ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్థిక నిఘా విభాగం - భారత్, భారత సైబర్ నేరాల నిరోధక సమన్వయ కేంద్రం మధ్య కీలక అవగాహన ఒప్పందం.. సైబర్ మెసాలు, ఆర్థిక నేరాలను అరికట్టడమే లక్ష్యం
నిర్వహణ సమాచారంలో ఇరు సంస్థలకూ ఉపయోగకరంగా ఒప్పందం... ఆర్థిక నేరాలను అరికట్టడంలో, డిజిటల్ లావాదేవీలకు రక్షణ కల్పించడంలో, ఆస్తుల రీకవరీలో దర్యాప్తు సంస్థలకు చేయూత
నాడు పోస్టు చేయడమైనది:
09 APR 2026 4:21PM by PIB Hyderabad
సైబర్ మోసాలు, ఆర్థిక నేరాలపై భారత్ పోరాటాన్ని బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడింది. పరస్పర సమాచార వినిమయం, సమన్వయాన్ని మెరుగుపరచుకోవడం కోసం ‘భారత ఆర్థిక నిఘా విభాగం (ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ - ఇండియా), భారత సైబర్ నేరాల నిరోధక సమన్వయ కేంద్రం (I4C) మధ్య ఒక సమగ్ర అవగాహన ఒప్పందం కుదిరింది.
ఎఫ్ఐయూ- భారత్ డైరెక్టర్ శ్రీ అమిత్ మోహన్ గోవిల్, భారత సైబర్ నేరాల నిరోధక సమన్వయ కేంద్రం (I4C) ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ రాజేశ్ కుమార్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. సైబర్ మోసాలు, ఆర్థిక నేరాలకు వ్యతిరేకంగా భారత్ పోరాటంలో అగ్రభాగాన ఉన్న ఈ రెండు సంస్థల మధ్య పరస్పర సమాచార వినిమయంలో నూతన శకానికి నాంది ఇది.
దేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులొస్తున్న తరుణంలో.. సైబర్ నేరాలు, మోసాల నుంచి ప్రజలను రక్షించేందుకు భద్రతా ఏర్పాట్లు అత్యంత ఆవశ్యకమైన దశలో ఈ భాగస్వామ్యం కుదిరింది. నిర్వహణ సమాచారాన్ని అభివృద్ధి చేయడంలో రెండు సంస్థలకు ఈ అవగాహన ఒప్పందం సహాయపడుతుంది. అలాగే ఆర్థిక నేరాలను నిరోధించడానికి, డిజిటల్ లావాదేవీలను రక్షించడానికి, పోగొట్టుకున్న ఆస్తులను తిరిగి పొందడంలోనూ దర్యాప్తు సంస్థలకు తోడ్పాటునందిస్తుంది.
జాతీయ స్థాయిలో మోసాల గుర్తింపునకు సంబంధించి నిర్వహణ నియమాలను మెరుగుపరచడం కోసం పటిష్టమైన అభిప్రాయ సేకరణ యంత్రాంగాలను ఏర్పాటు చేయడం ఈ అవగాహన ఒప్పందం ముఖ్య లక్ష్యం. అలాగే సైబర్ మోసాల నిరోధక చర్యలను బలోపేతం చేయడం లక్ష్యంగా.. మార్గదర్శకాలను, అనుమానాస్పద సంకేతాలను రూపొందించి ఆర్థిక సంస్థలకు తెలియజేయడంపైనా ఇది దృష్టి సారిస్తుంది. సైబర్ నేరాలపై పోరాటంలో ప్రభుత్వ యంత్రాంగమంతా ఏకోన్ముఖంగా పనిచేసే విధానాన్ని అనుసరించడంలో ఇదొక కీలక మైలురాయి.
ఆర్థిక నిఘా విభాగం - భారత్ (ఎఫ్ఐయూ-ఇండియా) గురించి:
అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని స్వీకరించడం, ప్రాసెస్ చేయడం, విశ్లేషించడం, సంబంధిత విభాగాలకు చేరవేయడంతోపాటు.. మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే చర్యలకు వ్యతిరేకంగా సమష్టి కార్యాచరణ దిశగా పనిచేసే జాతీయ సంస్థ ఇది.
భారత ఆర్థిక నేరాల నిరోధక సమన్వయ కేంద్రం (I4C) గురించి:
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుబంధ కార్యాలయమిది. చట్టాన్ని అమలు చేసే సంస్థలు సైబర్ నేరాలను సమన్వయంతో, సమగ్రంగా ఎదుర్కొనే వ్యవస్థను అందిస్తుంది. జాతీయ సైబర్ నేరాల నమోదు పోర్టల్ (ఎన్సీఆర్పీ), సైబర్ - పోలిస్, అనుమానాస్పదుల రిజిస్ట్రీ వంటి వివిధ వేదికలను I4C అభివృద్ధి చేసింది.
టెలికాం, బ్యాంకింగ్, సంబంధిత ఇతర వనరుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు క్రియాశీల చర్యలతో.. ఆన్‌లైన్ ఆర్థిక నేరాలు సహా సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో చట్టాలను అమలు చేసే సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వంటి వివిధ భాగస్వాముల మధ్య అంతరాయం లేకుండా నిఘా సమాచార మార్పిడి, సమన్వయం కోసం సురక్షితమైన వేదికలుగా ఇవి సేవలందిస్తాయి.
***
(రిలీజ్ ఐడి: 2250742)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7