే అత్యంత సమగ్రమైన విధానపరమైన మద్దతును ప్రభుత్వం అందిస్తోందని స్పష్టం చేశారు.
టెలికాం రంగంలో పరిశ్రమల కృషిని గుర్తిస్తూ, మంత్రి కొన్ని కీలక గణాంకాలను ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా దాదాపు 22 నెలల్లోనే 5.1 లక్షలకు పైగా బేస్ స్టేషన్లతో 5జీ రోల్అవుట్ పూర్తయిందని, 40 కోట్లకు పైగా చందాదారులు దీని పరిధిలోకి వచ్చారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో మొత్తం చందాదారుల సంఖ్య 122 కోట్లు దాటిందని, ప్రపంచంలోనే అత్యంత తక్కువ టారిఫ్లు, అత్యధిక డేటా వినియోగం కలిగిన దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచిందని పేర్కొన్నారు. 2025 ఆర్థిక ఏడాదిలో టెలికాం రంగం స్థూల ఆదాయం 10.7% వృద్ధితో రూ 3.72 లక్షల కోట్లకు చేరుకుందని వివరించారు. అలాగే, జూన్ 2025 నాటికి రూ 2.4 లక్షల కోట్లకు పైగా వచ్చిన ఎఫ్డిఐ వచ్చాయని, భారత టెలికాం రంగంపై విదేశీ పెట్టుబడిదారులకు ఉన్న బలమైన నమ్మకాన్ని తెలియజేస్తున్నాయన్నారు.

టెలికాం, నెట్వర్కింగ్ ఉత్పత్తుల కోసం ఉద్దేశించిన పీఎల్ఐ పథకం కింద రూ.12,195 కోట్ల కేటాయింపుతో సాధించిన పురోగతిని మంత్రి వివరించారు. ఈ పథకం కింద 42 కంపెనీలకు ఆమోదం లభించిందని, వీటి మొత్తం అమ్మకాలు రూ.65,000 కోట్లకు పైగా జరిగాయని, రూ. 12,000 కోట్లకు పైగా ఎగుమతులు జరిగినట్లు తెలిపారు. అలాగే.. టెలికాం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా రూ.542 కోట్ల విలువైన ప్రాజెక్టులతో స్వదేశీ పరిశోధనాభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందని తెలిపారు.
స్పామ్, డిజిటల్ మోసాలను అరికట్టేందుకు చేపట్టిన చర్యల గురించి కేంద్ర సహాయ మంత్రి డా.పెమ్మసాని వివరించారు. సంచార్ సాథీ, ఏఎస్టీఆర్ ద్వారా ఇప్పటి వరకు 88 లక్షలకు పైగా మోసపూరిత కనెక్షన్లను తొలగించినట్లు తెలిపారు. చక్షుకు మంచి స్పందన వస్తుుందని, డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ లో ఇప్పటికే 1,200కు పైగా సంస్థలు చేరాయని వివరించారు. ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్లు ద్వారా సుమారు రూ.2,300 కోట్ల మేర నష్టాన్ని నివారించగలిగామని, ఇటీవల టెలికాం శాఖ, సెబీ ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని తెలిపారు. రోజురోజుకు ముప్పులు మరింత సాంకేతికంగా మారుతునందున్న, కేవైసీని పటిష్టం చేయాలని, కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ను అమలు చేయాలని, స్పూఫ్డ్ అంతర్జాతీయ కాల్స్ను సమర్థవంతంగా అడ్డుకోవడంతో పాటు, నిఘా సమాచారాన్ని పంచుకోవాలని సూచించారు.
పరిశోధన, అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ.. 2025 ఆర్థిక ఏడాదిలో టెలికాం రంగం రూ.3.72 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించినప్పటికీ.. భారతీయ టెలికాం ఆపరేటర్లు తమ ఆదాయంలో కేవలం 1% కన్నా తక్కువే ఆర్ అండ్ డీ మీద ఖర్చు చేస్తున్నాయి. దీనికి భిన్నంగా అంతర్జాతీయంగా ప్రముఖ సంస్థలు తమ ఆదాయంలో దాదాపు 15–25% పరిశోధన, అభివృద్ధి కోసం కేటాయిస్తున్నాయని వెల్లడించారు. భారత్ 6జీ విజన్‌కు ఆర్ అండ్ డీ లో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు.
భారతదేశం ప్రస్తుతం ఒక కీలక దశలో ఉందని, మన దగ్గర సరైన ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాలు, నైపుణ్యం, విస్తారమైన అవకాశాలన్నీ సిద్ధంగా ఉన్నాయని అన్నారు. మనకు లభించిన ఈ గొప్ప అవకాశానికి తగ్గట్టుగానే మన లక్ష్యాలు కూడా ప్రతిష్టాత్మకంగా ఉండాలని పిలుపునిచ్చారు.
*****
(రిలీజ్ ఐడి: 2255306)
సందర్శకుల సూచీ సంఖ్య : : 22