రక్షణ మంత్రిత్వ శాఖ
జర్మనీతో వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం బలోపేతం... బెర్లిన్ లో రక్షణ మంత్రితో శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ద్వైపాక్షిక చర్చలు...
రక్షణ పరిశ్రమ సహకార ప్రణాళిక, యూఎన్ శాంతి పరిరక్షణ శిక్షణలో సహకారానికి భారత్-జర్మనీ మధ్య ఒప్పందం
ఉగ్రవాదాన్ని మినహాయింపులు, సమర్థనలు లేకుండా, నిస్సందేహంగా ఖండించాలి: శ్రీ రాజ్‌నాథ్ సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
22 APR 2026 6:08PM by PIB Hyderabad
జర్మనీ దేశంతో వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఏప్రిల్ 22, 2026న బెర్లిన్‌లో జర్మనీ రక్షణ మంత్రి శ్రీ బోరిస్ పిస్టోరియస్‌తో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇద్దరు మంత్రులు ద్వైపాక్షిక భద్రత, రక్షణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఇందులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగంలో రక్షణ పరికరాల ఉమ్మడి అభివృద్ధి, ఉత్పత్తికి సంబంధించిన ప్రాధాన్యతా అంశాలున్నాయి. వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలక సైనిక సహకారాన్ని మరింత పెంచేందుకు ఇరుదేశాలు నిబద్ధతను స్పష్టం చేశాయి.
ఈ సమావేశంలో రక్షణ పరిశ్రమ సహకార ప్రణాళిక, యూఎన్ శాంతి పరిరక్షణ శిక్షణలో సహకారానికి అమలు ఒప్పందంపై సంతకాలు చేసి, పరస్పరం మార్చుకున్నారు. జర్మనీ పర్యటనను అమితమైన స్నేహం, సమన్వయం, విశ్వాసానికి ప్రతీకగా రక్షణ మంత్రి అభివర్ణించారు. జర్మనీ రక్షణ మంత్రిగా శ్రీ బోరిస్ పిస్టోరియస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరుదేశాల రక్షణ సహకారంలో గణనీయమైన పురోగతి ఉందన్నారు.
ఇటీవల భారత్-ఈయూ మధ్య కుదిరిన భద్రత, రక్షణ భాగస్వామ్యం.. ఉమ్మడి సహకారాన్ని మరింత బలోపేతం చేయటంలో కీలక ముందడుగని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు, ఉమ్మడి సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు, భారత్-జర్మనీల మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక బంధాన్ని మరింత పటిష్ఠం చేసే స్పష్టమైన ఫలితాల కోసం ఈ భాగస్వామ్య వ్యవస్థను ద్వైపాక్షికంగానూ, యూరోపియన్ దేశాల పరిధిలోనూ ఉపయోగించుకోవాలని ఇద్దరు మంత్రులు అంగీకరించారు.
ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. భారత్, జర్మనీ దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని, బలాన్ని చేకూర్చాయని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఏ విధంగా వ్యక్తమైనా ఆ ముప్పును ఖచ్చితంగా ఖండించాలని చెప్పారు. ఎలాంటి మినహాయింపులు, సమర్థనలు లేకుండా ఉగ్రవాదాన్ని నిస్సందేహంగా ఖండించాలని పిలుపునిచ్చారు.
సేవల స్థాయి సిబ్బంది చర్చల వ్యవస్థీకరణ, భవిష్యత్తులో జరగబోయే ద్వైపాక్షిక సైనిక విన్యాసాలను జర్మనీ రక్షణ మంత్రి అభినందించారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారతదేశంలో నిర్వహించనున్న ఎక్స్-తరంగ్ శక్తి తదుపరి ఎడిషన్‌లో జర్మనీ వైమానిక దళం పాల్గొనాలని రక్షణ మంత్రి ఆహ్వానించారు.
ఈ సమావేశానికి ముందు జర్మనీ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్న శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌కు గౌరవ వందనంతో ఘన స్వాగతం లభించింది.
అంతకు ముందు, బుండెస్వెహర్ స్మారక చిహ్నం వద్ద రక్షణ మంత్రి నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన బుండెస్వెహర్ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన స్మారక చిహ్నమది.
భారత్, జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు 2026లో 75 ఏళ్లు పూర్తవుతాయి. ద్వైపాక్షిక స్థాయిలో ప్రస్తుతం ఈ బంధం పలు రంగాలకు విస్తరించింది. రక్షణ రంగంలో పాటు వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, ఆవిష్కరణలు, అభివృద్ధి సహకారం, స్వచ్ఛ ఇంధనం, ఉన్నత విద్య, సుస్థిర పరిష్కారాలు, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు వంటి అనేక రంగాల్లో ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఇది భాగస్వామ్య బలాన్ని, విస్తృతిని తెలియజేయటమే కాక, సామర్థ్యాన్ని, భవిష్యత్తుపై నమ్మకాన్ని చాటిచెబుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2254805)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5