గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఖనిజాల రాయితీ నియమాలకు భారీ సవరణలను ప్రకటించిన గనుల మంత్రిత్వ శాఖ... బీహెచ్‌క్యూ, బీహెచ్‌జే సహా నిర్దేశిత పరిమితి (థ్రెషోల్డ్) విలువ కన్నా తక్కువగా ఉన్న హెమటైట్ ఇనుప ఖనిజపు సగటు అమ్మకపు ధర ప్రచురణకు విధానాలు

నాడు పోస్టు చేయడమైనది: 14 APR 2026 11:10AM by PIB Hyderabad

ఖనిజాల (అణు, హైడ్రో కార్బన్ శక్తి ఖనిజాలు మినహా) రాయితీ (మూడో సవరణ) నియమాలు- 2026ను ఏప్రిల్ 10న గనుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బ్యాండెడ్ హెమటైట్ క్వార్ట్‌జైట్ (బీహెచ్‌క్యూ), బ్యాండెడ్ హెమటైట్ జాస్పర్ (బీహెచ్‌జే) సహా.. నిర్దేశిత విలువ కన్నా తక్కువగా ఉన్న హెమటైట్ ఇనుప ఖనిజపు సగటు అమ్మకపు ధర ప్రచురణకు సంబంధించిన పద్ధతిని ఈ నియమాలు తెలియజేస్తున్నాయి.

తవ్వకాల్లో లభించిన పదార్థాన్ని ఏ పరిమితి కన్నా తక్కువగా ఉంటే వ్యర్థంగా వదిలేయొచ్చో తెలిపే కనిష్ట స్థాయే ఒక ఖనిజపు నిర్దేశిత పరిమితి విలువ (థ్రెషోల్డ్ విలువ). హెమటైటిక్ ఇనుప ఖనిజపు నిర్దేషిత పరిమితి (థ్రెషోల్డ్) విలువను 45% Fe (కనిష్టం)గా నిర్ణయించారు. ఈ విలువ కన్నా తక్కువ నాణ్యత కలిగిన ఇనుప ఖనిజం నిల్వలు మన దేశంలో భారీగా ఉన్నాయి. ఇందులో కొంత భాగం బీహెచ్‌క్యూ లేదా బీహెచ్‌జే రూపంలో ఉంది. ఇవి ఇనుప ఖనిజానికి ప్రధాన ఆధార శిలలు. అయితే ప్రాసెసింగ్, ఖనిజ శుద్ధి సాంకేతికత మెరుగుపడడంతో.. బీహెచ్‌క్యూ, బీహెచ్‌జేలతోపాటు నిర్దేశిత పరిమితి విలువకు కింద ఉన్న ఇనుప ఖనిజ వనరులు శుద్ధి ప్రక్రియకు అనుకూలంగా మారి, ఉక్కు తయారీకి అవసరమైన అత్యుత్తమ గ్రేడ్ ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసేందుకు అవకాశముంది. ఇలాంటి తక్కువ నాణ్యత గల ఇనుప ఖనిజాన్ని శుద్ధి చేసే ప్రక్రియను ప్రోత్సహించడం కోసం ఒక సరైన విధానం అవసరమైంది.

నిబంధనల్లో ప్రస్తుత సవరణలకు ముందు.. నిర్దేశిత పరిమితి విలువ (అంటే 45% Fe) కన్నా తక్కువ నాణ్యత కలిగిన హెమటైట్ ఇనుప ఖనిజం (బీహెచ్‌క్యూ, బీహెచ్‌జే సహా) సగటు అమ్మకపు ధరను (ఏఎస్పీ) ప్రచురించేందుకు ఎలాంటి కచ్చితమైన పద్ధతీ లేదు. దాంతో నిర్దేశిత పరిమితి (థ్రెషోల్డ్) విలువకు పైన ఉన్న అతి తక్కువ గ్రేడ్ (అంటే 45% నుండి 51% Fe గ్రేడ్) సగటు ధరనే వీటికి కూడా వర్తింపజేసేవారు. ఇలా నిర్దేశిత పరిమితి విలువకు తక్కువగా ఉన్న ఖనిజాలపై కూడా నాణ్యమైన ఖనిజపు సగటు అమ్మకపు ధరల ప్రాతిపదికన రాయల్టీ, వేలం ప్రీమియం వంటివి విధించడం వల్ల.. ఆ ఖనిజాలను శుద్ధి చేయడం ఆర్థికంగా భారమయ్యేది. నిబంధనల్లో ప్రస్తుత సవరణ ఈ సమస్యను పరిష్కరిస్తుంది. దీని ప్రకారం.. నిర్దేశిత పరిమితి (థ్రెషోల్డ్) విలువ కన్నా తక్కువ Fe కంటెంటు ఉన్న హెమటైట్ ఇనుప ఖనిజపు సగటు విక్రయ ధరను (ఏఎస్పీ) కింది విధంగా లెక్కిస్తారు:

(a)  35 శాతం నుంచి 45 శాతం లోపు Fe గ్రేడ్ కలిగిన ఇనుప ఖనిజపు సగటు విక్రయ ధర (ఏఎస్పీ).. 45 శాతం నుంచి 51 శాతం లోపు Fe గ్రేడ్ కలిగిన ఇనుప ఖనిజపు సగటు విక్రయ ధరలో 75 శాతానికి సమానంగా ఉంటుంది.

(b) 35 శాతం కన్నా తక్కువ Fe గ్రేడ్ కలిగిన ఇనుప ఖనిజానికి సంబంధించి.. 45 శాతం నుంచి 51 శాతం లోపు Fe గ్రేడ్ కలిగిన ఇనుప ఖనిజపు సగటు విక్రయ ధరలో 50 శాతానికి సమానంగా ఉంటుంది.

తక్కువ నాణ్యత గల వనరులను వినియోగార్హమైన విభాగంలోకి తేవడం వల్ల.. అధిక నాణ్యత కలిగిన ఇనుప ఖనిజ నిల్వలు తగ్గిపోతున్నాయన్న ఆందోళన తగ్గుతుంది. ఇది ఉక్కు పరిశ్రమకు అవసరమైన ఖనిజ సరఫరా నిరంతరం కొనసాగేలా చేస్తుంది. తక్కువ నాణ్యత కలిగిన ఇనుప ఖనిజ వనరులను ఉపయోగించుకోవడం వల్ల ఖనిజాల పరిరక్షణతోపాటు.. శాస్త్రీయమైన, అత్యంత సమర్థమైన ఇనుప ఖనిజపు మైనింగుకు ప్రోత్సాహం లభిస్తుంది. దాంతో ఇనుప ఖనిజం విషయంలో దేశ స్వావలంబన కొనసాగుతుంది.

రన్-ఆఫ్-మైన్‌ను ప్రాసెస్ చేయడం వల్ల దాని ఆర్థిక విలువ తగ్గితే.. ప్రాసెస్ చేయకముందున్న ముడి ఖనిజాన్ని ప్రాథమికంగా స్క్రీనింగ్ చేసిన తర్వాత మిగిలిన ముద్దలు, పొడి రూపంలోని సూక్ష్మకణాలపైనే రాయల్టీ వసూలు చేయాలని ప్రస్తుత నిబంధనల సవరణ స్పష్టం చేస్తోంది. ‘రన్-ఆఫ్-మైన్’ అంటే.. గని ప్రాంతం లేదా లీజు ప్రాంతం నుంచి పేలుడు లేదా తవ్వకం ద్వారా సేకరించిన, ఎలాంటి శుద్ధి చేయని లేదా నలపని సహజ స్థితిలో ఉన్న ముడి ఖనిజ పదార్థం. ఖనిజ సాంద్రతను పెంచడానికి, మలినాలను తొలగించడానికి, పరిశ్రమలకు ఉపయోగపడే రూపంలోకి మార్చడానికి ఈ ముడి ఖనిజాన్ని ప్రాసెస్ చేయడం అవసరం. అయితే, రన్-ఆఫ్-మైన్ ప్రాసెసింగ్ పేరుతో ఖనిజపు ఆర్థిక విలువను తగ్గించడానికి వీల్లేదని ప్రస్తుత సవరణ స్పష్టం చేస్తోంది.

`1***


(రిలీజ్ ఐడి: 2251892) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi