ఆర్థిక మంత్రిత్వ శాఖ
మనీ లాండరింగ్, ఆర్థిక నేరాలను ఎదుర్కొనేందుకు భారత ఆర్థిక నిఘా యూనిట్, సెబీ మధ్య కుదిరిన ఎంవోయూ
నాడు పోస్టు చేయడమైనది:
16 APR 2026 1:19PM by PIB Hyderabad
మనీ లాండరింగ్, ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను మరింత బలోపేతం చేసే దిశగా భారత ఆర్థిక నిఘా యూనిట్ (ఎఫ్ఐయూ-ఐఎన్‌డీ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇది రెండు సంస్థల మధ్య సమాచారం పంచుకోవడాన్ని, సమన్వయాన్ని పెంచుతుంది.
ఎఫ్ఐయూ-ఐఎన్‌డీ డైరెక్టర్ శ్రీ అమిత్ మోహన్ గోవిల్, సెబీలో పూర్తి కాల సభ్యులు శ్రీ సందీప్ ప్రధాన్ ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు. మనీ లాండరింగ్, ఆర్థిక నేరాలపై భారత్ సాగిస్తున్న పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రెండు సంస్థల మధ్య నిఘా సమాచారాన్ని పంచుకోవడంలో కొత్త శకానికి ఈ ఒప్పందం నాంది పలికింది.


తమ డేటాబేస్‌లో అందుబాటులో ఉన్న సంబంధిత నిఘా, సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం ఈ ఒప్పందంలో భాగంగా ఉంది. అలాగే పీఎంల్ నియమాల ప్రకారం నియంత్రణ, నివేదిక సంస్థలు ఎఫ్ఐయూ-ఐఎన్‌డీకి సమాచారాన్ని అందించడానికి అవసరమైన విధానాలను, నమూనాలను రూపొందించడం కూడా ఒప్పందంలో భాగంగా ఉంది. ఎగ్మాంట్ సమాచార మార్పిడి సూత్రాల ద్వారా విదేశీ ఎఫ్ఐయూలతో సమాచారాన్ని పంచుకోవడంలో కూడా ఈ ఎంవోయూ సాయపడుతుంది.
నియంత్రణ/నివేదిక సంస్థల కోసం అవగాహన, శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసేలా రెండు సంస్థలకు వీలు కల్పించడమే ఈ ఎంవోయూ లక్ష్యం. ఇది సెబీ నియంత్రణలో ఉన్న సంస్థల్లో మనీలాండరింగ్ నిరోధక, ఉగ్రవాదులకు ఆర్థిక సహకారాన్ని అడ్డుకొనే (ఏఎంఎల్/సీఎఫ్టీ) సామర్థ్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తుంది. అలాగే ఇరుపక్షాలు అంతర్జాతీయ నియమాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ... సమాచారాన్ని పంచుకొనేందుకు, పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై చర్చించేందుకు త్రైమాసిక సమావేశాలను నిర్వహించాలి.
సంబంధిత ఆర్థిక ఉప రంగాల్లో మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం (ఎంఎల్/టీఎఫ్) ముప్పులను, బలహీనతలను అంచనా వేయడం, అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన హెచ్చరికలను గుర్తించి, ప్రచారం చేయడం ఈ సహకారంలో భాగంగా ఉన్నాయి. వీటితో పాటుగా.. పీఎంఎల్ఏ, పీఎంఎల్ నియమాలు, సెబీ మార్గదర్శకాల ప్రకారం నివేదిక సంస్థలు తమ విధులను నిర్వర్తిస్తున్న తీరును పర్యవేక్షించడం కూడా ఈ ఒప్పందంలో భాగమే.
భారత ఆర్థిక నిఘా యూనిట్ (ఎఫ్ఐయూ-ఐఎన్‌డీ) గురించి:
అనుమానిత ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని స్వీకరించి, విశ్లేషించి, ప్రసారం చేయడం, మనీలాండరింగ్, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయానికి వ్యతిరేకంగా సమన్వయ చర్యలు తీసుకొనే బాధ్యతలను జాతీయ సంస్థ ఎఫ్ఐయూ-ఐఎన్‌డీ చేపడుతుంది.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) గురించి
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా చట్టం - 1992 ప్రకారం చట్టబద్ధమైన సంస్థగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ)ను ఏర్పాటు చేశారు. ఇది భారత్‌లోని సెక్యూరిటీస్ మార్కెట్ల నియంత్రణ, పర్యవేక్షణ చేపడుతుంది. అలాగే పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తుంది. మార్కెట్ వ్యవస్థలో పారదర్శకత, సమగ్రత, క్రమబద్ధమైన పనితీరును నిర్ధారించేందుకు మార్కెట్ మధ్యవర్తులు, నమోదిత సంస్థలు, ఇతర భాగస్వాములకు సమగ్రమైన నియంత్రణ, పర్యవేక్షణా విధానాన్ని సెబీ అందిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2252627)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11