రైల్వే మంత్రిత్వ శాఖ
టిక్కెట్టు ధరలను పెంచకుండానే.. స్క్రాప్ అమ్మకాలు, ఛార్జీయేతర ఆదాయంతో స్టేషన్ల నిర్వహణ
ఆర్థిక సంవత్సరం2025-26లో స్క్రాప్ అమ్మకాల ద్వారా రూ.6813.86 కోట్లను ఆర్జించిన భారతీయ రైల్వేలు: నిరుపయోగంగా ఉన్న ఆస్తులను ఉపయోగించడం లేదా విక్రయించడం ద్వారా రూ.6000 కోట్లను సాధించాలన్న లక్ష్యాన్ని అధిగమించింది
డిపోలు, యార్డులు, వర్కుషాపుల్లో ఖాళీ అయిన స్థలం: పునర్వినియోగం, వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడం ద్వారా పర్యావరణ హితంగా మారుతున్న రైల్వేలు
గడచిన 5 ఏళ్లలో రైల్వేల్లో 168 శాతం వృద్ధితో రూ.290 కోట్ల నుంచి రూ.777 కోట్లకు పైగా పెరిగిన ఛార్జీయేతర ఆదాయం
వివిధ రైల్వే స్టేషన్లలో ఈ వృద్ధిని ముందుకు నడిపిస్తున్న 120 జన ఔషధి కేంద్రాలు, 22 ప్రీమియం బ్రాండ్ అవుట్‌లెట్లు
శుభ్రమైన స్టేషన్లు, ఆధునిక మౌలిక వసతులు, మెరుగుపరిచిన సౌకర్యాలు, పెరిగిన భద్రతా వ్యవస్థలు, మెరుగైన ప్రయాణికుల అనుభవం
కోవర్కింగ్ డిజిటల్ లాంజ్‌లు, వైద్య కేంద్రాలు, బహుళ అంతస్తుల కార్ పార్కింగ్, గేమింగ్ జోన్ తదితరమైన వాటిని ఛార్జీయేతర ఆదాయంతో అభివృద్ధి చేస్తున్నారు
నాడు పోస్టు చేయడమైనది:
19 APR 2026 6:59PM by PIB Hyderabad
టికెట్టు ధరలు పెంచకుండానే సుస్థిర ఆదాయ విధానాలు, స్క్రాప్ అమ్మకాలు, నిలకడగా పెరుగుతున్న ఛార్జీయేతర ఆదాయం ద్వారా భారతీయ రైల్వేలు ఆదాయ స్థిరత్వాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నాయి. నిరుపయోగంగా ఉన్న ఆస్తులను ఉపయోగించుకోవడం, ఛార్జీలపై మాత్రమే ఆధారపడకుండా.. వినూత్న ఆదాయ మార్గాలను విస్తరించడం ద్వారా సుస్థిరమైన ఆర్థిక విధానంలో స్టేషన్లలో సౌకర్యాలను, పారిశుద్ద్యాన్ని, డిజిటల్ సేవలను, ప్రయాణికులకు వసతులను మెరుగుపరిచేలా రైల్వే చర్యలు తీసుకుంటోంది. ఆస్తుల సమర్థ నిర్వహణ, వినియోగదారు కేంద్రక పెట్టబడులు, పర్యావరణ హితమైన పద్ధతులను ఈ సమతుల్య విధానం ప్రతిబింబిస్తోంది. అదేవిధంగా సౌకర్యవంతమైన, ఆధునికమైన, విశ్వసనీయమైన రవాణా అనుభవాన్ని అందించడంలో రైల్వేల చిత్తశుద్ధిని తెలియజేస్తుంది.
స్క్రాప్ ద్వారా ఆదాయార్జన సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్న రైల్వేలు
ఆర్థిక సంవత్సరం 2025-26లో స్క్రాప్ తొలగింపులో మెరుగైన ప్రదర్శనతో భారతీయ రైల్వేలు కీలకమైన మైలురాయిని అధిగమించాయి. స్క్రాప్ అమ్మకాల్లో నిర్దేశిత రూ. 6000 కోట్ల లక్ష్యాన్ని అధిగమించి రికార్డు స్థాయిలో రూ. 6813.86 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
మునుపటి ఆర్థిక సంవత్సరం 2024-25లో కనబరిచిన పనితీరు ఆధారంగా ఈ విజయం సాధ్యమైంది. ఆ ఏడాదిలో స్క్రాప్ అమ్మకాల ద్వారా రూ. 5400 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా రూ. 6641.78 కోట్ల విలువైన అమ్మకాలను సాధించారు.
ఆస్తుల సమర్థ నిర్వహణకు, పారదర్శకమైన తొలగింపు విషయంలో రైల్వేల అంకితభావాన్ని స్క్రాప్ ద్వారా ఆదాయాన్ని సంపాదించడంలో సాధిస్తున్న పురోగతి సూచిస్తుంది. పనికిరాని వస్తువులను క్రమపద్ధతిలో తొలగించడం ద్వారా, ఈ సంస్థ వినియోగంలో లేని ఆస్తుల నుంచి ఆదాయాన్ని రాబట్టడమే కాకుండా.. డిపోలు, యార్డులు, వర్కుషాపుల్లో స్థలం ఖాళీ చేస్తోంది.
పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం, వ్యర్థాలు పేరుకుపోవడాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ సుస్థిరతకు ఈ కార్యక్రమం గణనీయంగా దోహదపడుతుంది.
టిక్కెటేతర ఆదాయాన్ని బలోపేతం చేసుకుంటూ.. ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్నిస్తున్న రైల్వేలు
భారతీయ రైల్వేల్లో ఆర్థిక సుస్థిరతను బలోపేతం చేయడంలో ముఖ్యమైన వనరుగా ఛార్జీయేతర ఆదాయం (ఎన్ఎఫ్ఆర్) ఆవిర్భవించింది. ఇది నేరుగా ప్రయాణికులకు లబ్ధి చేకూరుస్తోంది. స్టేషన్ పునరాభివృద్ధి, ప్రకటనలు, రైల్వే ఆస్తుల వాణిజ్య వినియోగం, తదితర వినూత్న కార్యక్రమాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఈ ఎన్ఎఫ్ఆర్.. ప్రయాణికుల నుంచి వసూలు చేసే టిక్కెట్ ధరలు, సరకు రవాణా ఆదాయంపై అతిగా ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఈ అదనపు ఆదాయం వల్ల ఆధునిక మౌలిక వసతుల్లో పునఃపెట్టుబడులు పెట్టడానికి, స్టేషన్లలో వసతులను ఉన్నతీకరించడానికి, పారిశుద్ధ్యాన్ని పెంపొందించడానికి, డిజిటల్ సేవలను మెరుగపరచడానికి, మెరుగైన రైళ్లను, భద్రతా వ్యవస్థలను ప్రవేశపెట్టడానికి వీలు కలుగుతుంది. ఇది అంతిమంగా మరింత సౌకర్యవంతమైన, అనుకూలమైన, విశ్వసనీయమైన ప్రయాణ అనుభవాన్ని ప్రయాణికులకు అందిస్తుంది.
ఆర్థిక సంవత్సరం 2021–22లో రూ. 290 కోట్ల నుంచి ఆర్థిక సంవత్సరం 2025–26 నాటికి సుమారుగా రూ. 777.76 కోట్ల వరకు నిలకడగా ఎన్ఎఫ్ఆర్ ఆదాయం పెరిగింది. గడచిన అయిదేళ్లలో ఈ వృద్ధి 168 శాతంగా నమోదయింది. ఆర్థిక సంవత్సరం 2025-26లో ఎన్ఎఫ్ఆర్ అంచనా లక్ష్యం రూ. 720.85 కోట్లు. ఈ లక్ష్యాన్ని అధిగమించి ఇప్పటి వరకు రూ. 777.76 కోట్ల ఆదాయం సమకూరింది. అంటే 107.9 శాతంగా ఈ వృద్ధి నమోదయింది. ఆర్థిక సంవత్సరం 2024-25లో ఎన్ఎఫ్ఆర్ ఆదాయం రూ. 686.86 కోట్లుగా ఉంది. భారతీయ రైల్వేల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో వ్యూహాత్మక ఆదాయ మార్గాలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఈ ధోరణి స్పష్టం చేస్తోంది.
ఈ అంశంలో దిగువ పేర్కొన్న చర్యలు తీసుకున్నారు.
ప్రీమియం బ్రాండ్ అవుట్‌లెట్లు
ఎన్ఎఫ్ఆర్‌ను పెంపొందించేందుకు సంస్థల యాజమాన్యంలోని సింగిల్ బ్రాండ్ ప్రీమియం అవుట్‌లెట్లను ఏర్పాటు చేయడానికి వీలుగా కాంట్రాక్టులను ఇచ్చేందుకు జోనల్ రైల్వేలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ విధానం పరిధిలో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ వసతులను కొన్ని వినూత్న బ్రాండెడ్ అవుట్‌లెట్లను రైల్వేలు ప్రారంభించాయి. ఇతర బ్రాండ్లకు చెందిన స్టోర్లు సైతం త్వరలోనే ప్రారంభం కానున్నాయి. భారతీయ రైల్వేల్లో ఎన్ఎఫ్ఆర్ ద్వారా 22 ప్రీమియం బ్రాండ్లకు అవుట్‌లెట్లను కేటాయించారు.
ప్రధానమంత్రి భారతీయ జన ఔషధీ కేంద్రాల (పీఎంబీజేకే) ప్రారంభం
ప్రయాణికుల ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని పెంపొందించడంలో భాగంగా.. రైల్వేస్టేషన్లలో 50 ప్రధానమంత్రి భారతీయ జన ఔషధీ కేంద్రాలు (పీఎంబీజేకే)ను ఏర్పాటు చేయడానికి భారతీయ రైల్వే ఒక విధానాన్ని రూపొందించి అమలు చేసింది. భారత ఔషధాలు, వైద్య పరికరాల బ్యూరో నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ స్టాళ్లను నిర్వహిస్తారు. 2024 మార్చి 12న ప్రధానమంత్రి 50 పీఎంబీజేకేలను ప్రారంభించారు. ఈ కార్యక్రమం సాధించిన విజయం ఆధారంగా.. ఈ సంక్షేమ పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేసేలా భారతీయ రైల్వేల్లో అదనంగా 100 పీఎంబీజేకేలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ అదనపు 100 పీఎంబీజేకేల్లో 18 స్టోర్లను 2024 నవంబర్ 13న ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇప్పటి వరకు భారతీయ రైల్వేల్లో 150 పీఎంబీజేకేలకు గాను 120 పీఎంబీజేకేలను ప్రారంభించారు. భారతీయ రైల్వేల్లో ప్రధానమంత్రి భారతీయ జనఔషధీ కేంద్ర (పీఎంబీజేకే) అవుట్‌లెట్లను మరింత విస్తరించే బాధ్యతను జోనల్ రైల్వేల్లో జనరల్ మేనేజర్లకు అప్పగించారు. తద్వారా పీఎంబీజేకేను విస్తృతంగా అమలు చేయడంతో పాటు.. ప్రయాణికులకు ప్రయోజనం కలిగిస్తూనే మరింత ఆదాయాన్ని ఆర్జించవచ్చు.
జోనల్ రైల్వేలు చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు
వినూత్నమైన ఆలోచనలు, వాటిని సమర్థంగా అమలు చేయడం ద్వారా మెరుగైన ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి, ఛార్జీయేతర ఆదాయం (ఎన్ఎఫ్ఆర్)ను పెంపొందించడానికి రైల్వేలు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నాయి.
చేపట్టిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు: బహుళ అంతస్తుల కార్ పార్కింగ్, వైద్య సేవల కేంద్రం, నర్సింగ్ ప్యాడ్లు, వ్యాగన్లను శుభ్రం చేసే కాంట్రాక్టు, చెల్లింపుల సేవగా ఈ-వీల్ చెయిర్ సౌకర్యం, హెల్త్ కియోస్క్, గేమింగ్ జోన్, ప్లాస్టిక్ బాటిల్ క్రషింగ్ యంత్రం, ఫ్లాట్‌ఫాం బ్రాండింగ్, ప్రయాణికులు, ప్రజల సౌకర్యార్థ్యం ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకోవడం మొదలైనవి.
ప్రీమియం కోవర్కింగ్ స్పేస్/డిజిటల్ లాంజ్ పేరుతో వినూత్న విధానాన్ని పశ్చిమ రైల్వే రూపొందించింది. ఇది ప్రయాణికులకు హైస్పీడు వైఫై, వర్క్ స్టేషన్లు, ఛార్జింగ్ పాయింట్లు, కాన్ఫరెన్స్ సౌకర్యాలు, సౌకర్యవంతమైన సీట్లను అందిస్తుంది. దీనిలో ప్రింటింగ్, స్కానింగ్, శీతలపానీయాలు అందుబాటులో ఉంటాయి. అలాగే గంటల వారీగా వర్క్ స్పేస్‌ను వినియోగించుకోవడం, కాంబో ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉంటాయి. రైల్వే స్టేషన్లలో ఎదురుచూసే సమయాన్ని ఆధునికంగా, సౌకర్యవంతంగా, ఉత్పాదకంగా మార్చే దిశగా వేసిన ముందడుగును ఈ కార్యక్రమం సూచిస్తుంది. రైల్వేల్లో ఇలాంటి మంచి ఆలోచనలను అమలు చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను జోనల్ రైల్వేలకు జారీ చేశారు.
పైన పేర్కొన్నవన్నీ భారతీయ రైల్వేల్లో ఛార్జీయేతర ఆదాయ వనరులను పెంపొదిస్తాయి. అదే సమయంలో ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్నిస్తాయి.
***
(రిలీజ్ ఐడి: 2253711)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10