యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కామన్వెల్త్ క్రీడల అధ్యక్షుడు డాక్టర్ డొనాల్డ్ రుకారేతో కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సమావేశం; ప్రతిష్ఠాత్మక 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం భారత్ సన్నద్ధతపై చర్చ

రంగులమయమైన, సాంస్కృతిక వైవిధ్యంతో క్రీడా ప్రపంచాన్ని ఆహ్వానించడానికి భారత్ సిద్ధంగా ఉంది; కామన్వెల్త్ క్రీడల శతాబ్ది వేడుకలు చిరస్మరణీయమైన క్షణంగా నిలుస్తాయి: డాక్టర్ మాండవీయ

జాతీయ అభివృద్ధి ఎజెండాలో క్రీడలను ఒక ముఖ్యమైన మైలురాయిగా మార్చినందుకు ప్రధాని మోదీని అభినందించిన కామన్వెల్త్ క్రీడల అధ్యక్షుడు

నాడు పోస్టు చేయడమైనది: 10 APR 2026 7:57PM by PIB Hyderabad

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, ఈరోజు కామన్వెల్త్ క్రీడల సీనియర్ నాయకులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. 2030లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, క్రీడాకారులే కేంద్రంగా స్థిరమైన కామన్వెల్త్ క్రీడలను నిర్వహించాలనే భారత్ నిబద్ధతను ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ) -,2030 నిర్వహణకు ఆతిథ్య దేశంగా భారత్ ను ఎంపిక చేసినందుకు, డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కామన్వెల్త్ స్పోర్ట్ ప్రతినిధి బృందానికి  ధన్యవాదాలు తెలియజేశారు.

"ఈ క్రీడలను విజయవంతంగా నిర్వహించడానికి దేశంలో ఎంతో ఉత్సాహం నెలకొంది. భారతదేశం తన రంగులమయమైన, సాంస్కృతిక వైవిధ్యంతో క్రీడా ప్రపంచాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంది. కామన్వెల్త్ క్రీడల శతాబ్ది వేడుకలు చిరస్మరణీయమైన క్షణంగా నిలుస్తాయి" అని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు.

ఖేలో ఇండియా క్రీడల విస్తరణ గురించి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కామన్వెల్త్ స్పోర్ట్ ప్రతినిధి బృందానికి వివరించారు. ఖేలో ఇండియా కింద నిర్వహిస్తున్న వివిధ రకాల క్రీడలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఇందులో మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న అస్మిత లీగ్స్,  తొలిసారిగా ప్రారంభించిన ఖేలో ఇండియా గిరిజన క్రీడల గురించి ఆయన వివరించారు.

యువత, క్రీడాకారుల ద్వారా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో కామన్వెల్త్ గేమ్స్  పట్ల కల్పిస్తున్న అవగాహన, అలాగే ఈ క్రీడల సందేశాన్ని భారత ప్రభుత్వం దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎలా తీసుకెళ్తోందో కూడా డాక్టర్ మాండవీయ ప్రస్తావించారు.

డొనాల్డ్ రుకారే నాయకత్వంలోని కామన్వెల్త్ స్పోర్ట్ ప్రతినిధి బృందం, జాతీయ అభివృద్ధి ఎజెండాలో క్రీడలను ఒక ముఖ్యమైన మైలురాయిగా మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందించింది.

డొనాల్డ్ రుకారే నాయకత్వంలోని ఈ కామన్వెల్త్ స్పోర్ట్ ప్రతినిధి బృందంలో సీఈఓ కేటీ సాడ్లీర్, గేమ్స్ అండ్ అస్యూరెన్స్ డైరెక్టర్ డారెన్ హాల్, స్పోర్ట్ డైరెక్టర్ ఆన్-లూయిస్ మోర్గాన్,  మేజర్ ఈవెంట్స్ నిపుణుడు నీల్ కార్నీలు ఉన్నారు.

క్రీడల సమర్థవంతమైన నిర్వహణకు అవసరమైన సన్నాహక చర్యలు, సమన్వయ యంత్రాంగాలు, కాలపరిమితులపై సమావేశం ప్రధానంగా దృష్టి సారించింది. రెండు పక్షాలు భవిష్యత్తు కార్యాచరణ, కీలకమైన మైలురాళ్లపై  ఏకాభిప్రాయంతో కూడిన అవగాహనకు వచ్చాయి.

భారతదేశం తన 2030 కామన్వెల్త్ గేమ్స్  దార్శనికతను మూడు ప్రధాన అంశాలతో ప్రదర్శించింది. క్రీడాకారులే కేంద్రంగా  ప్రపంచ స్థాయి పోటీని,  క్రీడాకారుల సంక్షేమాన్ని నిర్ధారించడం, దీర్ఘకాలిక ప్రభావంపై దృష్టి సారించి పర్యావరణానికి అనుకూలమైన పద్ధతులను అనుసరించడం, క్రీడల సమర్థవంతమైన నిర్వహణ కోసం ఆధునిక, సాంకేతిక వ్యవస్థలను వినియోగించుకోవడం ఇందులో ఉన్నాయి. 

2030 కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు అహ్మదాబాద్‌లోని బలమైన మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, సంస్థాగత మద్దతు కీలక బలాలని సమావేశంలో డాక్టర్ మాండవీయ వివరించారు.

దేశవ్యాప్తంగా శాశ్వత క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, అట్టడుగు స్థాయి నుంచి భాగస్వామ్యాన్ని పెంచడం వంటి పటిష్ట ప్రణాళికపై భారత్  బలమైన దృష్టిని కూడా డాక్టర్ మాండవీయ వివరించారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2251111) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati