పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశ అన్వేషణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సముద్ర మంథన్ ద్వారా డేటా ఆధారిత అన్వేషణ సదస్సును నిర్వహించిన కేంద్రం


అనిశ్చితిని అవకాశంగా, డేటాను ఆవిష్కరణగా మారుస్తూ.. దేశ ఇంధన భవిష్యత్తును శక్తిమంతం చేయడానికి, ఇంధన రంగంలో ఆత్మనిర్భరత లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతోన్న భారత్‌: శ్రీ హర్దీప్‌ సింగ్‌ పూరి

నాడు పోస్టు చేయడమైనది: 18 APR 2026 1:33PM by PIB Hyderabad

భారతదేశ విస్తృత చమురు అన్వేషణ లక్ష్యాలను సాధించడంలో భాగంగా ‘సముద్ర మంథన్-నేషనల్ ఆఫ్‌షోర్ మిషన్’ కింద డేటా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా అన్వేషణ ఫలితాలను వేగవంతం చేసేందుకు.. పరిశ్రమలను భాగస్వాములను చేసేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్ (డీజీహెచ్‌) ఆధ్వర్యంలో ‘‘డేటా డ్రివెన్ ఎక్స్‌ప్లోరేషన్’’ అంశంపై ఒక సమావేశాన్ని నిర్వహించింది.

 

 

 

పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, డీజీహెచ్‌, జాతీయ చమురు సంస్థలు, సుమారు 80 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. ఇందులో బీపీ, ఎక్సాన్ మొబిల్, షెల్ వంటి అంతర్జాతీయ అన్వేషణ, ఉత్పత్తి సంస్థలతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్, కెయిర్న్ ఇండియా, ఇన్వెనిరే ఎనర్జీ, అదానీ వెల్స్‌పన్‌ అన్వేషణ వంటి ప్రైవేటు ఆపరేటర్లు కూడా భాగస్వాములయ్యారు. వీరితో పాటు టీజీఎస్‌, విరిడియన్‌, షీర్‌వాటర్ జియోసర్వీసెస్, ఎస్ఎల్‌బీ, వేవ్ జియో సర్వీసెస్ వంటి ప్రముఖ భూకంప సంబంధిత సమాచారాన్ని అందించే విభాగాలు, సాంకేతిక సంస్థలు కూడా పాల్గొన్నాయి. సముద్ర తీరానికి దూరంగా, ఇంకా అన్వేషించని కొత్త ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించిన ఈ సమావేశం... అన్వేషణ ఫలితాలను సాధించడంలో భూకంప సంబంధిత సమాచారం పోషించే పాత్రపై పరిశ్రమ వర్గాలను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా సాగింది.

పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి తన సామాజిక ఖాతా ఎక్స్‌ పోస్టులో.. భారత్‌ ఇకపై గుడ్డిగా చేసే అన్వేషణల దశను దాటిందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం సాహసోపేతమైన మల్టీ-క్లయింట్‌ నమూనాను అవలంబిస్తోందని, ఇది మరింత మంది నిపుణులు సమాచారాన్ని విశ్లేషించడానికి, ఆవిష్కరణలు చేయడానికి, కొత్త నిక్షేపాలను కనుగొనడానికి వీలు కల్పిస్తుందని ఆయన తెలిపారు. దీని ద్వారా అన్వేషణ, ఉత్పత్తి రంగాన్ని కేవలం ఒక అనిశ్చితి కలిగిన రంగంగా చూసే దృక్పథాన్ని నిర్ణయాత్మకంగా మారుస్తున్నట్లు వెల్లడించారు.

సముద్ర మంథన్ ద్వారా ఇంధన రంగంలో ఆత్మనిర్భరత సాధించాలనే మన అన్వేషణను నెరవేర్చడానికి... పారదర్శకత, సహకారం, అత్యాధునిక విజ్ఞానంతో దేశపు అపారమైన సముద్ర తీర సామర్థ్యాన్ని వెలికితీస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 

సమావేశంలోని ముఖ్య విషయాలు: 

 

ప్రధాన సాధక శక్తిగా డేటా.. 

 

· భూకంప సంబంధిత సమాచార లభ్యత, నాణ్యత, అందరికీ అందుబాటులో ఉండటం అనేవి నేరుగా అన్వేషణ ఫలితాలను నిర్ణయిస్తాయని పరిశ్రమ వర్గాలన్నీ స్పష్టంగా ఏకీభవించాయి.

 

· ముఖ్యంగా కొత్త ప్రాంతాలు, లోతైన సముద్ర గర్భ బేసిన్లలో డేటా కవరేజీ సరిగ్గా లేకపోవడం వల్ల... ఆయా ప్రాంతాల్లో ఉన్న అవకాశాలను గుర్తించడం, పెట్టుబడులు, అన్వేషణ వేగం గణనీయంగా తగ్గుతున్నాయని పాల్గొన్న సభ్యులు తెలిపారు.

 

· ఇమేజింగ్ సాంకేతికతలో వస్తున్న మార్పులు, కృత్రిమ మేధ ఆధారిత విశ్లేషణలను ఉపయోగించి, పాత డేటా సెట్‌లను మళ్ళీ ప్రాసెస్ చేయడం, కొత్త కోణంలో విశ్లేషించడం ద్వారా అపారమైన విలువను వెలికితీయవచ్చని వివరించారు.

 

 

 

డేటా సేకరణను వేగవంతం చేయాల్సిన అవసరం

 

· రాబోయే లైసెన్సింగ్ రౌండ్లకు అనుగుణంగా, లక్ష్యంతో కూడిన, వేగవంతమైన భూకంప సమాచార సేకరణ అవసరమని పాల్గొన్న సభ్యులు చెప్పారు. డేటాను ముందుగానే సేకరించి పటిష్టం చేయడం వల్ల సంస్థల భాగస్వామ్యం, పెట్టుబడి ఫలితాలు గణనీయంగా మెరుగుపడతాయని అంతర్జాతీయ అనుభవాలు చెబుతున్నాయి.

 

వేగవంతం చేసే సాధనాలుగా మల్టీ-క్లయింట్‌ భూకంప నమూనాలు (ఎంసీఎం): 

 

· వ్యయ సామర్థ్యాన్ని పెంచడానికి, ముఖ్యంగా కొత్త ప్రాంతాల్లో అందరి భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి మల్టీ-క్లయింట్ భూకంప నమూనాలు ఒక శక్తిమంతమైన మార్గమని గుర్తించారు.

 

· అంతర్జాతీయ అనుభవాల ప్రకారం ఈ నమూనా ద్వారా డేటా వేగంగా అందుబాటులోకి రావడమే కాకుండా, లైసెన్సింగ్ ప్రక్రియలో ఎక్కువ మంది పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది.

 

· అదే సమయంలో దేశంలోని బేసిన్ల పరిణతిని, ప్రస్తుతం ఉన్న డేటా యాజమాన్య పద్ధతులను దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని దశలవారీగా, ఆచితూచి అమలు చేయాల్సిన అవసరం ఉంది.

 

కీలక సహాయకారిగా ప్రభుత్వం.. 

 

· డేటా వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వ పాత్ర చాలా కీలకమని ఈ సమావేశం తెలిపింది. ముఖ్యంగా విధానపరమైన మద్దతు, డేటా సేకరణలో నిరంతర పెట్టుబడులు, నేషనల్ డేటా రిపోజిటరీ (ఎన్‌డీఆర్‌) వంటి సమాచార అందుబాటు విధానాలను బలోపేతం చేయడంపై చర్చించారు. పరిశ్రమ వర్గాల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వ విధానాలలో స్పష్టత, ముందస్తు అంచనా వేయగలిగేలా ఉండటం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.

 

సేకరణ, అమలు విధానాలు

 

· భవిష్యత్తులో జరగబోయే భారీ స్థాయి కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని బలమైన కొనుగోలు విధానాలు ఉండాలని సభ్యులు సూచించారు. నాణ్యమైన డేటా సేకరణ, సమయానికి పనులు పూర్తి చేయడం కోసం కేవలం తక్కువ ధరకే కాకుండా నాణ్యతతోపాటు ఖర్చుకు కూడా ప్రాధాన్యత ఇచ్చే పద్ధతులను అనుసరించాలని, అలాగే ఎక్కువ మంది సేవా సంస్థలతో కలిసి పనిచేయాలని సూచించారు.

 

చర్చల ఆధారంగా చేసిన ప్రతిపాదనలు 

 

· రాబోయే బిడ్డింగ్ రౌండ్లకు అనుగుణంగా, ముఖ్యంగా కొత్త ప్రాంతాలు, లోతైన సముద్ర బేసిన్లపై దృష్టి సారిస్తూ... ప్రాధాన్యత క్రమంలో భూకంప సమాచారసేకరణ ప్రణాళికను ఖరారు చేయడం.

 

· తక్షణ అన్వేషణ ఫలితాలను సాధించడం కోసం ప్రస్తుతం ఉన్న డేటా సెట్‌లను మళ్ళీ విశ్లేషించడానికి, అనుసంధానించడానికి ఒక క్రమబద్ధమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం.

 

· డేటా సేకరణ కోసం వాణిజ్య విధానాలను రూపొందించడం. ఇందులో అవసరాన్ని బట్టి మల్టీ-క్లయింట్, హైబ్రిడ్ నమూనాలను ఎంపిక చేసిన ప్రాంతాల్లో అమలు చేయడం.

 

· భారీ స్థాయి పనులకు తగ్గట్లుగా కొనుగోలు, అమలు విధానాలను రూపొందించడం. ఇందులో నాణ్యత ఆధారిత మూల్యాంకనానికి చోటు కల్పిస్తూ.. ఎక్కువ మంది సేవా సంస్థలు పాల్గొనేలా వీలు కల్పించడం.

డేటా ఆధారిత అన్వేషణ సదస్సు ముఖ్యంగా కొత్త ప్రాంతాల్లో, లోతైన సముద్ర గర్భ బేసిన్లలో పెట్టుబడులను ఆకర్షించడానికి, అన్వేషణను వేగవంతం చేయడానికి భూకంప సమాచారమే పునాది. డేటా నాణ్యతను, అందుబాటు, వాణిజ్య సాధ్యాసాధ్యాలను మెరుగుపరచడానికి ఒక నిర్దిష్ట కాలపరిమితితో కూడిన లక్ష్యంతో ముందుకు సాగాలని పరిశ్రమ వర్గాలన్నీ ఏకగ్రీవంగా అంగీకరించాయి.

ఈ సమావేశం ద్వారా వ్యక్తమైన ఏకాభిప్రాయాన్ని ఇప్పుడు ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు . ఇందులో భాగంగా... ప్రాధాన్యత క్రమంలో డేటా సేకరణ ప్రణాళికను ఖరారు చేయడం, సరైన వాణిజ్య నమూనాలను అభివృద్ధి చేయడం, పనుల పరిమాణం, నాణ్యతకు అనుగుణంగా కొనుగోలు విధానాలను రూపొందించడం వంటి కీలక అంశాలపై తక్షణమే దృష్టి సారించాల్సి ఉంది.

***


(రిలీజ్ ఐడి: 2253333) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Bengali , Assamese