సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సహకార బ్యాంకింగ్ విస్తరణ, శ్వేత విప్లవం 2.0, సాంకేతికత ఆధారిత సహకార సంస్థల వృద్ధిపై దృష్టి సారించిన వారణాసి జాతీయ సదస్సు


నిధుల వినియోగాన్ని మెరుగుపరచి సహకార పథకాల అమలును వేగవంతం చేయాలని, రాష్ట్రాలకు విజ్ఞప్తి

పోటీ ఉన్నప్పటికీ భారత్ ట్యాక్సీ కార్యకలాపాల విస్తరణ; కొనసాగుతున్న ప్రారంభ ప్రక్రియలు; రాబోయే సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న ప్రణాళికలు

ఎఫ్ పీఓలకు, మత్స్య, ఇతర అభివృద్ధి చెందుతున్న సహకార రంగాలకు ఆర్థిక సహాయం విస్తరించేందుకు ఎన్సీడీసీ ప్రణాళికలు

సహకార సంస్థల మధ్య పరస్పర సహకారం ద్వారా సమగ్ర విలువ శ్రేణులకు, గ్రామీణ ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహం

కీలక చోదక శక్తులుగా సాంకేతిక పరిజ్ఞానం అన్వయం, సామర్థ్య పెంపుదల, సహకార సంస్థల మధ్య పరస్పర సహకారం

రుణ పంపిణీని బలోపేతం చేయడానికి సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, కార్యకలాపాలను విస్తరించాలని సహకార బ్యాంకులకు ఆదేశం
రాష్ట్రాల ఉత్తమ విధానాలను ప్రతిబింబించిన జిల్లాల వారీ ఆవిష్కరణలు, విస్తరించదగ్గ సహకార నమూనాలు

సహకార సంవాద్ తో సహకార సంఘాలు, సంస్థల మధ్య క్షేత్రస్థాయి అనుభవాల మార్పిడి సులభతరం

నాడు పోస్టు చేయడమైనది: 10 APR 2026 6:41PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో 2026 ఏప్రిల్ 9, 10 తేదీల్లో సహకార మంత్రిత్వ శాఖ నిర్వహించిన 7వ జాతీయ సమీక్షా సదస్సు బ్యాంకింగ్, పాడి పరిశ్రమ, ఆర్థిక వ్యవస్థలు, కొత్త సహకార నమూనాలతో సహా కీలక రంగాల్లో సంస్కరణలను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. సంస్థాగత సామర్థ్యాన్ని పెంచడం, పథకాల అమలును వేగవంతం చేయడం ఈ సమావేశ ప్రధాన ఉద్దేశం. క్షేత్రస్థాయిలో అడ్డంకులను తొలగించి, విధానపరమైన నిర్ణయాలు స్పష్టమైన ఫలితాలను ఇచ్చేలా చర్యలు తీసుకోవడంపై ఈ చర్చలు సాగాయి.

రెండు రోజుల జాతీయ సమీక్ష సదస్సు ముగింపు సమావేశంలో కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశిష్ కుమార్ భుతానీ ప్రసంగించారు. తదుపరి దశ సంస్కరణలు క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన అమలుపై ఆధారపడి ఉంటాయని ఆయన చెప్పారు. దీనికి భాగస్వాముల మధ్య మెరుగైన సమన్వయం, సకాలంలో వనరుల వినియోగం తోడ్పడతాయని తెలిపారు. గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, కేవలం కాలానుగుణ సమీక్షలకే పరిమితం కాకుండా, విధానపరమైన లక్ష్యాలకు అనుగుణంగా అమలు వేగవంతం కావాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా పురోగతి తక్కువగా ఉన్న రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నిర్ణయాలు వేగంగా తీసుకోవడం, సంస్థల మధ్య బలమైన సమన్వయం ఉండటం వల్ల స్పష్టమైన, శాశ్వతమైన ఫలితాలను సాధించవచ్చని ఆయన స్పష్టం చేశారు.

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పిఏసీ) కంప్యూటరీకరణ, విస్తరణపై డాక్టర్ ఆశిష్ కుమార్ భుతానీ ప్రసంగిస్తూ.. ప్రస్తుతం కొనసాగుతున్న దశలను నిర్ణీత సమయంలో పూర్తి చేయడం, పిఏసీల బలోపేతానికి చేపట్టిన కార్యక్రమాలను అదే వేగంతో ముందుకు తీసుకెళ్లడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. నాణ్యమైన ఫలితాలను సాధించడానికి పటిష్టమైన అమలు యంత్రాంగం, నిరంతర పర్యవేక్షణ అవసరమని ఆయన చెప్పారు. అమలు ప్రక్రియలో భాగస్వాములైన వారు మరింత జవాబుదారీతనంతో ఉండాలని, వారి పనితీరు ఆధారంగానే మూల్యాంకనం జరగాలని ఆయన కోరారు. పథకాల ప్రారంభం సజావుగా సాగేలా సంస్థాగత సహాయక వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. నిరంతర శిక్షణ, సామర్థ్య పెంపుదల ప్రాముఖ్యతను ఆయన వివరించారు. నిర్దిష్ట పథకాల కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా ఈ వ్యవస్థలు సమర్థవంతంగా, స్థిరంగా కొనసాగాలని ఆయన పేర్కొన్నారు.

సహకార రంగంలో ధాన్యపు నిల్వ సామర్థ్య పెంపుదల పురోగతిని సమీక్షిస్తూ, ఈ పథకాన్ని నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయాలని, వివిధ సంస్థల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉండాలని ఆయన పేర్కొన్నారు. భూమి లభ్యతను సులభతరం చేయడం, ప్రక్రియలను సరళతరం చేయడంతో పాటు క్షేత్రస్థాయి సవాళ్లను అధిగమించడానికి వినూత్న విధానాలను అవలంబించాలని ఆయన స్పష్టం చేశారు.  అదేవిధంగా, సంస్థాగత బలోపేతంపై ఆయన ప్రసంగిస్తూ, సామర్థ్య పెంపుదల, లోపాలను గుర్తించడం, నిర్దేశిత లక్ష్య ఆధారిత చర్యల ద్వారా పాడి ఉత్పత్తి, మత్స్య రంగం వంటి వివిధ రంగాలలో సహకార పరిధిని విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రాలు తమ సహకార వ్యవస్థలను హేతుబద్ధం చేయాలని, బలోపేతం చేయాలని ఆయన కోరారు. అవసరమైన చోట పనిచేయని  సంస్థల సమస్యను పరిష్కరించాలని కూడా ఆయన సూచించారు.

గ్రామ స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు బహుళ సేవా కేంద్రాలుగా ఎదగాలని, తమ వ్యాపారాలను వైవిధ్యీకరించుకోవడం వాటికి ఎంతో ముఖ్యమని కార్యదర్శి స్పష్టం చేశారు. అదనపు ఆదాయాన్నిచ్చే కార్యకలాపాలను చేపట్టడం, సేవల పరిధిని విస్తరించడం ద్వారా ఇవి బలోపేతం కావాలని ఆయన ప్రోత్సహించారు

సహకార బ్యాంకింగ్‌పై డాక్టర్ భుతానీ ప్రసంగిస్తూ, సైబర్ భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, సురక్షితమైన డిజిటల్ వేదికలను ఏర్పాటు చేయడం, పనితీరులో సమర్థతను పెంచడం వంటి అంశాల ప్రాముఖ్యతను వివరించారు. దీనివల్ల సహకార బ్యాంకులు ఆర్థిక సవాళ్లను తట్టుకొని, మారుతున్న అవసరాలకు అనుగుణంగా సేవలందించగలవని పేర్కొన్నారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) పాత్రను ప్రస్తావిస్తూ, వివిధ రంగాలకు సకాలంలో, సులభతరమైన ఆర్థిక సహాయం అందించడంలో దీని ప్రాముఖ్యత పెరుగుతోందని చెప్పారు. సహకార సంస్థలకు ఆర్థిక వనరులను మరింత మెరుగుపరిచేందుకు నిరంతర ప్రయత్నాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

మల్టీ-స్టేట్ సహకార సంఘాల గురించి సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ, మార్కెటింగ్, బ్రాండింగ్, నాణ్యమైన ముడి సరుకులకు సంబంధించిన అందుబాటులో ఉన్న వేదికలను, సేవలను రాష్ట్రాలు చురుగ్గా ఉపయోగించుకోవాలని కోరారు. తద్వారా సహకార సభ్యులకు గరిష్ట ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. పాడి రంగంలో సహకార నిర్మాణాలను బలోపేతం చేయాలని, విలువ శ్రేణుల్లో రైతుల భాగస్వామ్యాన్ని పెంచాలని ఆయన  చెప్పారు. దీనివల్ల సహకార నమూనాల ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అందుతాయని పేర్కొన్నారు. విజయవంతమైన, స్థిరమైన సహకార నమూనాలను అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని ఆయన సూచించారు. 

సహకార రంగంలో వస్తున్న డిజిటల్ విప్లవాన్ని డాక్టర్ భుతానీ ప్రస్తావిస్తూ, ‘భారత్ టాక్సీ’ గురించి వివరించారు. ఇప్పటికే స్థిరపడిన ప్రైవేట్ సంస్థల నుంచి  తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ, భారత్ టాక్సీ వేదిక తన పరిధిని క్రమంగా విస్తరిస్తోందని ఆయన పేర్కొన్నారు. లక్నో, ముంబై, నాసిక్ వంటి నగరాల్లో ఇప్పటికే దీని ప్రయోగాత్మక ప్రారంభం జరిగిందని, రాబోయే సంవత్సరాల్లో జాతీయ స్థాయిలో దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ఆయన తెలిపారు. సహకార ఆధారిత డిజిటల్ వేదికలకు పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనమని ఆయన వెల్లడించారు.

చర్చల సారాంశాన్ని వివరిస్తూ.. తదుపరి దశ సంస్కరణల కోసం ప్రాధాన్యత కలిగిన రంగాలను ఈ సదస్సు స్పష్టంగా గుర్తించిందని సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి  పేర్కొన్నారు. నిధుల వినియోగాన్ని మెరుగుపరచడం, సహకార బ్యాంకింగ్ వ్యవస్థలను బలోపేతం చేయడం, ఎన్సీడీసీ మద్దతుతో వివిధ రంగాలకు ఆర్థిక సహాయాన్ని విస్తరించడం, సహకార సంస్థల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించడం, అలాగే పాడి, దాని అనుబంధ రంగాల పథకాల అమలును వేగవంతం చేయడం వంటి అంశాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయని ఆయన వివరించారు. సంస్థలు, వనరులు, అమలు యంత్రాంగాలు క్షేత్రస్థాయిలో ఎంత సమర్థవంతంగా సమన్వయం కాగలవనే దానిపైనే తదుపరి దశ వృద్ధి ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు. సహకార సభ్యులకు స్పష్టమైన ప్రయోజనాలను అందించడానికి ఈ సమన్వయం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.

జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డిసిసిబిలు), రాష్ట్ర సహకార బ్యాంకులు (ఎస్టిసిబిలు), పట్టణ సహకార బ్యాంకులు (యుసిబి) తో సహా సహకార బ్యాంకింగ్ సంస్థల వైవిధ్యం, ఆధునీకరణపై ఈ సదస్సు ప్రధాన దృష్టి సారించింది. వ్యాపార పోర్ట్ఫోలియోలను విస్తరించడం, పీఏసీఎస్ ల ద్వారా రుణాల లభ్యతను మెరుగుపరచడం సామర్థ్యం,  అందుబాటును పెంపొందించడానికి డిజిటల్ వేదికలను ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని ఈ చర్చల ద్వారా వివరించారు.  స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాల మధ్య సమతుల్యతను పాటించడంపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. సైబర్ భద్రత వ్యవస్థలను బలోపేతం చేయడం, సాంకేతిక ఆధారిత పరిష్కారాలను అవలంబించడం ద్వారా సహకార బ్యాంకులను మరింత పోటీతత్వంతో తీర్చిదిద్దాలని నిర్ణయించారు. దీనివల్ల మారుతున్న ఆర్థిక అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని సదస్సు అభిప్రాయపడింది.

నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నిర్వహించిన ప్రత్యేక సెషన్ ఈ సదస్సులో మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్పీఓ), మత్స్య రంగం, చక్కెర పరిశ్రమ, ఆహార సంస్కరణలు,  సముద్ర లోతుల్లో చేపల వేట వంటి వివిధ రంగాలలో విస్తరించిన ఆర్థిక సహాయ అవకాశాలను ఈ సందర్భంగా వివరించారు. అందుబాటులో ఉన్న ఆర్థిక సహాయాన్ని చురుగ్గా ఉపయోగించుకోవాలని, తద్వారా సహకార సంస్థలను పెద్ద ఎత్తున విస్తరించాలని ఈ సెషన్ స్పష్టం చేసింది. ఇలా చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చని, దేశంలోని సహకార వ్యవస్థను మరింత పటిష్టం చేయవచ్చని తెలిపింది. 

సహకార రంగాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడంపై జరిగిన చర్చలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పాడి పరిశ్రమ సహకార సంఘాలు, సమాఖ్యలు, సహకార బ్యాంకుల మధ్య సమన్వయాన్ని పెంచడం ద్వారా సమర్థవంతమైన విలువ వ్యవస్థలను సృష్టించడం, మొత్తం ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో, శ్వేత విప్లవం 2.0 పై జరిగిన చర్చలు పాల సేకరణను పెంచడం, డెయిరీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, రాష్ట్రాలు, ప్రముఖ డెయిరీ సంస్థల చురుకైన భాగస్వామ్యంతో సహకార ఆధారిత విలువ వ్యవస్థలను విస్తరించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాయి. 

రాష్ట్రాల ఉత్తమ పనితీరు తీరుతెన్నులపై  జరిగిన ప్రత్యేక సెషన్, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ‘సహకార్ సే సమృద్ధి’ నమూనాను ప్రదర్శించింది. ఇది జిల్లా స్థాయి ఆవిష్కరణలను, విస్తరించదగిన సహకార నమూనాలను ప్రముఖంగా వివరించింది. పరిపాలనాపరమైన ఏకీకరణ, సంస్థాగత సమన్వయం, స్థానిక నాయకత్వం ద్వారా సహకార రంగంలో ఎంత సమర్థవంతమైన అమలు కొలవదగిన ప్రభావం సాధించవచ్చో ఈ సెషన్ ప్రముఖంగా తెలిపింది.  ‘సహకార సంవాద్’  సెషన్ విజయవంతమైన సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సమాఖ్యలు, ఆర్థిక సంస్థల మధ్య ముఖాముఖి చర్చలకు వీలు కల్పించింది. ఈ వేదిక క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకోవడానికి, కార్యకలాపాల్లోని సవాళ్లను చర్చించడానికి, వినూత్న పద్ధతులను పరస్పరం మార్పిడి చేసుకోవడానికి ఎంతగానో దోహదపడింది.

మీడియా, కమ్యూనికేషన్ వ్యూహంపై జరిగిన ప్రత్యేక సెషన్, సహకార రంగం గురించి సానుకూల కథనాలను  విస్తృతం చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది. ప్రజల్లోకి ఈ అంశాలను బలంగా తీసుకెళ్లడంతో పాటు, అవగాహన, నమ్మకాన్ని పెంపొందించడానికి “పని చేయడం, తెలియజేయడం”  అనే విధానాన్ని అవలంబించాలని సూచించింది.

సంస్కరణలను వేగవంతం చేయడం, అమలు యంత్రాంగాలను బలోపేతం చేయడం, సహకార కార్యక్రమాలు గ్రామీణ వర్గాలకు, అలాగే విస్తృత ఆర్థిక వ్యవస్థకు అర్థవంతమైన, స్థిరమైన ఫలితాలను అందించేలా చూడాలనే కేంద్రం, రాష్ట్రాలు, సహకార సంస్థల ఉమ్మడి నిబద్ధతతో ఈ సదస్సు ముగిసింది. 

 

***


(రిలీజ్ ఐడి: 2251117) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati