|
ఆయుష్
‘ప్రపంచ హోమియోపతి దినోత్సవం-2026’ నేపథ్యంలో “సుస్థిర ఆరోగ్యానికి హోమియోపతి” ఇతివృత్తంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన జాతీయ స్థాయి వేడుకలు
· పరిశోధన.. నియంత్రణ.. సంస్థాగత మద్దతుతో భారత హోమియోపతి రంగం బలోపేతం: శ్రీ ప్రతాపరావు జాదవ్ · “ప్రపంచవ్యాప్తంగా హోమియోపతి బలోపేతం దిశగా నిదర్శానాధారిత ప్రగతి... నిరంతర పరిశోధనలు కీలకం” · మౌలిక సదుపాయాలు.. డిజిటల్ వేదికలు.. పరిశోధనల ద్వారా ఆయుష్ వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేస్తోంది: వైద్య రాజేష్ కోటేచా
నాడు పోస్టు చేయడమైనది:
10 APR 2026 4:35PM by PIB Hyderabad
‘ప్రపంచ హోమియోపతి దినోత్సవం-2026’ నేపథ్యంలో “సుస్థిర ఆరోగ్యానికి హోమియోపతి” ఇతివృత్తంగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇవాళ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జాతీయ స్థాయి వేడుకలు నిర్వహించింది. హోమియోపతి విధాన రూపకర్త డాక్టర్ శామ్యూల్ హానిమన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి విధాన రూపకర్తలు, పరిశోధకులు, వైద్యులు, విద్యావేత్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుస్థిర ఆరోగ్య సంరక్షణలో అందరికీ అందుబాటుతో హోమియోపతి పోషిస్తున్న కీలక పాత్రను వక్తలు ప్రముఖంగా ప్రస్తావించారు.
కేంద్ర ఆయుష్ (స్వతంత్ర బాధ్యత), ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖల సహాయ మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ మాట్లాడుతూ- “బలమైన వ్యవస్థలు, పరిశోధన సంస్థల తోడ్పాటుతో భారత హోమియోపతి రంగం కొన్నేళ్లుగా విస్తృత స్థాయిలో మానవ వనరులను సమకూర్చుంది. ఈ మేరకు ‘సీసీఆర్‌హెచ్, ఎన్‌సీహెచ్, ఎన్‌ఐహెచ్’ వంటి సంస్థలు హోమియోపతి రంగ శాస్త్రీయ పునాదిని, నియంత్రణ వ్యవస్థను సదా బలోపేతం చేస్తున్నాయి. నాణ్యమైన పరిశోధనలు, విద్య, వైద్య సేవల ప్రదానం ద్వారా అందుబాటులో చౌకగా, అర్థవంతంగా పనిచేస్తూ ఈ వైద్య విధానంపై సామాన్యులలో నమ్మకాన్ని ఇనుమడింపజేస్తున్నాయి” అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా హోమియోపతిని విశ్వసనీయ వైద్య విధానంగా నిలబెట్టేందుకు నిదర్శనాధారిత ప్రగతి, అంతర్-విభాగ సహకారం, నిరంతర పరిశోధనలు అత్యావశ్యకమని మంత్రి స్పష్టం చేశారు. శాస్త్రీయ అధ్యయనాల మెరుగుదల, విద్యా ప్రమాణాల పెంపు, వైద్యులు-పరిశోధకుల మధ్య సమన్వయంతో రోగి-కేంద్రక వైద్య సేవలు అందించవచ్చునని ఆయన తెలిపారు. జాతీయ ప్రాథమ్యాలు, అంతర్జాతీయ ఆరోగ్య లక్ష్యాల మేరకు సంపూర్ణ-సుస్థిర ఆరోగ్య విధానాలను ప్రోత్సహించడంపై ప్రభుత్వం నిబద్ధతతో ఉందని పునరుద్ఘాటించారు.
ఆయుష్ మంత్రిత్వశాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా మాట్లాడుతూ- నిదర్శానాధారిత ఆరోగ్య సంరక్షణ దిశగా మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు, సేవల విస్తరణ, ఆయుష్ గ్రిడ్, హెచ్‌ఎంఐఎస్ వంటి డిజిటల్ వేదికల ద్వారా ప్రభుత్వం ఆయుష్ వ్యవస్థను బలోపేతం చేస్తోందని గుర్తుచేశారు. అంతేకాకుండా నిపుణ, భవిష్యత్ సంసిద్ధ శ్రామిక శక్తిని రూపొందించే దిశగా విద్య-శిక్షణ వ్యవస్థల ఆధునికీకరణకు సాగుతున్న కృషిని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
బలమైన సంస్థాగత నెట్‌వర్క్, పరిశోధన-ప్రామాణీకరణకు పెరుగుతున్న ప్రాధాన్యం సహా అందుబాటులోగల, సుస్థిర ఆరోగ్య సంరక్షణకు దోహదం చేయడం ద్వారా హోమియోపతి రంగంలో భారత్ ప్రపంచ అగ్రగామిగా ఆవిర్భవించిందని శ్రీ కొటేచా విశదీకరించారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి డి.అలర్మేల్ మంగై మాట్లాడుతూ- సంస్థాగత పురోమనం, ప్రామాణీకరణ, ప్రపంచవ్యాప్త విస్తరణకు అధిక ప్రాధాన్యంతో భారత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో హోమియోపతి కీలక పాత్ర పోషిస్తున్నదని చెప్పారు. హోమియో వైద్యుల జాతీయ రిజిస్టర్ వంటి కార్యక్రమాలు ఈ విధాన పారదర్శకతను పెంచుతూ, వృత్తిపరంగానూ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయని తెలిపారు. అలాగే, విద్యా సంస్థలు-వైద్యుల నెట్‌వర్క్ విస్తరణ ద్వారా ఈ వ్యవస్థకు పెరుగుతున్న ప్రజామోదం స్పష్టమవుతున్నదని ఆమె పేర్కొన్నారు. సురక్షిత, విశ్వసనీయ, సమర్థ రోగి సంరక్షణకు భరోసా ఇస్తూ, క్లినికల్ శిక్షణ-ఔషధ నాణ్యతలో ఉన్నత ప్రమాణాలతో ఈ విస్తరణను అనుసంధానించాల్సి ఉందని స్పష్టం చేశారు.
అనంతరం ఆయుష్ మంత్రిత్వ శాఖ (హోమియోపతి) సలహాదారు డాక్టర్ ప్రీత కిళక్కుటిల్ ప్రసంగిస్తూ- హోమియోపతి విధానం రోగి-కేంద్రక, చౌక ఆరోగ్య సంరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు. వ్యాధి నివారణ, దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణలో దీనికి గణనీయ సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. తమ మంత్రిత్వ శాఖ నేతృత్వాన నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఈ వైద్య విధానం సామాన్యులందరికీ అందుబాటులోకి వస్తున్నదని తెలిపారు. ఈ క్రమంలో ఏకీకరణ ప్రక్రియను మెరుగుపరచడమేగాక విద్య, పరిశోధన, వృత్తి నైతికతపై నిరంతర దృష్టి ఫలితంగా వ్యవస్థ విశ్వసనీయత, విస్తృతి బలోపేతం అవుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ‘సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి’ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుభాష్ కౌశిక్ స్వాగతోపన్యాసం చేశారు. ఈ మేరకు “హోమియోపతికి పెరుగుతున్న గుర్తింపును ప్రతిబింబించే ఓ కీలక జాతీయ, అంతర్జాతీయ వేదికగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం రూపుదిద్దుకుంది. ఈ రంగంలో విస్తృత చర్చలు, ఆవిష్కరణలు, సహకారం తదితరాలను ప్రోత్సహించే దిశగా పరిశోధకులు, వైద్యులు, విద్యావేత్తలు, విధాన రూపకర్తలను ఈ కార్యక్రమం ఒక వేదికపైకి తెచ్చింది. శాస్త్రవిజ్ఞానం అర్థవంతమైన ప్రజారోగ్య ఫలితాలిచ్చేదిగా మారడంలో పరిశోధన, విధానం, ఆచరణల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడమే నేటి మన ప్రధాన లక్ష్యం” అని వివరించారు.
‘నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి’ చైర్‌పర్సన్ డాక్టర్ తారకేశ్వర్ జైన్ ప్రసంగిస్తూ- “దేశంలో నేడు హోమియోపతి ప్రత్యామ్నాయ విధానంగానే కాకుండా 3.45 లక్షల మందికిపైగా నమోదిత వైద్యులు, 291 విద్యా సంస్థల మద్దతుతో ప్రధాన వైద్య విధానంగానూ స్థిరపడింది. నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి ద్వారా ఈ వ్యవస్థ విశ్వసనీయత, ప్రభావాలను మరింత పెంచడం కోసం పారదర్శకత, విద్యా నాణ్యత, నైతిక ప్రమాణాలను మేం బలోపేతం చేస్తున్నాం” అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ‘సీసీఆర్‌హెచ్’ కొత్త అధికారిక లోగో, వేడుకల సూవెనీర్ సహా పలు కీలక ప్రచురణలు, విజ్ఞాన వనరులను ఆవిష్కరించారు. వీటిలో “సీసీఆర్‌హెచ్ జర్నీ: పబ్లికేషన్ ఔట్రీచ్ అండ్ నాలెడ్జ్ డిస్సెమినేషన్” పేరిట అకోరస్ కలామస్‌పై ఒక మోనోగ్రాఫ్ సహా “సైంటిఫిక్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్స్: ఎ ప్రాక్టీషనర్స్ గైడ్” కూడా ఉన్నాయి. ‘సీసీఆర్‌హెచ్’ ప్రచురించే నవీకృత ‘న్యూస్‌లెటర్’, ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి’ సంపుటం 20లో 1వ (తాజా) సంచిక సహా నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి చట్టం-నియమనిబంధనల సంపుటం-2ను కూడా ఆవిష్కరించారు.
హోమియో రంగం డిజిటలీకరణ సంబంధిత రంగంలో ఆయుష్ గ్రిడ్ పోర్టల్ ద్వారా సర్టిఫికేషన్ కోర్సు, ఏఐ ఆధారిత విజ్ఞాన విస్తరణ కంటెంట్, ‘ఐఆర్ఐఎన్ఎస్’ అనుసంధానం, హిందీ పదకోశం వెబ్‌సైట్, హోమియో అవగాహన వారోత్సవాల (2026 ఏప్రిల్ 1–7) సందర్భంగా దేశమంతటా నిర్వహించిన కార్యక్రమాల ఆడియో-విజువల్ సంకలనం వంటి కీలక కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
హోమియోపతిని ఒక నిదర్శనాధారిత, సౌలభ్య, రోగి-కేంద్రక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థగా బలోపేతం చేయడంలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్యక్రమం పునరుద్ఘాటించింది. ఇందులో భాగంగా పరిశోధన, విద్య, డిజిటల్ అనుసంధానం, ప్రజానీకానికి చేరువ చేయడంపై ఆయుష్ మంత్రిత్వ శాఖ నిరంతరం దృష్టి సారిస్తోంది. తద్వారా సమాజంలోని అన్ని వర్గాలకూ సరసమైన, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ ప్రదానంలో హోమియో పాత్రను మరింతగా విస్తరించాలని లక్ష్యనిర్దేశం చేసుకుంది.
***
(రిలీజ్ ఐడి: 2251018)
|