బొగ్గు మంత్రిత్వ శాఖ
ఈ నెల 17న ముంబయిలో 15వ వాణిజ్య బొగ్గు గనుల వేలాన్ని, భాగస్వాములతో సంప్రదింపులను నిర్వహించనున్న బొగ్గు మంత్రిత్వశాఖ
నాడు పోస్టు చేయడమైనది:
16 APR 2026 10:33AM by PIB Hyderabad
వాణిజ్య బొగ్గు గనుల 15వ విడత వేలంతో పాటుగా, ‘‘ఆత్మనిర్భర భారత్: ఇంధన భద్రత కోసం బొగ్గు’’ అంశంపై ఈ రంగంలోని నిపుణులతో సంప్రదింపులను 2026 ఏప్రిల్ 17న బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది. ముంబయిలో జరిగే ఈ కార్యక్రమానికి బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. పెరుగుతున్న దేశ ఇంధన అవసరాలకు మద్దతును అందించడంలో, ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మంత్రిత్వ శాఖ చిత్తశుద్ధిని ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది.
వాణిజ్య గనుల వేలం సాధించిన విజయం ఆధారంగా వృద్ధి, సామర్థ్యం, స్వావలంబనపై దృష్టి సారిస్తూ... దేశ ఇంధన రంగాన్ని బొగ్గు మంత్రిత్వ శాఖ బలోపేతం చేస్తోంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో 2020లో వాణిజ్య బొగ్గు తవ్వకాలను ప్రారంభించినప్పటి నుంచి దేశీయంగా బొగ్గు లభ్యత పెరిగింది. జాతీయ ఇంధన భద్రత బలోపేతమైంది.
త్వరలో నిర్వహించే 15వ విడత వేలం కూడా ఈ పురోగతిని కొనసాగిస్తుంది. అలాగే వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహించడానికి, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి అత్యంత ఉదారమైన నిబంధనలతో బొగ్గు గనులను అందిస్తోంది. పూర్తిగా, పాక్షికంగా అన్వేషించిన బొగ్గు గనులను ఈ దఫాలో వేలం వేస్తారు. అనుభవజ్ఞులైన గనుల తవ్వకందారులు, ఈ రంగంలోకి కొత్తగా ప్రవేశించినవారు, సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే సంస్థలను ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నారు. ఇది మరింత శక్తిమంతమైన, పోటీతత్వం నిండిన వ్యవస్థను ఏర్పాటు చేసి బొగ్గు రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో పెట్టుబడుల విస్తరణకు, ఉపాధి కల్పనకు, ఈ రంగం సమగ్రాభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు.
పారదర్శకతను, పోటీతత్వాన్ని, అందరికీ సమాన అవాశాలను కల్పించడం ద్వారా వాణిజ్య బొగ్గు గనుల వేలం విధానం బొగ్గు రంగంలో మార్పులను తీసుకువచ్చింది. ఇది దేశీయ పరిశ్రమలకు బొగ్గు లభ్యతను గణనీయంగా పెంచింది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి ఆత్మనిర్భర భారత్ లక్ష్యానికి తోడ్పాటునందించింది.
ఆర్థిక ప్రగతిలో కీలకమైన విధానంగా వాణిజ్య బొగ్గు గనుల తవ్వకం నిలిచింది. ఇది బొగ్గు ఉత్పత్తిని పెంచి, దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలకు స్థిరంగా, విశ్వసనీయంగా సరఫరా చేస్తోంది. ఈ బలమైన పునాదిపై ఆధారపడే రాబోయే విడత వేలం జరుగుతుంది. తద్వారా ఈ రంగంపై, దాని భవిష్యత్తు సామర్థ్యంపై విశ్వాసాన్ని మరింత పెంపొందిస్తుంది.
దేశానికి విశ్వసనీయమైన, సరసమైన ఇంధనాన్ని అందించేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. అలాగే ఈ రంగంలో సుస్థిరాభివృద్ధి, ఆవిష్కరణ, దీర్ఘకాల స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2252495)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11