పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
భారత్‌లో జన్మించిన ఆడ చిరుతకు కునో జాతీయ పార్క్‌లో నాలుగు కూనలు జననం
ఇది భారతదేశపు 'చీతా సంరక్షణ ప్రయాణం'లో ఒక చారిత్రాత్మక ఘట్టం: శ్రీ భూపేందర్ యాదవ్
నాడు పోస్టు చేయడమైనది:
11 APR 2026 5:26PM by PIB Hyderabad
భారతదేశ చీతా సంరక్షణ ప్రయాణంలో ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఈ రోజు కొనియాడారు. భారత్‌లో జన్మించిన ఆడ చిరుత (గామిని మొదటి సంతతిలోని రెండవ పిల్ల - కేపీజీ12, వయస్సు 25 నెలలు), మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్క్ పరిధిలోని అడవిలో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది.
సామాజిక మాధ్యమంలో ఒక పోస్టులో శ్రీ భూపేందర్ యాదవ్.. ఈ పరిణామాన్ని కునో జాతీయ పార్క్, దేశవ్యాప్త వన్యప్రాణి సంరక్షణ ప్రయత్నాల్లో ఒక ‘కీలక ఘట్టంగా’ అభివర్ణించారు. ఏడాదికి పైగా అడవిలో సహజ సిద్ధంగా జీవిస్తోన్న గామిని సంతతికి చెందిన ఈ ఆడ చిరుత.. సహజ వాతావరణ పరిస్థితులలో విజయవంతంగా నాలుగు పిల్లలకు జన్మనిచ్చిందని ఆయన పేర్కొన్నారు. 'చీతా పునరుద్ధరణ కార్యక్రమం'లో ఇది ఒక ప్రధాన ముందడుగు అని ఆయన వెల్లడించారు.
2022లో చీతా పునరుద్ధరణ ప్రారంభమైనప్పటి నుంచి అడవిలో సహజ సిద్ధంగా పిల్లలు జన్మించడం ఇదే మొదటిసారన్న కేంద్ర మంత్రి.. అందులో భారత్‌లో జన్మించిన ఆడ చిరుత పిల్లలకు జన్మనివ్వడం అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయమని ప్రముఖంగా పేర్కొన్నారు. దేశంలో సహజ వాతావరణ పరిస్థితులలో చిరుతలు మనుగడ సాగించడం, సంతానోత్పత్తిని నిర్ధారించడం వంటి ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యాలను చేరుకోవడంలో ఈ పరిణామం ఒక గొప్ప విజయమని ఆయన స్పష్టం చేశారు.
భారతదేశ పర్యావరణ పరిస్థితులకు చిరుతలు క్రమంగా అలవాటు పడుతున్నాయన్న విషయాన్ని ఈ పురోగతి తెలియజేస్తోందని శ్రీ భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. కునో జాతీయ పార్క్‌లో కొనసాగుతున్న నిరంతర సంరక్షణ చర్యలు, శాస్త్రీయ నిర్వహణ ప్రయత్నాల విజయానికి ఇది నిదర్శనమని ఆయన వెల్లడించారు.
చీతా సంరక్షణ కార్యక్రమంలో నిమగ్నమైన వన్యప్రాణి నిర్వాహకులు, పశువైద్యులు, క్షేత్రస్థాయి సిబ్బంది కనబరుస్తున్న అంకితభావం, నిరంతర కృషిని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అభినందించారు. ఈ పరిణామాన్ని దేశానికే గర్వకారణమైన ఘట్టంగా ఆయన అభివర్ణించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
***
(రిలీజ్ ఐడి: 2251304)
సందర్శకుల సూచీ సంఖ్య : : 33