మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
పశు సంవర్ధకం, పాడి పరిశ్రమ విభాగం ఆధ్వర్యంలో స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎస్ఏఎస్‌సీఐ),
కృత్రిమ వీర్య నిక్షేపణం, టీకా మందు ఇప్పించడం, భారత్ పశుధన్ పోర్టల్ అంశాలపై
కీలక జాతీయ సమావేశంతో పాటు కార్యశాల నిర్వహణ
నాడు పోస్టు చేయడమైనది:
17 APR 2026 2:38PM by PIB Hyderabad
పశుగణ రంగంలో సంస్కరణలను అమలు చేయడానికి సంబంధించిన ‘స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్’ (ఎస్ఏఎస్‌సీఐ), కృత్రిమ వీర్య నిక్షేపణం, టీకామందు ఇప్పించడం, భారత్ పశుధన్ పోర్టల్ అంశాలపై ఒక సమీక్షా సమావేశాన్ని, కార్యశాల (వర్క్‌షాపు)ను న్యూఢిల్లీలోని కృషి భవన్‌లో ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వ పశు సంవర్ధకం, పాడి పరిశ్రమ విభాగం (డీఏహెచ్‌డీ) కార్యదర్శి శ్రీ నరేశ్ పాల్ గంగ్‌వార్ అధ్యక్షత వహించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులు, ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సమావేశం/వర్క్‌షాపులో ప్రధానంగా ఈ కింద పేర్కొన్న అంశాలపై చర్చించారు:

(1) పశుగణ రంగంలో సంస్కరణలకు సంబంధించిన ‘స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్’ (ఎస్ఏఎస్‌సీఐ) తాలూకు అంశాలు,
(2) టీకామందు ఇప్పించడంతో పాటు ఇతర అంశాలకు సంబంధించి ఎస్ఓపీల నిర్వహణ ప్రక్రియ,
(3) కృత్రిమ వీర్య నిక్షేపణం,
(4) ఎన్‌డీఎల్ఎమ్-భారత్ పశుధన్ పోర్టల్‌కు సంబంధించిన అంశాలు.
ఎస్ఏఎస్‌సీఐల భాగంగా పథకం ఉద్దేశాల వివరాలను చైర్‌పర్సన్ వివరించి, ప్రోత్సాహకాలను అందుకోవడానికి అవసరమైన షరతులను గురించి తెలియజేశారు. దీనికి అదనంగా, ఎస్ఏఎస్‌సీఐ పాత షరతులను పెద్ద ఎత్తున అమలు చేసే విషయంలో ఎస్ఏఎస్‌సీఐ ముందస్తు షరతులు ప్రతి ఒక్కటీ అమలయ్యేలా సంబంధిత అధికారులతో సీనియర్ అధికారులు సంప్రదింపులు జరపాలని, ఈ ప్రతిపాదనలు రాష్ట్ర పశుగణాభివృద్ధి ప్రణాళిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండేటట్లు చూడాలంటూ ఆయన సలహా ఇచ్చారు.
పశు సంవర్ధకం, పాడి పరిశ్రమ విభాగం (డీఏహెచ్‌డీ) కార్యదర్శి శ్రీ నరేశ్ పాల్ గంగ్‌వార్ తన ప్రారంభిక ప్రసంగంలో, చాలావరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పశుసంవర్ధక విభాగాలు కేంద్ర ప్రభుత్వ డీఏహెచ్‌డీ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఒకే విధమైన చర్యలను తీసుకోవడం మొదలుపెట్టాయన్నారు. ఎస్ఏఎస్‌సీఐ పశుగణ రంగ సంస్కరణల లక్ష్యం స్పష్టమైన కార్యనిర్వహణ ప్రణాళికల ద్వారా ప్రోత్సాహక ఆధారిత మూలధన పెట్టుబడులను పెంచడమేనని ఆయన స్పష్టం చేశారు. కార్యాచరణలో జోరును పెంచాలని, సమయానుగుణంగా బడ్జెటును కేటాయింపు కోసం ఆర్థిక విభాగాలతో సమన్వయం నెలకొల్పుకోవాలని, ఆర్థిక సంవత్సరం ఆరంభం నాటి నుంచే నిధులను పశుగణ కార్యకలాపాలకు మాత్రమే వినియోగించేలా చూసుకోవాలనీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆయన కోరారు. కేంద్ర-రాష్ట్ర సమన్వయం, సకాలంలో వివరాల వెల్లడి, మెరుగైన సేవల్ని అందించడానికి డిజిటల్ ఉపకరణాలను ఉపయోగించడం, వర్క్‌షాప్ కార్యాచరణ సంబంధిత అంశాలపై క్రమం తప్పక పర్యవేక్షణ కొనసాగించడం ముఖ్యమని ఆయన అన్నారు.

సమావేశంలో డీఏహెచ్‌డీ అదనపు కార్యదర్శి వర్షా జోషీ సమగ్ర ప్రెజెంటేషన్ ఇచ్చారు. టీకామందు ఇప్పించడనికీ, కృత్రిమ వీర్యనిక్షేపణానికీ అనుసరించాల్సిన ప్రామాణిక నిర్వహణ ప్రక్రియలు (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్.. ఎస్ఓపీస్)తో పాటు ఇతర సంబంధిత అంశాలపై చర్చోపచర్చలు సాగాయి. వీటికి అదనంగా నేషనల్ డిజిటల్ లైవ్‌స్టాక్ మిషన్ (ఎన్‌డీఎల్ఎమ్)-భారత్ పశుధన్ పోర్టల్‌కు సంబంధించిన అంశాలను క్షుణ్నంగా పరిష్కరించారు. సమాచారాన్ని నిరంతరాయంగా ఏకీకరించడం, టీకామందు, కృత్రిమ వీర్యనిక్షేపణానికి సంబంధించిన రికార్డులను వాస్తవ సమయ ప్రాతిపదికన అప్‌లోడ్ చేయడానికి వీలు కల్పించడంపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్‌జీఎమ్)లో భాగంగా, ప్రతి గ్రామ పంచాయతీలోనూ ‘మైత్రి’ (మల్టీపర్పస్ ఆర్టిఫిశియల్ ఇన్సెమినేషన్ టెక్నీషియన్స్ ఇన్ రూరల్ ఇండియా.. ఎమ్ఏఐటీఆర్ఐ) కార్యకర్తలను రంగంలోకి దింపాల్సిందిగా రాష్ట్రాలనూ, కేంద్రపాలిత ప్రాంతాలనూ కోరారు. డీఏహెచ్‌డీ ప్రస్తుతం ఆవులు, ఎడ్లకు అదనంగా ఇతర జాతుల్లోనూ కృత్రిమ వీర్యనిక్షేపణ పద్ధతిని విస్తరించనుంది. గొర్రెల్లో ఆనువంశికత సంబంధిత మెరుగుదల కోసం ఐవీఎఫ్‌ను ప్రోత్సహించనున్నారు.
ఎన్ఎల్ఎమ్‑ఈడీపీలో పురోగతిని సమీక్షించారు. రెండో వాయిదాకు గాను సూచనలను నిర్ధారిత కాలావధి లోపు సమర్పించాలని ఆదేశాలిచ్చారు. లైవ్‌స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఎల్‌హెచ్‌డీసీపీ)లో భాగంగా రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ ఎన్ఏడీసీపీ, ఎంవీయూ, ఏఎస్‌సీఏడీలను దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ ప్రణాళికలను త్వరిత గతిన అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పశుగణ బీమా, గ్రామీణాభివృద్ధి విభాగాలతో కలిసి దాణా సంబంధిత ప్రణాళిక రూపకల్పన, ఇన్‌ఫ్లుయెంజాను ఎదుర్కొనేందుకు సన్నాహాలు, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ (ఎఫ్‌ఎండీ) జాడ ఉండని జోన్ల ఏర్పాటుతో పాటు జిల్లా రోగనిర్ధారణ ప్రయోగశాలల పటిష్ఠీకరణ వంటి అంశాలను కూడా సమావేశంలో సమీక్షించారు.
ప్రశ్న‑జవాబుల రూపంలో నిర్వహించిన కార్యక్రమంతో ఈ సమావేశాన్ని ముగించారు. రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రశ్నలకుడీఏహెచ్‌డీ అధికారులు సమాధానాలిచ్చారు. కార్యక్రమంలో పాలుపంచుకున్న వారు సంస్కరణలను, పథకాలను కాలబద్ధ పద్ధతిలో అమలు చేస్తామని, కేంద్ర‑రాష్ట్ర సమన్వయాన్ని బలోపేతం చేస్తామని, పశు సంవర్ధకంతో పాటు పశుగణ రంగంలో సేవలను విస్తృతం చేస్తామంటూ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
ఈ వర్క్‌షాపునకు హాజరైన వారిలో అదనపు కార్యదర్శి (ఎల్‌హెచ్) శ్రీ రామ శంకర్ సిన్హాతో పాటు డాక్టర్ నవీన కూడా ఉన్నారు. వీరికి తోడు పశుసంవర్ధక కమిషనరు శ్రీ బి. మహేశ్వరప్ప, సంయుక్త కార్యదర్శి (ఎన్ఎల్ఎమ్) డాక్టర్ ముత్తుకుమారస్వామి. బి, డీఏహెచ్‌డీ గణాంక సలహాదారు శ్రీ జగత్ హజారికాలే కాకుండా, పశుసంవర్ధక విభాగానికి చెందిన అదనపు ముఖ్య కార్యదర్శులు/ప్రధాన కార్యదర్శులు/ కార్యదర్శులు, పశుసంవర్ధకం, పశు చికిత్స సేవల డైరెక్టరేట్‌కు చెందిన డైరెక్టర్లు, అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2253187)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7