శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆహార స్టార్టప్‌లే లక్ష్యంగా.. మైసూరులోని కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థలో(ఎస్‌ఎఫ్‌టీఆర్‌ఐ) బయోనెస్ట్‌ను ప్రారంభించిన డాక్టర్ జితేంద్ర సింగ్


కొత్త ఒప్పందాలు, పీపీపీ-ఆధారిత ఉత్పత్తి ఆవిష్కరణలు, పరిశ్రమ భాగస్వామ్యాలతో తన ఇంక్యుబేషన్ పరిధిని విస్తరిస్తోన్న సీఎఫ్‌టీఆర్‌ఐ

ప్రయోగశాల పరిశోధనలను వాణిజ్య ఉత్పత్తులుగా మార్చడంలో కీలక వేదికగా నిలవనున్న దేశ ఇంక్యుబేషన్ వ్యవస్థ

ఆహార ఆవిష్కరణ రంగ విస్తరణకు పరిశోధన-పరిశ్రమల మధ్య బలమైన అనుసంధానం ఉండాలన్న మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 04 APR 2026 2:07PM by PIB Hyderabad

కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థలో (సీఎఫ్‌టిఆర్‌ఐ) బిరాక్ బయోనెస్ట్ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అంకుర సంస్థలు రూపొందించిన సాంకేతికతలు, ఉత్పత్తుల ప్రదర్శనను ఆయన సమీక్షించారు. ప్రయోగశాల పరిశోధనను వాణిజ్య ఉత్పత్తులుగా మార్చడంలో ఈ సంస్థ ఇంక్యుబేషన్ వ్యవస్థ  కీలక వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. 

ప్రత్యేకమైన ఇంక్యుబేషన్ సూట్లు, ఉమ్మడి మౌలిక సదుపాయాలతో రూపొందించిన ఈ బయోనెస్ట్‌ కేంద్రం.. ఆహార రంగ అంకుర సంస్థలను ప్రోత్సహిస్తుంది. ఇది ఆహార బయో ప్రాసెసింగ్, బయోటెక్నాలజీ రంగాలలో అధునాతన పరిశోధనలు, భారీ స్థాయి ఉత్పత్తి సామర్థ్య ధ్రువీకరణ, నియంత్రణ సదుపాయాలను అందించడం ద్వారా  శాస్త్రీయ ఆలోచనలను మార్కెట్‌కు సిద్ధంగా ఉన్న పరిష్కారాలుగా మార్చడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. 

మార్చి 2026 నాటికి, ఈ బయోనెస్ట్‌ కేంద్రం 26 అంకుర సంస్థలకు మద్దతునిచ్చింది. ఇందులో భౌతిక, హైబ్రిడ్ ఇంక్యుబేట్‌లతోపాటు గ్రాడ్యుయేట్ అయిన వెంచర్లు ఉన్నాయి. ఇప్పటికే పలు సంస్థలు తమ ఉత్పత్తులను వాణిజ్యీకరించడంలో విజయం సాధించాయి. ఇక్కడ శిక్షణ పొందుతున్న కంపెనీలు ఉమ్మడిగా 12 పేటెంట్లను దాఖలు చేశాయి. అనేక పరిశోధన పత్రాలను సమర్పించాయి. ఇది మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సాగుతున్న ఆవిష్కరణల వేగాన్ని ప్రతిబింబిస్తోంది. 

ఈ అంకుర సంస్థలు న్యూట్రాస్యూటికల్స్, ప్రిసిషన్ ఫెర్మెంటేషన్, ప్రోబయోటిక్స్, పోస్ట్‌బయోటిక్స్, క్రిస్పర్ ఆధారిత సాంకేతికతలు, బొటానికల్స్ వంటి అత్యాధునిక రంగాలలో పనిచేస్తున్నాయి. ఇది ఆహార, బయోటెక్నాలజీ రంగాలలో అధిక విలువ కలిగిన, శాస్త్ర సాంకేతిక ఆధారిత విభాగాల వైపు మారుతున్న ధోరణిని సూచిస్తోంది. 

పారిశ్రామికవేత్తలు, ఇతర భాగస్వాములతో జరిపిన ముఖాముఖిలో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం సులభతరమైందని, అయితే దానిని నిలబెట్టుకోవడానికి నిరంతర విలువ, మార్కెట్ సౌలభ్యం, పరిశ్రమలతో బలమైన అనుసంధానం అవసరమని చెప్పారు. పరిశోధనా సంస్థలు, ప్రైవేటు రంగం మధ్య లోతైన భాగస్వామ్యం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఆవిష్కరణలు వినియోగదారుల డిమాండుకు అనుగుణంగా ఉండాలని, ముఖ్యంగా తినడానికి సిద్ధంగా ఉన్న, సులభంగా తయారు చేసుకునే ఆహారవిభాగాలపై దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు. 

అత్యాధునిక సాంకేతిక రంగాలలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని విస్తరించడానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని మంత్రి వివరించారు. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలను వేగవంతం చేసే లక్ష్యంతో రూపొందించిన కొత్త నిధుల లభ్యత మార్గాలు, సంస్థాగత మద్దతు వ్యవస్థలను  ఈ సందర్భంగా ప్రస్తావించారు. శాస్త్రీయ సంస్థలు తమ సాంకేతికతలపై అవగాహన కల్పించడానికి, వాటి వినియోగాన్ని మెరుగుపరచడానికి డిజిటల్ వేదికలు, ప్రచార వ్యూహాల ద్వారా తమ పరిధిని విస్తరించుకోవాలని చెప్పారు. అదే సమయంలో బయోటెక్నాలజీ, అంతరిక్ష రంగం, ప్రత్యేక పోషకాహార విభాగాల మధ్య పరస్పర సమన్వయం ఉండాలని ఆయన ప్రోత్సహించారు. 

ఈ కార్యక్రమంలో నాలుగు అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరగడమే కాకుండా.. సీఎఫ్‌టీఆర్‌ఐ స్వయంగా అభివృద్ధి చేసిన రెండు ఉత్పత్తులను కూడా ప్రారంభించారు. ఇది పరిశ్రమలతో నిరంతర భాగస్వామ్యాన్ని, స్వదేశీ సాంకేతికతల వాణిజ్యీకరణను సూచిస్తోంది. ఆవిష్కరణలను విస్తరించడానికి, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఇటువంటి సహకారాలు అత్యంత కీలకమని అధికారులు పేర్కొన్నారు. 

సంస్థ స్థాపించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, దాని పరిశోధనా వారసత్వాన్ని, సాంకేతిక సహకారాన్ని వివరించే ప్రచురణల సముదాయాన్ని విడుదల చేశారు. ఇందులో ఒక కాఫీ టేబుల్ పుస్తకం, పరిశోధన, అభివృద్ధి విజయాల సంకలనం, ఒక ఫోటో యాత్ర,సంప్రదాయ వంటకాల సేకరణ ఉన్నాయి. ఈ కీలక సందర్భానికి గుర్తుగా ఒక స్మారక పోస్టల్ కవరు, చిత్ర పోస్టుకార్డును కూడా ఆవిష్కరించారు. 

ఈ ప్రదర్శన సంస్థ ల్యాబ్ నుంచి మార్కెట్‌  వరకు ప్రస్థానానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. ఇందులో సీఎఫ్‌టీఆర్‌ఐ, దానిలైసెన్సుదారులు అభివృద్ధి చేసిన సాంకేతికతలు, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తులు, అంకుర సంస్థల ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఇప్పటి వరకు 450కి పైగా సాంకేతికతలను అభివృద్ధి చేసి, వేలాది మంది లైసెన్సుదారులకు బదిలీ చేయడంతో ఈ సంస్థ ఆహార పరిశోధన, పరిశ్రమల సహకారం, ఉత్పాదక అభివృద్ధికి ఒక కీలక జాతీయ కేంద్రంగా ఆవిర్భవించింది. 

ఈ బయోనెస్ట్‌ వ్యవస్థ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఆసక్తిని ఆకర్షిస్తోందని అధికారులు తెలిపారు. ఇక్కడి అంకుర సంస్థలు ప్రపంచ స్థాయి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు, వాణిజ్యపరమైన మైలురాళ్లను అధిగమిస్తూ.. సాంకేతిక బదిలీలను విజయవంతంగా చేపడుతున్నాయి. అంతేకాకుండా ప్రత్యేక ఆహార అవసరాల కోసం రక్షణ రంగంవంటి వ్యూహాత్మక విభాగాలు కూడా ఈ ఆవిష్కరణల పట్ల ఆసక్తి చూపుతున్నాయి. 

ఈ పరిణామాలన్నీ కలిసి పరిశోధన ఆధారిత విధానం నుంచి మార్కెట్-అనుసంధాన ఆహార ఆవిష్కరణ వ్యవస్థ వైపు మారుతున్న ధోరణిని సూచిస్తున్నాయి. శాస్త్రీయ పరిశోధన, ఇంక్యుబేషన్ మద్దతు, పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని మేళవించిన ఒక సమగ్ర వేదికగా సీఎస్‌ఐఆర్‌-సీఎఫ్‌టీఆర్‌ఐ తనను తాను నిలబెట్టుకుంటోంది. భారత ఆహార శుద్ధి రంగంలో తదుపరి దశ వృద్ధిని నడిపించడంలో ఈ వేదిక కీలక పాత్ర పోషించనుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2249046) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Kannada