ఆర్థిక మంత్రిత్వ శాఖ
సుమారు రూ. 1,825 కోట్ల భారీ జీఎస్టీ రిఫండ్ మోసం వెనుక సూత్రధారిని ఢిల్లీ ఐజీఐ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన డీజీజీఐ అహ్మదాబాద్ జోనల్ యూనిట్ అధికారులు
నాడు పోస్టు చేయడమైనది:
20 APR 2026 6:37PM by PIB Hyderabad
వస్తు సేవల పన్ను వాపసు మోసానికి సంబంధించిన సూత్రధారి, అనేక ఇతర ఆర్థిక నేరాల కేసులలో నిందితుడు కపిల్ చుగ్‌ను దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అహ్మదాబాద్ డీజీజీఐ, ఏజడ్యూ అధికారులు 2026 ఏప్రిల్ 19న అరెస్టు చేశారు
కపిల్ చుగ్ దర్యాప్తును తప్పించుకుంటూ, అహ్మదాబాద్‌లోని డిజిజిఐ జారీ చేసిన 22 సమన్లకు స్పందించకుండా వివిధ ప్రాంతాల్లో సుమారు రూ. 1,825 కోట్ల విలువైన జీఎస్‌టీ వాపసు మోసానికి పాల్పడిన అనంతరం దుబాయ్‌కి పరారయ్యాడు.
ఈ కేసులో జరిగిన దర్యాప్తులో, కపిల్ చుగ్ తన సహచరుడు విపిన్ శర్మతో కలిసి ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ ను మోసపూరితంగా పొందడానికి, ఆపై జీరో-రేటెడ్ సరఫరాల పేరుతో రీఫండ్ క్లెయిమ్‌ల ద్వారా వాటిని నగదుగా మార్చుకోవడానికి ఒక వ్యవస్థీకృత పథకాన్ని రూపొందించి, అమలు చేసినట్లు తేలింది. ఈ మొత్తం నెట్‌వర్క్‌ను నకిలీ సంస్థలు, ఉద్యోగులు, సన్నిహితుల ద్వారా నియంత్రించే ప్రధాన సూత్రధారిగా,అలవాటుగా ఆర్థిక నేరాలకు పాల్పడే వ్యక్తిగా కపిల్ చుగ్ ను గుర్తించారు. ఇతరుల కేవైసీ పత్రాలను ఉపయోగించి సృష్టించిన ఈ సంస్థలు, కేవలం కాగితాలకే పరిమితమై, ప్రకటించిన చిరునామాల్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు, సిబ్బంది లేదా నిజమైన వ్యాపార కార్యకలాపాలు లేకుండా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. యజమానులు/డైరెక్టర్లు కేవలం పేరుకు మాత్రమే ఉండేవారు. వారికి ప్రతిఫలంగా నిర్ణీత నెలవారీ నగదు అందేది. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్, ఇన్వాయిస్ జనరేషన్, బ్యాంకింగ్ కార్యకలాపాలు, రిటర్నులు దాఖలు చేయడం, రీఫండ్ క్లెయిమ్‌ల సమర్పణతో సహా అన్ని కార్యకలాపాలను ప్రధాన నిందితులే కేంద్రంగా ఉండి నిర్వహించేవారు.
ప్రధాన నిందితులు వస్తువులను వాస్తవంగా స్వీకరించకుండానే నకిలీ కొనుగోలు ఇన్వాయిస్‌లను ఏర్పాటు చేసి, మోసపూరిత ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ని సృష్టించారు. భారీ మొత్తంలో ఐటీసీ పొందేందుకు ఇన్వాయిస్‌లలో అధిక విలువ కలిగిన పొగాకు ఉత్పత్తులను చూపారు. ఈ ఇన్వాయిస్‌లను పలు మధ్యవర్తి సంస్థల ద్వారా పంపి, లావాదేవీల సుదీర్ఘ శ్రేణిని రూపొందించారు. ఈ విధంగా సృష్టించిన ఐటీసీని కేవలం కాగితపు లావాదేవీల ద్వారా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు బదిలీ చేస్తూ, వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఒక కృత్రిమ మార్గాన్ని సృష్టించారు. ఈ పద్ధతి ద్వారా ప్రధాన నిందితులు అనర్హమైన ఐటీసీని జీఎస్టీ వ్యవస్థలోకి ప్రవేశపెట్టగలిగారు. అనంతరం, కాండ్లా స్పెషల్ ఎకనామిక్ జోన్ నుంచి ఎగుమతిదారులుగా చూపించిన కొన్ని ఎంపిక చేసిన సంస్థలలో ఈ మొత్తాన్ని పోగు చేశారు.
కాగితపు లావాదేవీలతో పాటు, తక్కువ విలువ కలిగిన పొగాకు, నాణ్యత లేని పొగతాగే మిశ్రమాలు, ఇతర పొగాకు ఉత్పత్తులను స్థానికంగా చాలా తక్కువ ధరలకు, తరచుగా ఎటువంటి ఇన్‌వాయిస్‌లు లేకుండానే సేకరించేవారు. అనంతరం, ఈ వస్తువులను కిమామ్/జర్దా వంటి అధిక విలువ గల ఉత్పత్తులుగా తప్పుగా ప్రకటించి, కృత్రిమంగా పెంచిన ధరలకు ఎగుమతి చేసేవారు. ఇటువంటి వస్తువుల మార్పిడిని సమర్థించడానికి అక్కడ ఎటువంటి తయారీ కేంద్రం లేదా మౌలిక సదుపాయాలు ఏమాత్రం లేవు. జీఎస్‌టీ రిటర్నులలో ప్రకటించిన ఈ కృత్రిమ టర్నోవర్ అంతా ప్రధానంగా నకిలీ బిల్లింగ్ కారణంగానే జరిగింది. దీనివల్ల మోసపూరిత పద్ధతుల్లో ఐటిసిని పోగు చేయడం, రీఫండ్ క్లెయిమ్‌లను పొందడం సాధ్యమైంది. ఆ తర్వాత, నిందితులు ఎటువంటి పన్ను చెల్లించకుండా 'లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్' (ఎల్యూటీ) కింద జీరో-రేటెడ్ సరఫరాలను చూపించి, పేరుకుపోయిన ఐటిసి మొత్తానికి రీఫండ్ పొందేందుకు క్లెయిమ్ చేశారు. ఈ ఎగుమతులు చాలా వరకు కల్పితమని లేదా అతిగా భారీగా చూపించారని దర్యాప్తులో తేలింది. అనుమానాస్పద లేదా ఒకే వాహనాల నంబర్లను పదేపదే ఉపయోగించి ఈ-వే బిల్లులను సృష్టించారు. కేవలం కాగితాలకే పరిమితమైన ఈ లావాదేవీలను నిజమని నమ్మించడానికి బూటకపు రవాణా పత్రాలను కూడా తయారు చేశారు.
ఆర్థిక లావాదేవీల విశ్లేషణలో, భారీ విలువైన లావాదేవీలు జరిగినప్పటికీ, నిధుల కదలిక చాలా తక్కువగా లేదా సర్క్యులర్ పద్ధతిలో ఉన్నట్లు తేలింది. అందిన చెల్లింపులను సంబంధిత సంస్థల ద్వారా మళ్లించడం లేదా ఆ వెంటనే నగదు రూపంలో డ్రా చేసినట్టు కనుగొన్నారు. అసలైన సరఫరాదారుల చెల్లింపులు లేదా రవాణా ఖర్చులు వంటి ఎటువంటి వ్యాపార ధోరణి అక్కడ కనిపించలేదు. పలు సంస్థలకు ఒకే సంప్రదింపు నంబర్లు, ఐపీ చిరునామాలు, అకౌంటింగ్ సిబ్బంది ఉండడాన్ని బట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రధాన నిందితులు కేంద్రీకృతంగా నియంత్రించారని స్పష్టం చేస్తోంది.
ఎగుమతి వ్యాపారంలో టర్నోవర్‌ను తప్పుగా చూపించి, కృత్రిమంగా పెంచడం ద్వారా యెస్ బ్యాంక్ నుంచి సుమారు రూ. 11 కోట్లను కపిల్ చుగ్ కాజేశారు. ఫోర్జరీ పత్రాల ద్వారా మోసపూరిత క్రెడిట్ సదుపాయాలను పొందిన మరో కేసులో కూడా సిబిఐ ఆయనపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అంతేకాకుండా, జీఎస్‌టీ మోసానికి సంబంధించిన బోగస్ బిల్లింగ్‌తో సృష్టించిన నకిలీ టర్నోవర్ ద్వారా కంపెనీ విలువను పెంచినందుకు, ఎలైట్‌కాన్ ఎండి విపిన్ శర్మపై 30.03.2026 నాటి సెబీ ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2253967)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9