రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కృత్రిమ మేధ,ఇతర ఆటోమేషన్ సాంకేతికతలను ఉపయోగించి ప్రయాణికుల భద్రత, కమ్యూనికేషన్, సమాచార వ్యవస్థల్లో తీసుకువచ్చిన వినూత్న పరిష్కారాలతో రైలు ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవం


భారతీయ రైల్వే అంతటా 1,405 స్టేషన్లలో రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని స్వయంచాలక పద్ధతిలో, ఎప్పటికప్పుడు అనౌన్స్ చేసే వ్యవస్థ

అనధికారిక ప్రవేశాలను, అనుమానాస్పదంగా తిరగడాన్ని గుర్తించేందుకు 1,874 స్టేషన్లలో ఏఐ ఆధారిత హైటెక్ వీడియో సర్వైలెన్స్ అనలిటిక్స్ పరిష్కారాల ఏర్పాటు

1,396 స్టేషన్లలో మెరుగైన సేవలను అందించడం కోసం స్టేషన్ లోపల, ఇతర స్టేషన్లతో కీలకమైన రైల్వే కార్యకలాపాల కోసం కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్టం

సవాళ్లతో కూడిన భౌగోళిక ప్రాంతాల్లో భద్రత కోసం సొరంగం లోపలి నుంచి కంట్రోల్ రూమ్‌లకు అంతరాయం లేకుండా రేడియో కమ్యూనికేషన్ అందించే టన్నెల్ కమ్యూనికేషన్ వ్యవస్థ

నాడు పోస్టు చేయడమైనది: 07 APR 2026 7:17PM by PIB Hyderabad

భారతీయ రైల్వే 2025-26 సంవత్సరంలో తన టెలికాం, డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో గణనీయమైన పురోగతిని సాధించింది. ముఖ్యంగా భద్రతను పెంపొందించడం, కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పటిష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు, ప్రయాణీకుల అవసరాలకు వినూత్నమైన పరిష్కారాలను చేపట్టడం ద్వారా ఆధునికీకరణ దిశగా ఇది కీలక పాత్ర పోషించింది.

ఏకీకృత టెలికాం ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధి

ఈ సంవత్సరంలో సాధించిన ప్రధాన విజయాలలో ఇంటర్నెట్ ప్రోటోకాల్ మల్టీ-ప్రోటోకాల్ లేబుల్ స్విచ్చింగ్ (ఐపీ  ఎంపీఎల్ఎస్) సాంకేతికత ద్వారా ఏకీకృత టెలికాం ఆధారిత మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఒకటి. రైల్వేకి సంబంధించిన అత్యంత కీలకమైన అప్లికేషన్ల ప్రస్తుత, భవిష్యత్తు బ్యాండ్‌విడ్త్ అవసరాలను తీర్చడానికి ఈ అధిక సామర్థ్య నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ వ్యవస్థ వీడియో పర్యవేక్షణను కేంద్రీకృత పద్ధతిలో నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. అలాగే మొబైల్ ట్రైన్ రేడియో కమ్యూనికేషన్ (ఎంటీఆర్సీ),  ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్), అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ (యూటీఎస్), ఫ్రైట్ ఆపరేషన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎఫ్ఓఐఎస్), సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (ఎస్సీఏడీఏ), వీడియో కాన్ఫరెన్సింగ్, ఇతర కార్యాచరణ అప్లికేషన్‌ల వంటి కీలక రైల్వే వ్యవస్థలకు మద్దతు ఇస్తుంది. డిజిటల్‌ అనుసంధానిత రైల్వే వ్యవస్థ దిశగా ఒక ముఖ్యమైన చర్యగా, ఇప్పటివరకు 1,396 రైల్వే స్టేషన్లలో ఐపీ  ఎంపీఎల్ఎస్ వ్యవస్థను విజయవంతంగా ప్రారంభించారు.

ప్రయాణికుల భద్రత కోసం ఏఐ ఆధారిత వీడియో పర్యవేక్షణ 

ప్రయాణికుల భద్రత, రక్షణ విషయంలో భారతీయ రైల్వే తన వీడియో పర్యవేక్షణ వ్యవస్థ (వీఎస్ఎస్)ను 1,874 రైల్వే స్టేషన్లకు విస్తరించింది. ఈ వ్యవస్థలో చొరబాట్లు,  అనుమానాస్పద సంచారాన్ని స్వయంచాలకంగా గుర్తించే అత్యాధునిక ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్‌తో పాటు, వ్యక్తులను తక్షణమే గుర్తించడానికి, పర్యవేక్షించడానికి ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) సాఫ్ట్‌వేర్   కూడా అందుబాటులో ఉంది. రైల్వే మంత్రి గతంలో ఈ సాంకేతిక పురోగతి ప్రాముఖ్యతను వివరిస్తూ, “కెమెరాలు ఈ వ్యవస్థకు కళ్లుగానూ,  ఏఐ దాని మెదడుగానూ పని చేస్తుంది” అని పేర్కొన్నారు. రైల్వే భద్రతను బలోపేతం చేయడంలో కృత్రిమ మేధ పోషించే పరివర్తనాత్మక పాత్రను ఆయన ప్రముఖంగా చెప్పారు.

తక్షణ ప్రకటనలతో ప్రయాణికుల సమాచార వ్యవస్థల స్థాయి పెంపు 

ప్రయాణీకుల సమగ్ర సమాచార వ్యవస్థ (ఇంటిగ్రేటెడ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ -ఐపీఐఎస్) విస్తరణతో ప్రయాణికుల సమాచార వ్యవస్థలు కూడా పెద్దఎత్తున ఆధునికతను సంతరించుకున్నాయి. ఎలక్ట్రానిక్ ట్రైన్ ఇండికేటర్ బోర్డులు, కోచ్ గైడెన్స్ సిస్టమ్‌లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లతో కూడిన ఈ ఐపీఐఎస్ రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని సరైన సమయంలో ప్రయాణికులకు చేరవేసేలా రూపుదిద్దుకుంది.  నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (ఎన్టీఈఎస్)తో ఐపీఐఎస్ అనుసంధానం కావడం వల్ల స్టేషన్లలో స్వయంచాలకంగా ఎప్పటికప్పుడు ప్రకటనలు అందించడం సాధ్యమవుతోంది. ఇప్పటివరకు భారతీయ రైల్వే వ్యాప్తంగా 1,405 స్టేషన్లలో ఈ అనుసంధానం పూర్తయింది.

అంతరాయం లేని అనుసంధానం కోసం టన్నెల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్

కమ్యూనికేషన్ సామర్థ్యాలను మరింత పెంపొందిస్తూ, వ్యూహాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టుతో సహా పలు రైల్వే జోన్లలో టన్నెల్ కమ్యూనికేషన్ వ్యవస్థల ఏర్పాటును చేపట్టారు. ఈ వ్యవస్థ టన్నెల్స్ లోపల ఉండే సిబ్బందికి, ప్రధాన కార్యాలయాలకు, ఆపరేషన్ కంట్రోల్ సెంటర్లకు మధ్య అంతరాయం లేని రేడియో కమ్యూనికేషన్‌ను నిర్ధారిస్తుంది, తద్వారా సవాళ్లతో కూడిన భౌగోళిక ప్రాంతాలలో భద్రతను, సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది.

ఆధునిక, సురక్షితమైన,  సాంకేతికత ఆధారిత రైల్వే వ్యవస్థ పట్ల నిబద్ధత

2025-26 కాలంలో చేపట్టిన ఈ చర్యలు మరింత సురక్షితమైన, సున్నితమైన, సమర్థవంతమైన రైల్వే నెట్‌వర్క్‌ను నిర్మించడానికి అత్యాధునిక సాంకేతికతను ఆవిష్కరణలను ఉపయోగించడంలో భారతీయ రైల్వే  నిబద్ధతను చాటి చెబుతున్నాయి. టెలికాం మౌలిక సదుపాయాల నిరంతర విస్తరణ, ఏఐ ఆధారిత వ్యవస్థల వినియోగం, ప్రయాణికుల సమాచార సేవల మెరుగుదల వంటివన్నీ కలిసి ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా స్పందించే, డిజిటల్ ఇండియా దార్శనికతకు అనుగుణంగా ఉండే ఆధునిక రైల్వే వ్యవస్థకు తోడ్పడుతున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2249893) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Gujarati , English , Urdu , हिन्दी , Kannada