రక్షణ మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశ సన్నద్ధతపై రక్షణ మంత్రి అధ్యక్షతన ఐజీవోఎం సమీక్ష
సన్నద్ధత, సమన్వయం, స్థిరత్వ నిర్మాణంపై దృష్టి సారించాలి: శ్రీ రాజనాథ్ సింగ్
‘‘ఎల్పీజీ, పెట్రోలు, డీజిలు, ఎరువులు నిరంతరం అందుబాటులో ఉండేలా, నిత్యావసర వస్తువుల సరఫరాను సులభతరం చేసేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది’’
నాడు పోస్టు చేయడమైనది:
08 APR 2026 9:25PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత్ సన్నద్ధతను సమీక్షించేందుకు రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ అధ్యక్షతన మంత్రుల అనధికార బృందం (ఐజీవోఎం) మూడో సమావేశం నిర్వహించారు. ఇది 2026, ఏప్రిల్ 8న న్యూఢిల్లీలోని కర్తవ్యభవన్-2లో జరిగింది. ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, వ్యవసాయం-రైతు సంక్షేమం-గ్రామీణాభివృద్ధి మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, వాణిజ్యం, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్, రసాయనాలు-ఎరువుల మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా, పెట్రోలియం-సహజవాయు మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీ, వినియోగదారుల వ్యవహారాలు-ఆహారం-ప్రజా పంపిణీ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, రైల్వేలు-సమాచార ప్రసారాలు-ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు, పౌర విమానయాన మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు, శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా సన్నద్ధత, సమన్వయం, స్థిరత్వ నిర్మాణంపై దృష్టి సారించాలని అన్ని విభాగాలను రక్షణ మంత్రి ఆదేశించారు. ఎల్పీజీ, డీజిలు, రైతులకు ఎరువులు నిరంతరం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దేశంలో నిత్యావసర వస్తువల సరఫరాను సులభతరం చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టులో రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఉద్రిక్తతల ప్రభావం నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది.
https://x.com/rajnathsingh/status/2041851021878780245?s=46
గత 40 రోజుల్లో ఇతర దేశాల కంటే అధిక సంఖ్యలో భారతీయ నౌకలు హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించాయని ఐజీవోఎంకు తెలిపారు. భారత్‌కు 11 రోజుల దిగుమతుల అవసరాలకు సమానమైన.. సుమారు 340 టీఎంల ఎల్పీజీని రవాణా చేస్తున్న మొత్తం 8 నౌకలు ఈ జలసంధిని విజయవంతంగా దాటాయి. ఇది దేశ ఇంధన భద్రతను, సరఫరాల స్థిరత్వాన్ని బలోపేతం చేసింది. ఎల్పీజీ పంపిణీ కేంద్రాల వద్ద కొరత ఏర్పడినట్లు ఎలాంటి నివేదికలు లేవు. గృహావసరాల కోసం ఎల్పీజీ సిలిండర్ల సరఫరా దేశవ్యాప్తంగా నిరంతరాయంగా కొనసాగుతోంది.
వలస కార్మికులతో సహా బలహీన వర్గాలకు మద్దతుగా 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను ఏప్రిల్ 7న రెట్టింపు చేశారు. ప్రాధాన్యతా విభాగాలకు అందించే 20 శాతం కేటాయింపుల కంటే ఇది అధికం. ప్రజా రవాణా అవసరాలకు తగినట్టుగా ఆటో ఎల్పీజీ పంపిణీని ప్రభుత్వ రంగ చమురు సంస్థల అవుట్ లెట్లు పంపిణీ చేస్తూనే ఉన్నాయి. సేకరణలో సవాళ్ల కారణంగా ప్రైవేటు ఆపరేటర్లు సరఫరా విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణం వల్ల పీఎస్‌యూ బంకుల్లో రద్దీ పెరిగింది.
పారిశ్రామిక రంగాలకు ఎల్పీజీ సరఫరాను మరింత సులభతరం చేయడానికి మొత్తం ఇంధన డిమాండులో 70 శాతాన్ని గృహావసరేతర భారీ వినియోగదారులకు కేటాయించేందుకు ఏప్రిల్ 8న కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఫార్మా, ఆహారం, పాలిమర్లు, వ్యవసాయం, ప్యాకేజింగ్, పెయింట్లు, ఉక్కు, రక్షణ సంబంధిత సామగ్రి తదితర కీలక రంగాలకు ప్రాధాన్యమిస్తారు. కొనసాగుతున్న అంతర్జాతీయ సంక్షోభం నేపథ్యంలో చేపట్టిన ఈ చర్య సరఫరా వ్యవస్థల్లో అవరోధాలను నిరోధిస్తుందని, నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చూస్తుందని, పారిశ్రామిక కార్యకలాపాలను కొనసాగేలా భరోసా ఇస్తుందని అంచనా వేస్తున్నారు.
సాధ్యమైన ప్రతిచోటా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ)ను చురుగ్గా ప్రోత్సహిస్తున్నారు. ఎల్పీజీపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రారంభించిన పీఎన్జీ కనెక్షన్ ప్రచారంతో ప్రజల్లో అవగాహన పెరిగింది. దీని కారణంగా 3.16 లక్షల కొత్త పీఎన్జీ కనెక్షన్లు ఏర్పాటయ్యాయి. 2025 మార్చితో పోలిస్తే ఇది మూడు రెట్లు మేర పెరుగుదలను సూచిస్తోంది. ఈ ప్రచార కార్యక్రమం ఫలితంగా.. 16,700కు పైగా ఎల్పీజీ కనెక్షన్లను తిరిగి సంబంధిత సంస్థలకు అప్పగించారు. ఇది పెరుగుతున్న పీఎన్జీ వినియోగాన్ని సూచిస్తుంది.
కాల్పుల విరమణ నేపథ్యంలో ఇంధన ధరలు తగ్గడం గురించి కూడా ఐజీవోఎంకు వివరించారు. కీలక రంగాల పరామితులను నిశితంగా పర్యవేక్షించడం కొనసాగిస్తామని, తగిన చర్యలు తీసుకుంటామని మంత్రులకు తెలియజేశారు.
ఆహారం, ప్రజా పంపిణీ విభాగం తీసుకున్న చర్యల గురించి కూడా ఐజీవోఎంకు వివరించారు.
ఆహార భద్రతకు సన్నద్ధత
పీడీఎస్‌లకు అవసరమైనంత మేర సరఫరాలను అందించేందుకు, అత్యవసరాలను తీర్చేందుకు సరిపడినంత బియ్యం, గోధుమల నిల్వలు అందుబాటులో ఉన్నాయి. బలహీన వర్గాల ప్రజలకు ఆహార ధాన్యాలు నిరంతరం అందుబాటులో ఉండేలా జాతీయ ఆహార భద్రత చట్టం హామీ ఇస్తుంది.
మార్కెట్‌పరమైన చర్య: బహిరంగ మార్కెట్ అమ్మకాల పథకం (దేశీయ)-ఓఎంఎస్ఎస్ (డీ)
ఆహార ధాన్యాల ధరలను ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. అవసరమైనప్పుడు ఓఎంఎస్ఎస్ (డీ) ద్వారా మార్కెట్ పరంగా అవసరమైన చర్యలను తీసుకుంటోంది. సరఫరాను పెంచడానికి, ధరలను స్థిరీకరించడానికి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) మిగులు గోధుమలు, బియ్యాన్ని బహిరంగ మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఇలాంటి చర్యల కోసం తగినన్ని నిల్వలు ఎఫ్‌సీఐ వద్ద అందుబాటులో ఉన్నాయి. అదనపు అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు రాయితీతో కూడిన నిర్దేశిత ధరలకు బియ్యం అమ్మేందుకు కూడా ఈ పథకం వీలు కల్పిస్తుంది.
సేకరణ: రబీ మార్కెటింగ్ సీజన్ (ఆర్ఎంఎస్) 2026-27
ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా ఎంఎస్‌పీ పరిధిలో గోధుమల సేకరణ ప్రారంభమైంది. ఈ విషయంలో సన్నద్ధతను క్రమం తప్పకుండా సమీక్షించేందుకు ఈ విభాగం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటోంది. కొనుగోలు ప్రక్రియకు అవసరమైన ప్యాకేజింగ్ సామగ్రి తగినంత అందుబాటులో ఉండేలా చూసుకుంటోంది.
ఆహార ధాన్యాల ప్యాకేజింగ్
ఆర్ఎంఎస్ 2026-27లో ప్యాకేజింగ్ సామగ్రిని అందుబాటులో ఉంచడానికి ముందస్తు చర్యలు చేపట్టారు. పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ, రసాయనాలు, పెట్రో రసాయనాల విభాగంతో సంప్రదించిన అనంతరం ప్యాకేజింగ్ వనరులను ఈ విభాగం వైవిధ్య పరుస్తోంది. కొరత ఎదురైతే దానిని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపడుతుంది.
వంటనూనెల స్థితిగతులు
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు నెలకొన్నప్పటికీ, దేశీయంగా వంట నూనెలు తగినంత మొత్తంలో అందుబాటులో ఉన్నాయి. కీలక భాగస్వాములు (ఇండోనేషియా, మలేషియా, అర్జెంటీనా, బ్రెజిల్) నుంచి దిగుమతులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆవాల ఉత్పత్తి పెరగడంతో దేశీయ సరఫరా బలోపేతమైంది. మొత్తం మీద సరఫరా స్థిరంగా ఉంది. పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. అవసరమైతే జోక్యం చేసుకుంటుంది.
చక్కెర రంగం
తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయి. 2025-26లో ఉత్పత్తి చేసిన చక్కెర సరిపోతుందని అంచనా వేస్తున్నారు. 15.80 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ) చక్కెరను ఎగుమతి చేసేందుకు అనుమతి ఇవ్వగా.. ఇప్పటి వరకు 3.73 ఎల్ఎంటీలను ఎగుమతి చేశారు. ప్రధానంగా శ్రీలంక, పశ్చిమాసియా, తూర్పు ఆఫ్రికాకు ఎగుమతులు చేస్తున్నారు. గత మూడేళ్లకు పైగా.. తక్కువ ద్రవ్యోల్బణం (సుమారు 3 శాతం) ఉండటంతో రిటైల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా 578 కేంద్రాల నుంచి 40 ఆహార వస్తువుల రోజువారీ ధరలను వినియోగదారుల వ్యవహారాల శాఖ పర్యవేక్షిస్తోందని మంత్రులకు తెలియజేశారు. మధ్యప్రాచ్యంలో చెలరేగిన యుద్ధం ఫలితంగా మారుతున్న ధరల ధోరణులను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు ధరల విషయంలో ఎలాంటి అసాధారణ హెచ్చుతగ్గులు కనిపించలేదు. వంటనూనెల ధరల్లో స్వల్ప పెరుగుదల మినహా మిగిలిన వాటి ధరలు స్థిరంగానే ఉన్నాయి.
దేశీయంగా ఆవ నూనె ఉత్పత్తి పెరగడంతో (సుమారుగా 5 శాతం అధిక ఉత్పత్తి) దిగుమతులపై ఆధారపడటం పాక్షికంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ధరల స్థిరీకరణ నిల్వల కోసం ఉల్లి సేకరణ త్వరలో ప్రారంభమవుతుంది. ఇది మార్కెట్ ధరలు నియంత్రణలో ఉండేలా చూస్తుంది. ఈ సేకరణకు అవసరమైన ఏర్పాట్లను జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య ప్రారంభించాయి. ఆర్థిక సంవత్సరం 2025-26లో ఉల్లి ఎగుమతి 15.40 ఎల్ఎంటీగా ఉంది. ఇది మునుపటి ఏడాదితో పోలిస్తే ఎక్కువే ఉంది. ఈ ఏడాది మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
(రిలీజ్ ఐడి: 2250489)
సందర్శకుల సూచీ సంఖ్య : : 23