మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
కేంద్రమంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన న్యూఢిల్లీలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారుల సమావేశం-2026.. ప్రపంచ మార్కెట్లో విస్తరణకు వ్యూహరచన
విలువ ఆధారిత మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల పెంపు.. ఈఈజడ్, అంతర్జాతీయ జలాల్లోని సముద్ర వనరుల వినియోగంపై భారత్ దృష్టి
సరికొత్త లక్ష్యాలను అధిగమించిన భారత సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులు.. గతేడాది రూ.62,000 కోట్ల ఎగుమతులు, ఈ ఏడాది రూ.68,000 కోట్ల ఎగుమతులు, దాదాపు రూ.6,000 కోట్ల నికర వృద్ధి
నాడు పోస్టు చేయడమైనది:
11 APR 2026 7:23AM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని అంబేద్కర్ భవన్‌లో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారుల సమావేశం-2026ను కేంద్ర మత్స్య శాఖ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ పరిధిలోని మత్స్య విభాగం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ (ఎంఓఎఫ్ఏహెచ్‌డీ), పంచాయతీరాజ్ శాఖ (ఎంఓపీఆర్) మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంఓఎఫ్ఏహెచ్‌డీ, ఎంఓపీఆర్ శాఖ సహాయమంత్రి ప్రొఫెసర్ ఎస్.పీ. సింగ్ బఘేల్, ఎంఓఎఫ్ఏహెచ్‌డీ, మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ జార్జ్ కురియన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం, పరిశ్రమల భాగస్వాముల మధ్య నిర్మాణాత్మక చర్చలకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మార్కెట్ లభ్యత, ధరల ఒత్తిడి, నిబంధనల అమలు వంటి అంశాల్లో ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లపై అభిప్రాయాలను తెలుసుకోవటమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ద్వీపాలు, ఈఈజడ్ బహిరంగ సముద్రాల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల పెంపు, మార్కెట్ విస్తరణ, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.
సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులను పెంచటంలో ఎగుమతిదారులు చేస్తున్న కృషిని కేంద్రమంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ, అమెరికా మినహా ఇతర మార్కెట్లలో కనబరిచిన అద్భుతమైన వృద్ధి వల్ల భారత సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో పటిష్టమైన అభివృద్ధి నమోదైనట్లు ఆయన స్పష్టం చేశారు. నిరంతరాయంగా కొత్త మార్కెట్ల అన్వేషణ, ఉత్పత్తుల్లో వైవిధ్యాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూనే.. యాంటీబయాటిక్స్ నిషేధాన్ని పాటించటం, ఉత్పత్తి మూలాలను గుర్తించే వ్యవస్థలను బలోపేతం చేయటం వంటి కఠినమైన నియంత్రణ నిబంధనలను పాటించాలని మంత్రి స్పష్టం చేశారు. ఈఈజడ్ నిబంధనలను ప్రస్తావిస్తూ.. యాక్సెస్ పాస్‌ల ద్వారా ఈ వ్యవస్థను అమల్లోకి తెస్తున్నామని, సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించటానికి సహకార సంఘాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అండమాన్, నికోబార్ దీవులు, ఈఈజడ్, అంతర్జాతీయ సముద్ర జలాల నుంచి లభించే ట్యూనా వంటి అత్యంత విలువైన చేప రకాల ఎగుమతి సామర్థ్యాన్ని ఆయన స్పష్టం చెప్పారు. చేపల వేట తర్వాత జరిగే నష్టాలను తగ్గించటానికి, ఎగుమతి వ్యవస్థను బలోపేతం చేయటానికి పడవల్లోనే వాటిని భద్రపరిచే విధానాలను మెరుగుపరచాలని, శీతలీకరణ వ్యవస్థలకు సంబంధించి పటిష్ఠమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని, మెరుగైన ప్యాకేజింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ప్రత్యామ్నాయ మార్కెట్ల అన్వేషణ అవసరమని ఆయన పిలుపునిచ్చారు. లక్ష కోట్ల రూపాయల ఎగుమతి లక్ష్యాన్ని సాధించే దిశగా ఎగుమతిదారులు కృషి చేయాలని, బహిరంగ మార్కెట్ విధానాన్ని అవలంబించాలని కోరారు. ఇందుకోసం ఈఐసీ, ఎన్‌సీడీసీ, నాబార్డ్, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వంటి సంస్థల నుంచి పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. అండమాన్, నికోబార్ దీవుల్లో నిర్వహించిన పెట్టుబడిదారుల సమావేశం గురించి కూడా ప్రస్తావించారు. ఈ సమావేశం ద్వారా సముద్రంలో పంజరపు పెంపకం, ముత్యాల సాగు, లోతైన సముద్ర ప్రాంతాల్లో చేపల వేటకు ఉపయోగించే నౌకల వంటి వాటిల్లో పెట్టుబడులు పెరిగాయని, ఇవి మత్స్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన చెప్పారు.
మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయమంత్రి శ్రీ జార్జ్ కురియన్ మాట్లాడుతూ.. బడ్జెట్ అనంతర వెబినార్-2026 లక్ష్యాలకు అనుగుణంగా మత్స్య రంగాన్ని అత్యంత విలువైనదిగా, అధిక డిమాండ్ గల రంగంగా తీర్చిదిద్దేందుకు సమష్టి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో కనిపిస్తున్న ప్రోత్సాహకరమైన వృద్ధిని ప్రస్తావిస్తూ.. ఎగుమతిదారులు చేస్తున్న నిరంతర ప్రయత్నాలను అభినందించారు. ఎగుమతుల వృద్ధిని నిలబెట్టుకోవటానికి ఉత్పత్తి మూలాలను గుర్తించటం, నాణ్యత ధ్రువీకరణలతో కఠినమైన నిబంధనల అమలు, పటిష్టమైన రవాణా వ్యవస్థ, విలువ వ్యవస్థ అభివృద్ధి అత్యంత ఆవశ్యకమని వ్యాఖ్యానించారు.
కేంద్ర మత్స్య విభాగ కార్యదర్శి అభిలక్ష్ లిఖీ ప్రసంగిస్తూ.. ఎంపీఈడీఏ, ఈఐసీ, వాణిజ్య శాఖల సమన్వయంతో విభిన్న మార్కెట్ విస్తరణ వ్యూహాన్ని రూపొందించినట్లు తెలిపారు. దాదాపు నలభై దేశాల రాయబారులతో జరిపిన దౌత్యపరమైన చర్చలు ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇచ్చాయని ఆయన స్పష్టం చెప్పారు. మార్కెట్ విస్తరణతో పాటుగా, తినటానికి, వండటానికి సిద్ధంగా ఉండే, విలువ ఆధారిత సముద్ర ఆహార ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందని తెలిపారు. సముద్ర ఆహార ఎగుమతులను ప్రోత్సహించటానికి ఎగుమతిదారులకు, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలకు మధ్య నేరుగా సంబంధాలను ఏర్పరచటానికి మత్స్య శాఖ సహకరిస్తుందని తెలిపారు. ఎగుమతిదారులకు మద్దతు ఇవ్వటానికి, నాణ్యతా ప్రమాణాలు, పోటీతత్వం, ఎగుమతి సంసిద్ధతను మెరుగుపరచటానికి అవసరమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేయాలని ఎంపీఈడీఏను కోరారు.
సమావేశంలో పాల్గొన్న వాటాదారులు భారత ప్రభుత్వ క్రియాశీల మద్దతును అభినందించారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులను పెంచటంలోని ప్రధాన సవాళ్లను, అవకాశాలను వివరించారు. ముఖ్యంగా చేపల వేట ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను సరళతరం చేయాలని.. అండమాన్, నికోబార్ దీవుల్లో కప్పాఫైకస్ రకపు సముద్రపు పాచి సాగుకు అనుమతులను సులభతరం చేయాలని కోరారు. శాస్త్రీయ పద్ధతిలో నాణ్యమైన చేపల మేతను తయారు చేసేందుకు ఫిష్-మీల్ తయారీదారులకు ప్రత్యేక మద్దతును అందించాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ తీరంలో మంచినీటి మత్స్య సాగు, సముద్ర సాగు ఎగుమతి సామర్థ్యాన్ని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. ఎగుమతులపై ప్రభావం చూపే ఇతర సవాళ్లపైనా దృష్టి సారించారు. వీటిలో ప్రధానంగా సుంకాలు, మార్కెట్ ప్రవేశంలో ఆటంకాలు, అధిక నిర్వహణ ఖర్చులు, వాల్యూ-యాడెడ్ ప్రాసెసింగ్ సామర్థ్య లోపాలు, శీతలీకరణ వ్యవస్థలు రవాణా ఇబ్బందులున్నాయి. వీటన్నింటితో పాటు మూలాలను గుర్తించి, ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించే వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని వారు సూచించారు.
ఈ సమావేశానికి సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి అథారిటీ (ఎంపీఈడీఏ), జాతీయ మత్స్య సంపద అభివృద్ధి బోర్డు (ఎన్ఎఫ్‌డీబీ), ఎక్స్‌పోర్టు ఇన్‌స్పెక్షన్ కౌన్సిల్ (ఈఐసీ), జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్), నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ), నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్సు లిమిటెడ్ (ఎన్‌సీఈఎల్), ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఓఎఫ్‌పీఐ), ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖల అధికారులు హాజరయ్యారు. వీరితో పాటు సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెరైన్ ఇంగ్రీడియంట్స్ అసోసియేషన్, సీవీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి ఎగుమతిదారుల సంఘాల ప్రతినిధులు.. సీ6 ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, సాషిమి ఫుడ్స్, ఆక్వాగ్రి ప్రాసెసింగ్, అనేమ్కో, ఓషియానిక్ హోరిజన్ వంటి పరిశ్రమల ప్రతినిధులు, వివిధ సహకార సంఘాలు, ఎగుమతిదారులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వ మత్స్య విభాగ సీనియర్ అధికారులతో పాటు ఒడిశా, గుజరాత్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, గోవా, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ మత్స్య శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
నేపథ్యం
భారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు గత 11 ఏళ్లలో సగటున 7 శాతం వార్షిక వృద్ధి రేటుతో స్థిరమైన, బలమైన వృద్ధిని నమోదు చేశాయి. ఈ సమయంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు రెట్టింపునకు పైగా పెరిగాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 30,213 కోట్లుగా ఉన్న ఎగుమతులు, 2024-25 నాటికి రూ. 62,408 కోట్లకు చేరాయి. ఇందులో ప్రధానంగా రూ. 43,334 కోట్ల విలువైన రొయ్యల ఎగుమతులు కీలకమైనవి.
భారతదేశపు సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతులు ఎంతో వైవిధ్యమైనవి. సుమారు 350కి పైగా రకాల ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 130 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతి విలువలో 36.42శాతం వాటాతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో చైనా, యూరోపియన్ యూనియన్, ఆగ్నేయాసియా, జపాన్, మధ్యప్రాచ్య దేశాలు, మిగిలిన మార్కెట్లతో కలిపి సుమారు 9 శాతం వాటాతో ఉన్నాయి. కేవలం కొన్ని రకాల ఉత్పత్తులపైనే అతిగా ఆధారపడటాన్ని తగ్గించటానికి, ప్రపంచ మార్కెట్లో ఉనికిని మరింత బలోపేతం చేసుకోవటానికి, ఎగుమతి చేసే ఉత్పత్తుల జాబితాను వైవిధ్యభరితంగా మార్చేందుకు భారత ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) ద్వారా విలువ ఆధారిత వ్యవస్థ అంతటా మత్స్య శాఖ వివిధ రకాల సహాయక చర్యలను అందిస్తోంది. ఇందులో నాణ్యమైన చేప పిల్లల ఉత్పత్తి, ఉప్పునీటి సాగు విస్తరణ, వైవిధ్యత, ఎగుమతి ఆధారిత జాతుల ప్రోత్సాహం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటం, వ్యాధి నిర్ధారణ, నిర్వహణ, ఉత్పత్తి మూలాలను గుర్తించటం, నైపుణ్యాల పెంపు వంటివి ఉన్నాయి. వీటితో పాటు పంట అనంతర మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటానికి, నిరంతర శీతల గిడ్డంగి వ్యవస్థలు, ఆధునిక మత్స్యకార ఓడరేవులు, చేపల ల్యాండింగ్ కేంద్రాల ఏర్పాటునకు భారీగా పెట్టుబడులు పెడుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2251298)
సందర్శకుల సూచీ సంఖ్య : : 22